డ్రగ్స్ పార్టీల్లో పాముల విషంతో ఏం చేస్తారు? అక్కడకు పాము పిల్లలను ఎందుకు తీసుకెళ్తారు?

ఎల్వీష్ యాదవ్

ఫొటో సోర్స్, GETTY IMAGES / ELVISH YADAV/FACEBOOK

    • రచయిత, బీబీసీ గుజరాతీ టీం
    • హోదా, .

రేవ్ పార్టీల్లో మత్తు కోసం పాముల విషాన్ని వాడుతున్నారంటూ యూట్యూబర్ ఎల్వీష్ యాదవ్‌పై కేసు నమోదు కావడంతో రేవ్ పార్టీలపై, పాము విషం ప్రభావంపై చర్చ జరుగుతోంది.

రేవ్ పార్టీలకు విషాన్ని సరఫరా చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్వీష్ యాదవ్, మరో ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

రేవ్ పార్టీలో పాము విషాన్ని వాడుతున్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారని, పోలీసులు తనిఖీలు చేసిన సమయంలో 9 పాములను కూడా స్వాధీనం చేసుకున్నారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మనేకా గాంధీ ఫిర్యాదు మేరకు వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 కింద నిందితులపై కేసు నమోదైంది.

''ఎల్వీష్ యాదవ్, ఆయన సహచరులు నిర్వహించిన పార్టీల్లో పాములను, పాము విషాన్ని వాడారు. మత్తు కోసం పాము విషం తీసుకుంటున్న వీడియోలు కూడా తీసుకున్నారు. నోయిడాలోని ఒక ఫామ్ హౌస్‌లో ఈ పార్టీ జరిగింది. పార్టీకి విదేశీ యువతులను రప్పించారు'' అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనపై వచ్చిన ఆరోపణలను ఎల్వీష్ యాదవ్ ఖండించారు.

మత్తు కోసం పాము విషాన్ని తీసుకునే అలవాటు చైనా, రష్యా, ఇతర పాశ్చాత్య దేశాల్లో చాలా ఏళ్లుగా ఉంది. ఇటీవల ఇండియాలోనూ పార్టీల్లో పాము విషం తీసుకునే అలవాటు పెరుగుతోంది.

మరోవైపు, పాముకాటు మరణాలు భారత్‌లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికీ గ్రామీణ భారతంలో పాముకాటు అతిపెద్ద సమస్య.

పాము విషం

ఫొటో సోర్స్, Getty Images

రేవ్ పార్టీలు, డ్రగ్స్ పార్టీల్లో పాము విషం వ్యసనంగా మారుతోందా?

భారత్‌లోని విషపూరిత పాములకు చైనా, రష్యా, ఫ్రాన్స్ సహా పశ్చిమ దేశాల్లో భారీ డిమాండ్ ఉంది. కొంత మంది విదేశీయులు వినోదం కోసం కూడా వాటిని పెంచుకోవడానికి ఇష్టపడతారు.

విమానాల్లో విదేశాలకు పాములను స్మగ్లింగ్‌ చేయడాన్ని అరికట్టేందుకు కస్టమ్స్ అధికారులు చర్యలు తీసుకుంటూ ఉండడంతో నేపాల్, బంగ్లాదేశ్‌లకు రోడ్డు మార్గం ద్వారా పాములను తరలిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.

నూతన సంవత్సర వేడుకల సమయంలో, మందు పార్టీల్లో తాగిన మత్తులో పాము విషం తీసుకుంటున్న ఘటనలు ఇటీవల భారత్‌లోనూ పెరుగుతున్నాయి. ముంబయి వంటి నగరాల్లో జరిగే పార్టీల కోసం గుజరాత్‌‌లోని అటవీ ప్రాంతం నుంచి విషపూరిత పాములను తరలిస్తున్న ఘటన కొద్ది రోజుల కిందట వెలుగులోకి వచ్చింది.

మార్ఫిన్, ఓపియం వంటి డ్రగ్స్ తరచుగా తీసుకునే వారికి కొద్దిరోజుల తర్వాత అవి సాధారణంగా అనిపిస్తాయని పరిశోధనా నివేదికలు చెబుతున్నాయి.

దీంతో వ్యసనపరులు మరింత మత్తు కోసం ప్రమాదకరమైన పదార్థాల కోసం వెతుకుతుంటారు. అలాంటి వారికి పాము విషం ప్రత్యామ్నాయంగా మారినట్లు కనిపిస్తోంది.

కొందరు పాము పిల్లలను రేవ్ పార్టీలకు, డ్రగ్స్ పార్టీలకు తీసుకొచ్చి, వాటి విషం కోసం, దానితో వచ్చే ఆనందం కోసం వాటిని చిత్రహింసలు పెడుతుంటారు.

విరుగుడు కూడా విషమేనా?

