ఇజ్రాయెల్: శిథిలాల కింద కాళ్లకు లోహపు వైర్లతో నగ్నంగా మహిళ శవం.. మరో చోట 20 మంది పిల్లలను బంధించి దహనం చేశారు

- రచయిత, లూసీ విలియమ్‌సన్, నిర్‌ఓజ్, ఇజ్రాయెల్
- హోదా, బీబీసీ న్యూస్
గాజా పొరుగు ప్రాంతాలలో శవాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి.
హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.
ఇజ్రాయెల్‌లోని బీరీ కిబూట్జ్ ప్రాంతంలో శిథిలాల నుంచి రికవరీ బృందాలు ఓ మహిళ శవాన్ని వెలికితీశాయి. ఆమె నగ్నంగా ఉంది. ఆమె కాళ్ళు లోహపు తీగలతో బంధించి ఉన్నాయి.
సమీప ప్రాంతంలో 20 మంది చిన్నారుల మృతదేహాలు కనుగొన్నట్టు, వారందరినీ హమాస్ మిలిటెంట్లు బంధించి దహనం చేసినట్టుగా ఉందని ఓ బృందం తెలిపింది.
వీటన్నింటినీ చూసి ఇటువంటి పనిలో అనుభవజ్ణులైన కార్మికులు కూడా కలత చెందుతున్నారు. జీవనోపాధిని దెబ్బతీయడానికి ఇలాంటి మరణాలు చాలు.
మేం నీర్‌ఓజ్‌లో ని కిబూట్జ్‌లోకి ప్రవేశించే సయమానికి అంబులెన్స్‌లు, బ్లాక్ వ్యాన్‌ల వరుస నెమ్మదిగా కంచెను దాటడం కనిపిస్తోంది. ఈ ప్రాంతమిప్పుడు స్తబ్దుగా కనిపిస్తోంది. దాడులు సృష్టించిన గందరగోళంతో ఇక్కడి ప్రజలు నిశ్చేష్టులైపోయారు.
పైకప్పులు కూలిపోయిన ఇళ్ళు, ఇళ్ళలో కాలిపోయిన మానవ శరీరాల మధ్య పిల్లులు తిరుగుతున్నాయి.
ఇక్కడ ఆవరించిన నిశ్శబ్దాన్ని పెద్ద పెద్ద పేలుళ్ళు భగ్నం చేస్తున్నాయి. ఇక్కడికి గాజా మూడు మైళ్ళ దూరంలో ఉంది.
నిర్‌ఓజ్‌లో హమాస్ మిలిటెంట్లు ఇటీవల దాడులు చేశారు. ప్రతి నలుగురిలో ఒకరి జాడ తెలియకపోవడమో, చనిపోవడమో జరిగిందని బతికి బయపడినవారు చెపుతున్నారు.

బ్రిటిష్ జాతీయుడు డానీ డార్లింగ్టన్ మాంచెస్టర్‌లో పుట్టిపెరిగారు. ఇటీవలే జర్మనీకి వెళ్ళడానికి ముందు ఆయన ఇజ్రాయెల్‌లో కిబుట్జ్ ప్రాంతంలోని తన కుటుంబాన్ని సందర్శించడానికి వచ్చారు.
దాడులు జరిగిన మరుసటి రోజు ఉదయం డానీ మృతదేహాన్ని పొరుగున ఉండే వ్యక్తి ఒకరు గుర్తించారు.
డానీ మృతిపై అధికారిక ప్రకటన కోసం ఆయన కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
నిజానికి డానీ ఆ రోజు రాత్రి కిబుట్జ్‌లో ఉండకూడదు. డానీ వస్తారని ఆయన సోదరుడు లైర్ పెరీ టెల్ అవీవ్‌లో ఎదురుచూస్తున్నారు. కానీ మరో రాత్రి కిబుట్జ్‌లోనే గడపాలని డానీ నిర్ణయించుకున్నారు.
దాడులు మొదలవ్వగానే ‘‘కిబుట్జ్‌లో గందరగోళం’’గా ఉందంటూ లైర్‌కు అక్టోబరు 7 శనివారం ఉదయం ఓ టెక్స్ట్ సందేశం వచ్చింది. ఇదే నాకు డానీ నుంచి వచ్చిన చివరి సందేశమని ఆయన చెప్పారు. మాంచెస్టర్‌లో ఉన్న డానీ కుటుంబానికి సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నానని లైర్ తెలిపారు.
దాడులు జరిగినప్పటి నుంచి లైర్ తండ్రి హైమ్ పెరీ జాడ కూడా తెలియడం లేదు.
హైమ్ పెరీ గాయపడిన చిన్నారులను గాజా నుంచి ఇజ్రాయెల్‌లోని ఆస్ప్తత్రులకు తరలిస్తుండేవారు. ఆయనెంతో ఇష్టపడే కొన్ని కళాకృతులు ఇల్లు, తోటలో చెల్లాచెదురుగాపడ్డ శిథిలాల మధ్య ఇప్పటికీ కనిపిస్తున్నాయి.
ఒక హమాస్ మిలిటెంట్ ఇంట్లోకి చొరబడినప్పుడు హైమ్, ఆయన భార్య ఓస్నాట్ సురక్షిత గదిలో దాక్కుని ఉన్నారు. ఆ గది తలుపు చాలా గట్టిగా ఉంది. దీంతో ఆ సాయుధుడు తిరిగి వెళ్ళి మరింతమందితో వచ్చాడు.
హైమ్ తన భార్యను సోఫా వెనుక దాక్కోమని చెప్పి, గది తలుపు తీసి వారికి లొంగిపోయాడు.
రెండోసారి దాడి చేయడానికి మరో బృందం వచ్చినప్పుడు హైమ్ భార్య సోఫా వెనకే దాక్కుని ఉన్నారు. దాడి చేయడానికి వచ్చినవారు ఇంటిని దోచుకున్నారు. ఆ సమయంలో సురక్షిత గది తలుపు తెరిచే ఉంది. లోపలంతా చీకటిగా ఉండటంతో దాడి చేయడానికి వచ్చినవారెవరూ అటు వైపు చూడలేదు.
ఇప్పుడు అధికారిక బందీల జాబితాలో హైమ్ పేరు కూడా ఉంది.

