Mindfulness: మెదడు పని తీరును మార్చడం సాధ్యమేనా, బ్రెయిన్ ఆల్టరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?

మెలీసా హోగెన్‌బూమ్
    • రచయిత, మెలీసా హోగెన్‌బూమ్
    • హోదా, బీబీసీ న్యూస్

రోజువారీ జీవితంలో మనం చేసుకునే కొన్ని మార్పులతో మెదడు పనితీరును మార్చుకోవచ్చని ఇటీవల కాలంలో కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. అసలు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు మెలీసా హోగెన్‌బూమ్ మెదడును స్కానింగ్‌ ద్వారా పరిశోధకులు పరిశీలించారు.

‘‘అసలు ఏ ఆలోచనా లేకుండా ఉండటం చాలా కష్టం’’ అనే ఆలోచనే బ్రెయిన్ స్కానింగ్ సమయంలో మొదట వచ్చింది. ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రిసొనెన్స్ ఇమేజైన్ (ఎఫ్‌ఎంఆర్ఐ) మెషీన్ తన పని మొదలుపెట్టేటప్పుడు నన్ను ఎదురుగా ఉండే బ్లాక్ క్రాస్‌పై దృష్టి పెట్టమని చెప్పారు.

స్కానర్ నుంచి వచ్చే శబ్దం నాపై హిప్నోసిస్ చేసినట్లుగా అనిపించింది. అసలు ఆ చిత్రాల్లో నా మెదడు ఎలా ఉంటుందోనని కాసేపు ఆందోళనగా కూడా అనిపించింది.

ఒక సైన్స్ జర్నలిస్టుగా అసలు మెదడు ఎలా పనిచేస్తుందో చూడాలనే కుతూహలం నాకు కాస్త ఎక్కువే ఉండేది. అదే నన్ను లండన్ యూనివర్సిటీలోని రాయల్ హాలోవే లో ఈ అధ్యయనం దిశగా నడిపించింది. ఆరు వారాల బ్రెయిన్-ఆల్టరింగ్ కోర్సుకు మొదట్లో నా మెదడును స్కాన్ చేశారు.

కొన్ని జీవన శైలి మార్పుల ద్వారా మెదడు పనితీరును మార్చుకోవచ్చా? అనేదే ఈ అధ్యయన లక్ష్యం. మెదడును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొన్ని కీలకమైన అనుసంధానాలను మరింత పటిష్ఠం చేసుకోవాలని నేను భావించాను. దీని కోసం కొన్ని కొత్త టెక్నిక్‌లను నేర్చుకున్నాను.

మెలీసా హోగెన్‌బూమ్

న్యూరోప్లాస్టిసిటీ

మన మెదడు మార్పులకు అలవాటు పడగలదు, కొత్త విషయాలు కూడా నేర్చుకోగలదు. అందుకే దీన్ని ప్లాస్టిక్ అని కూడా అంటారు. అంటే నిరంతరం మార్పులకు లోనవుతుందని అర్థం.

మెదడు ఇలా మార్పులకు లోను కావడాన్ని ‘న్యూరోప్లాస్టిసిటీ’గా చెబుతారు. అంటే మెదడు నిర్మాణం, పనితీరు పరిస్థితుల్లో మార్పులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది.

అయితే, మొదట్లో కేవలం యువతలో మాత్రమే ఇలాంటి మార్పులు జరుగుతాయని భావించేవారు. కానీ, అందరిలోనూ ఇలాంటి మార్పులు సాధ్యమేనని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ప్రతిసారీ మనం కొత్త విషయం నేర్చుకునేటప్పుడు మన మెదడు మార్పులకు లోనవుతుంది.

