మొహమ్మద్ షమీ: మా బౌలింగ్ తుపానుకు కారణమదే..

మహ్మద్ షమీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెమీ ఫైనల్‌లో న్యూజీలాండ్‌తో మ్యాచ్‌లో షమీ 7 వికెట్లు తీశాడు
    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ, అభిజీత్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

వన్డే ప్రపంచ కప్‌లో ఇండియా దూసుకుపోతోంది. సెమీ ఫైనల్స్‌లో న్యూజీలాండ్‌ను ఓడించి, ఫైనల్‌కు దూసుకెళ్లింది.

ఇప్పటి వరకు టీమిండియా ఆడిన 10 మ్యాచుల్లోనూ విజయం సాధించింది.

బుధవారం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజీలాండ్‌పై 70 పరుగుల తేడాతో భారత్ గెలిచింది.

గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలిచి, ఆస్ట్రేలియా ఫైనల్ చేరింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ జరుగనుంది.

ఈ ప్రపంచ కప్‌లో టీమిండియా ప్రదర్శనపై క్రికెట్ అభిమానులే కాదు, మాజీ క్రికెటర్లూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ జట్టుతో పోల్చుతున్నారు.

దుర్బేధ్యమైన బ్యాటింగ్ లైనప్‌తో పాటు, భీకర బౌలింగ్ దళం అప్పటి విండీస్ జట్టు సొంతం. వారి డ్రెస్సింగ్ రూం కూడా ఆహ్లాదంగా ఉండేదని చెబుతున్నారు మాజీ క్రికెటర్లు.

ఈ ప్రపంచ కప్‌లో భారత ప్రధాన బౌలర్ మొమహ్మద్ షమీ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది.

హార్దిక్ పాండ్యా గాయపడటంతో, అతని స్థానంలో జట్టులోకి వచ్చిన షమీ, వచ్చీ రావడంతోనే ధరమ్‌శాలలో న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీశాడు. సెమీస్‌లో మళ్లీ అదే న్యూజీలాండ్‌తో మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లలో 23 వికెట్లు తీశాడు.

ఇంతకుముందు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో షమీ, నలుగురిని ఔట్ చేశాడు.

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి, 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు షమీ. ఆ మ్యాచ్ అనంతరం షమీ మాట్లాడుతూ, భారత బౌలర్ల అత్యుత్తమ ప్రదర్శనకు కారణాలు, జట్టు బౌలింగ్ తీరులో వచ్చిన మార్పులను వివరించాడు.

మొహమ్మద్ షమి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రస్తుత ప్రపంచ కప్‌లో మొహమ్మద్ షమి రెండుసార్లు ఐదేసి వికెట్లు తీశాడు.

మా బౌలింగ్‌ను ఆస్వాదించని వారు ఉండరు: షమీ

''మా కఠోర శ్రమ, లయ(రిథమ్) కారణంగా మీరు మా బౌలింగ్ తుఫాన్‌.‌ను చూస్తున్నారు. మా బౌలింగ్‌ చూస్తుంటే దీన్ని ఆస్వాదించని వారే ఉండరనిపిస్తోంది. మేం యూనిట్‌గా కలిసి పనిచేస్తున్నాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాం. దాని ఫలితాలను మీరు చూడగలుగుతున్నారు" అని షమీ చెప్పుకొచ్చాడు.

తన బౌలింగ్‌పై షమీ మాట్లాడుతూ- "నా నుంచి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. సరైన చోట బంతిని వేస్తూ, లయ ఉండేలా చూసుకుంటున్నా, పెద్ద టోర్నీలో లయ కోల్పోతే, తిరిగి సాధించడం కష్టం. మొదటి నుంచి మంచి లైన్ అండ్ లెంగ్త్ లో బౌలింగ్ చేస్తున్నా, ఇది వర్కవుట్ అవుతోంది. దాన్నే కొనసాగిస్తా" అని అన్నాడు.

