విషపూరిత పుట్టగొడుగులతో ఆహారం వండి పెట్టి అత్తామామలను చంపేశారంటూ మహిళపై కేసు.. భర్త హత్యకూ యత్నించారని అభియోగం

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, హన్నా రిచీ, సైమన్ అట్కిన్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఆస్ట్రేలియాలో ‘పుట్టగొడుగుల’ మరణాల కేసులో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఆస్ట్రేలియాలో అత్తామామలకు, బంధువులకు విషపు పుట్టగొడుగుల ఆహారం తినిపించి, వారి మృతికి కారణమయ్యారనే అభియోగాలతో కోడలిని పోలీసులు గతంలో అరెస్టు చేశారు.
భర్తను నాలుగు సార్లు హత్య చేసేందుకు యత్నించారనే ఆరోపణలు కూడా ఆమెపై ఉన్నాయి.
విక్టోరియాలోని లియోంగథా పట్టణానికి చెందిన ఎరిన్ ప్యాటర్సన్ అనే 49 ఏళ్ల మహిళపై ఈ అభియోగాలు నమోదైనట్లు కోర్టు పత్రాల ద్వారా తెలిసింది.
మూడు హత్యలు, ఐదు హత్యాయత్నం అభియోగాలతో ఆమెపై పోలీసులు గురువారం కేసులు నమోదు చేశారు.
అయితే తాను అమాయకురాలినని ఎరిన్ వాదిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరిగింది?
లియోంగథాకు 60 కి.మీ దూరంలో మోర్వెల్ అనే చిన్న పట్టణం ఉంది. అక్కడ అర డజను మంది టీవీ సిబ్బంది వేచి ఉన్నారు.
అయితే కెమెరాలకు, అక్కడి స్థానికులకు ఎరిన్ ముఖమే కనిపించలేదు, ఎందుకంటే రాత్రిపూట పోలీస్ సెల్ నుంచి ఆమెను కనెక్టింగ్ టన్నెల్ ద్వారా కోర్టుకు తరలించారు.
శుక్రవారం కోర్టు పత్రాలను స్థానిక మీడియాకు విడుదల చేశారు.
తనతో దూరంగా ఉన్న భర్త సైమన్ ప్యాటర్సన్‌ను నవంబర్ 2021-సెప్టెంబర్ 2022 మధ్యలో ఎరిన్ మూడుసార్లు చంపడానికి యత్నించినట్లు అందులో అభియోగాలున్నాయి.
అయితే నాలుగో ప్రయత్నంలో 2023 జులైలో సైమన్ తల్లిదండ్రులు గెయిల్, డాన్ ప్యాటర్సన్, బంధువులు హీథర్ విల్కిన్సన్, హీథర్ భర్త ఇయాన్ విల్కిన్సన్‌లకు 'బీఫ్' భోజనం పెట్టారు ఎరిన్ ప్యాటర్సన్.
అయితే ఆ సమయంలో భర్త సైమన్ భోజనానికి హాజరు కాలేదు.
బటన్ మష్రూమ్‌ల మిశ్రమం, ఎండిన పుట్టగొడుగులు ఉపయోగించి ఈ వంటకాన్ని తయారు చేసినట్లు చెప్పారు ఎరిన్ ప్యాటర్సన్.
ఆ ఆహారం తిన్నాక నలుగురు తీవ్ర అనారోగ్యం పాలవడంతో ఆసుపత్రిలో చేరారని పోలీసులు తెలిపారు.
తిన్న కొద్దిరోజులకు 70లలో ఉన్న ప్యాటర్సన్ దంపతులతో పాటు హీథర్ విల్కిన్సన్ (66) మరణించారు. వైద్య చికిత్స అనంతరం ఇయాన్ విల్కిన్సన్ (68) కోలుకున్నారు.

ఫొటో సోర్స్, SUPPLIED
నేను మందులు కూడా ఇచ్చా: కోడలు
ఈ నలుగురూ 'డెత్ క్యాప్ మష్రూమ్'లను తిన్నారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇవి ప్రాణాంతకం.
భోజనం తర్వాత ఎరిన్, ఆమె ఇద్దరు పిల్లలూ క్షేమంగానే కనిపించడంతో పోలీసులకు కోడలిపై అనుమానం వచ్చింది.
అయితే అత్తామామలకు, బంధువులకు విషం ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదని, భోజనం తర్వాత తానే ఆసుపత్రికి తీసుకొచ్చానని ఎరిన్ వాదించారు. అంతేకాదు కాలేయం దెబ్బతినకుండా ఉండటానికి తాను మందులు కూడా ఇచ్చానని చెబుతున్నారామె.
''నాకు ఇష్టమైన వారు అనారోగ్యం పాలవడానికి ఈ పుట్టగొడుగులు కారణమయ్యాయమని తెలిసి విస్తుపోయాను'' అని ఎరిన్ ఆగస్టులో ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కేసుపై చాలా మందికి ఆసక్తి ఉందని, రాబోయే రోజుల్లో దీనిపై ఎక్కువ మంది దృష్టి ఉంటుందని చెప్పారు పోలీసులు.
జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఈ కేసు చాలా మంది దృష్టిని ఆకర్షించిందని హోమిసైడ్ స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్ డీన్ థామస్ తెలిపారు.
శుక్రవారం ఆమెను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.
ఎరిన్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లను విశ్లేషించడానికి ప్రాసిక్యూటర్లు సమయం కోరడంతో కేసును మే 3కు వాయిదా వేసింది కోర్టు.
ఎరిన్ మాత్రం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోలేదు.
ఇవి కూడా చదవండి
- ఇజ్రాయెల్ పక్షాన ఉంటూ గాజాకు సాయం చేయడంలో మోదీ ఆంతర్యం ఏమిటి?
- ఎలక్షన్ కోడ్: రూ.50 వేలకు మించి తీసుకెళ్లలేకపోతున్నారా? సీజ్ చేసిన డబ్బు తిరిగి పొందడం ఎలా?
- మొహమ్మద్ షమీ: మా బౌలింగ్ తుపానుకు కారణమదే
- అఫ్గానిస్తాన్: అంతర్యుద్ధం, పేదరికంతో అల్లాడుతున్న తాలిబాన్ల పాలనలో క్రికెట్ ఎలా వికసించింది?
- చిత్తూరు: భార్యతో ఉన్నప్పుడు పురుషుడు.. బాయ్‌ఫ్రెండ్‌ను కలిస్తే మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














