హమాస్ మిలిటెంట్ల బాడీకామ్ ఫుటేజిని జర్నలిస్టులకు ప్రదర్శించిన ఇజ్రాయెల్... అక్టోబర్ 7 నాటి ఆ వీడియోల్లో కాల్పుల మోతలు, రక్తంతో తడిసిన పౌరుల హాహాకారాలు

ఫొటో సోర్స్, IDF HANDOUT
- రచయిత, జోయల్ గుంటెర్
- హోదా, సీనియర్ రిపోర్టర్
- నుంచి, టెలీఅవీవ్
హెచ్చరిక: ఈ కథనంలో మీ మనసును కలచివేసే విషయాలు ఉండవచ్చు.
రెండువారాల కిందట ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి 'ఎంత క్రూరమైనదో' చెప్పడానికి ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్న హమాస్ మిలిటెంట్ల బాడీకెమెరాలలోని ఫుటేజీని ఇజ్రాయెల్ సోమవారంనాడు జర్నలిస్టులకు ప్రదర్శించింది.
మిలిటెంట్లు ధరించిన బాడీకామ్స్‌లో రికార్డ్ అయిన ఫుటేజీని సీసీటీవీల నుంచి, హమాస్ సాయుధులు, డాష్‌బోర్డు కెమెరాలు బాధితుల మొబైల్ ఫోన్ల నుంచి సేకరించిన వీడియోలతో కలిపి చూపించారు. దక్షిణ ఇజ్రాయెల్లో సంగీతోత్సవం, ఆ పొరుగునే ఉన్న కుటుంబాలపై ఎంత భయానకమైన దాడి జరిగిందో ఈ వీడియోలో చూపించారు.
చనిపోయిన హమాస్ సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న కొన్నిపత్రాలను కూడా ఇజ్రాయెల్ మిలటరీ విడుదల చేసింది. వీటిలో దాడులకు సంబంధించిన ప్రణాళిక, పొరుగువారిపై ఎలా దాడిచేయాలి, బందీలను ఎలా పట్టుకోవాలనే వివరాలు ఉన్నాయి.
దాడులు మొదలైనప్పటి నుంచి వందలాది గంటల ఫుటేజీని సేకరించామని టెల్‌అవీవ్‌లో 43 నిమిషాల ఫుటేజీని ప్రదర్శించిన సందర్భంగా మిలటరీ అధికారులు చెప్పారు. ఈ పుటేజిలో రోడ్డుపైన పౌరులను కాల్చి హమాస్ గన్‌మెన్లు సంతోషపడుతున్నట్టు, కిబుట్జ్‌లో ఫుట్‌పాత్ వెంబడి ఉన్న ఇళ్లలో తల్లిదండ్రులను, వారి పిల్లలను కాల్చిచంపిన దృశ్యాలు ఉన్నాయి.
కిబుట్జ్‌లోని హోమ్ కెమెరాల నుంచి తీసుకున్న ఫుటేజీలో అయితే బాధాకరమైన దృశ్యాలు ఉన్నాయి. అందులో, ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను షెల్టర్‌కు పంపుతుండగా హమాస్ సాయుధులు గ్రేనేడ్ విసరడంతో తండ్రి చనిపోవడం, పిల్లలు గాయపడటం కనిపించింది.
రక్తసిక్తమైన పిల్లలిద్దరూ బెదిరిపోయి ఇంట్లోకి వెళ్ళారు. హమాస్ గన్‌మెన్ ఇంట్లోకి వచ్చి తాపీగా వారి ముందే ఫ్రిజ్ తెరిచి కూల్ డ్రింక్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఆ పిల్లల్లో ఒకరు 'నాన్న చనిపోయాడు. ఇది అబద్ధం కాదు' అని తన సోదరుడితో చెబుతూ ఏడుస్తున్నాడు.‘నేనెందుకు బతకాలి’ అంటున్నాడు.
అతని సోదరుడు గ్రేనేడ్ దాడిలో గాయపడి రక్తమోడుతున్నాడు. అయితే, ఈ పిల్లలు బతికున్నారో లేదో ప్రెస్‌మీట్‌కు హాజరైన మిలటరీ ప్రతినిధి చెప్పలేకపోయారు.

