హమాస్ దాడుల్లో చనిపోయినవారి ప్రతి శరీర భాగాన్ని, రక్తాన్ని ఈ వాలంటీర్లు ఎందుకు సేకరిస్తున్నారు?

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Joel Gunter

ఫొటో క్యాప్షన్, టెల్‌ అవీవ్‌లో మృతదేహాల కోసం జకా వాలంటీర్ ఇజ్రాయెల్ హసీద్ ఎదురుచూస్తున్నారు
    • రచయిత, జోయెల్ గంటెర్
    • హోదా, బీబీసీ న్యూస్

సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని ఒక సైనిక స్థావరానికి చెందిన ఎత్తయిన ఇనుప కంచెల గేట్ల వెనుక సైనికులు, పోలీసు అధికారులు, ఫొరెన్సిక్ నిపుణులు దాదాపు అసాధ్యంగా భావించే ఓ పని చేస్తున్నారు. అదే హమాస్ దాడిలో మరణించిన వారిని గుర్తించే ప్రక్రియ.

(హెచ్చరిక: ఈ వార్తల్లో కొన్ని అంశాలు మిమ్మల్ని కలిచివేయొచ్చు.)

కఠినమైన ఫ్లడ్‌లైట్ల కాంతిలో అర్ధరాత్రి వరకూ వీరితో మరో బృందం కూడా కలిసి పనిచేస్తోంది. పసుపు రంగు వెస్ట్‌లతో కనిపించే వీరు ‘జకా’ ప్రతినిధులు. ఇదొక మతపరమైన సంస్థ. హమాస్ దాడి తర్వాత ఇక్కడ అత్యంత కష్టమైన పనుల్లో ఒకదాన్ని సంస్థకు అప్పగించారు.

రక్తంతోపాటు మరణించినవారి ప్రతి శరీర భాగాన్ని సేకరించే బాధ్యత జకా చూస్తోంది. అప్పుడే యూదుల సంప్రదాయం ప్రకారం మృతులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలుపడుతుంది. ప్రకృతి విపత్తులు, ఆత్మాహుతి దాడులు, మిలిటెంట్ల ఘతుకాల సమయంలో సాయం కోసం జకా ప్రతినిధులను పిలుస్తుంటారు.

జకా ప్రతినిధుల్లో దాదాపు అందరూ అల్ట్రా-ఆర్థొడాక్స్ యూదులు ఉంటారు. వీరిని వాలంటీర్లుగా పిలుస్తుంటారు.

దక్షిణ ఇజ్రాయెల్‌లో హమాస్ విధ్వంసం సృష్టిస్తున్నప్పుడు, జకా వాలంటీర్ 28 ఏళ్ల బరోచ్ ఫ్రాంకెల్ టెల్‌అలీవ్‌లోని ‘నీబ్రాక్’లో సబ్బత్‌లో (విశ్రాంతి తీసుకునే రోజు) ఉన్నారు. అయితే, కొన్ని అత్యవసర సేవలకు వాలంటీర్లు కావాలని తన వాకీటాకీలో ఆయనకు వినిపించింది.

జీవన్మరణ సమస్యల సమయంలో సబ్బత్‌ నుంచి బయటకు రావచ్చు. అయితే, సాయంత్రం ఫోన్ చూసుకున్న తర్వాతే ఫ్రాంకెల్‌కు పరిస్థితి తీవ్రత అర్థమైంది. వెంటనే బ్యాడీ బ్యాగ్స్, సర్జికల్ గ్లవ్స్, షూ కవర్స్, రక్తాన్ని సేకరించే ర్యాగ్స్ లాంటివన్నీ ఉండే తన కిట్‌ను సిద్ధం చేసుకున్నారు. అనంతరం కారు తీసుకుని బయల్దేరారు.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Joel Gunter

ఫొటో క్యాప్షన్, హమాస్ విధ్వంసం సృష్టిస్తున్నప్పుడు, జకా వాలంటీర్ 28 ఏళ్ల బరోచ్ ఫ్రాంకెల్ టెల్‌అలీవ్‌లోని ‘నీబ్రాక్’లో సబ్బత్‌లో (విశ్రాంతి తీసుకునే రోజు) ఉన్నారు

1995లో జకాను అధికారికంగా గుర్తించారు. అయితే, 1989 నుంచి ఇది సేవలు అందించేది. ఆనాడు ఇజ్రాయెల్‌లో ఒక బస్సుపై ఆత్మాహుతి అనంతరం, బాధితుల మృతదేహాల భాగాలను సేకరించిన వారిలో జకా వ్యవస్థాపకుడు కూడా ఒకరు.

