సైబర్ నేరాలు: ఆన్‌లైన్‌ దొంగలు మీ డబ్బు కొట్టేస్తే తిరిగి పొందడం సాధ్యమేనా?

సైబర్ క్రైం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘జులై రెండో వారంలో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫెడ్ ఎక్స్ కొరియర్ సర్వీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని పరిచయం చేసుకున్నారు. నాకు కొరియర్ రావాల్సినవి వస్తువులేమీ లేవని వారికి చెప్పాను.

వాళ్లు నా పేరు, ఫోన్ నంబరు చెప్పడంతో.. ఆ వివరాలు నావే అని చెప్పాను. ముంబయి నుంచి తైవాన్‌కు నా పేరుతో ఒక పార్శిల్ వెళుతోందని.. అందులో పార్శిల్ చేయకూడని వస్తువులు ఉన్నాయని చెప్పారు.

నా పేరుతో పార్శిల్ ఉండటంతో ముంబయి రావాల్సి ఉంటుందని భయపెట్టారు. పోలీసులు, కస్టమ్స్ అధికారులు అరెస్టు చేస్తారంటూ బెదిరించడం మొదలుపెట్టారు.

నేను.. ఫలానా అని, హైదరాబాద్ మాదాపూర్‌లో ఉంటానని కంగారులో నా వివరాలు చెప్పి.. మీరు నా గురించే మాట్లాడుతున్నారా.. అని అన్నాను. వారికి మరింత అవకాశం దొరికినట్లయింది.

అప్పుడు వెంటనే, "పార్శిల్ సంగతి మేం చూసుకుంటామన్నారు. అందుకు పార్శిల్ ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుందని అన్నారు’’ అని బీబీసీతో చెప్పారు మహతి.

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని హైదరాబాద్‌ మాదాపూర్‌కు చెందిన మహతి(పేరు మార్చాం) రూ.11.86 లక్షలు పోగొట్టుకున్నారు. ఆ మొత్తాన్ని సైబరాబాద్ పోలీసులు రెండు నెలల్లో తిరిగి రికవరీ చేయగలిగారు. డబ్బును బా‌‍ధితురాలికి అందించారు.

సైబర్ నేరగాళ్ల మాయలో పడి తాను ఎలా డబ్బులు పొగొట్టుకున్నానో బీబీసీకి వివరించారు మహతి.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

''పోలీసులతోనూ తామే మాట్లాడతామని చెప్పి.. మరో పోలీసు అధికారిణి పేరిట మరో మహిళతో మాట్లాడించారు. ఆ నకిలీ మహిళా అధికారిణి ముందు ఫోన్‌లో మాట్లాడి.. తర్వాత స్కైప్‌లో మాట్లాడదామని చెప్పింది..

నా ఆధార్, బ్యాంకు వివరాలు తెలుసుకోవడంతోపాటు బరువు, ఎత్తు వంటివి కూడా అడిగింది. ఆ సమయంలో నేను వీడియో ఆన్ చేశాను.. కానీ, ఆమె వీడియో ఆన్ చేయలేదు. పోలీసు అధికారి‌‍ణి కదా.. అని కంగారులో గమనించలేదు.

తర్వాత మళ్లీ కాసేపటికి వేరొకరు ఫోన్ చేసి పార్శిల్ ఛార్జీల కింద రూ.99,998 ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు.

తర్వాత మళ్లీ ఏవో ఛార్జీలు అని భయపెట్టి మరో రూ. 99,998 ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. తర్వాత మరికొన్ని ఛార్జీలు అంటూ రూ.8 లక్షలకు పైగా వేయించుకున్నారు.'' అని ఆమె చెప్పారు.

''ఆ సమయంలో కంగారు.. భ‌యంలో మొత్తం రూ.10.86 లక్షలు వేశాను. కాసేపటి తర్వాత వాళ్ల ఫోన్లన్నీ స్విచ్ఛాప్..!''

