హమాస్ దాడితో ‘పాలస్తీనా ప్రత్యేక దేశం’ కల చెదిరిపోతుందా?

ఇజ్రాయెల్, పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ద్వారా ‘పాలస్తీనా హక్కుల’ కోసం మీ వెంట నిలబడిన చాలా మందిని మీరు దూరం చేసుకున్నారని అర్థమవుతోందా? నేడు పాలస్తీనా హక్కుల పోరాటాన్ని మీరు చాలా ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని తెలుస్తోందా?’’

ఒక బ్రిటిష్ టీవీ చానల్ అడిగిన ఈ ప్రశ్నలపై హమాస్ పొలిటికల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ హెడ్ బాసెమ్ నాయిమ్ స్పందిస్తూ.. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది తమకు అండగా నిలుస్తారని గట్టిగా నమ్ముతున్నట్లు చెప్పారు.

ఆయన చెప్పిన మాటలు ఎంతవరకూ నిజం?

1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత, ఆ దేశంపై ఇంత పెద్ద స్థాయిలో దాడి జరగడం ఇదే తొలిసారి.

ఇజ్రాయెల్ భూభాగంలోకి పాలస్తీనా గ్రూపు హమాస్ చొరబడి చేసిన దాడుల్లో వెయ్యి మందికిపైగా మరణించారు. మరోవైపు ఈ దాడులకు స్పందనగా గాజాపై ఇజ్రాయెల్ చేపడుతున్న దాడుల్లోనూ 700 మందికిపైగా మరణించారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

గాజాలో దాదాపు 20 లక్షల మంది జీవిస్తున్నారు. వీరిలో చాలా మంది అంతర్జాతీయ సంస్థలు అందించే సాయంపైనే ఆధారపడుతున్నారు. రెండు వైపులా మరణించిన వారిలో పిల్లలు, వృద్ధులు, మహిళలు కూడా ఉన్నారు.

ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడిచేసి వందల మంది యువకులను కాల్చిచంపడంతోపాటు పిల్లలు, మహిళలు సహా కుటుంబాలను కిడ్నాప్ చేయడం, సాధారణ ప్రజల ఇళ్లలోకి చొరబడి హత్యలు చేయడం లాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో కోట్ల మంది చూసి షాక్‌ అవుతున్నారు.

ఇజ్రాయెల్ ప్రతిదాడుల్లో గాజాలో మరణిస్తున్న వారి ఫొటోలు, వీడియోలు కూడా దిగ్భ్రాంతికి గురిచేసేలా కనిపిస్తున్నాయి.

‘‘ఈ ఫోటోలు, వీడియోలు ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చులా వ్యాపిస్తున్నాయి. పాలస్తీనా హక్కుల కోసం పోరాడేవారికి ఇవి చాలా చేటు చేస్తాయి. ఈ దాడులకు వారు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’’ అని ఒక టీవీ చానల్‌తో నార్వే రిఫ్యూజీ కౌన్సిల్ హెడ్ జాన్ ఎగ్లాండ్ చెప్పారు.

మరోవైపు బందీలుగా తీసుకెళ్లినవారిని చంపేస్తామని హమాస్ మిలిటెంట్లు బెదిరిస్తున్నారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

కొన్ని యూరప్‌ దేశాలతోపాటు కెనడా, ఆస్ట్రేలియా, పశ్చిమాసియా దేశాలలో పాలస్తీనా ప్రజలకు మద్దతుగా కొంత మంది నిరసనలు, నినాదాలు చేపడుతున్నారు. అదే సమయంలో భారత్‌తోపాటు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి చాలా దేశాల్లోని ప్రభుత్వాలు హమాస్ దాడులను ఖండించాయి.

‘‘పిల్లలను కూడా హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లిన మాట నిజమైతే, ఇది పూర్తి అనాగరికం. ఇలా అయితే, ఇజ్రాయెల్ ‘ఆక్రమణ’లను తొలగించడం, శాంతి నెలకొనడం చాలా కష్టం’’ అని సీనియర్ జర్నలిస్టు మెహ్దీ హసన్ ట్వీట్ చేశారు.

మరోవైపు చాటమ్ హౌస్ థింక్ ట్యాంక్‌ ప్రొఫెసర్ యోసీ మెకెల్‌బర్గ్ స్పందిస్తూ.. ‘‘ఇలాంటి దాడులతో పాలస్తీనా ప్రజలకు మేలు జరగదు. పైగా ఇజ్రాయెల్ ‘బ్లాకేడ్ పాలసీ’కి మరింత మద్దతు వస్తుంది. పొరుగున్న దేశాలతో ఇజ్రాయెల్ సంబంధాలను మెరుగు పరచుకోకుండా అడ్డుకోవడమే ఈ దాడుల లక్ష్యం అయితే హమాస్ పూర్తిగా విఫలమైనట్లే. పైగా చర్చలకు పాలస్తీనా విశ్వసనీయమైన దేశం కాదనే సందేశాన్ని పొరుగునున్న దేశాల నాయకులకు ఇస్తున్నట్లు అవుతుంది’’ అని అన్నారు.

