పసిఫిక్ మహాసముద్రం: అర కిలోమీటర్ లోతు అగాథంలో 3 రోజులు చిక్కుకున్న నావికులు, చివరికి ఎలా కాపాడారంటే...

ఫొటో సోర్స్, PA
- రచయిత, వెనెస్సా బర్ఫోర్డ్
- హోదా, బీబీసీ న్యూస్
ఓ 50 ఏళ్ళ కిందట ఇద్దరు బ్రిటిషు నావికులు సముద్రపు అగాథంలో మూడు రోజులపాటు చిక్కుకుపోయారు. జలంతర్గామిలోని ఆరడుగుల వ్యాసార్థం గల స్టీలు బాల్‌లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు.
మరో 12 నిమిషాల్లో ఆక్సిజన్ అయిపోతుందనగా వీరు ప్రాణాలో బయటపడ్డారు.
అప్పట్లో ఈ పైసిస్-3 కథ హెడ్‌లైన్లలో నానింది. కాలక్రమంలో ఈ సంఘటన మరుగునపడింది. ఐర్లాండ్‌కు దాదాపు 250 కి.మీ. దూరంలో జరిగిందీ సంఘటన.
ఈ సంఘటన 76 గంటల రెస్క్యూ ఆపరేషన్ సుఖాంతంగా ముగిసింది.

ఫొటో సోర్స్, OTHERS
ఆరోజు ఏం జరిగింది?
అది 1973 ఆగస్టు 29, బుధవారం.
రాయల్ నేవీ మాజీ సబ్‌మెరైనర్ 28 ఏళ్ళ రోజర్ చాప్‌మెన్ , 35 ఏళ్ళ ఇంజనీర్ రోజర్ మిల్లెన్సన్ ఓ ప్రమాదం కారణంగా అట్లాంటిక్ సముద్రపు అగాథంలో చిక్కుకుపోయారు.
సంఘటన జరిగిన రోజు రోజర్ చాప్‌మెన్ , రోజర్ మిల్లెన్సన్ ఇద్దరూ ఐర్లాండ్‌కు దాదాపు 250 కి.మీ.ల దూరంలో అట్లాంటిక్ సముద్రంలో కెనడా కమర్షియల్ సబ్‌మెర్సిబుల్‌లో తమ రోజువారీ పనిలో మునిగి ఉన్నారు.
ఈ సబ్ మెర్సిబుల్ కార్గ్ నగరానికి నైరుతి దిశగా సముద్రగర్భంలో టెలిఫోన్ కేబులు వేసే పనులు చేస్తోంది.
‘‘మేం నీటిలో గంటకు అరమైలు దూరం ప్రయాణిస్తున్నాం, నీటి అడుగున పంపులు, జెట్ల సహాయంతో కేబుల్ వేసేపని పూర్తి చేశాం’’ అని రోజర్ చాప్‌మెన్ చెప్పారు.
‘‘ఈ పని మమ్మల్నెంతో అలసిపోయేలా చేసింది. దట్టంగా అలుముకున్న మంచులో ఓ తెల్లని గీతనే చూస్తూ వాహనాన్ని నడిపినట్టుగా ఉంది మా పరిస్థితి’’ అని మిల్లెన్సన్ చెప్పారు.
‘‘మేమప్పుడు 26 గంటల నుంచి నిద్రలేకుండా పనిచేస్తూనే ఉన్నాం. అంతకు ముందు రోజు జరిగిన ఓ చిన్న సంఘటన సబ్ మెర్సిబుల్‌ను డామేజ్ చేసింది. దీంతో మేం నిద్రకూడా పోకుండా దీనిని రిపేర్ చేయాల్సి వచ్చింది. నాకు పైసిస్ గురించి క్షుణ్ణంగా తెలుసు. ఎందుకంటే ఇది పూర్తిగా ధ్వంసమైన స్థితిలో కెనడా నుంచి వచ్చినప్పుడు బాగు చేసింది నేనే’’ అని ఆయన చెప్పారు.
‘‘అంతకు ముందు రోజు దీనిని రిపేర్ చేసినప్పుడు ఆక్సిజన్ ట్యాంక్‌ను కూడా మార్చాను. నిజానికి అప్పటికి సగం ఆక్సిజన్ ఉంది. అయినా పూర్తి ట్యాంక్ ఏర్పాటు చేయాలనుకున్నా. ఇది చాలా కష్టమైన, శారీరకశ్రమతో కూడిన పని. కానీ నేను ఆ పని చేశాను కాబట్టే, ఈ రోజున బతికి ఉండగలిగాను’’ అని మిలెన్సన్ గుర్తు చేసుకున్నారు.
‘‘సముద్రగర్భంలో మా పని పూర్తయింది. మా సబ్‌మెరైన్‌ను తాళ్ళతో పైకి లాగుతారని ఎదురు చూస్తున్నాం. తాళ్ళు, గొలుసుల శబ్దాలు మాకు వినిపిస్తూనే ఉన్నాయి. ఇది సాధారణంగా జరిగే విషయమే. అయితే హఠాత్తుగా నీటి కిందకు వెళ్ళిపోతున్నామని అర్థమైంది. సబ్‌మెరైన్ బీభత్సంగా ఊగిపోవడం మొదలుపెట్టింది. అదో భయంకరమైన అనుభవం’’ అని మిలెన్సన్ తెలిపారు.
