బ్లూవేల్స్: ఒకప్పుడు భారీ వేటకు బలైపోయిన ఈ అతిపెద్ద జీవులు ‘పుట్టింటికి’ తిరిగి వస్తున్నాయి!

నీలి తిమింగలం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నీలి తిమింగలం భూమ్మీద అతిపెద్ద జంతువు
    • రచయిత, విక్టోరియా గిల్, కేట్ స్టీఫెన్స్
    • హోదా, సైన్స్ టీమ్, బీబీసీ న్యూస్

దశాబ్దాల కిందట హిందూ మహాసముద్రంలోని ఓ ప్రాంతంలో విపరీతమైన వేట కారణంగా అంతరించిపోయే దశకు చేరిన నీలితిమింగలాలు (బ్లూ వేల్స్ ) ‘పుట్టింటికి’ తిరిగొస్తున్నాయి.

భూమ్మీద అతిపెద్ద జంతువుగా నీలితిమింగలం గుర్తింపు పొందింది.

తూర్పు ఆఫ్రికాలోని 115 ద్వీప సముదాయాలలో ఒకటైన సీషెల్స్ ద్వీపంలో 2020, 2021 సంవత్సరాలలో కొంత మంది పరిశోధకులు, సినిమా దర్శకులు బ్లూవేల్స్ ఫోటోలను తీశారు. ఈ ఫోటోలను ‘‘బ్లూ వేల్స్: రిటర్న్ ఆఫ్ ది జెయింట్స్’’ సినిమాలో చూడొచ్చు.

ఒక ఏడాదిపాటు నీటి అడుగున సాగిన రికార్డింగ్ ఈ పరిశోధనను మరింత ముందుకు తీసుకువెళుతూ ఈ ప్రాంతంలో నీలి తిమింగలాలు నెలల తరబడి ఉన్నట్టు తేల్చింది. అంటే దీనర్థం అవి అక్కడ సంతానోత్పత్తి చేస్తున్నాయని సైంటిస్టులు చెపుతున్నారు.

1960లో సోవియట్‌లో నీలి తిమింగలాలను భారీగా వేటాడి, అవి అంతరించిపోయే దశకు చేరిన తరువాత తిరిగి వాటి జాడ కనిపిస్తుండటం వారికి ఉత్సాహాన్ని ఇస్తోంది. వీటి జాడను కనిపెట్టిన పరిశోధకులు, దీనిని ‘‘పరిరక్షణ సాధించిన విజయం’’గా పేర్కొంటున్నారు.

‘‘పెద్ద ఎత్తున జంతువులను చంపడం మానేసి, వాటి సంతతి పెరిగేందుకు అవకాశం ఇస్తే, అవి కోలుకుంటాయి’’ అని పరిశోధనా బృంద సారథుల్లో ఒకరైన డాక్టర్ కేట్ స్టాఫోర్డ్ బీబీసీకి చెప్పారు. వాణిజ్యపరమైన చేపల వేట దీర్ఘకాల ప్రభావం చూపుతోందని చెప్పారు.

ఒకనాటి నీలి తిమింగలాల సంఖ్యతో పోల్చుకుంటే ఇప్పడు అవి అంతరించిపోయే దశలోనే ఉన్నాయని అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం తెలిపింది. సహజ సంపదల పరిరక్షణ కోసం ఈ సంఘం కృషి చేస్తూ ఉంటుంది.

దక్షిణార్థగోళంలో ఆధునిక, వేగవంతమైన నౌకలతో మూడు లక్షలకుపైగా నీలి తిమింగలాలను వేటాడారు.

‘‘భూమ్మీదున్న ఏకైక అతిపెద్ద జంతువు ఇదే. ఇవెక్కడి నుంచి తిరిగి వచ్చాయనే విషయాన్ని మేం తెలుసుకోవాలనుకుంటున్నాం. సీషెల్ ప్రాంతంలో వీటి జనాభా ఉందని తెలియడంతో ఉత్సుకతకు లోనవుతున్నాం’’ అని డాక్టర్ స్టాఫోర్డ్ చెప్పారు.

నీలి తిమింగలం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1930లో ఒక్క ఏడాదిలోనే 30 వేల నీలి తిమింగలాలను వేటాడి వధించారు.

సౌండ్ ట్రాప్‌తో ఆచూకీ గుర్తింపు

ఓ చిన్నద్వీపంలో నీటి అడుగున ఏర్పాటుచేసిన ‘సౌండ్ ట్రాప్’ కారణంగానే వీటిని కనుగొన్నట్టు ఎన్‌డేంజర్డ్ స్పీసిస్ రీసర్చ్ జర్నల్‌ ప్రచురించింది. ఈ ఉచ్చులో అండర్ వాటర్ మైక్రోఫోన్స్, బ్యాటరీలు, రికార్డింగ్ పరికరాలు ఉంటాయి. ఏడాదిపాటు ఈ పరికరాన్ని నీటి అడుగునే ఉంచారు. గంటకు 15 నిమిషాల పాటు అక్కడి శబ్దాలను ఇది రికార్డు చేసేది.

అదే సమయంలో డాక్టర్ స్టాఫోర్డ్ కూడా తన నెల రోజుల యాత్రలో రోజుకు కొన్నిగంటలపాటు హైడ్రోఫోన్‌ను సముద్రపు అడుగుభాగాన ఉంచేవారు.

