ఆంధ్రప్రదేశ్: కులగణన పై ఏపీ సర్కార్ తొందరపడుతోందా, వలంటీర్ల పాత్రపై విమర్శలు ఏమిటి?

ఫొటో సోర్స్, CMO Andhra Pradesh
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
బిహార్ ప్రభుత్వం కులగణన పూర్తి చేసి అధికారికంగా వెల్లడిచింది.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కులగణనకు సిద్ధపడింది. కానీ కులగణనలో వలంటీర్లను పాత్రధారులను చేయడంపై విమర్శలు వస్తున్నాయి.
అయితే బిహార్ ప్రభుత్వం అనుసరించిన విధానానికి, ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన తీరుకి తేడా కనిపిస్తోంది.
బిహార్‌లో పకడ్బందీగా సన్నాహాలు చేసి రెవెన్యూ యంత్రాంగం సారధ్యంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు.
కానీ ఏపీలో మాత్రం గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కుల గణన చేపట్టాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది.
వలంటీర్ల పాత్రపై ఇప్పటికే పలు విమర్శలున్నాయి. న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకునే వరకూ వ్యవహారం వెళ్లింది.
సంక్షేమ పథకాల అమలు కోసం క్షేత్రస్థాయి సిబ్బందిగా ఉన్న వలంటీర్లను ఓటర్ల జాబితా వంటి విషయాల్లో దూరంగా ఉంచాలనే ఆదేశాలు కూడా వచ్చాయి.
అయినప్పటికీ ఇప్పుడు కులగణనలో వారిని భాగస్వామ్యం చేయడం మీద విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వం మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. నవంబర్ 15 నుంచి రాష్ట్రంలో కులగణన చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం వివిధ సంఘాలు సహా అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెపుతోంది.
రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
బిహార్ లో పకడ్బందీగా..
దేశంలో 1931 తర్వాత కులగణన జరగ లేదు. కేవలం ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలు మాత్రం ప్రతీ పదేళ్ల జనగణనలో సేకరిస్తున్నారు.
బీసీలు, ఇతర కులాల సంఖ్య మాత్రం నిర్దిష్టంగా వెల్లడికావడం లేదు. దాంతో కులగణన చేయాలనే డిమాండ్ చాలాకాలంగా బీసీ సంఘాల నుంచి వస్తోంది.
బీసీలలో కూడా మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్(ఎంబీసీ)ల సంఖ్య వంటివి నిర్దుష్ట లెక్కలు తెలుసుకోవడం, ఆయా తరగతులకు అందించాల్సిన పథకాలు, ఇతర సహాయక కార్యక్రమాలకు పక్కాగా అమలుచేసేందుకు ఇది దోహదపడుతుందనే వాదన విపక్షాలు కూడా చేస్తున్నాయి.
జాతీయ స్థాయిలో కులగణన అంశం ప్రధానాంశంగా ముందుకొస్తోంది. బీజేపీ నేతలు కూడా విపక్షంలో ఉండగా కులగణన కోసం డిమాండ్ చేసినప్పటికీ ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం దానిని వ్యతిరేకిస్తోంది.
ఇండియా కూటమి నేతలు కులగణను ప్రధానాంశంగా ముందుకు తెస్తున్నారు.
ఆ క్రమంలోనే బిహార్ లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టింది. ఆరు నెలల పాటు ఈ ప్రక్రియ సాగింది.
కులగణన వ్యవహారాన్ని రెవెన్యూ అధికారులు చేపట్టారు. క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ, బాధ్యతలు అప్పగించడం, ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించడం, వాటిని పొందుపరచడం వరకూ మొత్తం వ్యవహారం పకడ్బందీగా సాగించినట్టు బిహార్ ప్రభుత్వం తెలిపింది.
ఈ కులగణనను ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో నమోదయిన పిటిషన్ పై కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం కులగణను శాస్త్రీయంగా నిర్వహించినట్టు స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, UGC
ఏపీలో భిన్నంగా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కులగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది.
కానీ కేంద్రం కులగణనకు ససేమీరా అంటోంది.
దాదాపుగా 150 ఏళ్ల తర్వాత తొలిసారిగా జనగణన కూడా ఈసారి నిలిచిపోయింది. గతంలో ప్రపంచ యుద్ధాలు, మహమ్మారి వంటివి అడ్డు వచ్చినా ఆగని జనగణన ఈసారి కరోనా పేరుతో నిలిపివేశారు.
కరోనా ఉధృతి తగ్గిన తర్వాత కూడా జనగణన చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కాలేదు.
కులగణన డిమాండ్ ముందుకు రావడం కూడా దానికి ఓ కారణమని విపక్షాలు వాదిస్తున్నాయి.
