నకిలీ పోలీసుగా చలామణి అయిన మాళవిక అసలు పోలీసులకు ఎలా దొరికిపోయారంటే...

ఫొటో సోర్స్, MALAVIKA JADALA/Instagram
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘మహిళ బయటకు వెళ్లిందంటే ఏదో సాధించడానికే...’’ అని చెప్పిన ఆ మహిళ ఏదో సాధించాలనుకుని తప్పటడుగు వేసి చివరకు కటకటాలపాలయ్యారు.
నకిలీ రైల్వే పోలీసు అవతారంలో ఏడాదిగా అందరినీ బురిడీ కొట్టిస్తున్న మాళవిక అనే మహిళను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. ఆమె నల్లగొండ జిల్లాకు చెందిన వారు. ఏడాది కాలంగా ఈ మహిళ ఎక్కడికైనా యూనిఫామ్‌లోనే వెళుతూ తాను పోలీసునని నమ్మించారు.
రైళ్ళలో కూడా ఈమె తనిఖీలు చేసేవారు. ఫంక్షన్లకు.. బంధువుల ఇళ్ళకు, గుడులకు పోలీసు డ్రెస్సులోనే తిరుగుతూ పరపతి చూపించేవారు.
కానీ, తన పెళ్ళిచూపులకు కూడా పోలీసు డ్రెస్‌లో హాజరుకావడమే ఆమెను పట్టించింది. ఈ యువతి వ్యవహారంపై అనుమానం వచ్చిన వరుడు విచారించడంలో ఆమె అసలు సంగతి బయటపడింది.
ఏడాదిగా పోలీసు యూనిఫామ్‌లో తిరుగుతున్నా ఈమెను నకిలీ అధికారి అని ఎందుకు కనిపెట్టలేకపోయారు?

ఫొటో సోర్స్, MALAVIKA JADALA/Instagram
అసలేం జరిగింది?
నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి చెందిన జడల యాదయ్య కుమార్తె జడల మాళవిక. చిన్నప్పటి నుంచి ఎస్ఐ కావాలనేది మాళవిక కోరిక. ఆమె తల్లిదండ్రులు కూడా మాళవికను పోలీసుగా చూడాలనుకునేవారు.
మాళవిక నిజాం కళాశాలలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశారు. 2018లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)లో ఎస్ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడితే దరఖాస్తు చేశారు.
అయితే, మెల్లకన్ను ఉండటంతో ఫిజికల్ టెస్టులో అర్హత సాధించలేకపోయారు. దీని తర్వాత ఆమె రాత పరీక్షకు హాజరు కాలేదు.
బంధువులు, తెలిసిన వారి వద్ద మాత్రం తాను రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించానని, త్వరలోనే ఉద్యోగం వస్తుందని నమ్మించారు.
‘‘ఆమె ఫిజికల్ టెస్టులో ఫెయిల్ అవ్వడంతో రాత పరీక్ష రాయడానికి అర్హత సాధించలేదు.గతేడాది ఉద్యోగం వచ్చిందని తల్లిదండ్రులు, బంధువులకు చెప్పి నమ్మించింది.టెక్నికల్ కారణాలతో జీతం రావడం లేదని, త్వరలో వస్తుందని చెప్పేది’’ అని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీ షేక్ సలీమా బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, MALAVIKA JADALA/Instagram
డ్రెస్ కోడ్ తెలుసుకుని
మాళవిక దాదాపు ఏడాది నుంచి నకిలీ ఎస్ఐగా చెలామణి అవుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఎస్ఐ ఆహార్యం ఎలా ఉంటుంది, పోలీసు డ్రెస్ లో ఏమేం ఉంటాయనే విషయాన్ని ఆమె తెలుసుకున్నారని పోలీసులు చెబుతున్నారు.
‘‘ఆమె హైదరాబాద్ ఎల్బీనగర్లో ఆర్పీఎఫ్ యూనిఫామ్ కుట్టించారు. సికింద్రాబాద్ లో ఆర్పీఎఫ్ లోగో, స్టార్స్, షోల్డర్ బ్యాడ్జీ, బెల్టు, బూట్లు కొనుగోలు చేశారు. ఆపైన విశాఖ డివిజన్‌లో ఉద్యోగం వచ్చినట్టుగా నకిలీ ఐడీ కార్డు కూడా సృష్టించారు’’ అని పోలీసులు వెల్లడించారు.