‘‘మేము అపురూపమైన శబ్దాలు విన్నాం. నీటి అడుగున వేల మీటర్ల లోతులో స్పెర్మ్ వేల్స్ కదలికలు, డాల్ఫిన్లు ఇచ్చిపుచ్చుకునే సమాచారం, తామెక్కడున్నది శబ్దాల ద్వారా తెలియజేయడం విన్నాం. కానీ దురదృష్టవశాత్తూ బ్లూవేల్స్ శబ్దాలు వినిపించలేదు’’ అని ఈ పరిశోధనలో సౌండ్ ఇంజినీర్‌గా వ్యవహరించిన క్రిస్ వాట్సన్ బీబీసీకి తెలిపారు.

నీలి తిమింగలం

ఫొటో సోర్స్, OCEANIC FILMS

ఫొటో క్యాప్షన్, సీషెల్స్ ప్రాంతంలో నీలితిమింగలాల సంతతి ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు

సంతానోత్పత్తి సమయంలో పాటలు

శాస్త్రవేత్తలు సౌండ్ ట్రాప్‌ నీటిపైకి తీసుకొచ్చాక క్షుణ్ణంగా విశ్లేషించారు. బ్లూవేల్స్ సీషెల్స్ ప్రాంతంలో ఉన్నాయని, పరిశోధకుల కదలికలు లేనప్పుడు అవి తమవైన పాటలు పాడుకున్నాయని అర్థం చేసుకున్నారు.

‘‘వీటి పాటలను ప్రత్యేకించి మార్చి, ఏప్రిల్‌లలో వినగలం. అంటే సీషెల్ ద్వీపం నీలి తిమింగలాలకు చాలా ముఖ్యమైన ప్రాంతమని అర్థమవుతోంది’’ అని స్టాఫోర్డ్ చెప్పారు.

‘‘సంతానోత్పత్తి సమయంలో మాత్రమే అవి పాటలు పాడతాయి. బహుశా మగవే పాట పాడతాయని భావిస్తున్నాం. ఇలా ఎందుకు చెపుతున్నామంటే ఇతర జీవులు ఇలాంటప్పుడు ఏం చేస్తాయో మాకు తెలుసు కాబట్టే ఈ నిర్థరణకు వస్తున్నాం. సీషెల్ వీటి సంతానోత్పత్తికి, లేదా పెంపకానికి అనువైన ప్రాంతమయ్యే అవకాశం ఉంది’’ అని వివరించారు.

ఇవి చేసే శబ్దాలను బట్టి వీటిని మనం వేరు చేయవచ్చని, సీషెల్‌లో తాము విన్న జలచరాల శబ్దాలు హిందూ మహాసముద్రంలో ఉత్తర భాగానికి దగ్గరగా ఉన్నాయని స్టాఫోర్డ్ చెప్పారు.

బ్లూవేల్ పాట మనిషి వినికిడి పరిధిని మించి ఉంటుంది.

నీలి తిమింగలం

ఫొటో సోర్స్, OCEANIC FILMS

ఫొటో క్యాప్షన్, సీషెల్స్ సముద్రపు అడుగున డైవర్స్ రికార్డింగ్ పరికరాలను అమర్చారు

బ్లూవేల్స్ పాటలు మనం వినగలమా?

గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో వేల్స్ శబ్దాలను రికార్డు చేసిన వాట్సన్ మాత్రం బ్లూవేల్స్ పాటలను మనం వినగలమని చెప్పారు. మెక్సికోలో తాను వేల్స్ శబ్దాలను రికార్డు చేసినప్పుడు వాటిని తన హెడ్‌ఫోన్స్‌లో వినగలిగినట్టు చెప్పారు. ఆ శబ్దాలు తన హెడ్‌ఫోన్స్‌లో ప్రతిధ్వనించాయని తెలిపారు.

‘’15 నుంచి 20 సెకన్లపాటు 188 డెసిబుల్స్ అంటే గాలిలో జెట్ ఇంజిన్ చేసే శబ్దంతో సమానమైన ధ్వనిని ఇవి చేస్తాయి’’ అని స్టాఫోర్డ్ తెలిపారు.

నీలి తిమింగలాలు వందల కిలోమీటర్లు లేదంటే వెయ్యికిలోమీటర్ల దూరంలో ఉన్నా శబ్దాలతో సమాచారం ఇచ్చి పుచ్చుకోగలవని చెప్పారు.

నీలితిమింగలాలకు సీషెల్ ఎంతటి ముఖ్యమైనదో శాస్త్రవేత్తలు తెలుసుకోవాలనుకుంటున్నారు.

అక్కడి ప్రభుత్వం చొరవతో నాలుగు లక్షల కిలోమీటర్ల సముద్రప్రాంతాన్ని రక్షించగలుగుతున్నారు. అయితే నీలి తిమింగలాలకు శబ్ద కాలుష్యం ద్వారా హాని కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

‘‘సీషెల్‌లో ఎక్కువగా సముద్రపు ట్రాఫిక్ లేదు కాబట్టి నీలి తిమింగలాలకు ఈ ప్రాంతం సురక్షితమైనదిగా చెప్పొచ్చు’’ అని ముగించారు స్టాఫోర్డ్ .

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)