‘‘మా సబ్‌మెరైన్ సముద్రపు అడుగు భాగాన్ని ఢీకొడుతుందేమోనన్నది మా బాధ. ఒకవేళ అదే జరిగితే మేం బతకమని భయమేసింది’’ అని చెప్పారు.
‘‘మేం వెంటనే ఎలక్ట్రికల్ వ్యవస్థను ఆపేశాం. దీనివలన సబ్ మెరైన్ గణనీయమైన బరువును కోల్పోయి తేలికగా మారింది. 500 అడుగుల లోతున డెప్త్ గేజ్‌ను ఆపాం. అది నీటి ఒత్తిడికి పగిలిపోతే మాకు గాయలయ్యేవి.’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, PA
అన్వేషణ మొదలు
ఈ సంఘటన తరువాత ఛాప్‌మెన్, మిల్లెన్సన్ సాయం చేయాలంటూ సందేశం పంపారు. ప్రమాదం జరిగినప్పుడు సబ్‌మెరైన్‌లో 66 గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉంది.
సహాయం చేయాలంటూ పైసిస్ 3 నుంచి పిలుపురాగానే, దీనికి అనుబంధంగా ఉండే వికర్స్ వాయేజర్ వెంటనే కార్క్ సిటీ వైపు బయల్దేరింది.
అక్కడి నుంచి పైసిస్ 2, పైసిస్ 5 సబ్‌మెర్సిబుల్స్‌తో పైసిస్ 3 జాడ కనుగొనేందుకు బయల్దేరారు.
వీరికి సాయం చేసేందుకు కొన్ని నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్‌లు కూడా బయల్దేరాయి. మూడు రోజులపాటు సాగిన ఈ ఆపరేషన్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.
పైసిస్ 2ను నీటి అడుగుకి పంపే ప్రయత్నం చేయగా, మధ్యతో దాన్ని మోసే తాడు తెగిపోవడం తిరిగి పైకి తీసుకురావాలసి వచ్చింది.
మరో జలంతర్గామి పైసిస్ 5 ఓ తాడు సాయంతో నీటి అడుగుకు వెళ్ళింది. అయితే పైసిస్ 3 జాడ కనిపెట్టలేకపోయింది.
ఇంతలో ఇంధనం అయిపోతుండటంతో పైసిస్ 5 కూడా నీటిపైకి వచ్చేయాల్సిన అవసరం ఏర్పడింది.
కొంతసేపటి తరువాత పైసిస్ 5ని మరోసారి కిందకు పంపగా, ఎట్టకేలకు పైసిస్ 3 జాడను కనుగొనగలిగింది.
ఈ సబ్‌మెరైన్‌లో చిక్కుకున్న ఇద్దరు నావికులకు మొదట ‘‘ క్వీన్ ఎలిజిబెత్ శుభాకాంక్షలు పంపారు’’ అని చెప్పారు.
‘‘అది నిజంగా భయంకరమైన పరిస్థితి’’ అని మిల్లెన్సన్ గుర్తు చేసుకున్నారు. అత్యంత శీతల ప్రదేశం వలన మేం గడ్డకట్టుకుపోయేలా ఉన్నాం. కానీ మహారాణి పంపిన సందేశం మాలో ఆశలు చిగురింపచేసింది అని తెలిపారు.
ఎన్నోకష్టాల అనంతరం రెస్క్యూటీమ్ వీరిద్దరిని సెప్టెంబర్ 1, 1973న విజయవంతంగా రక్షించగలిగింది. ఆ సమయంలో చాప్‌మెన్, మిల్లెన్సన్ మొత్తంగా 84 గంటల 30 నిమిషాలు పైసెస్ 3లో ఉన్నట్టయింది.
‘‘మేం సముద్రంలోకి వెళ్ళేటప్పుడు 72గంటలకు సరిపడా ఆక్సిజన్ ఉంది. దీంతోనే మరో పన్నెండున్నర గంటలు మేనేజ్ చేశాం. చివరగా మేం ఆక్సిజన్ సిలిండర్ లోకి చూసినప్పుడు కేవలం 12 నిమిషాల ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉంది’’ అని చాప్‌మెన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- పుట్టిన రోజు కానుకగా గ్రనేడ్, ఆర్మీ చీఫ్ సన్నిహితుడి దుర్మరణంపై అనుమానాలేంటి?
- డ్రగ్స్ పార్టీల్లో పాముల విషంతో ఏం చేస్తారు? అక్కడకు పాము పిల్లలను ఎందుకు తీసుకెళ్తారు?
- సెమీస్‌లో ఇండియా ప్రత్యర్థి ఎవరు? భారత్, పాకిస్తాన్ మరోసారి తలపడతాయా?
- దీపికా పదుకొణె: ‘శరీరం మరొకరితో ఉన్నా, మనసు మాత్రం రణ్‌వీర్‌తోనే’ అని అన్నారంటూ ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














