'గాజాకు తిరిగి వెళ్దామని నా పిల్లలు అడుగుతున్నారు... కానీ, మేం తిరిగి వెళ్ళలేమన్న సంగతి వారికి అర్ధం కావడం లేదు' - బీబీసీ ప్రతినిధి ఆవేదన

- రచయిత, రష్దీ అబు అలౌఫ్
- హోదా, బీబీసీ న్యూస్
- నుంచి, ఖాన్ యూనిస్, గాజా
'గాజా నగరానికి తిరిగి వెళ్దామని మా కూతుళ్లు అంటున్నారు. కానీ, అక్కడ పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి' అని ఆవేదన వ్యక్తం చేశారు బీబీసీ గాజా ప్రతినిధి రష్దీ అబు అలౌఫ్. అక్కడ తన కుటుంబం ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులను ఆయన ఇలా పంచుకున్నారు:
రెండు రోజుల క్రితం, నా భార్య, పిల్లలు మరణం అంచు వరకూ వెళ్లొచ్చారు.
గాజాలోని ఖాన్ యూనిస్ నగరంలోని హాస్పిటల్ సమీపంలో ఒక టెంట్ కింద నేను నిద్రపోతున్నాను.
నా భార్య, పిల్లలు నా టెంట్‌కి దగ్గర్లో ఒక నాలుగు అంతస్తుల భవంతిలో కింద అంతస్తులో ఉన్నారు.
ఆ భవనం పై అంతస్తుపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసేటప్పుడు, వారు నన్ను కలవడానికి అక్కడి నుంచి బయలుదేరబోతున్నారు.
ఈ దాడి తర్వాత తొమ్మిదేళ్ల నా ఇద్దరు కూతుళ్లు ఏడ్చుకుంటూ వీధిలోకి వచ్చేశారు.
వారు నా భార్య నుంచి తప్పిపోయారు. డ్రోన్ దాడితో ఆ అంతస్తులోని ఒక శిథిలానికి చెందిన ముక్క నా భార్య తలకు గట్టిగా తగిలింది. నా భార్యకు గాయాలయ్యాయి.
అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతోనే బయటపడింది.
నా కూతుళ్ళు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఆ రోజు రాత్రంతా భయపడుతూ ఏడుస్తూనే ఉన్నారు. ఏం చేయాలో తెలియలేదు.
డాక్టర్‌కు కాల్ చేసి, వారు ఏడవకుండా నిద్రపోవాలంటే ఏం చేయాలని అడిగాను.
నా కుటుంబం ఇప్పుడు డ్రోన్ దాడి జరిగిన భవంతికి దగ్గర్లోనే వీధుల్లో రాత్రులు గడుపుతోంది.
కళ్లు మూసుకుంటే సురక్షితంగా ఉంటారో లేదో తెలియదు. అంతా భయం భయంగానే వీధుల్లో ఉంటున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇజ్రాయెల్, హమాస్ మధ్యలో తీవ్ర ఘర్షణలు చెలరేగిన తర్వాత నేను, నా భార్య, ఇద్దరు కూతుర్లు, 18 ఏళ్ల కొడుకు రెండు వారాల్లో నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల హెచ్చరికలతో దుప్పట్లు, పరుపులు మా కారుకు పైన కట్టుకుని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఇలా వెళ్తూనే ఉన్నాం.
నా కూతుళ్ళు తమకు ఇష్టమైన వస్తువులన్నింటిన్నీ గాజా నగరంలోనే విడిచిపెట్టి దక్షిణ ప్రాంతానికి రావాల్సి వచ్చింది.
వారికెంతో ఇష్టమైన స్కూల్‌ను, పిజ్జా షాపును, వారి స్నేహితులను, హార్స్ రైడింగ్ క్లబ్‌ను ఇలా అన్నింటిన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది.
గాజాలో మరణం, జీవితం రెండూ ఒకేలా ఉన్నాయి. బాంబుల వర్షం ఏకధాటిగా సాగుతోంది.
పెద్దలకు ఈ పరిస్థితి చాలా భయానకంగా అనిపిస్తోంది. ఒక పిల్లల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఏ తొమ్మిదేళ్ల చిన్నారి కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనకూడదు.