ఆ తర్వాత మోసపోయానని అనుమానం వచ్చింది. వెంటనే సైబర్ నేరాలకు సంబం‌‍ధించి టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశానని మహతి చెప్పారు.

ఈ ఫిర్యాదు అందుకున్న సైబరాబాద్ పోలీసులు నేరగా‌ళ్ల అకౌంట్లను ఫ్రీజ్ చే‌‍‌‍శారు.

డబ్బు ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు మళ్లకుండా అడ్డుకోలిగారు. దీనివల్ల మహతి పోగొట్టుకున్న పూర్తి డబ్బును తిరిగి వాపసు ఇప్పించగలిగారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

డబ్బులు పోయిన వెంటనే ఏం చేయాలి..?

సైబర్ నేరాల్లో పోగొట్టుకున్న సొమ్ము తిరిగి బాధితులకు ఇప్పించడం ఓ పెద్ద విజయం అని చెప్పారు సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీ రితిరాజ్. సైబర్ నేరాల్లో రికవరీ శాతం చాలా స్వల్పమని బీబీసీతో అన్నారు.

అందుకే బా‌‍ధితులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే నిర్దేశిత పద్ధతులు (స్టాండర్డ్ ప్రొసీజర్) పాటించాలని చెప్పారు.

‘‘ఎవరైనా బా‌‍ధితులు సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930 హెల్ప్ లైన్ లేదా ఎన్సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.

ఫిర్యాదు వెంటనే సంబం‌‍ధిత పోలీసు అధికారితోపాటు బ్యాంకు నోడల్ అధికారికి చేరుతుంది. వెంటనే విచారణ చేపట్టి సంబంధిత అధికారి బ్యాంకు లావాదేవీలకు సంబం‌‍ధించి ఎన్సీఆర్పీ నివేదిక పరిశీలిస్తారు.

డబ్బులు మోసపూరితంగా పొందినట్లు గుర్తిస్తే, సీఆర్పీసీ సెక్షన్ 102 కింద అకౌంట్లను ఫ్రీజ్ చేస్తారు’’ అని రితి రాజ్ చెప్పారు.

రితిరాజ్, డీసీపీ

ఫొటో సోర్స్, Cyberabad police

వీలైనంత త్వరగా ఫిర్యాదు చేస్తేనే...

బాధితులు డబ్బులు పోగొట్టుకున్న వెంటనే ఫిర్యాదు చేయడం కూడా ఎంతో ముఖ్యం. లేకపోతే డబ్బు ఒక ఖాతాలోంచి వేర్వేరు ఖాతాల్లోకి మళ్లిపోతుంది.

సైబర్ నేరం జరిగిన తర్వాత డబ్బును నిమిషాల్లోనే వేర్వేరు అకౌంట్లు, ఆన్‌లైన్ వ్యాలెట్లకు మళ్లిస్తుంటారని పోలీసులు గుర్తించారు.

గంటలోనే ఐదారు దశలు దాటుకుని డబ్బు వెళ్లిపోతుంది.

సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకుంటే వీలైనంత వెంటనే టోల్ ఫ్రీ నంబరుకి ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేయాలని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యురిటీ బ్యూరో ఎస్పీ విశ్వజీత్ కంపాటి చెప్పారు.

‘‘అరగంటలోపు ఫిర్యాదు చేస్తే 99 శాతం రికవరీకి వీలుంటుంది. గంట తర్వాత ఫిర్యాదు చేస్తే రికవరీ అవకాశాలు 60-70శాతానికి పడిపోవచ్చు.

24 గంటల తర్వాత కంప్లయింట్ చేస్తే ౩౦ శాతమే తిరిగి రాబట్టే వీలుండొచ్చు. 72 గంటల తర్వాత చేస్తే ఐదు శాతం లోపలే రికవరీ ఉండొచ్చు. అందుకే క్విక్ రెస్పాన్స్(వేగంగా స్పందించడం) చాలా ముఖ్యం.’’ అని విశ్వజీత్ చెప్పారు.

