డానియోనెల్లా సెరెబ్రమ్: సెంటీమీటర్ పొడవున్న ఈ చేప అరిస్తే తుపాకీ పేలినంత శబ్దం

- రచయిత, మాట్ మెక్‌గ్రాత్
- హోదా, పర్యావరణ కరస్పాండెంట్
ఫిష్ ట్యాంక్‌ల నుంచి అంతుచిక్కని శబ్దాలు రావడంతో దీనిని ఛేదించాల్సిందిగా బెర్లిన్ శాస్త్రవేత్తలకు కబురందింది.
ఇలా శబ్ధాలు చేస్తున్న చేప పేరు డానియోనెల్లా సెరెబ్రమ్ అని పరిశోధకులు తెలిపారు.
ఈ చిన్న చేప డ్రిల్ మాదిరి పెద్ద శబ్దం చేస్తోంది. ఈ చేప 'స్విమ్ బ్లాడర్' అనే అవయవం ఉపయోగించి రిథమ్‌తో కూడిన శబ్ధాలు చేస్తుందని పరిశోధకులు తెలిపారు.
డానియోనెల్లా దాదాపు 140 డెసిబుల్స్ శబ్ధం చేయగలదని, అది తుపాకీ షాట్ శబ్ధం మాదిరి ఉంటుందని చెప్పారు.
అయితే, ఈ చేప పొడవు కేవలం 12 మిల్లీమీటర్లేనని(సెంటీమీటర్ కంటే కొంచెం ఎక్కువ), ఈ జాతుల్లో ఇంత పెద్ద శబ్ధం చేస్తున్న చేప ఇదేనని పరిశోధకులు అంటున్నారు. ఇంతకీ అలా ఎందుకు చేస్తోంది? శాస్త్రవేత్తలు ఏం చెప్పారు?

ఫొటో సోర్స్, ALAMY
ఎలా బయటపెట్టారు?
సాధారణంగా పెద్ద జంతువులు పెద్ద శబ్ధాలు చేస్తుంటాయి. అయితే, నీటి అడుగున ఇది రివర్స్. కానీ, ఈ చిన్న చేప నీటిలోనూ అధిక శబ్దాలు చేస్తోంది.
పిస్టల్ రొయ్యల వంటి జీవులు దాదాపు 200 డెసిబెల్స్ వరకు ఇతర ప్రాణులను వేటాడేటప్పుడు పెద్ద శబ్దాలను సృష్టించగలవని శాస్త్రవేత్తలకు తెలుసు.
అయితే, జర్మనీలోని తమ ల్యాబ్‌లో డానియోనెల్లాపై పరిశోధన జరుపుతున్నపుడు శాస్త్రవేత్తలు ఆ చేపలో అసాధారణ ప్రవర్తన గమనించారు.
"ల్యాబ్‌లో జనం ఫిష్ ట్యాంకు దగ్గరి నుంచి నడుస్తుండగా ఈ శబ్దాలను విన్నారు, అవి ఎక్కడ నుంచి వస్తున్నాయా అనుకున్నారు" అని ఈ అధ్యయనం ప్రధాన రచయిత, బెర్లిన్‌లోని చారిటే విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ విద్యార్థి వెరిటీ కుక్ అన్నారు.
వెంటనే పరిశోధన బృందం మైక్రోఫోన్‌లు, వీడియో కెమెరాలను ఉపయోగించి ఆ శబ్ధాల రహస్యాన్ని బయటపెట్టారు.
"ఆ శబ్ధాలు చేపల నుంచి వస్తున్నాయని తేలింది. ఇది అసాధారణమైనది, ఎందుకంటే అవి చాలా చిన్నవి, పెద్దగా శబ్ధం చేస్తున్నాయి" అని వెరిటీ కుక్ తెలిపారు.
చేపలు చేస్తున్న ఈ శబ్ధం ఒక కమ్యూనికేషన్ వంటిదని భావిస్తున్నారు.
ఇలాంటి జంతువును చూడలేదు: కుక్
''రెండు జీవుల మధ్య 140 డెసిబుల్స్ శబ్ధం వ్యాపిస్తే దూరం వెళుతున్న కొద్దీ ఆ ధ్వని క్షీణిస్తుంది. అంటే ఒక మీటర్ దూరంలో అది 108 డెసిబుల్స్ మాత్రమే వినిపిస్తుంది'' ఆమె బీబీసీ న్యూస్‌తో కుక్ అన్నారు.