నా బిడ్డలు గట్టిగా నా కాళ్లను పట్టుకుంటున్నారు. వాటేసుకుని అలానే ఉండిపోతున్నారు.
వారు తమ భయాన్ని పోగొట్టుకునేందుకు నా వెంటే ఉంటున్నారు. అసలు వదిలిపెట్టడం లేదు.
ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు చాలా సమయమే పట్టేలా కనిపిస్తోంది.
ఈ భయానక పరిస్థితుల నుంచి వారిని బయటకు తీసుకురావడానికి చాలా సపోర్టు అవసరం.
నా అమ్మాయిలు కూడా గాజాకి తిరిగి వెళ్దామని పదే పదే అడుగుతున్నారు.
ఈ ఘర్షణలు చెలరేగడానికి ముందు వరకు 99 శాతం పాలస్తీనియన్ ప్రజలతో పోలిస్తే మేం మెరుగైన జీవితాన్నే గడిపాం.
ఇక్కడ కరెంట్ సరిగ్గా ఉండటం లేదు. నీళ్లు చాలా కలుషితంగా ఉన్నాయి. ఏదైనా పని మీద కొద్దిసేపు బయటికి వెళ్లాలన్నా చాలా కష్టమవుతుంది.
మేము కనీసం సెలవులకు అయినా బయటికి వెళ్లగలిగాం. కానీ, ఇక్కడ పరిస్థితులు అలా కనిపించడం లేదు.
ఈ వేసవి కాలంలో మేం ఇస్తాంబుల్, ఈజిప్ట్, జోర్డాన్ ప్రాంతాలకు వెళ్లాం. మనం మళ్లీ గాజాకి తిరిగి వెళ్తున్నాం అని చెప్పినప్పుడు నా పిల్లలు ఏడ్చారు.
కానీ, ఇప్పుడు గాజాకి వెళ్దామంటూ పదే పదే అడుగుతున్నారు.
ఇక్కడ అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటున్నాం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
గాజాలో జీవితం...
గాజా నగరంలో బీచ్‌కి 400 మీటర్ల దూరంలో ఉన్న ఒక పెద్ద అపార్ట్‌మెంట్‌లో మేం ఉండేవాళ్లం.
నేను, నా భార్య బీచ్ ఒడ్డునున్న ఇసుకలో ఉదయం పూట వాకింగ్‌కి వెళ్లేవాళ్లం.
నా కొడుకు యూనివర్సిటీలో చదువుతున్నాడు. నా కూతుళ్లు మంచి స్కూల్‌లో చదువుతున్నారు.
సరదాగా స్విమ్మింగ్ క్లబ్‌కి, హార్స్ రైడ్స్‌కి వెళ్లేవాళ్లు. యూట్యూబ్ చూసుకునేందుకు వారిద్దరికీ టాబ్లెట్స్ కూడా ఉండేవి.
ఆడుతూ పాడుతూ చదువుకునే వారు. నా వర్క్ తర్వాత నేను వారి కోసం క్యాండీలను(స్వీట్స్‌ను) తీసుకొచ్చే వాడిని. సాయంత్రం పూట వారితో ఆడుకునే వాణ్ని. కొన్నిసార్లు నా బెడ్‌పైనే వారు పడుకునే వారు.
కానీ, ప్రస్తుతం నా పిల్లలు పెరిగిన ప్రదేశాలన్ని కూడా బాంబు దాడులతో తీవ్ర భయానక పరిస్థితులను చవిచూస్తున్నాయి. రాత్రుల్లో నేను స్నేహితుల ఇళ్లకు వెళ్లే వాడిని. వారితో కార్డ్స్ ఆడటం, కాఫీ తాగడం చేసే వాణ్ని.
వారంలో ఒకసారి ఫ్యామిలితో కలిసి మంచి రెస్టారెంట్‌కి వెళ్లే వాళ్లం. పిజ్జా షాపుకి కానీ, దగ్గర్లోని రెస్టారెంట్‌లో కానీ వెళ్లి కుండలో వండిన మాంసాన్ని తినేవాళ్లం.
