‘గాజాలో నేను నాలుగు యుద్ధాలను చూశా.. కానీ ఆకలితో చనిపోవడం ఇప్పుడే చూస్తున్నా’

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, రష్దీ అబు అలౌఫ్, ఖాన్ యూనిస్, గాజా
- హోదా, బీబీసీ న్యూస్
గాజాకు దక్షిణాన ఉన్న ఖాన్ యూనిస్ నగరంలో జనం తాకిడి ఎక్కువగా ఉంది.
గాజా నగరానికి ఉత్తర దిక్కునున్న లక్షల మంది ప్రజలు తాము పట్టుకుని రాగలిగే వస్తువులతో పెద్ద ఎత్తున ఖాన్ యూనిస్‌కు చేరుకున్నారు.
కొందరు ఇంధనముంటే కార్లలో, కొందరు గుర్రాలపై, వచ్చేందుకు ఎలాంటి సౌకర్యం లేని వారు కాలి నడకన ఖాన్ యూనిస్‌కు వచ్చారు.
రాత్రికి రాత్రే రెండింతలు పెరిగిన జనాభాను తట్టుకునే సామర్థ్యం ఈ నగరానికి లేదు.
ఖాన్ యూనిస్‌లో ప్రతి గది, ప్రతి సందు, ప్రతి వీధి జనంతో నిండిపోయింది. వీరు వెళ్లేందుకు మరెక్కడా స్థలం లేదు.
గాజాకు ఉత్తరాన నివసిస్తున్న ప్రజలందరూ దక్షిణ గాజాకు వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించిన తర్వాత ఈ వలసలు సాగుతున్నాయి.
గత 48 గంటల్లో సలాహ్ అల్ దిన్ రోడ్డు మార్గంలో ఉత్తర గాజాలో ఉన్న మొత్తం 11 లక్షల మంది జనాభాలో 4 లక్షల మంది ప్రజలు దక్షిణం వైపు వెళ్లినట్లు హమాస్ తెలిపింది.
వారిలో నేను(రష్దీ అబు అలౌఫ్) కూడా ఒకర్ని. నా భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి రెండు రోజులకు సరిపడా ఆహారంతో నేను ఇక్కడికి వచ్చాను.

ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడిలో 1,300 మంది చనిపోయిన తర్వాత, ఇజ్రాయెల్ బాంబు దాడులకు, దండయాత్రకు భయపడి చాలా మంది ఇక్కడే ఉండాలనే హమాస్ ఆదేశాలను పట్టించుకోవడం లేదు.
కానీ, ఈ ఇరుకైన స్థలంలో, అన్ని వైపుల దారులు మూసుకుపోవడం, మిగిలిన ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో.. ఎక్కడ ఉండాలనే దానికి వారివద్ద పరిమిత ఆప్షన్లే ఉన్నాయి. భద్రతకు ఏ మాత్రం భరోసా లేదు.
బాంబు దాడులకు ప్రభావితమై ఇప్పటికే తమ ఇళ్లను విడిచిపెట్టిన చాలా మంది గాజా ప్రజలు సర్వస్వం కోల్పోయారు. తర్వాత ఏం జరుగుతుందో తెలియక చాలా భయపడుతున్నారు.
సాధారణంగా 4 లక్షల మంది జనాభా ఉండగలిగే ఖాన్ యూనిస్ నగరంలో, రాత్రికి రాత్రే 10 లక్షల మందికి పైగా పెరిగారు.
ఉత్తర ప్రాంతంతోపాటు తూర్పు వైపు నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రతి ఒక్కరు ఆహారం, ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలా ఎంత కాలమో వారికి తెలియడం లేదు.
నిత్యావసర వనరులు చాలా వేగంగా నిండుకుంటున్నాయి. ఇప్పటికీ ఈ నగరం శరణార్థులతో నిండిపోయింది.
ఇక్కడున్న ప్రధాన ఆస్పత్రిలో అవసరమైన వస్తువులన్ని తగ్గిపోయాయి. ఉత్తరాన గాయపడ్డ వారిని, అనారోగ్యం బారిన పడిన వారిని ఇక్కడకు తీసుకొస్తున్నారు.
