జైలు శిక్ష పడ్డాక మతంమారి 8 ఏళ్లుగా అజ్ఞాతవాసం, దోషిని పట్టించిన ‘ప్రేమ వివాదం’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మాబ్రుక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఓ కేసులో జైలు శిక్ష పడిన వ్యక్తి హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారారు, అలా పేరు మార్చుకొని గత ఎనిమిదేళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు.
తాజాగా బంధువుల్లో ఒకరి ప్రేమ వ్యవహారంలో అతన్ని పోలీసులు విచారించడంతో పాత కేసు వెలుగులోకి వచ్చింది.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణపిళ్లై నటరాజశివం (48) శ్రీలంకలోని బట్టికలోవా జిల్లా నివాసి.
2016లో ఒక కేసులో బట్టికలోవా హైకోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, పోలీసులకు లొంగిపోకుండా తప్పించుకు తిరుగుతున్నారు.
అనంతరం హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారి, పొలన్నరువా జిల్లాలోని వెలికండి ప్రాంతంలో మహమ్మద్ హుస్సేన్ పేరుతో జీవిస్తున్నారు.
ఇలా గత ఎనిమిదేళ్లుగా ఆయన అజ్ఞాతంలో ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కేసు ఏంటి?
బట్టికలోవాలోని తిరుప్పెరుందురై ప్రాంతానికి చెందిన నటరాజశివం 2007లో నావర్కేణి ప్రాంతానికి చెందిన తంగరస దర్శినిని రెండో పెళ్లి చేసుకున్నారు.
నటరాజశివం మొదటి భార్యకు ముగ్గురు పిల్లలున్నారు. దర్శినికి కూడా అప్పటికే వివాహమైంది.
కాగా, నటరాజశివం 2009లో దర్శినికి, ఆమె మొదటి భర్తకు పుట్టిన ఇద్దరు పిల్లలను కొట్టి వేధించినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
ఈ మేరకు నమోదైన కేసులో పోలీసులు నటరాజశివంను అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై నటరాజశివం విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన కోర్టు విచారణకు హాజరు కాలేదు.
దీంతో 2016లో నటరాజశివంను కోర్టు దోషిగా నిర్ధరిస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
బాధిత పిల్లలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున రూ. 2 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో మరో రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఆ కేసులో ఆయనకు రూ.20,000 జరిమానా కూడా విధించారు. ఈ జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల జైలుశిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది.
అయితే తీర్పు వెలువడే సమయంలో నటరాజశివం కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి ఆయనపై వారెంట్ జారీ చేశారు.
అనంతరం పోలీసులు నటరాజశివం నివాసం ఉంటున్న అడ్రస్‌లో వెతికారు. అయితే ఆయన అక్కడ లేరని, కుటుంబసభ్యులతో కలిసి ఎక్కడికో వెళ్లిపోయారని తెలుసుకున్నారు.

ఎలా దొరికారు?
కాగా, శ్రీలంక పోలీసులు ‘మిలిటరీ’ పేరుతో చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా నటరాజశివంను అరెస్టు చేసినట్లు బట్టికలోవా పోలీసు అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
మాదకద్రవ్యాల అనుమానితులను, వారెంట్లలో ఉన్నవారిని శోధించడం, అరెస్టు చేయడం 'మిలిటరీ' ఆపరేషన్ లక్ష్యం.
ఈ ఆపరేషన్లో భాగంగా పోలీసులకు అందిన సమాచారం మేరకు ఈ నెల 11న నటరాజశివంను అరెస్టు చేశారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు ఏప్రిల్ 4 వరకు రిమాండ్ విధించారు.
ఇస్లాంలోకి మారడంపై భార్య ఏమంటున్నారు?
ఈ కేసుపై నటరాజశివం రెండో భార్య దర్శిని బీబీసీతో మాట్లాడారు.
"నాకు 2007లో నటరాజశివంతో పెళ్లయింది. నా మొదటి భర్త ద్వారా కలిగిన ముగ్గురు పిల్లలను మా దగ్గరే ఉంచుకున్నాం. నా మొదటి భర్తకు, పిల్లలను కలవడానికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. దీంతో నటరాజశింపై 2009లో వేధింపుల కింద కేసు పెట్టారు” అని రషీదాగా పేరు మార్చకున్న దర్శిని చెప్పారు.
కోర్టులో కేసు నమోదవడంతో పిల్లలను చైల్డ్ కేర్ హోంలో ఉంచారని, 2012లో కోర్టు ఇద్దరు పిల్లలను తనకు అప్పగించిందని నటరాజశివం భార్య తెలిపారు.