ఆ న్యూరోప్లాస్టిసిటీని నియంత్రించే విధానాలపై ప్రస్తుతం న్యూరోసైంటిస్టులు, సైకాలజిస్టులు అధ్యయనాలు చేపడుతున్నారు. ఇలా నియంత్రించడం ద్వారా కొన్ని రకాల మేధోపరమైన వ్యాధులను అడ్డుకోవచ్చని, కొన్నింటి రాకను వాయిదా వేయొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం మెదడుపై న్యూరోప్లాస్టిసిటీ ప్రభావాన్ని పరిశీలించేందుకు సర్రే యూనివర్సిటీలోని క్లినికల్ సైకాలజీ ప్రొఫెసర్ థోర్స్‌టెన్ బార్న్‌హోఫెర్ నేతృత్వంలో ఒక అధ్యయనం జరుగుతోంది.

కుంగుబాటుతో బాధపడుతున్న వారిలో ఒత్తిడి, కొన్ని తీవ్రమైన భావోద్వేగాలను మైండ్‌ఫుల్‌నెస్ (ధ్యానం) ఎలా తగ్గించగలదని ఈ అధ్యయనంలో పరిశీలిస్తున్నారు.

మన మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో మైండ్‌ఫుల్‌నెస్ లాంటి సులభమైన పద్ధతులు కూడా ప్రధానమైన పాత్ర పోషించగలవని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యాను.

మైండ్‌ఫుల్‌నెస్‌తో ఏకాగ్రతను పెంచుకోవచ్చు. నొప్పి, ఒత్తిడులను తగ్గించుకోవచ్చు. కొన్ని నెలలపాటు మైండ్‌ఫుల్‌నెస్‌ శిక్షణ తీసుకోవడంతో కొన్నిరకాల డిప్రెషన్, యాంక్సైటీ లక్షణాలను తగ్గించుకోవచ్చని కూడా పరిశోధనల్లో రుజువైంది.

మొత్తానికి మైండ్‌ఫుల్‌నెస్‌తో మెదడును మార్చుకోవచ్చు. ‘‘ఎందుకంటే ఒత్తిడి హార్మోన్ కార్టిజాల్ స్థాయిలు మెదడులో పెరిగినప్పుడు ఇవి విషంలా పనిచేస్తాయి. ఈ ప్రభావాలను ధ్యానంతో తగ్గించుకోవచ్చు’’ అని బార్న్‌హోఫెర్ చెప్పారు.

మరోవైపు న్యూరోప్లాస్టిసిటీ శక్తిని ఒత్తిడిని తగ్గించగలదు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా మన మెదడును మనమే మార్చుకోవచ్చు.

మెలీసా హోగెన్‌బూమ్
ఫొటో క్యాప్షన్, మైండ్‌ఫుల్ రీసెర్చ్ కోర్సును బార్న్‌హోఫెర్ సిద్ధం చేశారు

అధ్యయనం ఎలా సాగింది?

ఇక్కడ అసలైన ప్రశ్న ఏమిటంటే.. నా మెదడు విషయంలోనూ ఇది పనిచేస్తుందా? దీని కోసం ఆరు వారాలపాటు మైండ్‌ఫుల్ రీసెర్చ్ కోర్సును నా కోసం బార్న్‌హోఫెర్ సిద్ధం చేశారు. రోజుకు 30 నిమిషాలపాటు ఒకే సెషన్‌లో లేదా రెండు 15 నిమిషాల సెషన్లలో నేను మైండ్‌ఫుల్‌నెస్‌ మెడిటేషన్ ప్రాక్టీసు చేశారు. దీన్ని కెమెరాలో రికార్డు కూడా చేశాను.

దీనికి అదనంగా వారానికి ఒక రోజు బార్న్‌హోఫెర్ మెడిటేషన్‌ శిక్షణ ఇచ్చారు. ఇది జూమ్‌ ద్వారా కొనసాగింది. ఈ కోర్సును కావాలంటే ఎవరైనా ఆన్‌లైన్‌లో ఉచితంగా చేరొచ్చు.

ప్రస్తుతంలో గడిపేందుకు వీలైనంత ఎక్కువ కృషిచేయాలని నాకు సూచించారు. సాధారణంగా నేను పట్టించుకోని సంగతులపై ఏకాగ్రత పెట్టమని చెప్పారు. అసలు నా ఆలోచనలు ఎలా వెళ్తున్నాయి? దేని చుట్టూ నా ఆలోచనలు తిరుగుతున్నాయి? లాంటివి కూడా పరిశీలించమని సూచించారు.