ఇదే విషయంపై సైబర్ సెక్యురిటీ నిపుణులు నల్లమోతు శ్రీధర్ బీబీసీతో మాట్లాడారు.

‘‘సా‌‍ధారణంగా సైబర్ నేరాలు శని, ఆదివారాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. బ్యాంకు లావాదేవీలకు సంబం‌‍ధించి సెటిల్ డౌన్ పీరియడ్(సమయం) 24 గంటలు ఉంటుంది. ఆ సమయంలో ఫిర్యాదు అందితే బ్యాంకు ఫ్రీజ్ చేయగలదు. అలా కాకపోతే మనీ ట్రాన్స్ ఫర్ జరిగిపోతుంది.

అలాగే క్రిప్టో కరెన్సీలోకి మారితే ఆ వ్యాలెట్లకు యూజర్‌కు తప్ప మరెవరికీ యాక్సెస్ ఉండదు. ఒకే తరహా లావాదేవీల విషయంలో బ్యాంకులు గట్టి నిఘా తీసుకురావాలి. ఆర్బీఐ, హోం మినిస్ట్రీ, ఐటీ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేక పాలసీని రూపొందించాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

మరో రకం మోసం

ఫిర్యాదు కాస్త ఆలస్యం కావడంతో మరో కేసులో పోలీసులు కేవలం 52 శాతమే రికవరీ చేయగలిగారు.

మేడ్చల్ జిల్లా గండిమైసమ్మకు చెందిన యశ్వంత్ ఓ చిన్న మొబైల్ దుకాణం నిర్వహిస్తుంటాడు.

ఈ ఏడాది జులై పదో తేదీన అతని ఫోన్‌కు ఓ వాట్సాప్ సందేశం వచ్చింది. దాన్ని క్లిక్ చేసి.. లైక్ చేసి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే డబ్బులు ఇస్తామని ఉంది.

అది నమ్మిన యశ్వంత్.. సందేశంలో ఉన్నట్టుగా చేశాడు. అతను టాస్క్ పూర్తి చేసినట్లుగా రూ.150 అకౌంట్‌లో పడ్డాయి.

అలా రెండు, మూడు సార్లు డబ్బులు పడడంతో నిజమేనని నమ్మేశాడు.

వెంటనే అతనికి సైబర్ నేరస్తుడు ఫోన్ చేసి రూ.1000 నుంచి మొదలుకుని రూ.౩ లక్షల వరకు పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని ఆశచూపాడు.

అలా రూ.2.92 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత ఫోన్ చేసినా, స్పందన లేకపోవడంతో మోసపోయానని యశ్వంత్ గ్రహించాడు.

తనకు జరిగిన మోసం గురించి బీబీసీతో యశ్వంత్ మాట్లాడారు.

‘‘జులై 10-13తేదీల మధ్య సైబర్ నేరగాళ్లతో నా కమ్యూనికేషన్ జరిగింది. డబ్బులు పోయాక మోసం జరిగిందని తెలుసుకుని ముందుగా పోలీసు స్టేషన్ కు వెళ్లా. అక్కడ పోలీసుల సూచనల మేరకు 1930 నంబరుకు కాల్ చేశా.

అప్పటికే ఆలస్యం జరిగింది. ఇప్పుడు రూ.1.53 లక్షలు రికవరీ చేయగలిగామని పోలీసులు చెప్పారు. మిగిలిన సొమ్ము విషయంలో సమయం పడుతుందని అన్నారు. నా కాళ్ల మీద నేను నిలబడాలని చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించిన డబ్బు సైబర్ నేరగాళ్లు కాజేయడంతో చాలా బా‌‍ధేసింది’’ అని వాపోయారు.

స్థానిక భాషల్లోనే కాల్ సెంటర్లు

సైబర్ నేరగా‌‍ళ్లు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.

