వరల్డ్ కప్ 2023: పాక్ జట్టు దుస్థితికి బాధ్యత ఎవరిది, సొంత దేశం నుంచే ఎందుకు విమర్శలు వస్తున్నాయి?

పాకిస్తాన్ క్రికెట్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రపంచ కప్‌లో సెమీస్ ఆశలను సజీవం చేసుకోని పాక్ జట్టు
    • రచయిత, సంజయ్ కిశోర్
    • హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్తాన్ జట్టు నాలుగు మ్యాచ్‌లు వరుసగా ఓడిపోవడం ఎప్పుడూ జరగలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఓటమితోె పాక్ సెమీస్ ఆశలు దాదాపుగా ఆవిరైనట్లే చెప్పాలి.

ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో 1992 ప్రపంచకప్ ట్రోఫీ, యూనిస్ ఖాన్ నాయకత్వంలో 2009లో టీ20 వరల్డ్ కప్‌ను సాధించడమే కాక, అంతర్జాతీయ క్రికెట్‌లో బలమైన స్థానం, చరిత్ర ఉన్న పాకిస్తాన్ జట్టు ఇలా వైఫల్యాల ఊబిలో చిక్కుకుపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు?

ప్రస్తుతం బాబర్ సారధ్యంలోని జట్టు కనీసం గత విజయాల తాలూకూ ఛాయలను కూడా చేరుకోలేకపోయింది.

జట్టు వైఫల్యాలపై బీబీసీ సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సంజయ్ కిశోర్ విశ్లేషణ..

దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒక వికెట్ తేడాతో విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా

ఓటమి..

శుక్రవారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో 30 వేలమంది ప్రేక్షకుల మధ్య జరిగిన దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ మ్యాచ్‌లో 46.4 ఓవర్లకే ఆలౌట్ అయిపోయింది పాక్.

షంసీ 4 వికెట్లు తీసి జట్టును కట్టడి చేసినా, బాబర్ 50 పరుగులు, షకీల్ 52 పరుగులు, ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్ 43 పరుగులతో జట్టు స్కోరును 270 వరకు చేర్చారు.

అనంతరం బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా జట్టు మొదట్లోనే తడబడి 20 ఓవర్లకే మూడు వికెట్లను కోల్పోయింది. నిజానికి ఇది పాక్‌కు కలిసొచ్చే అంశం. కానీ, పాకిస్తాన్ బౌలర్లు మాత్రం ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యారు.

మరో 16 బంతులు ఉండగానే కేశవ్ మహరాజ్ ఫోర్ కొట్టి, జట్టుని విజయతీరానికి చేర్చాడు.

వరుస ఐదు విజయాలతో దక్షిణాఫ్రికా జట్టు సెమీస్‌కు దగ్గరవుతుంటే, పాక్ టోర్నీ నుంచే వైదొలిగే స్థితికి వెళ్లింది.

పాక్ పేస్ బౌలింగ్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, విఫలమైన పాకిస్తాన్ బౌలింగ్ వ్యూహం

వరుస పతనాలు..

ప్రపంచకప్‌కు ముందు బలమైన జట్టుగా పాకిస్తాన్‌ను కూడా పరిగణలోకి తీసుకున్నారు. కానీ టోర్నీ మొదలైన దగ్గర్నుంచి జట్టు దిగజారుతూ వస్తోంది.

దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో 48వ ఓవర్ బౌలింగ్‌ను ఉసామా మిర్‌కు గనుక ఇచ్చుంటే ఫలితం వేరుగా ఉండేదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

కెప్టెన్ బాబర్ నిర్ణయంపై వారు పెదవి విరిచారు. ఇదేకాకుండా పాక్ పేలవమైన ప్రదర్శనకు ఇతర కారణాలు కూడా ఉన్నాయి.

ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఏమాత్రం లోటులేని పాకిస్తాన్‌లో, మట్టిలో మాణిక్యాలను గుర్తించి, వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో లోపం ఉంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం చూసినా, నైపుణ్యం కలిగిన క్రీడాకారులను గుర్తించే అధునాతన సాంకేతిక పరికరాలు, వ్యవస్థ పాకిస్తాన్‌లో లేవు.

