హమాస్, ఫతాల మధ్య ఘర్షణకు మూలం ఏంటి... పాలస్తీనా కలను ఈ కలహమే చిదిమేస్తోందా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, సిసిలియా బార్రియా
- హోదా, బీబీసీ న్యూస్ వరల్డ్
అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్లు చేసిన భీకరదాడితో ఇజ్రాయెల్ యుద్ధంలో చిక్కుంది. ఈ దాడులలో 1,300 మందికిపైగా మృత్యువాతపడ్డారు.
20 లక్షలమందికిపైగా ప్రజలు నివసించే హమాస్ నియంత్రణలోని గాజాస్ట్రిప్ పై ఇజ్రాయిల్ బాంబుదాడులతో విరుచుకుపడటంతో శుక్రవారం నాడు 1,900 మందికి పైగా మరణించారు.
ఇజ్రాయెల్ ప్రతిదాడులు మధ్యప్రాచ్యంలో పాలస్తీనాకు అనుకూలంగా ఆందోళనలు ఎగిసేందుకు దోహదపడ్డాయి. నిజానికి, హమాస్-ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాల తరబడి కొనసాగుతున్న విభేదాల కారణంగా తమ సొంత ప్రాంతాన్ని సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాయి.
పాలస్తీనా లోని ప్రధాన రాజకీయ గ్రూపులైన హమాస్, ఫతా మధ్యన ఉన్న తగువులు 2007 జూన్ లో పతాకస్థాయికి చేరాయి. ఈ రెండు వర్గాలు గాజాస్ట్రిప్ వీధుల్లో కలబడటంతో వందలాదిమంది చనిపోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.
‘గాజా యుద్ధం’గా పేరొందిన ఈ సాయుధపోరు ఈ రెండు వర్గాల మధ్య ఈనాటికీ పూడ్చలేని అగాధాన్ని మిగిల్చింది.
2006 పార్లమెంటరీ ఎన్నికలలో ఫతా ఓటమితో అల్లర్లు చెలరేగాయి. హమాస్ ఫైటర్లు గాజాను తమ చెప్పుచేతుల్లోకి తీసుకున్నారు. ఈ యుద్ధం ఫలితంగా ఉమ్మడి ప్రభుత్వం రద్దయి పాలస్తీనా భూభాగం విడిపోయింది. ఫలితంగా వెస్ట్ బ్యాంక్ ఫతా అధీనంలోకీ, గాజా హమాస్ చేతుల్లోకీ వచ్చింది.
‘‘ప్రత్యేకించి 2007 యుద్ధం నుంచి హమాస్, ఫతా మధ్య వైరం మరింత ముదిరి, రక్తం చిందించింది’’ అని అమెరికాలోని జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రం, అంతర్జాతీయ వ్యవహారాలను బోధించే ప్రొఫెసర్ నాథన్ బ్రౌన్ బీబీసీకి చెప్పారు.
ఆనాటి నుంచి ఈ రెండు వర్గాలు భిన్నమార్గాలలో ప్రయాణిస్తున్నాయి. నిజానికి ఇంతకుమునుపే ఈ రెండు గ్రూపుల మధ్య వైరం ఉంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
హమాస్, ఫతా ఆవిర్భావం
పాలస్తీనా ఇస్లామిక్ గ్రూపులలో హమాసే అతిపెద్దది. ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్’ కు ఇది అరబిక్ సంక్షిప్త నామం.
ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా 1987లో హమాస్ పురుడు పోసుకుంది. దీంతోపాటు ఈజిప్ట్ ముస్లిమ్ బ్రదర్ హుడ్‌కు పాలస్తీనా శాఖగానూ మొదలైంది.
అల్ కస్సమ్ బ్రిగేడ్ర్స్‌గా పిలిచే దీని మిలీషియాలు 1991లో ప్రారంభమయ్యాయి. కమాండర్ మహమ్మద్ డెఫ్ వీటికి నేతృత్వం వహిస్తున్నారు.
కొన్ని సంఘటనలలో హమాస్ లేదా అల్ కస్సమ్ బ్రిగ్రేడ్స్ ను ఇజ్రాయెల్, పశ్చిమదేశాలు టెర్రరిస్టు గ్రూపులుగా పరిగణిస్తుంటాయి.