తర్వాత కేసు ముగిసిపోయిందనుకున్నామని ఆమె అంటున్నారు.
కోర్టు పిల్లలను అప్పగించడంతో భర్తపై ఉన్న కేసు ముగిసిపోయిందని భావించామని, ఆ తర్వాత తన మాజీ భర్త ఉన్న ప్రాంతంలో నివసించడం ఇష్టంలేక వేరే ప్రాంతానికి వలస వెళ్లామని రషీదా అంటున్నారు.
ఇలా హఠాత్తుగా ఇస్లాంలోకి ఎందుకు మారారని నటరాజశివం భార్య రషీదాను బీబీసీ అడిగింది.
“అప్పుడు నాకు ఉండటానికి సొంత ఇల్లు లేదు. పొలం కూడా లేదు. సొంతవాళ్లు నాకు సహాయం చేయలేదు. నా పరిస్థితి బాగాలేకపోవడంతో కుటుంబంతో కలిసి ఎబ్రావూరుకు వెళ్లాం. అక్కడ మేం ఇస్లాంలోకి మారాలనుకుంటున్నట్లు చెప్పాం. మా కష్టాలను చూసిన ఒక ముస్లిం వ్యక్తి మమ్మల్ని తన ఇంట్లో మూడు నెలల పాటు ఉండేందుకు అనుమతించారు. ఇస్లాంలోకి మారేందుకు సమ్మతి లేఖ ఇచ్చాం. పోలీసు రిపోర్టు కూడా వచ్చింది. ఆ తర్వాత 2012లో ఎబ్రావూరు మసీదులో మా కుటుంబంతో కలిసి ఇస్లాం స్వీకరించాం' అని ఆమె చెప్పారు.
“ఆ తర్వాత మేం ఎబ్రావూరు నుంచి పోలోన్నరువా జిల్లాలోని వెలికంఠై సేనపురానికి వెళ్లాం. అక్కడ ఒకరు భూమిని బహుమతిగా ఇస్తే, దానిలో ఇంటి నిర్మాణం మొదలుపెట్టాం. కానీ నా భర్త పని చేయడం ద్వారా వచ్చే డబ్బులతో ఇంటిని పూర్తి చేయలేకపోయాం. దాంతో అక్కడి మసీదు నిర్వాహకులే మా ఇంటికి పైకప్పు వేశారు. అక్కడే ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్నాం. ప్రభుత్వ పథకాల కోసం అప్లై చేశాం. నా భర్త పని నిమిత్తం చాలా ప్రాంతాలు తిరిగేవాడు. మేం నిజంగా అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటే, మేం మా ఐడెంటినీ ఇలా బయటపెట్టేవాళ్లం కాదు” అని రషీదా అంటున్నారు.

పట్టించిన ప్రేమ
''మా సోదరి కొడుకు ఒక యువతిని ప్రేమించాడు, ఆమెను తీసుకొచ్చి మా ఇంట్లో ఉన్నాడు, ఇది నా భర్తకు నచ్చలేదు, అందుకే మా సోదరి కొడుకును, ఆ అమ్మాయిని ఊరికి పంపించాను'' అని రషీదా తెలిపారు.
"కొడుకు ఇల్లు వదిలి వెళ్లడంతో నా సోదరి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు విచారించారు. అతను మా ఇంట్లోనే ఉన్నాడని తెలిసింది. ఆ తర్వాత పోలీసులు మమ్మల్ని ప్రశ్నించారు. నా భర్తకు 2016లో బట్టికలోవా హైకోర్టు జైలుశిక్ష విధించిందని పోలీసులు అప్పుడే నాకు చెప్పారు” అని రషీదా వివరించారు.
ఈ నెల 11న తన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారని, ఏప్రిల్ 4వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు ఆమె తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఎలక్టోరల్ బాండ్స్: కొన్ని తెలుగు రాష్ట్రాల కంపెనీలు భారీగా రాజకీయ విరాళాలిచ్చి ఆర్ధికంగా లబ్ధికి ప్రయత్నించాయా?
- ఫ్రామౌరో: మతం కాదు, సైన్స్ ఆధారంగా తొలి ప్రపంచ పటాన్ని చిత్రించిన సన్యాసి... గడప దాటకుండానే ఆయన ఈ అధ్భుతాన్ని ఎలా సాధించారు?
- గుజరాత్ యూనివర్సిటీ: 'నమాజ్ చేస్తుండగా మాపై దాడి చేశారు, మేం చదువు ఎలా పూర్తి చేయాల'ని ప్రశ్నిస్తున్న విదేశీ విద్యార్థులు
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
- సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