శరణార్థులు కారిడార్లలో క్యూలైన్లు కట్టారు. ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో గాయపడ్డ వారిని ఇక్కడకు తీసుకొస్తుండటంతో డాక్టర్లు కూడా రేయింబవళ్లు పనిచేయాల్సి వస్తోంది.
ఇక్కడికి వచ్చే వారిని మీరు తప్పుపట్టలేరు.
కానీ, యుద్ధ సమయాల్లో సురక్షితమైన ప్రాంతాల్లో ఆస్పత్రులు ఒకటి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం వీటిని సంరక్షిస్తూ ఉంటారు.
కొన్ని చర్యలను తీసుకోవడం ద్వారా ప్రస్తుతానికైతే ఆస్పత్రుల్లో ఆశ్రయం పొందుతున్న వారిని అదృష్టవంతులుగా చెప్పొచ్చు.
కొత్తగా గాయపడి వచ్చిన వారికి చికిత్స చేసేందుకు తమ వద్ద ఏమీ లేవని డాక్టర్లు చెబుతున్నారు.
రోగులకు రోజుకి 300 ఎంఎల్ మంచినీరు మాత్రమే ఉంది. శరణార్థులకు ఏమీ అందడం లేదు.
ఖాన్ యూనిస్‌లో చాలా మంది ప్రారంభం నుంచి కూడా దుర్భలమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు.
శరణార్థుల రాక పెరుగుతుండటంతో ప్రస్తుతం వారి పరిస్థితులు మరింత దారుణంగా మారాయి.
ఇప్పటికే అత్యధిక కుటుంబీకులతో ఉండే వారి చిన్న చిన్న అపార్ట్‌మెంట్లలో ప్రస్తుతం 50 నుంచి 60 మంది ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ కాలం పాటు జీవించలేరు.
నా కుటుంబం రెండు చిన్న బెడ్‌రూమ్‌లున్న ఒక ఫ్లాట్‌లో నలుగురితోపాటు నివసిస్తోంది.
మా వ్యక్తిగత జీవితానికి కేవలం మీటర్ల దూరమే ఉంది. మేం అదృష్టవంతుల్లో ఒకరమని మాత్రం నేను చెప్పగలను.
యుద్ధంలో సురక్షితమైన ప్రాంతాలుగా చెప్పుకునే పాఠశాలలు.. ఎన్నో కుటుంబాలతో నిండిపోయాయి. ఎంతో మంది శరణార్థులు అక్కడ ఉన్నారు. లెక్కపెట్టేందుకు వీలు కానంత మంది అక్కడ ఉంటున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
యూఎన్ రిలీఫ్ ఏజెన్సీ యూఎన్ఆర్‌డబ్ల్యూఏ నడిపే ఒక పాఠశాలలో ప్రతి క్లాస్‌రూం శరణార్థులతో నిండిపోయింది.
ఆకలితో అలమటిస్తూ.. నిస్సహాయంగా ఎదురుచూస్తున్న తమ పిల్లలకు ఆహారం అందించేందుకు తమ తల్లులు, అమ్మమ్మలు, నాన్మమ్మలు పార్కుల్లోని బెంచ్‌లపైనే ఏదో ఒకటి వండేందుకు చూస్తున్నారు.
కానీ, వారికి ఎలాంటి వసతి లభించకపోతే వీధుల్లోనే ఉండాల్సి వస్తుంది. దుమ్ము, ధూళి, శిథిలాల్లోనే వారు నిద్రపోవాల్సి ఉంటుంది.
అండర్‌పాస్‌లు, బిల్డింగ్‌లకు పక్కనున్న దారులన్నీ శరణార్థులతో నిండిపోనున్నాయి.
ఏదైనా మంచి జరుగుతుందేమోనని వేచిచూసే వారికి, అది జరిగే అవకాశం కనిపించడం లేదు.
ఆహారం తక్కువుంది. ఇంధనం సరిపడినంత లేదు.
దుకాణాల్లో నీళ్లు కూడా దొరకడం లేదు. వాటర్ స్టేషన్లు మాత్రమే ప్రస్తుతం వారికి ఆశను కలిగిస్తున్నాయి. ఇదొక దారుణమైన విపత్కర పరిస్థితి.