ఫొటో సోర్స్, IDF HANDOUT
మిలటరీ ప్రదర్శించిన చిత్రంలో ఓ ఆడియో రికార్డింగ్ కూడా ఉంది. ఇందులో ఓబాధితుడి ఇంటి నుంచి గాజాలోని తన తల్లిదండ్రులకు ఫోన్‌చేసి తాను ‘‘ఉత్త చేతులతోనే పదిమంది యూదులను చంపినట్టు’’ చెప్పడం వినిపిస్తోంది.
ఎంతమంది చనిపోయారో చూడటానికి దయచేసి వాట్సాప్ తెరవండి అంటూ అతను తల్లిదండ్రులను బతిమాలుతున్నాడు .బహుశా దాడులకు సంబంధించి తాను పంపిన ఫోటోనో, వీడీయోనో చూడమనడం కోసం అలా బతిమాలుతూ ఉండొచ్చు. ‘‘నీ కొడుకు ఎంతో మంది యూదులను చంపాడు, నీకొడుకు ఒక హీరో ’’ అనడం వినిపిస్తోంది.
మరోచోట కిబుట్జ్‌లోపల ఏదో వేడుక చేసుకుంటున్నట్టుగా ఓ హమాస్ గన్‌మెన్ పౌరులను కాల్చిచంపడం, ఓ వ్యక్తి బతికి ఉన్నట్టుగా కనిపిస్తే అతని తలను పారతో నరకడానికి ప్రయత్నిస్తున్న దృశ్యం ఉంది.
బాధితుల మొబైల్ ఫోన్ల నుంచి సేకరించిన ఫుటేజీలో తమకు సమీపంలో పేలుళ్ళు, తుపాకుల శబ్దాలు వినిపిస్తుండటంతో సురక్షిత గదులలో తలదాచుకున్నవారి భయం కూడా స్పష్టంగా కనిపించింది.
ఈ రా-ఫుటేజిని జర్నలిస్టులకు చూపించాలనే నిర్ణయం ఇజ్రాయెల్ ఉన్నత సైనికాధికారుల అసహనాన్ని, నిస్పృహను ప్రతిఫలించింది. అక్టోబర్ 7న జరిగిన హమాస్ భీకరదాడులు ఆ తరువాత గాజా మీద ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులను మీడియా కవర్ చేసేలా చేసింది. అలాగే, గాజా ప్రజలు దక్షిణ ప్రాంతానికి తరలిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశాలు ఇవ్వడంతో తలెత్తిన మానవతా సంక్షోభం అంతా కూడా మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. ఇదంతా ఇజ్రాయెల్ సైనికాధికారులను అసహనానికి గురి చేసిందని ఈ వీడియోల ప్రదర్శన చెప్పకనే చెప్పింది.
ఈ ఫుటేజి ప్రదర్శన అనంతరం అంతర్జాతీయమీడియా సమావేశంలో మేజర్ జనరల్, ఐడీఎఫ్ డివిజన్ మాజీ కమాండర్ మైకేల్ ఎడెల్‌స్టీన్ మాట్లాడుతూ మీడియా కవరేజీ చూసి దిగ్భ్రాంతి చెందినట్లు తెలిపారు.
‘‘కొన్ని చానళ్ళు ఇజ్రాయెల్ చేస్తున్న పనిని, టెర్రరిస్టుల నీచమైన పనులతో పోల్చడానికి ప్రయత్నించాయి. అలా పోల్చేవారిని మేం అర్థం చేసుకోలేం. మేమిప్పుడు మీతో పంచుకున్న ఫుటేజీని మీరు అర్థం చేసుకోవాలి’’ అన్నారు.
హమాస్ అక్టోబరు7న జరిపిన దాడిలో 1400 మందికి పైగా మరణించారని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువభాగం మొదటిసారి చేసిన దాడుల్లోనే చనిపోయారని, మరో 220మందిని గాజాలోకి బందీలుగా తీసుకువెళ్ళారని తెలిపారు.
హమాస్ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై జరిపిన వైమానికదాడులలో 5వేలకుపైగా పాలస్తీనీయులు చనిపోయినట్టు హమాస్ నేతృత్వంలోని ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వశాఖ కూడా అక్టోబరు 7 నుంచి 91 మంది పాలస్తీనీయులు మరణించారని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
చనిపోయిన హమాస్ గన్‌మెన్ల నుంచి స్వాధీనం చేసుకున్న పథక రచన చిట్టాను కూడా ఇజ్రాయెలీ మిలటరీ విడుదల చేసింది. అందులో దాడులు ఎలా చేయాలి, బందీలను పట్టుకోవడానికి సంబంధించిన ప్రణాళిక ఉంది.