గతంలో కేవలం ఒకటి లేదా రెండు ప్రాంతాలకే పరిమితం కాగా.. ఇప్పుడు ప్రధాన రాష్ట్రాలన్నింటిలోనూ కాల్ సెంటర్లు నడుపుతున్నారు. అలాగే, మోసపూరిత కాల్స్ చేసేందుకు సంబంధిత భాషలు తెలిసిన వ్యక్తులను రిక్రూట్ చేసుకుంటున్నారు.

ఉదాహరణకు, తెలుగు వారితో మాట్లాడేందుకు తెలుగు తెలిసిన వ్యక్తులను కాల్ సెంటర్లో నియమించుకుంటున్నారు.

అలా తెలిసిన వారే కాల్స్ చేస్తున్నట్లుగా నమ్మించి మోసం చేస్తున్నారు.

విశ్వజీత్

ఫొటో సోర్స్, Cyberabad police

పోగొట్టుకున్న డబ్బులు నేరుగా ఇచ్చేస్తారా..?

సైబర్ నేరాల్లో డబ్బులు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు అందిన తర్వాత విచారణ చేసి అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్ చేస్తారు.

ఇంత వరకు బాగానే ఉంది.

తర్వాత డబ్బును స్వాధీనం చేసుకుని నేరుగా బాధితులకు అందించేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయని డీసీపీ రితిరాజ్ బీబీసీకి వివరించారు.

‘‘కేసు విచారణ అధికారి సూచన మేరకు డబ్బును తిరిగి ఇప్పించాలని సీఆర్పీసీ సెక్షన్ 457 ప్రకారం పిటిషన్ వేయాలి.

ఈ పిటిషన్ ఆధారంగా కోర్టు విచారణ చేస్తుంది. విచారణాధికారి ఇచ్చే నివేదిక ఆధారంగా బాధితుడు లేదా బాధితురాలికి డబ్బును రికవరీ చేసి తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశిస్తుంది.

దాని ఆధారంగా పోలీసులు బ్యాంకులను సంప్రదించి ఫ్రీజ్ చేసిన అకౌంట్ల నుంచి డబ్బులు తిరిగి ఇప్పించే ఏర్పాట్లు చేస్తారు’’ అని చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

దోచుకున్న డబ్బును సైబర్ నేరగాళ్లు ఎ‌‍లా తీసుకుంటారు?

దోచుకున్న డబ్బు సైబర్ నేరగాళ్లు రెండు పద్ధతులలో తీసుకుంటారని పోలీసులు గుర్తించారు.

మొదటిది ఏటీఎం నుంచి తీసుకోవడం. రెండోది క్రిప్టోలోకి మార్చి విత్‌డ్రా చేయడం.

ఈ రెండు పద్ధతుల్లోనూ ఎలా విత్ డ్రా చేసుకున్నా.. రికవరీ చేయడం దాదాపు అసాధ్యమేనని పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఆన్ లైన్‌లో దోచుకున్న సొమ్మును క్రిప్టోలోకి మార్చేందుకు వేర్వేరు అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేయడం, గూగుల్ పే, ఫోన్ పే వంటి వాలెట్లలోకి వేసుకోవడం.. అంతిమంగా క్రిప్టో కరెన్సీలోకి మార్చుతారు.

క్రిప్టో కరెన్సీ బ్లాక్ చైన్ టెక్నాలజీతో నడుస్తుంది కనుక డబ్బులు రికవరీ చేయడం కష్టమవుతుంది. అందుకే సైబర్ నేరాల్లో నగదు రికవరీ రేటు ‌‍0.1 శాతం మాత్రమేనని ‌‍ పోలీసులు చెబుతున్నారు.

క్రిప్టోలోకి మార్చే క్రమంలో అకౌంట్లను ఫ్రీజ్ చేయలిగితేనే డబ్బులు కొంతమేర తిరిగి రాబట్టవచ్చని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యురిటీ బ్యూరో విశ్వజిత్ కంపాటి తెలిపారు.

‘అకౌంట్లను ఫ్రీజ్ చేయడం మొదలుకుని మనీ రికవరీ చేయడం వరకు ప్రక్రియ సింపుల్ అనిపించవచ్చు. కానీ, ఆచరణలో చాలా కష్టంతో కూడుకున్నది’’ అని చెప్పారు.