సున్నీ ముస్లింలు ఇరాన్ వంటి దేశాల మద్దతుతో 16 ఏళ్ళ కిందట ఫతాను బహిష్కరించి, హమాస్‌గా ఏర్పడి గాజాను నియంత్రణలో తెచ్చుకున్నారు. దీంతో గాజాస్ట్రిప్ నుంచి ప్రజల రాకపోకలతో పాటు వస్తు రవాణాకు ఇజ్రాయెల్ అడ్డుకట్ట వేసింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మరోపక్క ఫతా అతిపెద్ద పాలస్తీనా లౌకిక పార్టీగానే కాకుండా పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ , పాలస్తీనా అథారిటీకీ చోదకశక్తిగా ఉంది.
1948నాటి అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిన ఓ దశాబ్దం తరువాత 1959లో మాజీ అధ్యక్షుడు యాసర్ అరాఫత్ తో కలిసి పాలస్తీనా ఆందోళనాకారులు ఫతాను స్థాపించారు.
ఇజ్రాయెల్ ప్రభుత్వ సాయుధ దాడులను ఫతా వ్యతిరేకిస్తూనే దౌత్యమార్గాలలో సమస్య పరిష్కారానికి ప్రయత్నించింది. ఫలితంగా రెండు దేశాల ఏర్పాటుతో సంఘర్షణలకు చరమగీతం పాడాలనే 1980 నాటి ఓస్లో ఒప్పందం కుదిరింది. దీనిని హమాస్ వ్యతిరేకించింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రాథమిక వ్యత్యాసాలు
ఇజ్రాయిల్ ఉనికిని ఫతా గుర్తిస్తుంది. 1967లో జరిగిన ఆరురోజుల యుద్ధంలో ఆక్రమించుకున్న భూభాగాలనుంచి ఇజ్రాయెల్ వైదొలగాలనే ఐక్యరాజ్యసమితి భద్రతామండలి చేసిన 242 తీర్మానానికి కూడా ఫతా మద్దతు తెలిపింది.
ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ సినాయ్ ప్రావిన్స్, వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరుసలెం, గాజాస్ట్రిప్ తో పాటు గోలన్‌హైట్స్‌లోని ఎక్కువభాగాలను ఆక్రమించుకుంది. ఈ ఆక్రమణ ఇజ్రాయెల్ అధీనంలోని భూభాగం కంటే మూడింతలు పెద్దది.
మరోపక్క ఇజ్రాయెల్‌ను హమాస్ గుర్తించలేదు. 1988లో ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూపులు ఇజ్రాయెల్ సహా పాలస్తీనా భూభాగాలన్నింటినీ నియంత్రణలోకి తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. జెరూసలెం రాజధానిగా పాలస్తీనా ఏర్పాటుకు 1967 నాటి సరిహద్దులను ప్రామాణికంగా తీసుకోవాలనే ప్రతిపాదనను అంగీకరిస్తూ 2017లో ఓ కొత్తపత్రంపై హమాస్ సంతకం చేసింది.
హమాస్ పోరాటం యూదులకు వ్యతిరేకంగా కాదని, కేవలం జియోనిస్ట్ ఆక్రమణదారులకే వ్యతిరేకమని ఆ పత్రంలో పేర్కొన్నారు.
పాలస్తీనా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలన్నదే హమాస్, ఫతా ఏకైక లక్ష్యమైనప్పటికీ , ఇవి అనుసరించే మార్గాలు మాత్రం భిన్నమైనవి.
పాలస్తీనా అథార్టీలో ఫతా అతిపెద్ద పార్టీ. దీనిని అల్ ఫతాగానూ పిలుస్తారు. దీని నాయకుడు మహమ్మద్ అబ్బాస్ పాలస్తీనా అధ్యక్షుడిగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు.
ఫతా తనను తాను లౌకిక రాజకీయ పార్టీగా నిర్వచించుకుంటూ అంతర్జాతీయ వేదికల ద్వారా ఇజ్రాయెల్‌తో చర్చలకు సిద్ధమంటోంది. హమాస్ మాత్రం పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ ఆక్రమణలకు వ్యతిరేకంగా సాయుధపోరాటం చేసి, ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వెస్ట్ బ్యాంక్ పాలస్తీనా అథార్టీని లంచగొండులని హమాస్ భావిస్తుండగా, ఇజ్రాయెల్ పై హమాస్ దాడులను ఫతా నాయకులు ఖండిస్తున్నారు. తమ లక్ష్యాలను చేరుకోలేక ఈ రెండు వర్గాలు పరస్పరం నిందించుకుంటున్నాయి.