నల్లగొండ-సికింద్రాబాద్ రూటులో ఆమె ఏడాది నుంచి నకిలీ ఎస్ఐ గా చలామణీ అవుతున్నట్లు పోలీసులు చెబుతున్నా.. 2019 జనవరి 3న నకిలీ ఐడీ తీసుకున్నట్లు ఉంది. కార్డుపై జె. మాళవిక, సబ్ ఇన్ స్పెక్టర్ గా రాసి ఉంది. MR5732019 యూనిక్ నంబరుతో ఐడీ కార్డు ఉంది.వెనుక వైపు బ్లడ్ గ్రూపు, అడ్రస్ రాసి ఉంది.

ఫొటో సోర్స్, MALAVIKA JADALA/Instagram
మహిళా దినోత్సవంలో సన్మానం
నల్లగొండకు చెందిన ఎంఈఎఫ్ సంస్థ మార్చి 8న నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లోనూ మాళవిక పాల్గొన్నారు. ఈ వేడుకకుకూడా మాళవిక పోలీసు యూనిఫాంలో హాజరయ్యారు. ఆమెకు సంస్థ సభ్యులు సన్మానం చేశారు.
‘‘ఒక ఆడది బయటకు వెళ్లింది అంటే ఏదో ఒకటి సాధించడానికే వెళ్లింది..
నా భార్య ఇది చేస్తుంది.. నా బిడ్డ ఇది చేస్తుంది.. అని నమ్మి బయటకు పంపండి. స్వేచ్ఛ ఇవ్వండి.. సమాజంలో వారిని ఎదగనివ్వండి..’’ అంటూ ఆమె ఒక ఉపన్యాసం చేశారు. ఈమె అరెస్టయ్యాక ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.

ఫొటో సోర్స్, MALAVIKA JADALA/Instagram
పోలీసులు ఎదురుపడితే ...
మాళవిక రైళ్లలో తనిఖీలు చేసేవారని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా పల్నాడు ఎక్స్ ప్రెస్ లో తనిఖీలు చేస్తుండేవారని చెబుతున్నారు. ఏడాదికాలంగా రైళ్లలో ఎస్ఐ అంటూ తనిఖీలు చేస్తున్నా.. ఎవరూ గుర్తించలేకపోయారు. ఇందుకు కారణాలను ఎస్పీ సలీమా వివరించారు.
‘‘ఎవరైనా పోలీసులు వస్తున్నారని ఆమె గమనిస్తే వెంటనే తన వద్ద ఉన్న జర్కిన్(జాకెట్) వేసుకునేవారు. దానివల్ల ఆమె పోలీసు యూనిఫాంలో ఉన్నట్లు ఎవరూ గుర్తించలేకపోయేవారు. అలాగే ఏ రైల్వేస్టేషన్ లో కూర్చుని విధులు నిర్వహించారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఆమె పెద్ద స్టేషన్లలో కాకుండా చిన్నచిన్న రైల్వేస్టేషన్లో కూర్చుని ఉండవచ్చు. ఒకవేళ పెద్దస్టేషన్లలోనైతే ఎస్ఐ స్థాయి అధికారి ఉండేవారు. అక్కడికి వెళితే ఆమె బండారం తెలిసిపోతుందని చిన్నస్టేషన్లను ఎంచుకుని ఉండవచ్చు.’’ అని చెప్పారు.
మాళవికను ఎక్కడైనా మోసాలకు పాల్పడ్డారా లేదా అన్నది విచారించాల్సి ఉందని. చెప్పారు.
ఎక్కడికెళ్లినా పోలీసు డ్రెస్సులోనే..
మాళవిక ఎక్కడికి వెళ్లినా, పోలీసు యూనిఫాంలోనే వెళ్లేవారు. ఆలయాలకు పోలీసు డ్రెస్ లో వెళ్లడంతో ఆమెకు ప్రత్యేక పూజలు చేయించేవారు. బంధువుల పెళ్లిళ్లకు కూడా యూనిఫాంలోనే హాజరయ్యేవారు. చాలా బిజీగా ఉండటంతో నేరుగా విధులు ముగించుకునివచ్చినట్లు నమ్మబలికేవారని పోలీసులు చెప్పారు.