టీమిండియా

ఫొటో సోర్స్, Getty Images

నాకు మాటలు రావడం లేదు: రోహిత్ శర్మ

ఇప్పటివరకు ఏడు మ్యాచుల్లో ఐదుసార్లు ప్రత్యర్థి జట్లను ఇండియా ఆలౌట్ చేసింది. ఈ ఐదింటిలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక ఉన్నాయి.

అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు మాత్రమే ఆలౌట్ కాకుండా, నిలదొక్కుకొని నిర్ణీత 50 ఓవర్ల కోటా ఆడాయి.

తమ బౌలర్ల అద్భుత ప్రదర్శనకు మాటలు రావడం లేదని, వారి గురించి ఏం చెప్పగలమని కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు.

"సిరాజ్ నాణ్యమైన బౌలర్, కొత్త బంతితో బాగా బౌలింగ్ చేయగలడు. స్వింగ్ చేయగలడు. అతను తన పనిని విజయవంతంగా పూర్తిచేసినప్పుడు, చాలా తేడా కనిపిస్తుంటుంది" అని అన్నాడు రోహిత్.

ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు టీమిండియా అర్హత సాధించినందుకు సంతోషంగా ఉందని, జట్టు సమష్టి ప్రదర్శన వల్లే ఇది సాధ్యమైందని తెలిపాడు రోహిత్.

ఇక శ్రేయాస్ అయ్యర్ మానసికంగా చాలా ధృడమైన వ్యక్తి అని, శ్రీలంకతో మ్యాచ్‌లో అదే కనిపించిందని చెప్పాడు కెప్టెన్. తను సిక్సర్లు కొట్టిన విధానం చూస్తే ఎలాంటి సవాళ్లు స్వీకరించడానికైనా సిద్ధంగా ఉన్నట్లు కనిపించాడని, శ్రేయాస్ చాలా కష్టపడుతున్నాడని, ఫలితం ఇప్పుడు చూశామని కెప్టెన్ వివరించాడు.

ఇదే సందర్భంలో భారత జట్టు ప్రదర్శనతోపాటు డ్రెస్సింగ్ రూం, మేనేజ్‌మేంట్ ధోరణిలో కూడా చాలా మార్పులు వచ్చాయంటున్నారు మాజీ క్రికెటర్లు.

టీమిండియా డ్రెస్సింగ్ రూం

ఫొటో సోర్స్, BCCI

ఫొటో క్యాప్షన్, మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్ల ఫీల్డింగ్‌పై ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం, ఆపై వారికి బహుమతులు ఇవ్వడం చేస్తున్నారు.

డ్రెస్సింగ్ రూం: దిలీప్ ఎవరు? ఏం చేస్తున్నారు?

గత కొన్ని నెలలుగా భారత క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది సెప్టెంబర్‌లో శ్రీలంకలో జరిగిన ఆసియా కప్ నుంచి ప్రస్తుత టోర్నీ వరకు భారత జట్టు డ్రెస్సింగ్ రూంలో ఒక పద్దతి ప్రారంభమైంది.

మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్ల ఫీల్డింగ్‌పై ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం, ఆపై వారికి బహుమతులు ఇవ్వడం చేస్తున్నారు. జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ బాధ్యతలను హైదరాబాద్‌లో పుట్టి, బెంగళూరులో పెరిగిన టి.దిలీప్‌‌కు అప్పగించారు.

దిలీప్ భారత జట్టు ఫీల్డింగ్ కోచ్. డ్రెస్సింగ్ రూంలోని ఆటగాళ్లందరినీ సమావేశపరిచి, ఆ రోజు ఆటపై ఫీడ్‌బ్యాక్‌ను, ప్రశంసలను అందిస్తారు.

ఉదాహరణకు ధరమ్‌శాలలో న్యూజిలాండ్‌పై టీమిండియా విజయం తర్వాత, ఆటగాళ్లతో "మీరు మంచి ఫీల్డింగ్‌తో 14 పరుగులు ఆపారు" అని ప్రశంసించారు.

మంచి ఫీల్డింగ్ చేసిన ఆటగాడి వీడియో డ్రెస్సింగ్ రూంలో ప్రదర్శించి, జట్టు సభ్యుల నుంచి ప్రశంసలు అందేలా చేస్తున్నారు.