‘‘ఈ రెండు గ్రూపులవి భిన్న ప్రాపంచిక దృక్పథాలు, భిన్న సిద్ధాంతాలు కలిగి ఉన్నవి ’’ అని వాషింగ్టన్ డీసీ అరబ్ సెంటర్‌లోని పాలస్తీనా,ఇజ్రాయెల్ సెంటర్ హెడ్ యూసఫ్ మున్యార్ చెప్పారు.
‘‘ రెండు సంస్థలూ పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కానీ తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవి భిన్న మార్గాలను అనుసరిస్తున్నాయి’’ అని ఆయన వివరించారు.
ఇందులో సమస్య ఏమిటంటే ‘‘ ఈ మౌలిక వ్యత్యాసాలు సరిదిద్దలేనివి’’ అని మున్యార్ చెప్పారు.
అయితే ఫతాను ఇజ్రాయెలీ సెక్యూరిటీ సబ్ కాంట్రాక్టర్ అని వ్యతిరేకులు అభివర్ణిస్తుంటారు. ఇజ్రాయెల్ తో చర్చల వలన ఎటువంటి ఫలితాలు రాకపోగా ప్రతికూల ఫలితాలు చూపుతున్నాయని భావిస్తున్నారు.
మరోపక్క హమాస్‌ను టెర్రరిస్టు గ్రూపుగా భావిస్తూ, ఇజ్రాయెల్‌తో ఎటువంటి పురోగతిని సాధించనీయకుండా అడ్డుపడుతోందనే కోణాన్నీ వారు చూస్తున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఒస్లో ఒప్పందం
హమాస్, ఫతా మధ్య వైరానికి 1993 నాటి ఓస్లో ఒప్పందం కారణమని కొందరు విశ్లేషకులు భావిస్తుంటారు. ఇజ్రాయెల్, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌ఓ) మధ్య అమెరికా ఓ తాత్కాలిక ఒప్పందం కుదిర్చింది. దీనిప్రకారం పాలస్తీనా అథార్టీనీ ఏర్పాటుచేసి (ప్రస్తుతం మహమ్మద్ అబ్బాస్ అధ్యక్షుడిగా ఉన్నారు) ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్, గాజాస్ట్రిప్‌పై పరిమిత అధికారం ఇవ్వాలన్నది ఈ ఒప్పంద సారాంశం.
చాలామంది ఈ చొరవను స్వాగతిస్తూ శాశ్వత శాంతి ఒప్పందానికి దీన్నొక మంచి ప్రారంభంగా భావించారు. ఈ ఒప్పందం ప్రవాసంలో జీవిస్తున్న యాసర్ అరాఫత్ తదితర నాయకులు తిరిగి పాలస్తీనాకు రావడానికి దోహదపడింది.
అయితే, ఈ ఒప్పందాన్ని హమాస్ తో సహా వ్యతిరేకించే వారందరూ ‘వ్యక్తిగత స్వార్థం కోసం పాలస్తీనా ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు చేసిన ఒప్పందంగా’ పరిగణించారని హమాస్, ఫతా వైరం ఈనాటికీ కొనసాగడానికి కారణమైందని మున్యార్ చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
డబ్బు, ఆయుధాలపై నియంత్రణ కోసం యుద్ధం
హమాస్, ఫతా వైరం నుంచి ఇజ్రాయెల్ ప్రయోజనం పొందడమే కాకుండా, వాటిని బలహీనపడేలానూ చేస్తోందని కొందరు పరిశీలకులు చెబుతున్నారు.
నాయకత్వం కోసం ఘర్షణపడటమే హమాస్, పతా మధ్య విభజనలో కీలకమని మరికొందరు నమ్ముతున్నారు.
‘‘అధికారం కోసమే వైరం’’ అని మిడిల్ ఈస్ట్ ఇనిస్టిట్యూట్ లో సీనియర్ రీసెర్చర్, వైస్ ప్రెసిడెంట్ పాలసీగా ఉన్న బ్రియాన్ కట్లీస్ బీబీసీకి చెప్పారు.
‘‘సైద్ధాంతిక విభేదాలు మరీ అంత గొప్పవేమీ కావు. మౌలికంగా అధికారంలో కొనసాగేందుకు రెండు గ్రూపులు పడుతున్న ఘర్షణ" అని ఆయన అన్నారు.