పాములు కరిచినప్పుడు వచ్చే విషం మోతాదు పామును బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని పాముల్లో విషం ఎక్కువ ఉండొచ్చు, మరికొన్నింటిలో తక్కువ ఉండొచ్చు.

పాము వయసు, లింగం, అవి ఉండే ప్రాంతాన్ని బట్టి దాని విషం ఎంత ప్రమాదకరమనేది ఆధారపడి ఉంటుంది. అందువల్ల పాముకాటు తర్వాత కనిపించే లక్షణాల్లోనూ వ్యత్యాసాలు ఉంటాయి. దీని కారణంగా చికిత్స కూడా క్లిష్టంగా మారుతుంది.

అయితే, పాము విషంలోని కొన్ని రసాయనాలను కొన్ని వ్యాధులకు చికిత్సలో ఉపయోగిస్తారు. పాము విషాన్ని ఉపయోగించి తయారు చేసిన చాలా ఔషధాలు ఈ రోజు వాడుకలో ఉన్నాయి. పాము విషం నుంచే విరుగుడు కూడా తయారు చేస్తారు. అయితే, దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.

గుర్రాలు, మేకలు, గొర్రెలు వాటి శరీరంలో పాము విషానికి విరుగుడును అభివృద్ధి చేసుకుంటాయి. వాటి రక్తాన్ని శుద్ధి చేసిన తర్వాత యాంటీ వీనమ్స్‌, టీకాల తయారీలో ఉపయోగిస్తారు.

కీళ్ల వాతం, నొప్పులు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందుల తయారీలో పాము విషాన్ని ఉపయోగిస్తారు.

పాము విషంతో ఎలాంటి దుష్ప్రభావాలూ లేని నొప్పి నివారణ మందులను తయారు చేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ దిశగా ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి.

కొన్ని పాముల విషం ఒక లీటరు కోటి రూపాయల కంటే ఎక్కువ ధర ఉంటుంది. ప్రత్యామ్నాయ ఔషధాలు తయారు చేసే కంపెనీలు చాలా వరకూ విషాన్ని అక్రమంగానే సేకరిస్తున్నాయి.

పాము విషం

ఫొటో సోర్స్, Getty Images

పాము విషం రెండు రకాలు

దేశంలో వర్షాకాలంలో పాముకాటు ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. పాముకాటుకు వెంటనే చికిత్స అందించలేకపోతే పరిస్థితి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.

పాముల సంతానోత్పత్తి సమయం కూడా అదే కావడంతో వర్షాకాలంలో పాముకాటు ఘటనలు ఎక్కువగా నమోదవుతుంటాయని పాములపై జరిపిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

పాముల విషంలో వేర్వేరు రకాలున్నాయి. కొన్ని పాముల విషం వెంటనే మరణానికి కారణమవుతుంది. మరికొన్ని పాముల విషం నెమ్మదిగా ప్రాణాలు తీస్తుంది.

కొన్ని పాములు కాటు వేసినప్పుడు వాటి పదునైన దంతాల ద్వారా విషం శరీరంలోకి ఎక్కుతుంది. దీంతో విషం నేరుగా రక్తంలో కలిసిపోతుంది. ఆఫ్రికాలో కనిపించే మొజాంబిక్ కింగ్ వంటి పాములు కరవడానికి బదులు విషాన్ని చిమ్ముతాయి.

''కోబ్రా, కట్లపాముల విషం న్యూరోటాక్సిక్. ఇది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. రక్త పింజరి జాతి పాముల విషం హీమోటాక్సిక్. అది రక్తప్రసరణపై ప్రభావం చూపిస్తుంది.

న్యూరోటాక్సిక్ విషం శరీరంలోకి చేరితే పక్షవాతం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. హీమోటాక్సిక్ విషం రక్తప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఈ విషం రక్తంలో కలిసిపోయి రక్తనాళాల విచ్ఛిన్నానికి (హ్యామరేజ్) దారితీస్తుంది'' అని సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ హేమాంగ్ దోషి చెప్పారు.

ఆయన 20 ఏళ్లుగా పాముల విషంపై పరిశోధనలు చేస్తున్నారు.

''పాము కరిచినప్పుడు, విషం శరీరంలోకి ఎక్కిన సుమారు 10 నుంచి 15 నిమిషాల్లో లక్షణాలు కనిపిస్తాయి. 30 నుంచి 45 నిమిషాలకు విషం శరీరంపై ప్రభావం చూపించడం మొదలవుతుంది.

కట్లపాము విషం ప్రభావం చూపించేందుకు గంటన్నర నుంచి రెండు గంటలు పడుతుంది. నాలుగు గంటల నుంచి ఆరు గంటలు దాటితే పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది.

రక్తపింజరి జాతి పాములు కరిస్తే దాని ప్రభావం వెంటనే కనిపించదు. అయితే, పాము కరిచిన ప్రదేశంలో విపరీతమైన నొప్పి, వాపు కనిపిస్తుంది'' అని హేమాంగ్ దోషి వివరించారు.