రోజువారి జీవితంలోనూ ఇలానే కాస్త ఎక్కువ శ్రద్ధతో ఉండాలని చెప్పారు. వంట చేస్తున్నా లేదా రన్నింగ్ చేస్తున్నా.. ఎప్పుడూ ప్రస్తుతం చేస్తున్న పనిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టమని చెప్పారు.

చూడటానికి చాలా తేలిగ్గా కనిపించే ఈ ప్రక్రియలతో మన మెదడుపై చాలా మంచి ప్రభావం కనిపిస్తుంది. ‘‘మైండ్‌ఫుల్‌నెస్ ఒత్తిడిని తగ్గించగలదు. ముఖ్యంగా మనల్ని ఆందోళనకు గురిచేసే అంశాలేంటో దీని ద్వారా తెలుసుకోవచ్చు. వాటి నుంచి మన దృష్టిని ప్రస్తుతానికి మరల్చొచ్చు’’ అని బార్న్‌హోఫెర్ చెప్పారు.

నిజానికి ఈ ప్రయోగానికి నేనేమీ మంచి ఎంపికకాదు. ఎందుకంటే దీనికి ముందు, ఆ తర్వాత కూడా నాలో ఒత్తిడి స్థాయిలు తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ నేను ఫలితాలను చూడగలిగాను.

మైండ్‌ఫుల్‌నెస్ సెషన్ పూర్తయిన వెంటనే నాకు చాలా ప్రశాంతంగా అనిపించేది. నా శ్వాస, శరీరంలోని ఇతర భాగాలపై నేను దృష్టిపెట్టగలిగాను.

కానీ, ఖాళీగా ఉండేటప్పుడు నా బుర్రలో ఆలోచనలు గతంలోకి, భవిష్యత్‌లోకి వెళ్లిపోయేవి. కొన్ని వారాల క్రితం ఫ్రెండ్స్‌తో మాట్లాడిన మాటలు, డాక్టర్ అపాయింట్‌మెంట్లు ఇలా ఏవేవో గుర్తుకువచ్చేవి.

మైండ్‌ఫుల్‌నెస్‌తో నా మెదడు ఎంత వేగంగా ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచనకు మారుతుందో పరిశీలించగలిగాను. కొన్నిసార్లు ఇలా వేగంగా ఒకటి తర్వాత ఒకటిగా వచ్చే ఆలోచనలు మనల్ని అలసిపోయేలా చేస్తాయి.

‘‘అయితే, కొన్నిసార్లు ఇలా వచ్చే ఆలోచనలే మనకు ఉపయోగపడతాయి కూడా. ఉదాహరణకు మనలో సృజనాత్మకతను పెంచుతాయి. అలానే ఇవే ఆందోళనకూ గురిచేస్తాయి’’ అని బార్న్‌హోఫెర్ చెప్పారు.

ఈ మార్పులను గమనించినప్పుడు, ఆలోచనలను నియంత్రించే శక్తి నా చేతిలోనే ఉందని అర్థమైంది. ఇక్కడ అసలు మన మెదడు ఎలా పనిచేస్తుందో గమనించడమే తొలి అడుగు.

మెలీసా హోగెన్‌బూమ్

మెదడు, శరీరంల మధ్య అనుసంధానం

ఆరువారాల మైండ్‌ఫుల్‌నెస్ కోర్సులో భాగంగా కొంతమంది న్యూరోసైంటిస్టులతోనూ కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఇంకా ఏమైనా మెరుగ్గా చేయొచ్చేమోనని వారితో మాట్లాడేదాన్ని.

ఉదాహరణకు ధ్యానంతోపాటు వ్యాయామం కూడా చేస్తే మెదడులో మరిన్ని సానుకూల మార్పులు ఉంటాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఈ లాంటి విషయాలు తెలుసుకునేందుకు నేను వారితో మాట్లాడేదాన్ని.