భారత ఆటగాళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఆటగాళ్ల మధ్య సఖ్యత స్పష్టం

"డ్రెస్సింగ్ రూం‌లో జరిగేది మైదానంలోని ఆటగాళ్ల ముఖాల్లోనూ కనిపిస్తుంటుంది" అని మాజీ ఇంగ్లండ్ క్రికెటర్, బీబీసీ టీఎంసీ ప్రసార జట్టు సభ్యుడు జొనాథన్ ఆగ్న్యూ అంటున్నారు.

“క్లైవ్ లాయిడ్, వివ్ రిచర్డ్స్‌తో కూడిన అప్పటి ప్రపంచ చాంపియన్ జట్టైన వెస్టిండీస్‌ను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వారి డ్రెస్సింగ్ రూం‌లో అందరూ సోదరుల మాదిరి కలిసి సరదాగా గడిపేవారు. అది టెస్ట్ క్రికెట్ అయినా వన్డే అయినా, మైదానంలో ఆటగాళ్ల సఖ్యత ప్రత్యర్థి జట్లను ఒత్తిడిలోకి నెట్టేది. కచ్చితంగా భారత ఆటగాళ్లలో అలాంటి ఐక్యత ఉంది. అందుకే టీం వీడియోలో జస్ప్రీత్ బుమ్రా, మొమహ్మద్ షమీ భుజం మీద చేయి వేసి సరదాగా కనిపిస్తున్నాడు. విరాట్ మ్యాచ్ గెలిపిస్తే రోహిత్ శర్మ పరిగెత్తుకుంటూ వెళ్లీ అతన్ని కౌగిలించుకున్నాడు" అని అన్నారు.

భారత జట్టు డ్రెస్సింగ్ రూం గోడలపై "యు ఆర్ ది బెస్ట్" , "క్రికెట్ ఈజ్ మై ఫస్ట్ లవ్" వంటి కొటేషన్లూ కనిపిస్తుంటాయి.

“నాకౌట్ దశలో మ్యాచ్‌లు గెలవాలంటే ఆటగాళ్లకు సరైన మానసిక స్థితి అవసరం. ఒకప్పటి పెద్ద ప్లేయర్ అయిన ఇప్పటి కోచ్ రాహుల్ ద్రవిడ్ దీన్ని అందించారు'' అని ద టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక మాజీ క్రికెట్ విశ్లేషకుడు, మిడ్‌డే పత్రిక కోసం ప్రపంచ కప్-2023ని కవర్ చేస్తున్న సంతోష్ సూరి అభిప్రాయపడ్డారు.

ద్రవిడ్, రోహిత్

ఫొటో సోర్స్, Getty Images

ద్రవిడ్ మార్క్

''ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లో మాదిరిగానే ఆటగాళ్లపై పని భారం సరిగ్గా ఉండేలా చూడాలి. జట్టులోని ఆటగాళ్ల మానసిక, శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యమైంది'' అని 2021లో రవిశాస్త్రి నుంచి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించారు.

ఇటీవల ధరమ్‌శాలలో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు మరో రోజు అక్కడే ఉండి, విశ్రాంతి తీసుకోవాలని సూచించడానికి కారణం ఈ దృక్పథమే.

రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ మాత్రమే బయటకు వెళ్లారు.

ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాకుండా ఉండేందుకు, ట్రాక్‌పై ఆటలాడకుండా ఈత కొట్టడానికి, విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే వారికి అనుమతి ఇచ్చారు.

అదే సమయంలో విరాట్ కోహ్లీ ఓ అనాథాశ్రమానికి వెళ్లి పిల్లలతో సరదాగా గడిపాడు.

కీలకమైన నాకౌట్‌ దశలో విజయం సాధించాలంటే ఆటగాళ్లకు ఇలాంటి మానసిక స్థితి అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, మహమ్మద్ షమీ: 'మా బౌలింగ్ తుపానుకు కారణం అదే...'

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)