ఆంధ్రప్రదేశ్: వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఎస్సీల పరిస్థితి ఏంటి... కొత్త కాలనీలు పూర్తయితే మార్పు వస్తుందా?

జగనన్న కాలనీలు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

తెలుగు రాష్ట్రాల్లోని అత్యధిక గ్రామాల్లోని ఎస్సీ కాలనీలన్నీ ఊరికి ఓ చివరలోనే ఉంటాయి. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా ఈ రీతిలోనే ఎస్సీల కోసం కాలనీలుంటాయి. ఎస్సీలంతా దాదాపుగా అక్కడే నివసిస్తూ ఉంటారు. వివిధ ప్రభుత్వ పథకాల్లో వచ్చిన ఇళ్ల నిర్మాణం కూడా అందుకు అనుగుణంగానే జరిగింది.

ఎస్సీలతోపాటు, ఇతర కులాల వారీగా కాలనీల నిర్మాణం కూడా చాలాచోట్ల జరుగుతున్నట్లు వార్తలు ఎప్పటికప్పుడే వస్తుంటాయి.

మరి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణం పరిస్థితి ఎలా ఉంది? కొత్తగా నిర్మిస్తున్న కాలనీలు పూర్తయితే సామాజిక సంబంధాల్లో మార్పుకు మార్గం ఏర్పడుతుందా? అనే విషయాల పరిశీలనకు ఏపీలో ఇటీవల ప్రారంభించిన కాలనీల్లో పరిస్థితిని బీబీసీ పరిశీలించింది.

జగనన్న కాలనీలు

సీఎం ప్రారంభించిన చోట ఇలా...

కాకినాడ జిల్లా సామర్లకోటలో ఇళ్ల నిర్మాణం పూర్తి కావస్తున్న దశలో జగనన్న కాలనీలను ప్రారంభించారు. అక్టోబర్ 12న జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని, గృహ ప్రవేశానికి హాజరయ్యారు.

ఏపీలో 13వేల పంచాయతీలుంటే తమ హయంలో 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామంటూ సీఎం ప్రకటించారు.

సామర్లకోట కాలనీలో 2020లో ఇళ్ల పట్టాలు కేటాయించగా, ప్రస్తుతం సుమారు 60 శాతం మంది తమ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. దాదాపుగా 90 కుటుంబాలు అక్కడే నివాసం కూడా ఉంటున్నాయి.

ఇళ్ల కేటాయింపులో కులాల ప్రస్తావన లేకుండా అన్ని కులాల వారికి ఒకే చోట కేటాయించారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, కమ్మ కులస్థులు కూడా పక్క పక్కనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని నివాసాలు కూడా ఉంటున్నారు.

"మాకు గతంలో వేరుగా కాలనీలు ఉండేవి. అప్పుడు అవమానంగా భావించేవాళ్లం. కానీ ఇక్కడ అలా కాదు. మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాల ఆధారంగా నెంబర్ల ప్రకారం డ్రా తీశారు. అందులో మాకు ఏ ప్లాటు వస్తే అదే కేటాయించారు. కులాలు, మతాల ప్రస్తావన లేకుండా అందరికీ కలిపి ఇళ్లు ఇచ్చారు. దీనివల్ల మాకు సంతోషంగా ఉంది. ఎస్సీలమనే పేరుతో దూరంగా పెట్టే విధానం తొలగించడం సంతోషం" అని ప్రస్తుతం ఈ కాలనీలో నివాసం ఏర్పాటు చేసుకున్న ఇంజేటి సమర్పణ రాజు అన్నారు.

తనకు పెళ్లయిన 17 ఏళ్లకు సొంత ఇంటి కల తీరిందని, ఇన్నాళ్లుగా ఎస్సీ కాలనీల్లోనే అద్దె ఇళ్లల్లో ఉండేవారమని ఆయన బీబీసీకి తెలిపారు. ప్రభుత్వం స్థలం ఇచ్చినప్పటికీ ఇంటి నిర్మాణం కోసం తాము సొంతంగా రూ. 13 లక్షల వరకూ వెచ్చించామని సమర్పణ రాజు అన్నారు.

జగనన్న కాలనీలు
ఫొటో క్యాప్షన్, కులాల బేధాలు లేకుండా అందరూ కలిసి ఉండేలా కాలనీ ఇవ్వడంతో చాలా సంతోషంగా అనిపించిందని గుండుగోలు అరుణ బీబీసీతో అన్నారు.

గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది?

పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఇళ్ల పంపిణీలో కులాల ప్రస్తావన లేకుండా చాలాకాలంగానే అమలు చేస్తున్నారు. గతంలోనే వాంబే, రాజీవ్ గృహకల్ప వంటి పథకాల్లో సైతం అన్ని కులాల వారికీ కలిపి ఇళ్లను కేటాయించారు.

అయితే, గ్రామాల్లో ఎక్కువగా కులాల కట్టుబాట్లు, ఇతర సమస్యలు కొనసాగుతున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో కొత్త కాలనీల పరిస్థితి గురించి కూడా బీబీసీ పరిశీలించింది.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద తాడేపల్లిలో కొత్తగా కాలనీ నిర్మించారు. దాదాపుగా గ్రామానికి 500 మీటర్ల దూరంలో ఇంజనీరింగ్ కాలేజ్‌కు సమీపంలో కొత్తగా కాలనీ వెలిసింది. ఇక్కడ సుమారు 200 ఇళ్లు నిర్మించారు. వాటిలో 150 వరకూ నిర్మాణం పూర్తయ్యాయి. 100 ఇళ్లలో నివాసం కూడా ఉంటున్నారు.