అయితే, నేనేమీ నా రోజువారీ వ్యాయామంలో కొత్తగా ఎలాంటి మార్పులూ చేసుకోలేదు. రోజుకు 5 కి.మీ. రన్నింగ్ చేసేదాన్ని. దాన్నే అప్పుడు కూడా కొనసాగించాను.

దీని వల్ల నా మెదడు మరింత మెరుగ్గా పనిచేస్తుందని తెలియడంతో రన్నింగ్‌పై మరింత ఎక్కువ శద్ధ పెట్టేదాన్ని. ‘‘ప్లాస్టిసిటీకి శారీరక వ్యాయామం మరింత మేలు చేస్తుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని బ్రెయిన్, కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ లెక్చరర్ ఓరీ ఆస్మీ నాతో చెప్పారు.

‘‘వ్యాయామాన్ని మీరు ధ్యానం లాంటి సెషన్లతో కలిపితే రోజువారీ చేసే పనులను మీరు మరింత మెరుగ్గా చేయగలుగుతారు’’ అని ఆస్మీ నాతో అన్నారు.

మన మెదడు, శరీరం మధ్య ఎంత దృఢమైన సంబంధం ఉందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చని ససెక్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిలియన్ ఫారెస్టెర్ కూడా చెప్పారు.

‘‘మన శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండూ కలిపే చూడాలి. అప్పుడే మన మొత్తం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది’’ అని ఆమె వివరించారు.

ఈ విషయంపై బీర్బెక్ యూనివర్సిటీ ‘బేబీ గ్రో’ పేరుతో ఒక ప్రత్యేక అధ్యయనాన్ని చేపడుతున్నారు. తొలి 18 నెలల్లో పిల్లల మెదడులో మార్పులను దీని ద్వారా పరిశీలిస్తున్నారు. పైకి కనిపించక ముందే పిల్లల్లో మేధోపరమైన సమస్యలను గుర్తించడమే దీని లక్ష్యం. ఎంత ముందుగా వీటిని గుర్తిస్తే, న్యూరోప్లాస్టిసిటీకి అంత ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

పిల్లల మెదడులో మార్పులకు మరింత ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెదడులోని చాలా నాడుల సంబంధాలు అప్పుడే ఏర్పడుతుంటాయి. కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు ఇవి మరింత బలపడుతుంటాయి.

కాబట్టి సరైన సమయంలోనే వీరిలోని సమస్యలను గుర్తిస్తే దీనికి చికిత్సలను కూడా వేగంగా అందించే వీలుంటుంది.

వీడియో క్యాప్షన్, అలర్జీల విషయంలో మీరు తెలుసుకోవాల్సిన 6 విషయాలివే...

న్యూరో రీహాబిలిటేషన్

తీవ్రమైన మెదడు గాయాల నుంచి కోలుకునే రోగుల్లోనూ కూడా ఇదే జరుగుతుంది. దీనిపై సెంట్రో న్యూరోలెసీ బొనీనో పులేజో డైరెక్టర్ ఏంజెలో క్వార్టరోన్‌తో నేను మాట్లాడాను. ప్లాస్టిసిటీలో భాగంగా రోజువారీ మెదడులో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో ఆయన అధ్యయనం చేపడుతున్నారు.

‘‘కొన్ని తీవ్రమైన గాయాలైనప్పుడు కూడా మెదడు తనను తాను బాగుచేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇలాంటి పరిస్థితిని నుంచి కోలుకునేందుకు న్యూరోరీహాబిలిటేషన్‌ మరింత సాయం చేస్తుంది’’ అని ఆయన అన్నారు.

రీహాబిలిటేషన్‌ కోసం రొబోటిక్స్, వర్చువల్ రియాలిటీతోపాటు మెదడుకు చాలా స్వల్ప మొత్తంలో విద్యుత్‌తో షాక్‌లను ఇచ్చే థెరపీని కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు.

‘‘స్వల్ప మొత్తంలో ఇచ్చే విద్యుత్ షాక్‌లతో రీహాబిలిటేషన్‌ను మరింత వేగవంతం చేయొచ్చు’’ అని ఆయన అన్నారు.

