బ్లూ కార్నర్: ప్రజ్వల్ రేవణ్ణ కోసం ఈ నోటీస్ ఎందుకు జారీ చేశారు, దీనివల్ల ఏమవుతుంది?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, అమృతా దుర్వే
- హోదా, బీబీసీ ప్రతినిధి
లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు ఇంటర్ పోల్ ‘బ్లూ కార్నర్ నోటీసు’ జారీచేసింది.
ఒక ఎంపీగా ప్రజ్వల్ రేవణ్ణ డిప్లొమాటిక్ పాస్‌పోర్టును ఉపయోగించి జర్మనీకి వెళ్ళారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ చెప్పారు. జర్మనీకి వెళ్ళేందుకు ఎంపీలకు దౌత్యపరమైన అనుమతి అవసరం లేదని, తాము వీసా జారీ చేయలేదని స్పష్టం చేశారు.
డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ మెరూన్ రంగులో ఉంటుంది. పార్లమెంటు సభ్యులకు, ఉన్నత స్థానాలలోని ప్రభుత్వాధికారులకు, దౌత్యవేత్తలకు, రాయబార కార్యాలయ అధికారులకు ఈ పాస్‌పోర్ట్‌ను జారీ చేస్తారు.
ప్రజ్వల్ రేవణ్ణ వద్ద ఈ తరహా పాస్‌పోర్టు ఉన్నందువల్లే, జర్మనీకి వెళ్ళేందుకు ఆయనకు మరో వీసా అవసరం లేకుండా పోయిందని రణ్‌ధీర్ చెప్పారు.
ప్రజ్వల రేవణ్ణను వెనక్కి రప్పించేందుకు ఇంటర్ పోల్ సాయం అర్థించడంతో, ఆయనకు ‘బ్లూ కార్నర్ నోటీసు’ జారీ అయినట్టు కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర తెలిపారు.
ఈ నేపథ్యంలో అసలు ఇంటర్ పోల్ అంటే ఏంటి, అది జారీ చేసే నోటీసులు ఎన్నిరకాలు, ఏయే సందర్భాలలో వాటిని జారీ చేస్తారో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇంటర్‌పోల్ అంటే..
ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీసు ఆర్గనైజేషన్‌ను ఇంటర్‌పోల్‌గా వ్యవహరిస్తారు. ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది.
ప్రపంచంలోని పోలీసు శాఖలన్నింటినీ ఇంటర్‌పోల్ సాంకేతికంగానూ, భౌతికంగానూ అనుసంధానం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పోలీసులకు సమాచారాన్ని, సాంకేతికతను పంచే అధికారం ఉన్న ఏకైక సంస్థ ఇదే.
1923లో ఇంటర్‌పోల్‌ను ఏర్పాటు చేసినప్పుడు 20 దేశాలు సభ్యత్వం కలిగి ఉండగా, ఇప్పుడది 196 దేశాలకు పెరిగింది. దేశాలతోపాటు, ఇంటర్‌పోల్ వివిధ అంతర్జాతీయ సంస్థలతోనూ కలిసి పనిచేస్తుంది.
దశాబ్దాల తరబడి ఐక్యరాజ్యసమితితో ఈ సంస్థ పనిచేయడమే కాకుండా, న్యూయార్క్‌లోని యూఎన్ ప్రధాన కార్యాలయంలోనూ ఇంటర్‌పోల్ కార్యాలయం ఉంది. దీంతోపాటు ఇంటర్‌పోల్ యూరోపోల్, యురోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్‌తోనూ పనిచేస్తుంది.
సభ్యదేశాలు ఏటా నిర్ణీత మొత్తాన్ని ఇంటర్‌పోల్‌కు అందిస్తాయి. అలాగే వివిధ పనులు, ప్రాజెక్టుల ద్వారా ఈ సంస్థకు విరాళాలు అందుతాయి.
2023 సంవత్సరంలో ఇంటర్‌పోల్ ఆదాయం 17.6 మిలియన్ యూరోలు.
ఇంటర్‌పోల్ 24గంటలూ పనిచేసే సురక్షిత సమాచార వ్యవస్థ ద్వారా ప్రపంచంలోని 196 దేశాలనూ ఒకదానితో ఒకటి అనుసంధానిస్తుంది.
ఇంటర్‌పోల్ డేటాబేస్‌కు ఇది రియల్‌టైమ్ యాక్సెస్‌ను కలిగిస్తుంది. ఇంటర్‌పోల్ వద్ద మొత్తం 19 రకాల డేటాబేస్‌లు ఉన్నాయి. డాక్యుమెంట్స్ డేటా బేస్, ఫోరెన్సిక్ డేటాబేస్, డీఎన్ఏ, ఫింగర్ ప్రింట్, ఫేస్ రికగ్నిషన్ డేటాబేస్‌లు ఉన్నాయి.