రైల్వేలోనూ తనిఖీల పేరుతో ఉచితంగా ప్రయాణించేవారు. యూనిఫాంలోనే రీల్స్ చేస్తూ ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసేవారు. సినీనటుడు సుమన్ తో దిగిన ఫోటోలు ఇన్ స్టా గ్రాంలో పంచున్నారు.

ఫొటో సోర్స్, MALAVIKAJADALA
వరుడి అనుమానం
మార్చి మొదటివారంలో మాళవికకు నార్కెట్ పల్లికి చెందిన యువకుడితో నిశ్చితార్థం జరిగింది. అతడు ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, నిశ్చితార్థానికి కూడా ఆమె పోలీసు యూనిఫాంలోనే హాజరవ్వడంతో యువకుడికి అనుమానం వచ్చింది.
అప్పుడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎస్పీ షేక్ సలీమా బీబీసీతో మాట్లాడుతూ, ‘‘పెళ్లిచూపుల తర్వాత రైల్వేలో జనరల్ పోలీసులను విచారించారు. మాళవిక పేరుతో ఎవరైనా పనిచేస్తున్నారా.. అని వాకబు చేశారు. జనరల్ రైల్వే పోలీసులు ఆర్పీఎఫ్ లో వాకబు చేశారు. వారు నల్లగొండ ఆర్పీఎఫ్ సమాచారం ఇచ్చారు. అక్కడ అలాంటి పేరుతో ఎవరూ లేరని తేలడంతో స్పెషల్ బ్రాంచీ పోలీసులకు సమాచారం ఇచ్చారు" అని అన్నారు.
ఇంకా, "స్పెషల్ బ్రాంచీ పోలీసులు ఆమె మీద పది రోజులు నిఘా పెట్టారు. మాళవిక ఎక్కడికి వెళుతోంది.. ఏం చేస్తోంది.. ఇలా అన్ని విషయాలు రహస్యంగాగమనించి ఆర్పీఎఫ్ ఐజీకి నివేదిక సమర్పించారు. ఐజీ ఆదేశాల మేరకు నల్లగొండ ఆర్పీఎఫ్ ఎస్ఐ పవన్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు మాళవికను ఆరెస్టు చేశారు’’ అని వివరించారు.
మార్చి 19న ఉదయం తనిఖీలకు సిద్ధమవుతున్న సందర్భంలో నల్గొండ స్టేషన్ లో మాళవికను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు.
మాళవికపై ఐపీసీ సెక్షన్ 170(ప్రభుత్వ ఉద్యోగిగా అక్రమంగా చలామణి అవ్వడం), 419(వ్యక్తిత్వంతో మోసం చేయడం), 420(మోసం చేయడం) కింద కేసులు నమోదు చేశారు.
ఎస్ఐ యూనిఫారం, ఆర్పీఎఫ్ లోగో, స్టార్స్, ఆర్పీఎఫ్ షోల్డర్ స్టీల్ బ్యాడ్జీలు, నేమ్ ప్లేట్, బ్రౌన్ బూట్లు, బెల్టు స్వాధీనం చేసుకున్నారు. లామినేటెడ్ ఐడీ కార్డును స్వాధీనం చేసుకున్నారు.
‘‘చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేది. బాడీ లాంగ్వేజీ గానీ, మాట తీరు గానీ నిజంగా ఎస్ఐ ఉద్యోగం చేస్తున్నట్లుగా ఉండేది. రైల్వేలో దాదాపు పది లక్షల మందికిపైగా ఫోర్స్ ఉంటుంది. తెలంగాణలో ఎక్కడో చేస్తోందని అందరూ అనుకున్నారు.సిబ్బంది గానీ, అధికారులు గానీ ఐడెంటిఫై చేయలేకపోయారు.’’ అని బీబీసీతో అన్నారు సలీమా.

ఫొటో సోర్స్, Secunderabad GRP
నకిలీ పోలీసులను గుర్తించడం ఎలా..?
నకిలీ అధికారులుగా చలామణీ అవుతూ గతంలోనే చాలా మంది పట్టుబడ్డారు.