అయితే, ఈ నగరం కూడా బాంబు దాడుల ముప్పు నుంచి సురక్షితమైనది కాదు. దీనిపై కూడా బాంబు దాడులు జరుగుతున్నాయి. ఇది కూడా వార్ జోన్‌లోనే ఉంది. పడిపోయిన భవంతులు, శిథిలాల మధ్య వీధులు చిక్కుకుపోయాయి.
ఆస్పత్రికి దగ్గర్లో రాకెట్ లాంచ్‌ల శబ్దాలు నేను విన్నాను. ఇజ్రాయెల్ లోపల హమాస్ ఇంకా దాడులు జరుపుతోంది. ఇది కయ్యానికి కాలు దువ్వుతున్నట్లు ఉంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
గాజాలో నాలుగు యుద్ధాలను చూశాను, కానీ..
ఇజ్రాయెల్ డ్రోన్లు తమ తదుపరి లక్ష్యం కోసం ఎదురు చూస్తున్నాయి.
బాంబు దాడులు పెరిగి, బిల్డింగ్స్ కూలిపోతే.. ఆస్పత్రులన్ని కూడా మరింత మంది క్షతగాత్రులతో నిండిపోతాయి.
ఈ ఉదయం నా కుటుంబం ఉండే ఫ్లాట్‌కు దగ్గర్లో బాంబు దాడి జరిగింది. ఈ కారణంతో అన్ని టెలిఫోన్ సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నా కొడుకుని కాంటాక్ట్ కావడానికి నాకు 20 నిమిషాల సమయం పట్టింది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు జీవించలేరు. ఇజ్రాయెల్ సైన్యం పూర్తిస్థాయి దండయాత్ర ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.
గాజాలో నాలుగు యుద్ధాలను నేను చూశాను. ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు.
ముందు యుద్ధాల వల్ల కూడా చాలా దారుణమైన పరిస్థితులను చూసినప్పటికీ, ఇలా ఆకలితో, దాహంతో చనిపోవడం నేనెప్పుడూ చూడలేదు. కానీ, ఇదే ప్రస్తుత వాస్తవ పరిస్థితులు.
మాకున్న ఏకైక మార్గం గాజాను విడిచిపెట్టి, రఫా క్రాసింగ్ ద్వారా ఈజిప్ట్‌లోకి వెళ్లడం. కానీ, అది మూసివేసి ఉంది.
ఈ మానవీయ సంక్షోభంలో దీన్ని తెరుస్తారని భావిస్తున్నారు.
10 లక్షల మంది గాజా శరణార్థులు రఫాకు 20 కి.మీ.ల దూరంలో వేచిచూస్తున్నారు. రఫా క్రాసింగ్ తెరవగానే వారు ఈజిప్ట్‌లోకి వెళ్లాలని చూస్తున్నారు.
యుద్ధం నుంచి తప్పించుకునేందుకు 2014లో కూడా వేల మంది పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ సారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇదే ఈజిప్ట్‌ను భయపెడుతోంది.
సరిహద్దులో జనం తాకిడి ఎక్కువగా ఉంది. ఇది మరో విపత్కర పరిస్థితిని చూడనుంది.
ఇవి కూడా చదవండి:
- గాజా: తెలిసింది గోరంత, తెలియాల్సింది కొండంత... అక్కడి ప్రతి కథా విషాదమే
- LGBTQ వివాహాలను చట్టబద్ధం చేయాలని కోరుతున్న ఒక లెస్పియన్ యాక్టివిస్ట్ కథ
- మెదడు పని తీరును మార్చడం సాధ్యమేనా, బ్రెయిన్ ఆల్టరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
- రుషికొండ మీద రూ. 270 కోట్లతో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంప్ కార్యాలయం కోసమేనా... వీటిపై ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోంది?
- టవర్ ఆఫ్ సైలెన్స్: పార్సీలు తమ బంధువుల మృతదేహాలను రాబందులకు ఎందుకు వదిలేస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