వివిధ నేరాలపై పోలీసులు, నిపుణుల నెట్‌వర్క్‌ను ఇంటర్‌పోల్ అనుసంధానిస్తుంది.
ఇంటర్‌పోల్ 1935లో అంతర్జాతీయ రేడియో నెట్‌వర్క్‌ను కూడా ప్రారంభించింది. ఈ రేడియో నెట్‌వర్క్ ద్వారా ప్రతిరోజూ లక్షలాది సందేశాలు పంపుతుంటారు. 196 దేశాలకూ ఈ సందేశాలు అందుకుంటాయి.
ప్రపంచ వ్యాప్తంగా పరారైన నిందితులను కనిపెట్టడంలో ఇంటర్‌పోల్ సాయమందిస్తుంది. ఇందుకోసం వివిధరకాలైన నోటీసులు జారీచేస్తుంది. దీన్నిబట్టి అన్ని దేశాలు ఆ కేసులోని తీవ్రతను అర్థం చేసుకుంటాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
నోటీసులు ఎప్పుడు జారీ చేస్తారు?
1947లో ఓ పోలీసును హత్య చేసిన రష్యన్‌ను కనిపెట్టేందుకు మొదటిసారిగా ఇంటర్‌పోల్ ‘రెడ్ నోటీస్’ జారీచేసింది. అప్పటి నుంచి వివిధ రంగుల నోటీసులు జారీచేయడం మొదలైంది.
ఈ నోటీసులను ఇంటర్‌పోల్ జనరల్ సెక్రటేరియేట్, సభ్యదేశాల విన్నపం మేరకు జారీచేస్తుంది. ఈ నోటీసులను సభ్యదేశాలన్నీ అందుకుంటాయి. దేశాలే కాక, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ క్రిమినల్ ట్రిబ్యునల్, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విజ్ఞప్తి మేరకు కూడా ఇంటర్‌పోల్ నోటీసులు జారీచేస్తుంది.
బ్లూకార్నర్ నోటీసు అంటే..
ప్రజ్వల్ రేవణ్ణ కోసం ఇంటర్‌పోల్ బ్లూకార్నర్ నోటీసు జారీచేసింది. ఓ నేరవిచారణలో నిందితుడు ఎక్కడున్నాడు, అతని గుర్తింపును కనిపెట్టడానికి ఈ నోటీసు జారీచేస్తారు.
ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి వెళ్ళినా, ఇంటర్‌పోల్ ద్వారా భారత విచారణా సంస్థలు ఆయనను పట్టుకోవచ్చు. ఇంటర్‌పోల్ ఈనోటీసు జారీ చేయగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోలీసు విచారణా సంస్థలకు, దేశాలకు సంబధిత విషయం తెలిసిపోతుంది.
దీనివల్ల నిందితుడి కదలికలు తేలికగా తెలిసిపోతాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇతర నోటీసులు
రెడ్‌నోటీస్: ఇదో అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్. ఇంటర్‌పోల్‌లోని సభ్యదేశాలు తమ చట్టాల ప్రకారం ఆ నిందితుడిని విచారించి, అరెస్ట్ చేయాలో వద్దో నిర్ధరిస్తాయి.
ఎల్లో నోటీస్: తప్పిపోయిన వ్యక్తిని వెతికి పట్టుకోవడానికి, ముఖ్యంగా 18 ఏళ్ళలోపు పిల్లలను, లేదంటే తమను తాము గుర్తించుకోలేని వ్యక్తులను పట్టుకోవడానికి జారీచేస్తారు.
బ్లాక్ నోటీస్: గుర్తుతెలియని శవాల వివరాలు తెలుసుకోవడానికి జారీచేస్తారు.
గ్రీన్ నోటీస్: ప్రజా రక్షణకు భంగకరంగా కనిపించే వ్యక్తి నేరకార్యకలాపాల గురించి హెచ్చరించడానికి జారీచేస్తారు.
ఆరెంజ్ నోటీస్: ప్రజల రక్షణకు ముప్పు కలిగించే సంఘటనలు, వస్తువులు, కార్యకలాపాల గురించి హెచ్చరించేందుకు జారీచేస్తారు.
పర్పుల్ నోటీస్: నేరస్తులు ఉపయోగించే వస్తువులు, పద్ధతుల సమాచారాన్ని అందుకోవడానికి, లేదా అందించడానికి జారీచేసే నోటీసు.
ఇంటర్‌పోల్-యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పెషల్ నోటీస్ : ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఆంక్షల కమిటీ ద్వారా లక్ష్యంగా మారిన వ్యక్తులు, లేదా సంస్థల గురించి జారీచేసే నోటీసు.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