తమ కుటుంబసభ్యులు ఏమయ్యారనే సమాచారం వెంటనే తెలియకపోవడంపై ఇక్కడివారు నిరాశగా కనిపిస్తున్నారు.
మృతదేహాలను గుర్తించేందుకు సైనిక స్థావరాల వద్ద ప్రత్యేక గుడారాలు వేశారు. జనరేటర్లు, యుద్ధవిమానాల శబ్దాల మధ్యే డాక్టర్లు పనిచేసుకుపోతున్నారు.
ఇలాంటి ఓ కేంద్రం వద్ద మేము డజనకు పైగా ఉన్న షిప్పింగ్ కంటైనర్లను చూశాం. వాటిల్లో వివిధ సైజులకు సంబంధించిన శవాల సంచులు కనిపించాయి.
ఇక్కడి నుంచి సుమారు వెయ్యి మంది అవశేషాలు తరలిస్తున్నాం, కొంత మంది కెప్టెన్ మాయాన్ సంరక్షణలో ఉన్నారు. మాయాన్ పూర్తిపేరు చెప్పేందుకు ఆర్మీ నిబంధనలు అనుమతించవు.
ఒక్కసారి మాత్రమే కాల్చిన ఒక్క శరీరాన్ని కూడా నేను చూడలేదని ఆమె చెప్పారు.
‘‘ ప్రతి శరీరంపై తూటాల వర్షం, కోతలు, తలకు ఇతర అవయవాలకు అనేక దెబ్బలు కనిపిస్తున్నాయి. మనం యుద్ధంలో ఉన్నట్టు అనిపించడం లేదు. ఊచకోతలో ఉన్నట్టుగా ఉంది. మనమిప్పుడు చూస్తున్నది మారణహోమం’’ అని ఆమె అన్నారు.
నిర్‌ఓజ్‌ను చేరుకోవడానికి సైన్యానికి 9 గంటల సమయం పట్టింది. సరిహద్దు వద్దకు వందల మంది సైనికులు చేరుకున్నారు. గాజాలోకి వెళ్ళి హమాస్ కూకటివేళ్లతో పెకలించి వేయడంపై ఇజ్రాయెల్ దృష్టి సారించింది.
ఇజ్రాయెల్‌లో ప్రస్తుత వాతావరణం గురించి లైర్ పెరీ మాట్లాడుతూ- ‘‘ప్రతీకారమనేది బలమైన భావోద్వేగం. ప్రస్తుతం ఇలాంటి భావోద్వేగమే చాలా మంది ప్రజల్లో ఉంది’’ అని చెప్పారు.
‘‘కానీ వారు మన్నలి అర్థం చేసుకుంటే ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందని గుర్తిస్తారు.యుద్ధంలో గెలవడాని కంటే ముందు ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడటానికి ఎంతో కొంత చేద్దామని వారు చెప్పొచ్చు’’ అని అన్నారు.
దాడుల తరువాత బందీల, ఆచూకీ తెలియనివారి కుటుంబాల వారు ఇప్పటికీ స్తబ్దుగానే ఉన్నారు. వారు ఇప్పుడు తాము ఆలోచించాల్సింది సొంతవారి కోసమా, దేశం కోసమా అనే సంకటంలో పడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ‘గాజాలో నేను నాలుగు యుద్ధాలను చూశా.. కానీ ఆకలితో చనిపోవడం ఇప్పుడే చూస్తున్నా’
- ‘మేం ఇజ్రాయెల్, హమాస్ ఇద్దరి చేతిలో బందీలం’- ఉత్తర గాజాలో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
- హమాస్, ఫతాల మధ్య ఘర్షణకు మూలం ఏంటి... పాలస్తీనా కలను ఈ కలహమే చిదిమేస్తోందా?
- గాజా: తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత... అక్కడి ప్రతి కథా విషాదమే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