ఆయన రోగుల్లో ఒకరు కుడి చేయి, కాలులో కదలికలను కోల్పోయారు. అయితే, కొన్ని కంప్యూటర్ గేమ్‌ల సాయంతో మళ్లీ కదలికలను రప్పించగలిగారు.

ఇలాంటి నైపుణ్యాలను మనం నేర్చుకోవచ్చు.

కొత్తకొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, కొత్త పరిస్థితుల్లో గడపడంతో మెదడుకు అలవాటు పడే శక్తి కూడా పెరుగుతుంది.

దీనిలో భాగంగానే ఇటాలియన్‌లో టొమాటోలను ఆర్డర్ చేయడం, కొత్త వాయిద్య పరికరాలను నేర్చుకోవడం, మౌంట్ ఎట్నా దగ్గర ధ్యానం చేయడం లాంటివి కూడా నేను చేశాను.

వీడియో క్యాప్షన్, కళ్ళు ఎందుకు అదురుతాయి? కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలివే..

మెదడు నిర్మాణంలో మార్పులు

మొత్తానికి ఆరు వారాల తర్వాత అసలు నా మెదడులో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకునేందుకు నేను చాలా ఉత్సాహంతో ఉన్నాను. దీని కోసం సర్రే యూనివర్సిటీలోని బార్న్‌హోఫెర్ దగ్గరకు వెళ్లాను.

నా రెండు బ్రెయిన్ స్కాన్‌లను ఆయన జాగ్రత్తగా పరిశీలించారు.

దీంతో నా మెదడు నిర్మాణంలో మార్పులు వచ్చాయని తేలింది. వీటిలో కొన్ని గుర్తించగలిగే పెద్ద మార్పులు కూడా ఉన్నాయి.

భావోద్వేగాలను నియంత్రించడంలో మెదడులోని అమిగ్దల ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, కుడివైపు దీని నిర్మాణంలో మార్పులను బార్న్‌హోఫెర్ గుర్తించారు.

ఇది చాలా స్వల్ప మార్పు. అయితే, మైండ్‌ఫుల్‌నెస్‌తో దీని నిర్మాణంలో మార్పు వస్తుందని చెబుతున్న వాదనతో ఇది సరిపోలింది.

మనం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనేటప్పుడు అమిగ్దల కూడా పెరుగుతుంది. అయితే, నేను ఒత్తిడికి గురవుతున్నట్లు ఏమీ అనిపించేది కాదు. అయినప్పటికీ ఈ మార్పులు చూసి ఆశ్చర్యపోయాను.

మరోవైపు ప్రవర్తనకు సంబంధించిన మెదడులోని సింగులేట్ కార్టెక్స్‌గా పిలిచే భాగంలోనూ మార్పులు వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు.

ఆరు వారాల సమయంలో దీని పరిమాణం కాస్త పెరిగింది. అంటే దీనిపై మళ్లీ మెదడుకు నియంత్రణ వచ్చినట్లుగా పరిశోధకులు వివరించారు.

సెషన్ల సమయంలో మెదడు మరింత ప్రశాంతం ఉంటున్నట్లుగా నాకు అనిపించేది. ఆలోచనలతో సతమతం కావడం కూడా తగ్గింది.

కేవలం మైండ్‌ఫుల్‌గా ఉండటంతోనే మెదడులో పదేపదే వచ్చే ఆలోచనలను నేను నియంత్రించుకోగలిగాను.

ఇక్కడ మనం మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మెదడు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. అన్ని మార్పులకూ ఈ సెషన్లే కారణమని చెప్పలేం.

అయితే, ఇలాంటి మార్పులు దీర్ఘకాలం ఉండాలన్నా లేదా మార్పులు వేగంగా జరగాలన్నా మైండ్‌ఫుల్‌నెస్, వ్యాయామం లాంటివి చేస్తూ ఉండాలి.

ఇకపై నేను రోజూ మెడిటేషన్ చేస్తానా? తప్పకుండా చేస్తాను.

(అదనపు రిపోర్టింగ్ టామ్ హేడెన్, పీరాంజెలో పిరాక్)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)