‘అబ్రహాం ఎకార్డ్స్’లో భాగంగా పశ్చిమాసియాలోని దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవడాన్ని ప్రస్తుతం పాలస్తీనా ప్రజలు చూస్తూనే ఉన్నారు.

అమెరికా నేతృత్వంలో సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న చర్చలు కూడా ప్రస్తుత దాడికి కారణాల్లో ఒకటిగా చాలా మంది నిపుణులు చెబుతున్నారు. ఆ చర్చలతో తమకు చాలా చేటు జరుగుతుందని, తమ హక్కులనూ ఎవరూ పట్టించుకోరని పాలస్తీనా ప్రజలు భావిస్తున్నారని వివరిస్తున్నారు.

పాలస్తీనా ప్రజలకు మద్దతు పలకడం అనేది తమ విదేశాంగ విధానంలో భాగమని భారత్ చెబుతోంది. కానీ, కొన్ని ఏళ్లలో భారత్-ఇజ్రాయెల్‌ సంబంధాలు చాలా వేళ్లూనుకున్నాయి.

హమాస్ తాజా దాడిని ‘ఉగ్రవాద దాడి’గా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పడాన్ని కూడా ఈ కోణంలోనే చాలా మంది చూస్తున్నారు.

దీనిపై ‘ద హిందూ’ మాజీ ఎడిటర్ మాలినీ పార్థసారథి స్పందిస్తూ.. ‘‘శ్రీలంకలో తమిళ హక్కులపై ఎల్‌టీటీఈ దారుణ చర్యలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో అలానే పాలస్తీనా హక్కులకు హమాస్ మిలిటెంట్లు చాలా చేటు చేస్తున్నారు’’ అని అన్నారు.

‘‘అమాయక ప్రజలపై చేపట్టిన తాజా దాడిని ప్రపంచం ఎప్పటికీ మరచిపోలేదు’’ అని ఆమె అన్నారు.

అయితే, పాలస్తీనా హక్కులపై హమాస్ దాడి ఎలాంటి ప్రభావం చూపబోదని లిబియా, జోర్డాన్, మాల్టాలకు భారత రాయబారిగా పనిచేసిన అనిల్ త్రిగుణాయత్ అన్నారు.

‘‘పశ్చిమాసియాతోపాటు యూరప్, కెనడాల్లో పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నిరసనలు జరుగుతున్నాయి. అంటే ఇప్పటికీ పాలస్తీనా హక్కులకు మద్దతు పలికేవారు చాలా మందే ఉన్నారు’’ అని ఆయన చెప్పారు.

తాజా హింసపై ఆయన స్పందిస్తూ.. ‘‘అక్కడ రక్తపాతం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇక మరణాల సంఖ్య విషయానికి వస్తే, రెండు వైపులా మరణాలను మనం లెక్కపెట్టాలి’’ అని ఆయన అన్నారు.

సెంటర్ ఫర్ ఇండియా-పశ్చిమాసియా డైలాగ్ డైరెక్టర్, ప్రొఫెసర్ ఏకే పాషా స్పందిస్తూ.. ‘‘హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ నుంచి వస్తున్న ఫోటోలు, వీడియోలు పాలస్తీనా హక్కులపై కొంత ప్రతికూల ప్రభావం చూపించొచ్చు. కానీ, నేడు ఇజ్రాయెల్ చేస్తున్నది చూస్తుంటే ఇజ్రాయెల్ పౌరులపై సానుభూతి తుడుచుపెట్టుకుపోయేలా కనిపిస్తోంది’’ అని అన్నారు.

ఇజ్రాయెల్, పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

పాలస్తీనాకు ఆర్థిక సాయంపై పునరాలోచన

ఇజ్రాయెల్‌పై హమాస్ దాడుల తర్వాత, పాలస్తీనాకు ఇచ్చే ఆర్థిక సాయం విషయంలో చాలా దేశాలు పునరాలోచనలో పడ్డాయనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే పాలస్తీనాకు అందించే ఆర్థిక సాయాన్ని నిలిపివేసే ఆలోచనను పరిశీలిస్తున్నామని, ఎందుకంటే ఈ సాయం దాడులకు ఉపయోగపడకూడదని భావిస్తున్నామని యూరోపియన్ కమిషన్ తెలిపింది.

హమాస్ దాడుల తర్వాత, పాలస్తీనాకు 20 మిలియన్ డాలర్లు (రూ.166.35 కోట్లు) సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఆస్ట్రియా ఇప్పటికే ప్రకటించింది.