దాంతో కులగణన చేయాలంటూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం అమలుకి నోచుకోలేదు.
అదే సమయంలో బిహార్ రాష్ట్ర ప్రభుత్వమే కులగణన చేయడంతో జగన్ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు చెపుతోంది
అయితే బిహార్ లో కులగణన వ్యవహారం గతంలో జనగణన సాగించిన అధికారుల పర్యవేక్షణలో సాగింది.
కానీ ఏపీలో మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వార్డు/ గ్రామ సచివాలయాల ప్రిన్సిపల్ సెక్రటరీల ఆధ్వర్యంలో వేసిన కమిటీ ప్రతిపాదనల మేరకు ముందుకు సాగుతున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ చెబుతున్నారు.
"నవంబర్ 15 నుంచి కులగణన జరుగుతుంది. దానికోసం ఓ యాప్ రూపొందిస్తాం. సచివాలయ సిబ్బంది, వలంటీర్ల సహకారంతో జరుగుతుంది. ఆ అంశంలో ఎవరైనా తమ సూచనలు, అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ప్రభుత్వానికి మెయిల్ చేసినా, లేదంటే విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, కర్నూలు, తిరుపతి కేంద్రాలుగా నిర్వహించబోతున్న రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరై, తమ అభిప్రాయాలు చెబితే వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఇదో చారిత్రక కార్యక్రమంగా చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది" అంటూ ఆయన బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
హడావుడి వెనుక లక్ష్యం అదే..
ఓవైపు ఎన్నికల సన్నాహాలు సాగుతున్నాయి. ఓటర్ల జాబితాలో సవరణలు పూర్తి చేసి తుది జాబితా విడుదలకు సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే బూత్ లెవెల్ ఆఫీసర్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది స్థానంలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించారు.
అదే సమయంలో ఇప్పుడు కులగణన వ్యవహారం కూడా వారి ద్వారానే అంటూ ప్రభుత్వం ప్రకటించింది.
బిహార్ వంటి రాష్ట్రంలో అనుభవమున్న మొత్తం రెవెన్యూ యంత్రాంగాన్ని రంగంలోదింపి కులగణనను శాస్త్రీయంగా పూర్తిచేసేందుకు ఆరు నెలల సమయం తీసుకుంది.
ఏపీలో మాత్రం సాధారణ ఎన్నికలకు నాలుగు నెలల ముందుగా ఈ వ్యవహారం ప్రారంభించడం విశేషంగా మారుతోంది.
రాజకీయ లక్ష్యాల సాధన కోసమే హడావుడి అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి.
"కులగణన విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నట్టు కనిపించడం లేదు వలంటీర్ల ద్వారా కులగణన చేస్తామని చెప్పడం బాధ్యతారాహిత్యం. సుదీర్ఘకాలం తర్వాత జరుగుతున్న కులాల వారీ లెక్కల సేకరణ పక్కాగా జరగాలి. అందుకు తగ్గట్టుగా అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. కానీ ఇంత స్వల్పకాలంలో ఆతృతగా కులగణన అంటూ ప్రచారం చేయడం వచ్చే ఎన్నికల్లో లబ్ది కోసమే తప్ప బీసీలు సహా ఇతరులను ఉద్దరించే ఉద్దేశం ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రభుత్వం బిహార్ అనుభవాలను గమనంలోకి తీసుకోవాలి." అంటూ సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు.
ప్రభుత్వం ఆతృత చూస్తుంటే అసలు లక్ష్యం నెరవేరుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు శ్రీనివాసరావు.

ఇప్పటికే డేటా ఉంది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఇంటింటి సర్వే జరిగింది. ప్రతీ కుటుంబంలో ఉన్న వారి వివరాలు అధికారికంగానే సేకరించారు.
అందులో కులాలు, మతాల వారి వివరాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వ హయంలో సేకరించిన ఆ లెక్కలను అధికారికంగా వెల్లడించలేదు.
కేవలం కాపుల రిజర్వేషన్ల అంశం మీద చర్చ సమయంలో అసెంబ్లీలో మాత్రం కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల సంఖ్యను మాత్రం శాతాల వారీగా వెల్లడించారు.
జగన్ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రవేశ పెట్టిన తర్వాత వలంటీర్ల ద్వారా ప్రతీ కుటుంబ సమాచారం సేకరించారు.
వాటిని వలంటీర్లకు ఇచ్చిన యాప్ లలో నమోదు చేశారు. అందులో ప్రతీ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక , కుల, మత సంబంధిత అంశాలన్నీ పొందుపరిచారు.