చాలాచోట్ల మృతదేహాల భాగాలను సేకరించే బాధ్యతను పోలీసులే తీసుకుంటారు. కానీ, యూదుల సంప్రదాయంలో మృతదేహాలకు సంబంధించిన దాదాపు అన్ని భాగాలనూ సేకరించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ కలిపే అంత్యక్రియలు నిర్వహించాలి. అందుకే ఈ పనిని జాగ్రత్తగా నిర్వహించే బాధ్యత జకా చూసుకుంటుంది.

మ్యూజిక్ ఫెస్టివల్ జరిగిన చోట జకా ప్రతినిధులను కూడా భయపెట్టే పరిస్థితులు కనిపించాయి. ఫ్రాంకెల్ వచ్చేసరికి చీకటి పడింది. అప్పటికి హమాస్ మిలిటెంట్లతో ఇజ్రాయెల్ సైనికులు పోరాడుతున్నారు. కాబట్టి పరిస్థితి కాస్త సద్దుమణిగేవరకూ ఆయన వేచిచూడాల్సి వచ్చింది.

దాదాపు దాడులు జరిగిన అన్నిచోట్లా జకా ప్రతినిధులు పనిచేస్తున్నారు. రెండేసి గంటల షిఫ్టుల్లో వీరు పనిచేస్తారు. ఎందుకంటే ఈ పని చాలా కష్టం. ముఖ్యంగా పిల్లల మృతదేహాల భాగాలను సేకరించడం అత్యంత దారుణంగా ఉంటుందని ఫ్రాంకెల్ చెప్పారు.

మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి సమీపంలోని కిబుట్జ్‌కు శనివారం తీసుకెళ్లేటప్పుడే జకా ప్రతినిధులను ముందే ఇజ్రాయెల్ పోలీసులు హెచ్చరించారు. తమకు ఈ పనిలో అనుభవం ఉన్నప్పటికీ, పరిస్థితులు చూడలేనంత దారుణంగా ఉన్నాయని ముందే వారిని హెచ్చరించారు.

లోపల కాలిపోయిన పిల్లల మృతదేహాలు ఫ్రాంకెల్‌కు కనిపించాయి. ఇక్కడ గ్రెనేడ్లతో దాడి జరిగింది. మరికొన్ని కుటుంబాలను తుపాకులతో కాల్చి చంపారు. ‘‘అసలు ఎంత మంది పిల్లలు ఉన్నారో, ఎంత మంది కాలిపోయారో నాకు అర్థంకాలేదు’’ అని ఫ్రాంకెల్ చెప్పారు. ‘‘నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా అదే దృశ్యాలు నా కళ్లముందు కనిపిస్తున్నాయి’’ అని ఆయన అన్నారు.

ఇలాంటి సేవలు అందిస్తున్నందుకు జకా ప్రతినిధులపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తుంటారు. అయితే, ఇలాంటివి తాము ఆశించబోమని ఫ్రాంకెల్ చెప్పారు.

‘‘జకా ఒక పవిత్రమైన సేవ. మీరు ప్రతిఫలం ఆశించకూడదు. ఎందుకంటే మరణించిన వారు మీకు ప్రతిఫలం చెల్లించేందుకు తిరిగిరారు’’ అని ఆయన అన్నారు.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Joel Gunter

బుధవారం సాయంత్రం దక్షిణ ఇజ్రాయెల్‌లో తమ చివరి మృతదేహ భాగాల సేకరణ పనిని జకా పూర్తిచేసింది. అక్కడి నుంచి గంట దూరం ఉత్తర దిశగా ప్రయాణించి ఫ్రాంకెల్ ఓ సైనిక స్థావరానికి చేరుకున్నారు. ఇక్కడ మృతదేహాలను గుర్తించే ప్రక్రియలు కొనసాగుతున్నాయి.

లోపల షిప్పింగ్ కంటైనర్ల తరహాలో దాదాపు 20 భారీ కోల్డ్ స్టోరేజీ యూనిట్లు ఉన్నాయి. వీటిలోనే మృతదేహాల భాగాలను స్టోర్ చేశారు. చనిపోయిన వారికి సంప్రదాయబద్ధంగా గౌరవంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు జకా వాలంటీర్లు వంద శాతం కష్టపడుతున్నారు. అయితే, భారీగా మృతదేహాలు రావడం, కొన్నింటి పరిస్థితి మరింత దారుణంగా ఉండటంతో వారికి మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి.

మధ్యమధ్యలో వారు కాస్త బ్రేక్ తీసుకొని ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మరికొందరు సామూహిక ప్రార్థనలు కూడా చేస్తున్నారు.

ఫ్రాంకెల్ నివసిస్తున్న నీబ్రేక్ ప్రాంతానికి డిప్యూటీ మేయర్‌గా 39 ఏళ్ల యాకుబ్ జకారియా పనిచేస్తున్నారు. యాకుబ్ వరుసగా ఐదు రోజుల నుంచి రాత్రిపూట ఇక్కడే గడుపుతున్నారు. ‘‘అసలు నిద్ర అనేదే లేకుండా గడపుతున్నాను. అలా మృతదేహాలను మోసుకుంటూ వెళ్లడం కూడా చాలా కష్టం. కానీ, తప్పదు. చేయాలి’’ అని యాకుబ్ అన్నారు.