అక్కడికి వెళ్లడం మాకందరికీ చాలా ఇష్టం. కానీ, ఇప్పుడు ఆ పిజ్జా షాపు పూర్తిగా శిథిలాల కింద కూరుకుపోయింది.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా, మేం ఒకరినొకరం కలుసుకుని సంతోషంగా ఉండేవాళ్లం.
గాజా ఎప్పుడూ యుద్ధ జోన్‌లో ఉండేది కాదు. ఎప్పుడైనా సంతోషంగా గడిపేందుకు అవకాశం దొరికితే, మేం దాన్ని ఉపయోగించుకునే వాళ్లం.
మేమందరం కలిసిమెలిసి ఉండేవాళ్లం. రోజులు మంచిగున్నా, మంచిగా లేకపోయినా నా భార్య, పిల్లలు, కొడుకే నా బలం.

ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో కూడా మాకు వీలైనప్పుడు సంతోషకరమైన క్షణాల కోసం చూస్తున్నాం. నేను పనిలో ఉన్నప్పుడు నా పిల్లలు నా దగ్గరికి వచ్చి చూసి వెళ్తున్నారు.
వారు నా బుల్లెట్‌ప్రూప్ డ్రెస్, హెల్మెట్ పెట్టుకుంటూ సరదాగా కలిసి నవ్విస్తూ ఉంటారు. నా మైక్రోఫోన్ తీసుకుని, కరెస్పాండెంట్స్‌లాగా మాట్లాడుతూ ఉంటారు.
కానీ, వారి జీవితం ఇప్పుడు అప్పటి మాదిరి ఉండదు. నా బిడ్డలు తాము తిరిగిన ప్రాంతాల గురించి, వారెళ్లే షాపు గురించి పదేపదే అడుగుతున్నారు. తిరిగి వెళ్దామని నన్ను కోరుతున్నారు.
మేం తిరిగి వెళ్లలేమన్న సంగతి వారికి అర్థం కావడం లేదు. ఇంకా ఉత్తర గాజాలో ఉన్న డాక్టర్లు, ఇతరులు ప్రతి రోజూ మరో భవంతి ధ్వంసమైందని, రోడ్డు పాడైపోయిందని, పెట్రోల్ బంక్ పేలిపోయిందని నాకు అప్‌డేట్లను ఇస్తూనే ఉన్నారు.
గాజా నగరాన్ని వదిలి వేలాది మంది ప్రజలతో పాటు మేం కూడా సౌత్‌కి తిరిగి వచ్చాం.
మా ఫ్లాట్‌ను వదిలి బయటికి వచ్చేటప్పుడు, నా కుటుంబంతో పాటు నేను గడిపిన ఎన్నో జ్ఞాపకాలు నా కళ్ల ముందు మెదిలాయి.
నా భార్య వైపు చూసి, ‘‘మన ఈ ప్రేమ మందిరాన్ని చూసుకున్నావా. మళ్లీ మనం ఇక్కడికి రాకపోవచ్చు’’ అని చెప్పాను.
ఇవాళ నేను టెంట్ కింద పడుకుంటున్నాను. నా బెడ్‌ను, సముద్రాన్ని చూసుకుంటూ తాగే కాఫీని గుర్తుకుతెచ్చుకుంటే, అవి ఇప్పుడు నా కలలుగా మిగిలిపోయాయి.
ఇవి కూడా చదవండి:
- టెన్నిస్ ఆటగాళ్ల చేతి ఎముక మిగతా వారికంటే ఎందుకు పొడవు ఉంటుంది?
- క్రికెట్ వరల్డ్ కప్ - ఇండియా Vs న్యూజిలాండ్: 2019లో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
- లీచ్ థెరపీ అంటే ఏంటి... స్టాలిన్ కూడా చేయించుకున్న ఈ జలగల చికిత్స నిజంగానే రోగాలను నయం చేస్తుందా?
- వేడి వేడి చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
- తెలంగాణ ఎన్నికలు: ట్రక్, రోడ్ రోలర్, ఆటో రిక్షా గుర్తులు 2018లో చూపిన ప్రభావం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