అలాగే బా‌‍ధితులు 1930 నంబరును ఫిర్యాదు చేయడానికే వినియోగించాలని, కేసు స్టేటస్ తెలుసుకోవడానికి కాదని చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ ఎక్కువ

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి.

ఇందులో భాగంగా వాట్సాప్ లేదా టెలిగ్రామ్‌‌లో వెబ్ లింకులు పంపిస్తారు. ఏదో చిన్న టాస్క్ పూర్తి చేయమని చెప్పి స్వల్ప మొత్తంలో డబ్బులు ఎరవేస్తారు.

తర్వాత 1000, 3000, 5000, 10000, 100000, 2000000 రూపాయలు పెట్టుబడిగా పెట్టాలని చెప్పి దోచుకుంటారు.

దే‌శవ్యాప్తంగా వివిధ రకాల మోసాలు 14,007 కేసులు రిపోర్టు అయినట్లు 2021 జాతీయ క్రైం రికార్డుల బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగిందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

‘‘ప్రస్తుతం ఎక్కువగా ‌‍‌‌‍‌ఇన్వెస్ట్ మెంట్‌ ఫ్రాడ్స్ రిపోర్టు అవుతున్నాయి. ఎవరైనా ఆన్ లైన్ లింకులు పంపించి పెట్టుబడి పెట్టాలని అడిగితే ఏ మాత్రం నమ్మకండి. ముందుగా సులువుగా కొంత డబ్బులు వస్తున్నాయని నమ్మితే తర్వాత ఎక్కువగా నష్టపోతారు’’ అని డీసీపీ(క్రైమ్స్) కల్మేశ్వర్ సింగనేవార్ బీబీసీకి చెప్పారు.

ఏటా కేసుల పెరుగుదల

దేశంలో సంవత్సరాల వారీగా సైబర్ నేరాల వివరాలు..

సంవత్సరం సైబర్ నేరాలు

2019 44,735

2020 50,035

2021 52,974

2020తో పోల్చితే దేశవ్యాప్తంగా కేసులు 5.9 శాతం పెరిగాయి.

మొత్తం సైబర్ నేరాల్లో 32,230 అంటే ఏకంగా 60.8 శాతం ఫ్రాడ్ కేసులే ఉన్నాయి. మరో 4,555 (8.6శాతం) లైంగిక దోపిడీ, 2,883 కేసులు(5.4 శాతం) దోపిడీకి సంబంధించినవి ఉంటున్నాయి.

2019-21 మధ్య కాలంలో సైబర్ నేరాల్లో ఛార్జ్ షీట్ రేటు కేవలం ౩౩.8 శాతమే ఉంది. నిందితులను పట్టుకుంటున్నప్పటికీ, రికవరీ వివరాలు చాలా చాలా తక్కువని పోలీసులు చెబుతున్నారు.

బాధితులకు సొమ్ము అందజేస్తున్న పోలీసులు

ఫొటో సోర్స్, Cyberabad police

మొత్తంగా 1.27 లక్షల కేసులు

2021 సంవత్సరంలో నమోదైన కేసులతోపాటు అంతకుముందు సంవత్సరాల్లో పెండింగులో ఉన్న కేసులు కలిపి 1,27,330 ఉన్నాయి.

సరైన ఆధారాలు లేకపోవడంతో వివిధ కారణాలతో 55,130 కేసులు పోలీసులు డిస్పోజ్ చేశారు.

2021వ సంవత్సరంలో కేవలం 18,744 కేసులలో ఛార్జిషీట్లు దాఖలు చేశారు.

71,868 కేసులు ఇంకా పెండింగులో ఉన్నాయి.

అలాగే, 2021 సంవత్సరంలో 6,591 కేసులు కోర్టు విచారించి శిక్షలు వేయగా, మరో 28,787 కేసులు వివి‌‍ధ దశల్లో విచారణలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)