చేపల శబ్ధాలు నీటి లోపల ప్రతిధ్వనించడంతో ఫిష్ ట్యాంకు బయట ఉన్న జనాలకు నిరంతర ధ్వనిలా వినిపిస్తుంది.
అది ఒక బుల్డోజర్ చేసే శబ్దానికి దాదాపు సమానం. ప్లెయిన్‌ఫిన్ మిడ్‌షిప్ మ్యాన్ చేప, బ్లాక్ డ్రమ్ చేపలు ఎక్కువ శబ్దం చేస్తాయి కానీ, అవన్నీ డానియోనెల్లా కంటే చాలా పెద్దవి.
"కమ్యూనికేషన్ సిగ్నల్స్ పరంగా ఇంత గట్టిగా శబ్దాలు చేసే చిన్న జంతువును ఇప్పటివరకు చూడలేదు" అని కుక్ తెలిపారు.
చేపలు ఉపయోగించే డ్రమ్మింగ్ మెకానిజం చాలా అధునాతనమని పరిశోధకులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ శబ్ధం ఎలా వస్తుంది?
అన్ని అస్థి చేపలకు 'స్విమ్ బ్లాడర్' ఉంటుంది, ఇది నీటిలో ఉండటానికి సహాయపడే వాయువుతో నిండిన అవయవం.
అనేక జాతుల్లో శరీరంపైనున్న బ్లాడర్‌ను కండరాలు బలంగా తాకినపుడు శబ్ధాలు బయటికొస్తాయి, కానీ డానియోనెల్లా మరికొన్ని దశలు ముందుకు వెళుతుంది.
చేప దాని కండరాలను సంకోచించినప్పుడు, పక్కటెముకపై శక్తి ప్రయోగం జరుగుతుంది. దీంతో కండరాల లోపలున్న మృదులాస్థిపై ఉద్రిక్తత కలుగుతుంది.
ఎప్పుడైతే మృదులాస్థి విడుదలవుతుందో అపుడది స్విమ్ బ్లాడర్‌ను తాకుతుంది.
ఈ జాతులలోని మగవి మాత్రమే ఈ ధ్వనిని చేస్తాయి, మరొకటి ఉన్నపుడే ఇలా చేస్తుంటాయి. కొన్నైతే గట్టిగానూ చేస్తాయి.
"ఒక పెద్ద ట్యాంక్‌లో ఎనిమిది మగవి ఉన్నప్పుడు, శబ్ధాలు సృష్టించడంలో వాటిలో మూడు ఆధిపత్యం చెలాయిస్తాయి, మిగిలినవి నిశ్శబ్దంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాటికి స్థాయిలూ ఉన్నాయనుకుంటున్నాం" అని కుక్ చెప్పారు.
మియన్మార్‌లోని మురికి నీరు కూడా డానియోనెల్లా శబ్దాలు చేసేలా తోడ్పడ్డాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది చాలా ఆసక్తికర సమస్యలను పరిష్కరించేలా చేసిందని కుక్ తెలిపారు.
"ఒక జాతి ప్రాణిలో ఏం జరుగుతుందో అదేవిధంగా మిగతా వాటిలోనూ జరుగుతుందనుకోకూడదు" అని సూచిస్తున్నారు కుక్.
నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ అనే జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
ఇవి కూడా చదవండి:
- స్కిన్ డొనేషన్: కిడ్నీ, లివర్‌లాగే చర్మాన్నీ కూడా దానం చేయవచ్చని తెలుసా?
- సీతాదేవీ: రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన ఈ పిఠాపురం యువరాణి కథ ఏంటి?
- ఐశ్వర్యా రాయ్ పేరును రాహుల్ గాంధీ పదేపదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు?
- విజయ్: ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ ఎందుకు పెట్టారు? అప్పట్లో ఆయన సినిమాలు చిక్కుల్లో ఎందుకు పడ్డాయి?
- మునావర్ ఫారూకీ: ఈ బిగ్‌బాస్ విజేత చుట్టూ ఎందుకింత చర్చ?
- పాకిస్తాన్లో భారతీయ టీవీ సీరియళ్లను నిషేధించినా ఆ ప్రభావం మాత్రం అలాగే ఎందుకు కొనసాగుతోంది
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