జర్మనీలోనూ పాలస్తీనాకు ఇచ్చే ఆర్థిక సాయంపై చర్చ జరుగుతోంది. ‘‘పాలస్తీనాతో మన పూర్తి సంబంధాలనే నేడు సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని ఒక మంత్రి కూడా వ్యాఖ్యలు చేశారు.

చాలా మంది పెద్ద పెద్ద హాలీవుడ్ నటులు కూడా ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించారు.

అమెరికా కూడా ఇజ్రాయెల్‌కు ఆయుధాలను పంపిస్తోంది. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను కూడా ఇజ్రాయెల్‌కు అమెరికా పంపుతోంది.

గాజాను పాలిస్తున్న హమాస్ అక్కడి ప్రజలను పట్టించుకుంటోందా, ఇజ్రాయెల్‌పై దాడి తర్వాత తమ ప్రజలకు ఎంత చేటు జరుగుతుందనేది ఆలోచించిందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి.

వీడియో క్యాప్షన్, బీబీసీ లైవ్‌లో న్యూస్ ఇస్తున్న సమయంలో, ఓ భవనంపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది.

చరిత్ర ఇదీ

పశ్చిమాసియాలో ఆ భూభాగం కోసం ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ఎప్పటి నుంచో పోరాటం జరుగుతోంది.

ఇజ్రాయెల్, పాలస్తీనాలను రెండు ప్రత్యేక దేశాలుగా చాలా దేశాలు గుర్తించాయి. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా శాంతి యుతంగా జీవించాలని, శాంతి స్థాపన దిశగా చర్చలు జరపాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది. కానీ, ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపించడం లేదు.

దశాబ్దాల నుంచి ఇజ్రాయెల్ తమను అమానవీయంగా చూస్తోందని పాలస్తీనా ప్రజలు చెబుతున్నారు. నానాటికీ ఇజ్రాయెల్ ఆక్రమిస్తున్న భూభాగం పెరుగుతోందని అంటున్నారు.

ఇజ్రాయెల్ ఇప్పటికీ వెస్ట్‌బ్యాంక్‌లో చాలా ప్రాంతాలను తన అధీనంలోకి తీసుకుంది. కానీ, గాజా మాత్రం హమాస్ చేతుల్లోనే ఉంది.

ఈస్ట్ జెరూసలెం, వెస్ట్‌బ్యాంక్‌లలో జీవించే ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజల మధ్య ఎప్పటికప్పుడు ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.

హమాస్, ఇజ్రాయెల్ మధ్య గతంలో చాలా యుద్ధాలు జరిగాయి. గాజాకు ఆయుధాలు చేరకుండా సరిహద్దులను ఇజ్రాయెల్, ఈజిప్టు పకడ్బందీగా మూసి ఉంచుతున్నాయి. అయితే, దీని వల్ల పాలస్తీనా ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.

వీడియో క్యాప్షన్, గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులతో నిలువ నీడ కోల్పోయిన 3 లక్షల 38 వేల మంది ప్రజలు...

నానాటికీ పెరుగుతున్న ఇజ్రాయెల్ జనాభా కూడా పాలస్తీనా ప్రజలను కలవరపెడుతోంది.

‘‘పాలస్తీనా సమస్య పరిష్కారం అయితేనే ఈ ఘర్షణ తగ్గుముఖం పడుతుంది. రెండు దేశాల ప్రజలు పక్కపక్కనే శాంతియుతంగా జీవించేలా అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలి’’ అని అనిల్ త్రిగుణాయత్ అన్నారు.

పాలస్తీనా అంశం చాలా భావోద్వేగాలతో ముడిపడి ఉందని ప్రొఫెసర్ ఏకే పాషా అన్నారు.

‘‘పాలస్తీనా ప్రజలకే కాదు, అరబ్ దేశాలు, మొత్తం ప్రపంచానికి ఇదొక భావోద్వేగ అంశం. ముస్లింలతోపాటు వలసవాద పీడిత ప్రజలు కూడా పాలస్తీనాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. పాలస్తీనాకు మద్దతు ప్రకటించేవారి సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది’’ అని చెప్పారు.

వీరి వాదనతో మాలినీ పార్థసారథి విభేదించారు. ‘‘హింస ఏ సమస్యనూ పరిష్కరించలేదు. అమాయక ప్రజలపై ఇలాంటి భీకర దాడులతో పరిస్థితులు మరింత దిగజారుతాయి. ఇది 9/11 లాంటి దాడని ఇజ్రాయెల్ అంటోంది, అసలు చర్చలే ఉండవని చెబుతోంది. నేడు ప్రతిగా ఇజ్రాయెల్ చేపడుతున్న దాడులు పాలస్తీనా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతాయి’’ అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, హమాస్ మిలిటెంట్ల చేతిలో బందీలైన వారి కుటుంబాల ఆవేదన

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)