అసాధ్యమైన జట్టుగా పాకిస్తాన్ జట్టుకు పేరుంది. ఒకసారి గెలిస్తే, మరోసారి ఓటమిని చూడటం మామూలే అయినా, పాకిస్తాన్ జట్టు పడి లేస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు.

అఫ్గానిస్తాన్ జట్టు నుంచి ఊహించని పరాభవాన్ని మూటగట్టుకున్నాక, శ్రీలంక, నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. మళ్లీ భారత్‌ చేతిలో ఓటమితో మొదలైన పతనం అలా ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా జట్టు వరకు సాగింది.

మొత్తం ఆరు మ్యాచుల్లో రెండు విజయాలు, నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలోనూ దిగజారింది.

పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటతీరుపై విమర్శలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ జట్టు

బ్యాటింగ్ బాలేదు..

క్రికెట్ అంటేనే ఆటగాళ్లందరి సమష్టి కృషి. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్..ఈ మూడు సరైన దిశలో సాగితేనే జట్టుకు విజయం అనేది అలవోకగా అందుతుంది. లేదంటే విజయం కష్టమే.

పాకిస్తాన్ జట్టు బౌలింగ్ గానీ, ఫీల్డింగ్ గానీ ఏ అంచనాలను అందుకోలేకపోయింది.

ప్రపంచ కప్‌లో అన్ని జట్లు ఎక్కువ పరుగులు సాధిస్తున్నాయి. కానీ, పాక్ జట్టు రెండుసార్లు మాత్రమే 300 పరుగుల మైలురాయిని దాటింది. అయితే ఇక్కడ సమస్యేమీ లేదు.

నిజానికి మహ్మద్ రిజ్వాన్‌పైనే పాకిస్తాన్ జట్టు ఆధారపడాల్సిన పరిస్థితి. రిజ్వాన్ టోర్నీలో 333 పరుగులు సాధించాడు. క్వింటన్, విరాట్ కోహ్లీల తరువాతి స్థానంలో ఉన్నాడు.

కానీ, జట్టు కెప్టెన్ బాబర్ మాత్రం 207 పరుగులతో 19వ స్థానానికి పరిమితం అయ్యాడు. ఇతర బ్యాట్స్‌మెన్లు అబ్లుల్లా షఫిక్, సౌద్ షకీల్‌లు కూడా బాబర్ కన్నా ఎక్కువ పరుగులు తీశారు.

ఈ ప్రపంచ కప్‌లో పాక్ బ్యాట్స్‌మెన్లు దూకుడుగా ఆడలేకపోయారు. భారీ భాగస్వామ్యాల మాటే లేదు. జట్టులో సమన్వయ లోపం కూడా కనిపిస్తోంది.

విఫలమైన బౌలింగ్..

ఆ దేశ క్రికెట్ చరిత్రను చూస్తే, విజయ చరితను లిఖించింది బౌలర్లే. కానీ ఈసారి మాత్రం జట్టు ఫీల్డింగ్, బౌలింగ్ చాలా బలహీనంగా ఉన్నాయి. ఆసియా కప్‌లో పాకిస్తాన్ బౌలర్లు భారత జట్టును 266 పరుగులకే కట్టడి చేశారు.

పాకిస్తాన్ బౌలర్లు వరల్డ్ కప్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లకు సవాల్ విసురుతారని నిపుణులు కూడా అంచనా వేశారు.

కానీ టోర్నీకి రెండు వారాల ముందు బౌలర్ నసీం షా భుజానికి తగిలిన గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతడు లేనిలోటు కనిపించింది.

భారత్, పాక్‌ల పిచ్‌ల మధ్య అంత వ్యత్యాసమేమీ లేదు. కానీ, బౌలర్లు మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేదు. దీనికితోడు ఫీల్డర్ల నుంచి కూడా తగినంత సహకారం లభించలేదు.

షహీన్ షా అఫ్రిదీపై జట్టుకు భారీ అంచనాలున్నా, అంతగా రాణించలేదు. ఆరు మ్యాచుల్లో కలిపి 13 వికెట్లు మాత్రమే తీశాడు.

హారిస్ రవూఫ్ మొత్తంగా ఆరు మ్యాచుల్లో 348 పరుగులు ఇచ్చి, 10 వికెట్లు తీశాడు. స్పిన్నర్ల నుంచి కూడా నిరాశే ఎదురైంది.