గతేడాది ఖమ్మంలో అటవీశాఖలో అధికారినంటూ కిరణ్ అనే వ్యక్తి నకిలీ గుర్తింపు కార్డు తో మోసాలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖపట్నానికి చెందిన కొవ్విరెడ్డి శ్రీనివాస్ రావు అనే వ్యక్తి సీబీఐలో జాయింట్ డైరెక్టర్ గా చలామణీ అయ్యేవారు. ఆయన్ను 2022 డిసెంబరులో దిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు.
ముఖ్యమంత్రి కార్యాలయలో అధికారి అంటూ హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన అత్తిలి ప్రవీణ్ ను 2023 డిసెంబరులో పోలీసులు అరెస్టు చేశారు. మంత్రుల లెటర్ హెడ్స్ తో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
ఎమ్మెస్సీ పూర్తి చేసిన యువతి నకిలీ ఎస్ఐ గా చలామణీ అవ్వడంపై రైల్వే పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
‘‘ఎప్పుడైనా అనుమానం వస్తే వెంటనే ఐడీ కార్డు గమనిస్తే తెలిసిపోతుంది.
మోనోగ్రామ్ తో సహా కార్డు భిన్నంగా ఉంటుంది.’’ అని చెప్పారు ఎస్పీ షేక్ సలీమా.
ప్రవర్తన, మాటతీరుతో పసిగట్టే అవకాశం..
నకిలీ అధికారులను ప్రవర్తన(బిహేవియర్), వేషధారణ ఆధారంగా గుర్తించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పారు ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్.
సాధారణంగా అధికారుల ప్రవర్తన, వేషధారణను మనం చూస్తుంటాం.
నకిలీ అధికారుల ప్రవర్తనలో కచ్చితంగా మార్పు ఉంటుంది. అనవసరంగా మాట్లాడటం, ఏదో ఆశిస్తున్నట్లు మాట తీరు ఉండటం గమనించవచ్చు.
వేషధారణ విషయంలో ఎక్కువగా బిల్డప్ ఇచ్చినట్లుగా చేస్తారు. అలా వారిని గుర్తించేందుకు వీలుంటుంది.’’ అని వివరించారు సజ్జనార్
నకిలీ అధికారులపై మూడు సెక్షన్ల కింద కేసులు పెట్టేందుకు వీలుంటుందని ఆయన చెప్పారు.
‘‘ప్రధానంగా ఈ తరహా నేరాలు మోసపూరిత చర్యల కిందకు వస్తాయి.
ఐపీసీ సెక్షన్ 419, 420 కింద కేసులు నమోదు చేస్తారు. ఇందులో సెక్షన్ 419 కింద నేరం రుజువైతే మూడేళ్ల జైలు, జరిమానా లేదా రెండు శిక్షలు విధించే వీలుంది.
420 కింద నేరం రుజువైతే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
అలాగే సెక్షన్ 170 కింద నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది. దీని కింద రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.’’ అని వివరించారు.
ఒక్కసారి కేసులు నమోదైతే జీవితంలో మళ్లీ ప్రభుత్వ ఉద్యోగం సాధించే అర్హతను కోల్పోతామనే విషయాన్ని యువత గుర్తుంచుకోవాలని చెప్పారు సజ్జనార్.
ఇవి కూడా చదవండి:
- 'కలుపు దెయ్యాల'ను 141 ఏళ్ల కిందట భూమిలో పాతిపెట్టినా చావలేదు... అవి ఇలాఎంతకాలం జీవిస్తాయి?
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
- బిర్యానీ ఎలా వండాలి? ఈ వంటకానికి రుచి తెచ్చిపెట్టే సుగంధ ద్రవ్యాలేమిటి
- సర్ ఆర్థర్ కాటన్: గోదావరి జిల్లాల ప్రజలు ఆరాధించే ఈ బ్రిటిష్ అధికారి విగ్రహానికి ఇప్పుడు ఎందుకు ముసుగు వేశారు?
- అనంతపురం: కరవుసీమలో పచ్చదనం ఎలా వచ్చింది? హార్టికల్చర్ సాగులో రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా ఎలా నిలిచింది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