అంతిమంగా అధికారానికి అవసరమైన డబ్బు, ఆయుధాలను ఎవరు నియంత్రించాలనే విషయంపైనే గొడవంతా అని ఆయన విశ్లేషించారు.
ఈ రెండు వర్గాల మధ్య ఉన్న సంక్షోభం వాటి మధ్య దూరాన్ని మరింత పెంచుతోంది. ఈ శత్రుత్వం పాలస్తీనా సాధించాలనే ఆశయానికి గండి కొడుతోంది. ఎందుకంటే ఇది ‘‘నాయకత్వం కోసం పడుతున్న ఘర్షణ’’ అని చెప్పారు.
‘‘ఈ రెండువర్గాలలో ఎవరూ దీర్ఘకాలిక పరిష్కారాన్ని కనుగొనలేకపోవడం వలన వారు ప్రజాదరణ కోల్పోతున్నారు ’’ అని కతులిస్ తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పాలస్తీనియన్ల మధ్య అశాంతి
ఫతా,హమాస్ మధ్య ఉన్న శత్రుత్వం పాలస్తీనా ఆశయాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తోంది.
‘‘వీరి మధ్య విభజన పాలస్తీనియన్ల వద్ద చెడ్డపేరు మూటగట్టుకుంటోంది. అయినా ఎవరిని నిందించాలనే విషయంలోనూ వారిలో విభేదాలున్నాయి’’ నాథన్ బ్రౌన్ వివరించారు.
కొన్నిసార్లు వారు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి దగ్గరగా వచ్చినప్పుడు కూడా సమస్యకు పరిష్కారం కనుగొనడానికి బదులు ఒకరినొకరు విభేదించుకున్న విషయాలనే పేపర్ పై పెట్టారు అని వివరించారు.
పాలస్తీనియన్లకు నిజంగా ఎవరు ప్రాతినిధ్యం వహించాలి అనేది చాలా సంక్లిష్టమైన విషయమని చెప్పారు.
1948లో ఇజ్రాయెల్ ఏర్పడింది. ఇప్పటికి 75 ఏళ్ళు గడిచాయి.
తమ ఆశయాన్ని సాధించుకోవడానికి అటు దౌత్యపరంగానైనా, ఇటు సాయుధపోరాట రూపంలోనైనా ఏ పరిష్కారాన్ని సాధించలేకపోవడంపై చాలామంది పాలస్తీనియన్లు ఆక్రోశంతో ఉన్నారు.
పాలస్తీనా అథారిటీకి దాదాపు 20 ఏళ్ళ నుంచి అధ్యక్షుడిగా ఉంటున్న 87 ఏళ్ళ మహమ్మద్ అబ్బాస్ తరువాత ఆ అగ్ర స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్న అలాగే ఉండిపోతోంది.
అయితే, గాజాలో ఇజ్రాయెల్ దాడులతో రేగిన సంక్షోభం ముగిసినప్పుడు హమాస్ నాయకుల పరిస్థితి ఏం కానుంది? ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వెస్ట్ బ్యాంక్, గాజాలోని యువ పాలస్తీనియన్లు భవిష్యత్తులో స్పందించే తీరును బట్టి ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
ప్రస్తుతానికి, ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడుల వలన రాజకీయ నాయకత్వం అత్యంత అనిశ్చిత స్థితిని ఎదుర్కొంటోంది.
ఇవి కూడా చదవండి:
- LGBTQ వివాహాలను చట్టబద్ధం చేయాలని కోరుతున్న ఒక లెస్పియన్ యాక్టివిస్ట్ కథ
- రుషికొండ మీద రూ. 270 కోట్లతో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంప్ కార్యాలయం కోసమేనా... వీటిపై ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోంది?
- టవర్ ఆఫ్ సైలెన్స్: పార్సీలు తమ బంధువుల మృతదేహాలను రాబందులకు ఎందుకు వదిలేస్తారు?
- ప్రవళిక ఆత్మహత్యపై నాయకులు, విద్యార్ధి సంఘాల వాదనేంటి, పోలీసులు ఏం చెప్పారు?
- తెలంగాణ ఎన్నికలు: ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు మహిళలే అయినా ఒక్కరూ ఎమ్మెల్యే కాలేకపోయారు, ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