షాదాబ్ ఖాన్, ఉసామా మిర్, మహమ్మద్ నవాజ్, ఇఫ్తిఖర్‌ అహ్మద్‌ల బృందం ఆరు మ్యాచుల్లో 710 పరుగులు ఇచ్చి కేవలం ఎనిమిది వికెట్లు తీశారు.

ఈ ప్రదర్శన చూస్తే, పాకిస్తాన్ బౌలింగ్ ఉందో అర్థమవుతోంది.

బాబర్ కెప్టెన్సీపై విమర్శలు…

జట్టు ప్రదర్శన బాగుంటే కెప్టెన్సీ సమస్యలు సగం మేర తగ్గిపోతాయి. అదే సమయంలో జట్టు కెప్టెన్ కూడా తన ఆటతో జట్టుకు ఆదర్శంగా నిలవాలి. కానీ బాబర్ విషయంలో అది ఆశించినంత లేదు. 207 పరుగులకే పరిమితమై సగటు 34.5 పరుగులే సాధించాడు.

అతడి కెప్టెన్సీలో దూకుడు లేదని, వ్యూహాత్మకంగా వ్యవహరించడంలోనూ, ఫామ్‌లో లేని బ్యాట్స్‌మెన్‌ అన్న ముద్రను తప్పించడంలోనూ బాబర్ విఫలమయ్యాడని విమర్శలు ఉన్నాయి.

జట్టులో తనకు ఇష్టమైన ఆటగాళ్లకే ప్రపంచకప్ ఆడేందుకు అవకాశం ఇచ్చాడంటూ పాకిస్తాన్ మీడియా ఆరోపణలు కూడా చేసింది. జట్టులో ఆటగాళ్ల మధ్య సమన్వయం లేదని, బాబర్ జట్టును పటిష్టం చేయలేకపోయారని కూడా విమర్శలు వస్తున్నాయి.

మరోవైపు బాబర్‌, షాహీన్ షాల మధ్య మంచి సంబంధాలు లేవు.

పాకిస్తాన్ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాక్ జట్టులో సమన్వయలోపం

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైఫల్యం..

నిజానికి పాకిస్తాన్‌లో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు కొరత లేదు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల విషయంలో పాకిస్తాన్ ఎప్పుడూ వెనక్కుతిరిగి చూసుకోవాల్సిన పనిలేదు.

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో రాజకీయ జోక్యం, తిరుగుబాటుల ఫలితంగా పరిస్థితి దిగజారిపోయింది. ఈ కారణాల వలన ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల సరసన ఎక్కువ కాలం ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యం సాధించిన పాక్ జట్టు ఈ స్థితికి చేరింది.

గతేడాది, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో మూడుసార్లు ప్రెసిడెంట్ల మార్పిడి జరిగింది.

దక్షిణాఫ్రికాకు చెందిన మైకీ ఆర్ధర్‌ను టీం డైరెక్టర్‌గా నియమించారు మాజీ ప్రెసిడెంట్ నజాం సేతీ. కానీ మైకీ ఓపక్క డెబ్రీషైర్ కౌంటీ అసోసియేషన్‌లోనే కొనసాగుతూనే, పీసీబీకి కూడా పనిచేశారు.

పాకిస్తాన్ మీడియా ఆర్థర్‌ను ’జూమ్ కోచ్’ అంటూ వ్యాఖ్యానించింది.

ఫాస్ట్ బౌలర్లను సమయానుకూలంగా మార్చడంలోనూ బోర్డు విఫలమైంది.

షహీన్ అఫ్రిదీ, నజీం షాలు మూడు నెలలుగా అన్ని ఫార్మాట్లలో ఆడుతూనే ఉన్నారు. నజీం జట్టునుంచి తప్పుకోగా ఆ స్థానంలో వచ్చిన హసన్ అలీ నుంచి కూాడా ఆశించిన స్థాయిలో రాణింపు లేదు.

దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పిలిచే షోయబ్ అక్తర్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియో కామెంట్ చేశాడు.

“ఈరోజు మనం చూస్తున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు, గడిచిన 20-30 ఏళ్లలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు ఫలితం. ఇవే తప్పులు చేయండి. ఇలాంటి వ్యక్తులనే జట్టులోకి తీసుకువస్తే, ఇలాంటి ఫలితాలే వస్తుంటాయి” అని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)