హేమాంగ్ దోషి

ఫొటో సోర్స్, HEMANG DOSHI

ఫొటో క్యాప్షన్, డాక్టర్ హేమాంగ్ దోషి 20 ఏళ్లుగా పాముల విషంపై పరిశోధనలు చేస్తున్నారు.

పాముకాటు మరణాల్లో 80 శాతం ఇండియాలోనే

ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా పాముకాటు మరణాల్లో దాదాపు 80 శాతం వరకూ భారత్‌లోనే జరుగుతున్నాయి. పాము కాట్ల కారణంగా ఏడాదికి సగటున దాదాపు 64 వేల మరణాలు జరుగుతుండగా, సుమారు నాలుగు లక్షల మంది పక్షవాతం, కంటిచూపు కోల్పోవడం, శాశ్వత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

పాముకాట్ల కారణంగా 2000 నుంచి 2019 వరకూ 20 ఏళ్లలో 12 లక్షల మంది చనిపోగా, వారిలో సగం మంది 30 ఏళ్ల నుంచి 69 ఏళ్ల లోపువారే. మరో 25 శాతం మంది చిన్నారులు ఉన్నట్లు ఆ అధ్యయనంలో తేలింది.

ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన సంఖ్య కంటే, పాముకాట్లకు గురైన వారి సంఖ్య ఎక్కువే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. 2001 నుంచి 2014 మధ్య కాలంలో బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

గత కొన్నేళ్లుగా పాము విషాన్ని పెద్ద సమస్యగా గుర్తించి జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం కింద పరిష్కారాలు కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

పాము కాటేస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు?

పాము కరించిన వెంటనే ఆందోళన పడడం వల్ల పరిస్థితి దిగజారుతుంది.

కొంత మంది పాము కాటు వేసిన శరీర భాగం వద్ద గట్టిగా కట్టు కడుతుంటారు. కొందరు అక్కడే గాయం చేసి రక్తం బయటికి పోయేలా చేస్తుంటారు. అలాగే, పాముని చంపడం కోసం సమయం వృథా చేస్తుంటారు. ఆ పాముని చంపి ఏ పాము కరిచిందో డాక్డర్‌కి చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, ఆ క్షణంలో విలువైన సమయాన్ని అలా వృథా చేయకూడదు.

పాముకాటు తర్వాత వీలైనంత త్వరగా బాధితుడిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి.

కొన్నిసార్లు విషపూరితం కాని పాములు కాటువేస్తాయి. కానీ, పాము కాటువేస్తే చనిపోవడం ఖాయమని కొందరు తీవ్ర ఆందోళనకు గురవుతారు. దీంతో రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది. అది ప్రాణాలు పోయేందుకు కారణమయ్యే అవకాశం ఉంది.

విషపూరితమైన పాములైనా, విషపూరితం కానివైనా కాటు వేసినప్పుడు భయాందోళన చెందకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. మీ పక్కనున్న ఎవరినైనా పాము కాటువేస్తే కనీసం మీరైనా ఆందోళన చెందకుండా, జాగ్రత్తగా వ్యవహరించాలి.

పాము కాటును నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి క్షణమూ విలువైనదే అని గుర్తుంచుకోవాలి.

పాము విషం

ఫొటో సోర్స్, Getty Images

పాముకాటును తప్పించుకోవడం ఎలా?

పాములను దూరం చేయలేం కానీ, పాముకాట్లను దూరం చేయొచ్చు.

''మన ఇంటి చుట్టు పక్కల ప్రాంతాలన్నీ ఒకప్పుడు జంతువులకు ఆవాసాలే. ఇప్పుడు ఆ ప్రాంతాల్లోనే మనం ఇళ్లు కట్టుకుంటున్నాం. కాబట్టి పాములు వస్తాయని అందరూ తెలుసుకోవాలి. మన పూర్వీకులు దానిని బాగా అర్థం చేసుకున్నారు'' అని కళింగ ఫౌండేషన్ రీసర్చ్ డైరెక్టర్ ఎస్.ఆర్ గణేష్ అన్నారు.

అందువల్లే పూర్వీకులు పామును చూసినా చంపేవారు కాదని, అవి ఉంటాయని తెలిసినా వాటితో కలిసి జీవించడం నేర్చుకున్నారు అని గణేష్ చెప్పారు.

''భారత్‌లోని చాలా సర్పజాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. వాటి ఆవాసాలు నాశనమయ్యాయి. ఈ పరిస్థితిని మనం మెరుగుపరచాలంటే, పాములు మనకు ఇబ్బంది కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి'' అని ఆయన అన్నారు.

కారు ప్రమాదాలు జరుగుతున్నాయని కార్లను మనం వాడకుండా ఉంటామా? అలాగే, పాములను దూరం చేయాల్సి అవసరం లేదు. పాముకాటుకు గురవకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని గణేష్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)