జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?

పెరూలో పుడెల్లా కార్లే అనే కొత్త జాతి జింకను గుర్తించారు

ఫొటో సోర్స్, SERNANP

ఫొటో క్యాప్షన్, పెరూలో పుడెల్లా కార్లే అనే కొత్త జాతి జింకను గుర్తించారు

దక్షిణ అమెరికా ఖండంలో జింకల్లో ఒక కొత్త జాతిని కనుగొని 60 ఏళ్లకు పైగా గడిచింది.

ప్రపంచంలో 21వ శతాబ్దంలో కనుగొన్న కొత్త జింక జాతి ఇదే.

తాజాగా ఉత్తర పెరూలో పుడెల్లా కార్లే లేదా పెరూవియన్ జుంగా పుడు అని పిలిచే కొత్త జాతి జింక కనిపించింది.

అర్జెంటీనా నుంచి కొలంబియా వరకు ఉన్న పెద్ద భూభాగాల్లో నివసించే చిన్న, ముదురు రంగు జింకను చాలా ఏళ్ల క్రితం పరిశోధకులు కనుగొన్నారు.

ఇదే పేరుతో రెండు జాతులు ఉండేవి. అందులో ఒకటి పుడు పుడా. అర్జెంటీనా, చిలీ మధ్యలోని ఉత్తర సరిహద్దు అడవుల్లో ఇవి నివసిస్తాయి.

రెండోది పుడు మెఫిస్టోఫిల్స్. దీన్నే ప్రపంచంలోకెల్లా జింకల్లో అతిచిన్న జాతిగా పరిగణిస్తారు. ఉత్తర పుడు అని కూడా పిలుస్తారు. పెరూ, ఈక్వెడార్, కొలంబియాలోని కొన్ని ప్రాంతాల మధ్య ఉన్న ఎత్తైన కొండల్లో ఇవి నివసిస్తాయి.

పుడు మెఫిస్టోఫిల్స్‌లో నిజానికి రెండు వేర్వేరు జాతులు ఉన్నాయని పెరూలోని ఆర్నిథాలజీ, బయోడైవర్సిటీ కేంద్రానికి చెందిన మాస్టోజువాలజీ డివిజన్ పరిశోధకులు నిరూపించగలిగారు.

అందులో ఒకటి పుడెల్లా మెఫిస్టోఫిలా, రెండోది కొత్తగా గుర్తించిన పుడెల్లా కార్లే.

పుడెల్లా మెఫిస్టోఫిలా జీవులు పెరూలోని హ్యుంకాబాంబా నుంచి ఉత్తర అమెరికా వరకున్న ప్రాంతంలో ఉంటాయి.

కొత్త జాతి జింక పుడెల్లా కార్లే, హ్యుంకాబాంబాకు దక్షిణాన ఉంటుంది. లిమా నుంచి అయితే ఉత్తరాన 1,000 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.

పుడెల్లా కార్లే

ఫొటో సోర్స్, SERNANP

ఫొటో క్యాప్షన్, ఉత్తర పెరూలోని హ్యాంకాబాంబాకు ఆగ్నేయంగా పుడెల్లా కార్లేను గుర్తించారు

రెండు జాతుల్లో ఉన్న తేడాలు ఏంటి?

పుడు వంటి అరుదైన క్షీరదాలు జీవించే ప్రాంతాల్లో పరిరక్షణ ప్రాజెక్టులను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఇటీవలి సంవత్సరాల్లో పెరూకు చెందిన నేషనల్ సర్వీస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ న్యాచురల్ ఏరియాస్ సంస్థ వివిధ ఆవాసాల్లో అనేక అధ్యయనాలు చేపట్టింది.

పెరూ శాస్త్రవేత్త జేవియర్ బరియో ఈ అధ్యయనాల్ని నిర్వహించారు. ఈ రెండు జాతులు వేర్వేరుగా ఉన్నాయని ఆయన సూచించారు. ఏళ్లుగా ఆ రెండు జాతుల్ని ఒకటనే (ఒకే జంతువు) భావిస్తున్నారు.

అనేక జన్యు, మార్ఫోలాజికల్ విశ్లేషణల తర్వాత, హ్యుంకాబాంబాకు దక్షిణాన నివసించే పుడు జీవులు, ఉత్తరాన నివసించే జీవులు ఒకటి కాదని ఆ బృందం నిరూపించగలిగింది.

ఈ రెండు జీవుల మధ్య రెండు తేడాలు ఉన్నాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న యూనివర్సిడాడ్ ఆస్ట్రల్ డి చిలీకి చెందిన ప్రొఫెసర్ గిలెర్మో డి ఎలియా చెప్పారు.

మొదటిది వాటి శరీర కూర్పులో తేడాలు. పుడెల్లా కార్లే శరీరం పెద్దదిగా, శరీరంపై వెంట్రుకలు మందంగా ఉంటాయి. చెవుల ఆకారం కూడా వేరుగా ఉంటుంది.

‘‘వాటిని ఒకే జాతి జంతువులు అని పిలవడానికి వాటి వంశాలు ఒకటే కావు. వేర్వేరు’’ అని డి ఎలియా అన్నారు.

ఉత్తర పుడు

ఫొటో సోర్స్, WIKICOMMONS

ఫొటో క్యాప్షన్, పెరూ, ఈక్వెడార్, కొలంబియాల్లో ఉండే ఉత్తర పుడు జంతువులను ప్రపంచంలో అతి చిన్న జింక జాతిగా పరిగణిస్తారు.

ఆ పేరు ఎలా పెట్టారు?

చిలీకి చెందిన మపుడుంగన్ భాషలోని పుడు అనే పదం నుంచి ఈ పేరు వచ్చింది. పుడు అంటే మపుడుంగన్ భాషలో జింక అని అర్థం.

చిలీ, అర్జెంటీనాలో కనిపించే జింక జాతి జంతువులను అక్కడివారు ఇలా పిలిచారు.

పెరూ, ఈక్వెడార్‌లో గుర్తించే వాటిని కూడా ఇదే పేరుతో పిలవాలని నిర్ణయించారు.

ఈ జీవులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తల్లో ఒకరైన కార్లా గజాలో పేరు మీదుగా కార్లే అని పెట్టారు.

పర్యావరణ ముప్పు పొంచి ఉన్న నేటి ప్రపంచంలో కొత్త జాతులను కనుగొనడంలో మాత్రమే కాకుండా, దక్షిణ అమెరికా ఖండంలో నివసించే జింక జాతుల గురించి మరింత సమాచారాన్ని అందించడంలో ఈ ఆవిష్కరణ పెద్ద పాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెప్పారు.

‘‘ఈ జీవుల చరిత్ర గురించి మనకు తెలియదు. అవి ఎలా కదులుతాయో, ఎలా తింటాయో, ఎలా జతకడతాయో తెలియదు. అందుకే వాటిపై పరిశోధనలు చేయడం చాలా ముఖ్యం’’ అని తెలిపారు.

ఈ క్షీరదాల పరిరక్షణకు తాజా డేటా ప్రాథమికమని పరిశోధకులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)