ఐదుగురు పిల్లల తండ్రైన జకారియా తీవ్రమైన గాయాలతోపాటు పూర్తిగా కాలిపోయిన చిన్నారుల మృతదేహాలను కూడా ఇక్కడకు తీసుకురావడాన్ని చూశారు. కొంతమంది పిల్లల చేతులు, కాళ్లు ఫోన్ కేబుళ్లతోపాటు కలిసి కాలిపోయాయి.

ఒక ట్రక్కు నుంచి ఇంటి పేరు కనిపిస్తున్న ఒక బ్యాగ్‌ను యాకుబ్ తీసుకొచ్చారు. ఆ పక్క బ్యాగ్‌పైనా అదే ఇంటి పేరుంది. ఆ పక్క బ్యాగ్‌పై కూడా అదే. మొత్తంగా ఆ ట్రక్కు నుంచి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యుల బ్యాగులను ఆయన తీసుకొచ్చారు. వీరిలో రెండు బ్యాగులు తల్లిదండ్రులవి. మిగతా మూడు చిన్న పిల్లలవి. వీరిందరినీ కుబుట్జ్‌లోని కఫార్ అజ్జా ప్రాంతంలో హమాస్ మిలిటెంట్లు హత్యచేశారు.

‘‘అసలు ఒక కుటుంబం మొత్తం ఇలా హత్యచేయడాన్ని చూసి తట్టుకోలేం. నాక్కూడా ఐదుగురు పిల్లలు ఉన్నారు. మేం కూడా దేవుణ్ని నమ్ముతాం. అంతా దేవుడి దయతోనే జరుగుతుందని మేం కూడా భావిస్తాం. కానీ, ఇలాంటివి జీర్ణించుకోవడం మాత్రం చాలా కష్టం’’ అని ఆయన అన్నారు.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Joel Gunter

ఫొటో క్యాప్షన్, డిప్యూటీ మేయర్ యాకుబ్ జకారియా కూడా జకా కోసం పనిచేస్తున్నారు

ఆ మృతదేహాలను కోల్డ్ స్టోరేజీలో పెడుతున్నప్పుడు వాటి ముఖాలను యాకుబ్ చూశారు. వాటిని ప్రాసెస్ చేసేటప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నారు. కొన్ని గంటల తర్వాత, ఉదయం 5 గంటలకు ఆయన షిఫ్టు పూర్తయింది. ఆ తర్వాత తన కారులోనే ప్రశాంతంగా చాలాసేపు ఆయన కూర్చుండిపోయారు. ఆ తర్వాత ఒక కాఫీ, సిగరెట్ తాగి అక్కడి నుంచి నెమ్మదిగా బయలుదేరారు.

అక్కడి నుంచి ఆయన అరగంట ప్రయాణించి నీబ్రాక్‌లో తన ఇంటికి వచ్చారు. కేవలం రెండు గంటలు నిద్రపోయారు. మళ్లీ డిప్యూటీ మేయర్‌గా విధులు నిర్వర్తించేందుకు ఆయన సిటీ హాల్‌కు బయలుదేరి వెళ్లారు.

సైనిక స్థావరం గేట్ల బయట రోడ్లపై మృతుల కుటుంబ సభ్యులు కూర్చొని ఎదురుచూస్తున్నారు. వీరి కోసం ఫుడ్ ట్రక్కుల ప్రతినిధులు, స్థానికులు సాయం చేస్తున్నారు. తన సోదరుడు, మాజీ ఫుట్‌బాలర్ లియోర్ అస్లిన్ ఈ దాడిలో చనిపోయారని శనివారం తెలుసుకున్నప్పటి నుంచి ఈ రోడ్డు పక్కనే ఆర్తల్ అస్లిన్ ఎదురుచూస్తున్నారు. ఆమె నిద్రపోవడం కూడా ఇక్కడే.

‘‘మాకు ఎవరూ సమాధానాలు ఇవ్వడం లేదు. ఎందుకంటే లోపలంతా భయానకంగా ఉందని మాకు తెలుసు. ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఏదైనా మృతదేహం కనిపించిందా? అని అడుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ అందరికీ నా సోదరుడు తెలుసు. అతడు ఒక ప్రముఖ ఫుట్‌బాలర్. ఇప్పుడు లోపల అతడిని గుర్తుపట్టే వారి కోసం నేను ఎదురుచూస్తున్నాను’’ అని ఆమె చెప్పారు.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Joel Gunter

అస్లిన్ అడుగుతున్నప్పుడు ఫ్రాంకెల్ విన్నారు. అతడికి ఆమె సోదరుడు గురించి తెలుసు. వెంటనే ‘‘నేను చూశాను. నేను అతడి మొహం చూశాను. నాకు తెలుసు అది అతడే’’ అని ఫ్రాంకెల్ చెప్పారు.