అధికారికంగా వినియోగించుకోడమే తప్ప వాటిని బహిరంగంగా వెల్లడించడం లేదు. వలంటీర్లు సేకరించిన డేటా లీక్ అవుతోందని టీడీపీ, జనసేన నేతలు విమర్శలు కూడా చేశారు.
ఇప్పుడు ప్రభుత్వం మరోసారి వివరాలు సేకరిస్తామని చెపుతుండడంతో వలంటీర్ల వద్ద ఉన్న పాత డేటానే బయటపెడతారా అనే అనుమానాలు బీసీ సంఘాల నుంచి వస్తోంది.
"కులగణన ఎవరి ద్వారా, ఎప్పటి నుంచి చేయాలని అనేది ఖరారయ్యింది. ఎవరు, ఎప్పుడు, ఎలా చేస్తారన్నది నిర్ణయించేసి ఇప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉంది. కులగణన జరగకపోవడం వల్ల బీసీలు ఎక్కువగా నష్టపోతున్నారు. ఎంబీసీలకు న్యాయం జరగాలంటే కులగణన అవసరం. అందుకు బిహార్ అనుభవం ఉంది. అయినా గానీ ఏపీలో ఏకపక్షంగా సాగుతున్నారు." అని బామ్ సెఫ్ ప్రతినిధి ఆర్.రవిచంద్ర అన్నారు.
శాస్త్రబద్ధ కులాల వారీ జనాభా లెక్కల ప్రక్రియ చేపడితే ఆహ్వానించాల్సి ఉందని, అందుకు అనుగుణంగా అడుగులు కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, ANI
జనాభా లెక్కల సేకరణతో సమానం..
జనాభా లెక్కల సేకరణ శాస్త్రబద్ధంగా సాగాలి. అందుకు నిర్దుష్ట ప్రమాణాలు కూడా ఉన్నాయి.
అందులో పాల్గొనే సిబ్బంది నుంచి వాటి విశ్లేషణ చేసే యంత్రాంగం వరకూ అంతా తగిన శిక్షణ పొంది ఉండాలి.
"ఏపీలో ఏ కులాల వారీ సంఖ్య ఎంత అన్నది తేల్చడం ఆహ్వానించదగ్గ విషయం. కానీ అందుకు తగిన ఏర్పాట్లు జరగాలి. జనాభా లెక్కల సేకరణకి జరిగేటంత సన్నాహాలు చేయాలి. అప్పుడే అసలు లక్ష్యం నెరవేరుతుంది. వివరాల సేకరణలో లోపాలు లేకుండా తగినంత శ్రద్ధ పెట్టాలి. ఎన్నికల ముందు రాజకీయ ప్రహసనంగా మిగిలిపోకూడదని ఆశిస్తున్నాం. ప్రభుత్వం దానికి అనుగుణంగా స్పందిస్తుందని భావిస్తున్నాం" అంటూ ఏపీ బీసీ కులాల సంక్షేమ సంఘం కార్యదర్శి కె. ఆనందరావు అన్నారు.
మోదీ ప్రభుత్వం ముందుకు రాకపోయినా జగన్ మాత్రం కులగణనకు సిద్ధం కావడం అభినందనీయమని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు బీసీ సంఘాలు, విపక్షాలు కూడా వలంటీర్లతో కులగణన మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
అయితే ప్రభుత్వం మాత్రం సన్నాహాలు షురూ చేసిన తరుణంలో ఏపీలో కులగణన వ్యవహారం ఎలా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారుతోంది.
ఇవికూడా చదవండి
- రాజమహేంద్రవరం జైలు నుంచి చంద్రబాబు బహిరంగ లేఖపై వివాదం... అందులో ఏముంది, అసలు అలా రాయవచ్చా?
- హమాస్ మిలిటెంట్ల బాడీకామ్ ఫుటేజిని జర్నలిస్టులకు ప్రదర్శించిన ఇజ్రాయెల్... అక్టోబర్ 7 నాటి ఆ వీడియోల్లో కాల్పుల మోతలు, రక్తంతో తడిసిన పౌరుల హాహాకారాలు
- ‘డ్రగ్స్ ఇచ్చి, మంచానికి కట్టేసి అత్యాచారం చేశాడు, ఆ సీరియల్ కిల్లర్ నుంచి ఎలా తప్పించుకున్నానంటే..’
- కుడా బక్స్: ‘ఎక్స్రే కళ్ల’తో యూరోపియన్ల మతి పోగొట్టిన భారతీయ ఇంద్రజాలికుడు
- తెలంగాణ: మేడిగడ్డ బరాజ్ కట్టిన నాలుగేళ్లకే ఎందుకు కుంగిపోయింది? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివే...
- తెలంగాణ: బైక్పై ఆరు దేశాలు చుట్టొచ్చిన యువతులు!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