‘‘వీలైనంత మందిని కాల్చి చంపాలి. బందీలుగాపట్టుకోవాలి. వారిని వేరువేరు కార్లు ఉపయోగించి గాజాస్ట్రిప్‌కు తరలించాలి’’ అని ఆ ఆదేశాలలో కొంతభాగం తెలుపుతోంది.
బందీల గురించి ప్రత్యేకంగా రూపొందించిన పత్రంలోనైతే ‘‘ సమస్యాత్మకంగా కనిపించేవారిని, మనకు ముప్పు అనిపించినివారందరనీ చంపండి’’ ఇతరులనందరినీ ఓ చోట చేర్చి ఫిరంగిమేతగా ఉపయోగించండి అని ఉంది.
అక్టోబరు7నాటి హమాస్ దాడుల గురించి ఇజ్రాయెల్ ఇప్పటికీ విలవిల్లాడుతోంది. గడిచిన 50 ఏళ్ళలో దక్షిణభాగంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఎన్నడూ ఇంతటి చొరబాటుకు గురికాలేదు. హమాస్ టన్నెల్స్‌ను ధ్వంసం చేసే సామర్థ్యం, భద్రతా కంచెను విస్తరించగలిగే వనరులు ఇజ్రాయెల్‌కు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ సరిహద్దు కంచెను హమాస్ సభ్యులు పెద్దఎత్తున దాటగలిగారు.
మొదటిసారి చొరబాటులో దాదాపు వెయ్యిమంది మిలిటెంట్లు ఇజ్రాయెల్ కంచెను దాటారని జనరల్ ఎడెల్‌స్టెన్ సోమవారం చెప్పారు. హమాస్ గన్‌మెన్లతో నిండిన పికప్ ట్రక్కులు ఇజ్రాయెలీ హైవేలపై స్వేచ్ఛగా తిరుగుతూ ఇష్టారాజ్యంగా పౌరులను కాల్చిచంపుతున్న దృశ్యాలతో ఈ వీడియో మొదటిభాగాన్ని రూపొందించారు.
హమాస్ మిలిటెంట్ల మృతదేహాల నుంచి సేకరించిన పత్రాలు ‘‘పౌరులను నరికేయడానికి, కాల్చి చంపడానికే’’వచ్చారని స్పష్టం చేస్తున్నాయని జనరల్ ఎడెల్‌స్టెన్ తెలిపారు.
‘‘ఇళ్ళలోని కుటుంబాలను కాల్చిచంపాలని, బందీలను ప్రాణాలతో పట్టుకోవాలని, పిల్లలను గాజాకు తీసుకువెళ్ళాలనే లక్ష్యాలను వారు రాసి పెట్టుకున్నారు. ఎంతమందిని చంపాలి, ఎంతమందిని బందీలుగా తీసుకోవాలో చెప్పడంతోపాటు రేప్ చేయాలనే ఆదేశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ లిఖితపూర్వకంగా ఇచ్చిన ఆదేశాలు’’ అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి :
- మారువేషాల మొనగాడు, 'రబ్బర్ ఫేస్' మాఫియా కింగ్ మీద ఆ ఊరి ప్రజల కన్ను పడింది, తీగ లాగితే డొంకంతా కదిలింది...
- క్రికెట్ వరల్డ్ కప్: పాకిస్తాన్‌పై అఫ్గానిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఎలా గెలిచింది... అదీ చేజ్ చేసి?
- కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల ఆత్మహత్యలను ఈ కఠిన నిబంధనలు అడ్డుకోగలవా?
- ‘జట్టును సముద్రంలో కలిపేస్తా’ అని బిషన్ సింగ్ బేడీ ఎందుకన్నారు?
- నీళ్ల కోసం వెళ్తే మొసళ్ల దాడులు.. వీటిని ఇండోనేషియా ఎందుకు ఆపలేకపోతోంది?
- ఎలుగుబంట్లను హడలెత్తిస్తున్న రోబో తోడేళ్లు, ఇక పంటలు భద్రమేనా?









