సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో కుదుపులకు కారణమేంటి?

ఫొటో సోర్స్, PA
- రచయిత, ఎస్మే స్టాలార్డ్,
- హోదా, బీబీసీ న్యూస్
లండన్ నుంచి సింగపూర్ వెళుతున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర కుదుపులకు గురైంది. అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారు.
విమానం ఇంత తీవ్రంగా కుదుపులకు గురికావడం అరుదు.
కానీ వాతావరణ మార్పులు విమానాల్లో ఈ కుదుపులను మరింతగా పెంచుతున్నాయని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి.
కుదుపులకు కారణం ఏంటి?
సింగపూర్ విమాన ఘటనలో ఒకవేళ వాతావరణ మార్పుదే కీలక పాత్ర అయితే, ముందుగా ఈ విమానం ఏ రకమైన కుదుపులకు గురైందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
గాలి దిశలో అనుకోని మార్పులను కుదుపులుగా (Turbulence) చెబుతుంటాం.
విమానాన్ని ఈ గాలి వేగంగా తాకినప్పుడు, విమానం ఊగడం, అది ప్రయాణిస్తున్న ఎత్తు నుంచి అకస్మాత్తుగా కిందకి జారడం జరుగుతుంటుంది.
పర్వతాల పైన వీస్తున్న గాలి నుంచి మబ్బుల వరకు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమానం కుదుపులకు గురి కావడానికి పలు కారణాలుంటాయి.
అయితే, ఫ్లైట్ ఎస్‌క్యూ321(SQ321) ఏ కారణంతో కుదుపులకు లోనైందో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
కానీ, క్లీన్ ఎయిర్ టర్బులెన్స్(సీఏటీ) వల్ల లేదంటే వర్షాలు వచ్చే సమయంలో ఏర్పడే మేఘాల వల్ల ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Mark Evans/Getty Images
వాతావరణ మార్పే కారణమా?
జెట్ స్ట్రీమ్ లోపల లేదా చుట్టూ గాలి దిశలో మార్పులు చోటు చేసుకోవడాన్ని ‘క్లీన్ ఎయిర్’ టర్బులెన్స్‌గా చెబుతుంటారు. 30 వేల నుంచి 60 వేల అడుగుల ఎత్తులో వేగంగా ఈ గాలులు వీస్తుంటాయి.
ఉత్తర అట్లాంటిక్‌లో 1979 నుంచి 2020 మధ్యలో క్లీన్ ఎయిర్ వల్ల విమానాల్లో కుదుపులు 55 శాతం పెరిగినట్లు గత ఏడాది రీడింగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు.
గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు పెరుగుతుండటంతో వేడెక్కిన గాలులతో జెట్ స్ట్రీమ్‌లో గాలుల వేగం మారుతున్నట్లు చెప్పారు.
ఈ రకమైన కుదుపుల వల్ల పైలట్లకు విమానాలను నేవిగేట్ చేయడం కష్టమవుతుంది.
ఎక్కడ వీటిని గుర్తించవచ్చో వాతావరణ విభాగ సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, విమానంలో ఉన్నప్పుడు వాటి రాడార్ వ్యవస్థలు వీటిని గుర్తించడం లేదా చూడటం కష్టమవుతుంది.
ఆ గాలిలోకి విమానం ప్రవేశించినప్పుడు కుదుపులు చాలా తీవ్రంగా ఉంటాయని అకడమిక్, కమర్షియల్ పైలట్‌గా పనిచేసిన గై గ్రాట్టన్ చెప్పారు.
ఉరుములతో కూడిన గాలివాన వల్ల విమానాలు ఎందుకు కుదుపులకు లోనవుతాయి?
వర్షాలు వచ్చే సమయంలో ఆకాశంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. వీటివల్ల గాలిలో అలజడి తీవ్రంగా ఉంటుంది. విమానం ఇలాంటి వాతావరణం గుండా ప్రయాణిస్తున్నప్పుడు తీవ్ర కుదుపులకు లోనవుతుంది.
సాధారణంగా విమానాలు చాలా ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. వీటి కంటే ఎత్తులో ఆ మేఘాలు ఉంటాయి. ఆ సమయంలో వాటిని తప్పించుకోవడం కష్టం.
క్యుములోనింబస్ మేఘాల వల్ల ఉరుములతో కూడిన వర్షాలు, పిడుగులు, వడగండ్ల వర్షాలు పండుతుంటాయి.
క్యుములోనింబస్ మేఘాల లోపల గాలి పైకి, కిందకి వీచే ప్రక్రియ చాలా బలంగా ఉంటుంది. దీని వల్ల విమానం తీవ్ర కుదుపులకు లోనవుతుంది.
క్యుములోనింబస్ మేఘాల వల్ల వచ్చే వర్షాలు బలమైన గాలులను కలిగి ఉంటాయి.
మంగళవారం సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం ఎగురుతున్నప్పుడు మియన్మార్ సమీపంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే వాతావరణం ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఉష్ణమండల తుపానుల తీవ్రత
వాతావరణ మార్పుల ఫలితంగా ఇలాంటి ఉష్ణమండల తుపానుల తీవ్రత పెరుగుతోందనడానికి బలమైన ఆధారాలున్నట్టు ఐక్యరాజ్యసమితి వాతావరణ శాస్త్ర సంస్థ ఐపీసీసీ తెలిపింది.
దీనికి రెండు కారణాలున్నాయి. వాతావరణ మార్పు మహాసముద్రాలను వేడెక్కిస్తోంది. దీనివల్ల ఎక్కువ నీరు ఆవిరైపోతోంది. గాలిలోకి ఎక్కువ వేడి, తేమ జోడవుతున్నాయి.
అదే సమయంలో వెచ్చని గాలి ఎక్కువ తేమను నిలుపుకుంటుంది, ఫలితంగా బలమైన గాలులు, తీవ్రమైన వర్షపాతం కారణంగా అల్లకల్లోల పరిస్థితి ఏర్పడుతుంది.
ఏదేమైనా, ఈ ఉష్ణమండల తుపానులు తరచుగా మారుతున్నాయనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు.
ఇప్పుడేం జరుగుతుంది?
కచ్చితంగా ఏం జరిగిందో తెలుసుకునేందుకు మరికొద్ది నెలల్లో విమానం నుంచి సేకరించిన డేటాను పరిశోధకులు పరిశీలించనున్నారు.
ఈ డేటాను శాస్త్రీయ పరిశోధనలో ఉపయోగించవచ్చని, కల్లోల కారణాలను అర్థం చేసుకోవడానికి, టర్బులెన్స్ ప్రిడిక్షన్ వ్యవస్థలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని ప్రొఫెసర్ విలియమ్స్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