అక్కడికక్కడే అస్లిన్ కుప్పకూలిపోయారు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు మొత్తం ఫ్రాంకెల్ దగ్గరకు వచ్చారు. మరోసారి అది అస్లిన్ సోదరుడేనని ధ్రువీకరించేందుకు ఫ్రాంకెల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే, ఇప్పుడు ఆ కుటుంబాన్ని లోపలకు పంపించేందుకు పోలీసులు కూడా సిద్ధంగా లేరు.

‘‘ఇప్పుడు ఆ మృతదేహం ఎక్కడుందో గుర్తించడం సాధ్యంకాదు. దయచేసి కాసేపు వేచి చూడండి. మేం అందరి మృతదేహాలనూ అప్పగిస్తాం’’ అని ఓ పోలీసు వారికి చెప్పారు.

సైనిక స్థావరం వెలుపల ఇలాంటి ఘటనలు చాలా చోటుచేసుకున్నాయని ఆ అధికారి తెలిపారు. ‘‘లోపల చాలా మంది మృతదేహాలు ఉన్నాయి. మృతదేహాన్ని సరిగ్గా వారి బంధువులకే అప్పగించేలా మేం చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికి ఐదు రోజులు గడిచాయి. దీని వల్ల మృతదేహాలపై కొంత ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో ఎలాంటి తప్పులూ జరగకుండా మేం జాగ్రత్తపడాలి’’ అని ఆమె వివరించారు.

వీడియో క్యాప్షన్, ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు: పెరుగుతున్న హింస మరో యుద్ధానికి దారి తీస్తుందా?

మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడంలో ఆలస్యం కావడం కూడా యూదులకు చాలా వేదన మిగులుస్తుంది. చనిపోయిన వెంటనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని, అప్పుడే వారి ఆత్మ స్వర్గానికి వెళ్తుందని వీరు నమ్ముతారు. మరోవైపు అంత్యక్రియలు నిర్వహిస్తేనే సంతాప దినాలు మొదలవుతాయి. ప్రస్తుతం చనిపోయిన తమ బంధువుల్లానే తమ పరిస్థితి కూడా ఎటూవెళ్లలేని స్థితిలో ఉండిపోయిందని కొందరు యూదులు అంటున్నారు.

లియోర్ అస్లిన్‌ను ఎట్టకేలకు గుర్తించారు. గురువారం అతడికి అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. అతడి మృతదేహాన్ని గుర్తుపట్టే చివరి సమయంలోనూ జకా సాయం చేసింది. అయితే, ప్రస్తుతం చాలా మృతదేహాలను సైనిక స్థావరం నుంచి టెల్‌అవీవ్‌లోని జకా కేంద్రానికి తరలిస్తున్నారు. అక్కడ కూడా తమ పని నిరంతరంగా కొనసాగుతుందని వాలంటీర్ ఇజ్రాయెల్ హసీద్ చెప్పారు.

అక్కడ కూడా కొంతంది పోలీసులు, టెక్నికల్ నిపుణులు ఉంటారు. అంత్యక్రియలు నిర్వహించే ముందు ఇక్కడ మృతదేహాలను హసీద్‌తోపాటు ఇతర జకా ప్రతినిధులు శుద్ధిచేస్తారు. పక్కనే ఉన్న నదిలో నీటితో మృతదేహాలను శుభ్రంచేసి, ఆ తర్వాత వస్త్రాలతో కప్పుతారు. అవసరమైతే, జుట్టు, గోళ్లు కూడా కత్తిరిస్తారు.

‘‘దాడి తీవ్రంగా జరగడంతో మా పని కష్టం అవుతోంది. కానీ, మేం చేయాల్సిందంతా చేస్తాం’’ అని హసీద్ చెప్పారు.

‘‘చివర్లో ప్రతి మృతదేహాన్ని తెల్లని వస్త్రంలో చుట్టి జకా వాలంటీర్లు ఇస్తారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించేందుకు పంపిస్తారు. అప్పుడే మరణించినవారు స్వర్గానికి చేరుకోగలరు’’ అని ఆయన అన్నారు.

(ఇదాన్ బెన్ ఆరీ కూడా ఈ కథనం కోసం సాయం అందించారు. ఫోటోలు: జోయెల్ గంటెర్)

వీడియో క్యాప్షన్, హమాస్‌ను నామరూపాలు లేకుండా చేస్తానని ప్రధాని నెతన్యాహు శపథం...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)