"మేము మాదిగలం. మాకు సొంత ఇల్లు లేదు. 15 ఏళ్ల క్రితం ఈ ఊరుకు పనుల కోసం వలస వచ్చాం. అప్పటి నుంచి అద్దె ఇళ్లలో ఉన్నాం. నెలకు రూ. 2వేల వరకూ ఇంటి అద్దె కట్టేవాళ్లం. పెళ్లయ్యి పాతికేళ్లవుతోంది. ఇన్నాళ్లకు మాకు ఓ ఇల్లు వచ్చింది. కులాల గురించి పట్టించుకోలేదు. ఇల్లు లేదని దరఖాస్తు పెట్టుకుంటే అన్ని కులాల వారితో సమానంగా మాకు కూడా స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకున్నాం. మా ఎదురుగా కమ్మవారున్నారు. మా పక్కన తూర్పు కాపులున్నారు. అంతా కలిసే ఉంటున్నాం" అని పెద తాడేపల్లికి చెందిన గుండుగోలు అరుణ అన్నారు.

వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ పిల్లల్ని చదివిస్తున్న అరుణ కుటుంబం దాదాపుగా రూ. 11 లక్షలు ఖర్చు చేసి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నామని తెలిపారు. కులాల బేధాలు లేకుండా అందరూ కలిసి ఉండేలా కాలనీ ఇవ్వడం చాలా సంతోషం కలిగించిందని ఆమె బీబీసీతో అన్నారు.

జగనన్న కాలనీలు
ఫొటో క్యాప్షన్, ఎస్సీలమనే పేరుతో దూరంగా పెట్టే విధానం తొలగించడంతో సంతోషంగా ఉందని ఇంజేటి సమర్పణ రాజు బీబీసీతో అన్నారు

దాదాపుగా అంతే

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు, కృష్ణా జిల్లా చల్లపల్లి మండల కేంద్రం ఇలా వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న కాలనీలు కూడా ఇదే పద్ధతిని అనుసరించాయి. దాదాపుగా కులాల ప్రమేయం లేకుండానే ఇళ్ల కేటాయింపు చేశారు. గతంలో ఎస్సీలు, ఇతర కులాల మధ్య కుల పరమైన విబేధాలు వివాదాలుగా మారిన చోట్ల కూడా ఇప్పుడు అందరికీ కలిపి కాలనీలు నిర్మాణం జరుగుతున్నాయి.

ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఇళ్లు లేని పేదలు అనే అంశమే ఏకైక అర్హతగా లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల కేటాయింపు చేశామని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. ఎస్సీలు, ఇతర కులాలన్నీ కలిపి ఒకే కాలనీలో నివాసం ఉండడం వల్ల కులపరమైన వ్యత్యాసాలు కొంత వరకూ తగ్గుతాయనే ఆశాభావం వ్యక్తం చేశారామె.

"ఇలాంటి ప్రయత్నం ఆహ్వానించాలి. కుల వివక్షని అరికట్టేందుకు ఇది తోడ్పడుతుంది. అన్ని రకాల కులాలు కలిసి సహజీవనం చేయడం ద్వారా వారి మధ్య సంబంధాలు బలపడతాయి. దూరం తగ్గుతుంది. ఇది మార్పునకు ఉపయోగపడుతుంది. దీని వల్ల కుల విబేధాలు, ఇతర వివాదాలలు చాలావరకు తగ్గుతాయి" అని రిటైర్డ్ జడ్జి పి. దామోదర్ అన్నారు.

సామాజిక సంబంధాలు బలపడితే ఇతర సమస్యలకు కొంత పరిష్కారం కూడా దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జగనన్న కాలనీలు

నిర్మాణ దశలో కొత్త కాలనీలు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించే పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దానికి జగనన్న పేదలందరికీ ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రారంభించింది.

అర్హులైన లబ్ధిదారులుగా పేర్కొంటూ 31లక్షల మందికి పైగా ఇంటి పట్టాలు అందించింది. పట్టణ ప్రాంతాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించింది.

అందుకోసం 71,811 ఎకరాలు సేకరించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ భూములతో పాటుగా అత్యధికంగా ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించింది.

కేటాయించిన స్థలాల్లో 17వేల కొత్త కాలనీలు నిర్మిస్తున్నట్టు చెబుతోంది.

అయితే 31లక్షల మందికి పట్టాలు ఇచ్చినప్పటికీ తొలిదశలో 21.75లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్దేశిత లక్ష్య సమయం గడిచినప్పటికీ తొలి దశ పూర్తికాలేదు.

ఇప్పటి వరకూ 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తికాగా మరో 14.33 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. పూర్తయిన వాటిలో 5,85,829 ఇళ్ళు వ్యక్తిగత నిర్మాణాలు కాగా మరో 1,56,566 టిడ్కో ఇళ్లు ఉన్నాయి.

నిర్మాణంలో ఉన్న 13.27 లక్షల ఇళ్లతో పాటుగా 1.04 లక్షల టిడ్కో ఇళ్లలో కొన్నింటిని ఎన్నికలకు ముందే పూర్తి చేస్తామని ప్రభుత్వం అంటోంది.

వీడియో క్యాప్షన్, కులం పేరుతో బడుల్లో పిల్లలను వేర్వేరుగా కూర్చోబెడుతున్న టీచర్లు..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)