ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్: ఎగిరిన కాసేపటికే ఇంజిన్‌లో మంటలు, చివరకు ఏం చేశారంటే....

ఎయిర్ ఇండియా

ఫొటో సోర్స్, Dr Jeffy Cherry

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ కోసం

ప్రయాణికులతో వెళ్తున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

బెంగళూరు నుంచి కొచ్చికి వెళ్తున్న ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల తర్వాత ఇంజిన్ కుడివైపున మంటలు రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు.

ఈ ఘటన సమయంలో విమానంలో 177 మంది ప్రయాణీకులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం ప్రమాదంలో ఉందని వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు శనివారం రాత్రి 11:12 గంటలకు కెంపెగౌడ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వెంటనే పూర్తి స్థాయి ఎమర్జెన్సీ పరిస్థితిని ప్రకటించినట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు.

విమానం ల్యాండ్ అయిన వెంటనే మంటల్ని ఆర్పేసినట్లు వెల్లడించారు.

‘‘ ప్రయాణీకులందరినీ విమానంలోని సిబ్బంది క్షేమంగా బయటకు పంపించారు. ఎవరికీ గాయాలు కాలేదు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణీకులందరూ వీలైనంత త్వరగా తమ గమ్యాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని ఎయిరిండియా ఒక ప్రకటన విడుదల చేసింది.

ఎయరిండియా విమానం

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఆదివారం ఉదయం కొచ్చికి వెళ్లే ఒక ఎయిరిండియా విమానంలో 122 మంది ప్రయాణీకులను పంపించారు. మిగతా ప్రయాణీకులను కూడా వేరే విమానాల్లో పంపిస్తామని బీబీసీతో ఎయిరిండియా అధికార ప్రతినిధి చెప్పారు.

ఇద్దరు, ముగ్గురు ప్రయాణీకులను ఒక హోటల్‌కు తరలించారు. కానీ, మిగతా చాలామందిని సామాను తీసుకునే స్థలం (బ్యాగేజ్ అరైవల్) దగ్గర ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చోబెట్టారని ప్రయాణీకురాలు, డాక్టర్ జెఫ్పీ చెర్రీ తెలిపారు.

‘‘మా అమ్మకు 72 ఏళ్లు. ఆమె కూడా అక్కడే కూర్చున్నారు. దాదాపు 10, 15 మంది వృద్ధులు, చిన్నపిల్లలు ఆ కుర్చీల్లోనే కూర్చొన్నారు. కానీ, వారు మాకు తినడానికి స్నాక్స్, ఆహారం, నీళ్లు అందించారు. మాకు వసతి ఏర్పాటు చేసి ఉండాల్సింది. ఈ రోజు ఉదయం నుంచే ప్రయాణీకుల్ని పంపిస్తున్నారు. మాకోసం వెంటనే మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మొదట చెప్పారు. కానీ, రాత్రి గడిచిపోయింది. ఉదయం అనుకుంటే మధ్యాహ్నం 12 గంటల తర్వాత 122 మందిని ఒక విమానంలో పంపించారు’’ అని ఆమె చెప్పారు.

ఇంజిన్‌లో మంటల్ని గుర్తించిన వెంటనే ప్రయాణీకులు భయపడొద్దంటూ పైలట్ విజ్ఞప్తి చేసినట్లు డాక్టర్ చెర్రీ తెలిపారు.

ఎయిరిండియా విమానం

ఫొటో సోర్స్, Dr Jeffy Cherry

‘‘వెంటనే విమానాన్ని కిందకు దించారు. మా హ్యాండ్ లగేజీని విమానంలోనే వదిలేసి మమ్మల్ని త్వరగా విమానం నుంచి బయటకు వెళ్లిపోవాలని చెప్పారు. అయితే, హ్యాండ్ లగేజీ ఇవ్వాలంటూ ప్రయాణీకులు డిమాండ్ చేశారు. అయితే, ఆ లగేజీని నేరుగా మమ్మల్ని పంపించే మరో విమానంలో సర్ధుతామని మొదట చెప్పారు. కానీ, సమయానికి వేసుకోవాల్సిన మందులు ఆ లగేజీలోనే ఉండిపోవడంతో తర్వాత సిబ్బంది అందరికి లగేజీని ఇచ్చేశారు’’ అని ఆమె చెప్పారు.

శనివారం రోజున 137 మంది ప్రయాణీకులతో తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న మరో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం కూడా అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానంలో ఒక లోపం కారణంగా తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని కిందకు దించారు.

బెంగళూరుకు వెళ్లే ఒక ఎయిరిండియా విమానం ఆక్జిలరీ పవర్ యూనిట్‌లో మంట హెచ్చరికల కారణంగా తిరిగి దిల్లీకి వెళ్లినట్లు మే 17న వార్తలు వచ్చాయి. ఆ విమానంలో 175 మంది ప్రయాణీకులు ఉన్నట్లు పేర్కొన్నారు.

బెంగళూరు-కొచ్చి విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగిన ఘటన గురించి ఎయిరిండియా ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ ప్రమాదానికి కారణాలను నిర్ధారించేందుకు రెగ్యులేటర్ సంస్థతో సమగ్ర దర్యాప్తును జరిపిస్తామని అందులో ఎయిరిండియా పేర్కొంది.

వీడియో క్యాప్షన్, టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం ఇంజిన్ నుంచి మంటలు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)