IND vs PAK మ్యాచ్ గురించి సచిన్ టెండూల్కర్, షోయబ్ అఖ్తర్ మధ్య మాటల పోటీ... పాక్‌కు టాలెంట్ లేదని షోయబ్ ఎందుకు అన్నాడు?

ఇండియా వర్సెస్ పాక్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో క్రికెట్ దేవుడిగా పేరు పొందిన సచిన్ టెండూల్కర్‌కు, ఆటకు ఎప్పుడో రిటైర్మెంట్ ఇచ్చిన పాక్ బౌలర్ షోయబ్ అఖ్తర్ మధ్య పోటీ మాత్రం ఇంకా కొనసాగుతుంది.

2003 వరల్డ్‌కప్‌లో షోయబ్ బౌలింగ్‌లో క్లాసికల్ అప్పర్‌షాట్‌తో సిక్సర్ బాదిన సచిన్ టెండూల్కర్, తాజాగా సోషల్ మీడియాలో కూడా షోయబ్‌ను వదల్లేదు. అచ్చం అలాంటి పంచ్‌నే ఇచ్చాడు.

భారత్-పాక్ మ్యాచ్ మొదలవ్వడానికి ముందు పాకిస్తాన్ జట్టుకు షోయబ్ అఖ్తర్ ఒక సలహా ఇచ్చాడు.

ఏళ్ల క్రితం తన బౌలింగ్‌లో సచిన్ అవుట్ అయిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, పాకిస్తాన్‌ను కూల్‌గా ఉండాలంటూ సూచించాడు.

సచిన్

ఫొటో సోర్స్, Getty Images

శనివారం మ్యాచ్‌లో భారత్ గెలుపొందిన తర్వాత సచిన్ టెండూల్కర్, షోయబ్‌ను ఆటపట్టించాడు.

‘‘మై ఫ్రెండ్, మీ సలహానే పాటించారు. మీరు చెప్పినట్లుగానే కూల్‌గా ఉన్నారు’’ అని షోయబ్ ట్వీట్‌కు సచిన్ మరో ట్వీట్‌లో బదులిచ్చాడు.

సచిన్ చేసిన ఈ ట్వీట్‌ను పాక్ జట్టు ప్రదర్శనతో ముడిపెట్టి చూస్తున్నారు.

భారత్‌తో మ్యాచ్‌లో పాక్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో విఫలమైంది.

ఇది ఇద్దరు మాజీ ఆటగాళ్ల మధ్య జరిగిన ‘‘సరదా వివాదం’’ మాత్రమే కాదు. సాధారణ పౌరుల నుంచి రెండు దేశాల ప్రముఖుల వరకు భారత్-పాక్ మ్యాచ్ ఎంత ఉత్కంఠను రేకెత్తించిందో ఇది తెలుపుతుంది.

నరేంద్ర మోదీ స్టేడియం

ఫొటో సోర్స్, Getty Images

నిండుగా స్టేడియం

ఈ మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన అభిమానులతో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం కిక్కిరిసిపోయింది.

భారత్ టాస్ గెలిచి, పాకిస్తాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించినప్పుడు మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుందని అభిమానులంతా ఆశించారు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 191 పరుగులకే ముగుస్తుందని ఎవరూ అనుకోలేదు.

వరల్డ్ నంబర్ వన్ టీమ్ అయిన భారత్ ఈ మ్యాచ్‌లో మరో 117 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది.

వన్డే ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌కు ఇది వరుసగా ఎనిమిదో విజయం.

తాము పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించాలని అనుకున్నట్లు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నారు.

‘‘మేం ఆటను సరిగా ప్రారంభించలేకపోయాం. 280 పరుగుల వరకు చేయాలని ముందుగా మేం అనుకున్నాం’’ అని బాబర్ చెప్పారు.

పాక్ జట్టు గెలిచేందుకు ప్రయత్నించినట్లు కనిపించలేదని భారత క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, హర్దిక్ పాండ్యా అన్నారు.

బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

‘‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’’ బుమ్రా ఏమన్నాడంటే...

మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్‌చేసి కేవలం 19 పరుగులే ఇచ్చి 2 వికెట్లను పడగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రాకు ‘‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’’ అవార్డు లభించింది.

మొహమ్మద్ రిజ్వాన్, షాదాబ్ ఖాన్‌లను బుమ్రా అవుట్ చేశాడు.

‘‘వికెట్ చాలా నెమ్మదిగా ఉన్నట్లు మాకు తెలుసు. ఈ అవగాహనే మాకు చాలా సహాయపడింది. బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడం వీలైనంత కష్టతరం చేయాలని అనుకున్నాం.

జడ్డూ వేసిన బంతులు గింగిరాలు తిరగడం చూశాను. అందుకే స్పిన్నర్లు వేసినట్లుగా నేను స్లో బంతులు వేస్తే బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడతారని అనుకున్నా. నేను అనుకున్నట్లుగానే నా వ్యూహం పనిచేసింది’’ అని రిజ్వాన్ వికెట్ గురించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అందుకున్న తర్వాత బుమ్రా చెప్పాడు.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

బౌలర్ల గురించి రోహిత్ శర్మ ఏమన్నాడు?

మ్యాచ్ గమనాన్ని తమ బౌలర్లు నిర్దేశించారని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.

‘‘ఒక సమయంలో పాక్ జట్టు 270, లేదా 280 పరుగులు చేస్తుందని మాకు అనిపించింది.

మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించగల ఆరుగురు బౌలర్లు మా వద్ద ఉన్నారు. కెప్టెన్‌గా నా పని ఏంటంటే మ్యాచ్ పరిస్థితులను అంచనా వేసి ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టగల బౌలర్‌ను ఎంచుకోవడం.

వరల్డ్‌కప్‌లో అవకాశం దొరికిన ప్రతీసారి మా ప్లేయర్లు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

ఇది చాలా సుదీర్ఘ టోర్నమెంట్. 9 మ్యాచ్‌ల తర్వాత సెమీఫైనల్, ఫైనల్ ఉంటాయి.

నిజం చెప్పాలంటే, ఈ టోర్నీలో ఆడే ప్రతీ జట్టు బలమైనదే. తమదైన రోజున ప్రతీ జట్టూ గెలవగలదు. ఈ విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను’’ అని రోహిత్ వివరించాడు.

షోయబ్ అక్తర్

ఫొటో సోర్స్, @SHOAIB100MPH

పాక్‌ ఆటతీరు పట్ల అఖ్తర్ అసంతృప్తి

మ్యాచ్‌కు ముందు ‘కూల్‌గా ఉండండి’ అంటూ పాక్ జట్టుకు సలహా ఇచ్చిన షోయబ్ అఖ్తర్, పాక్ బ్యాటింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

పాక్ ప్రదర్శనతో నిరాశ చెందినట్లు ఒక వీడియోలో చెప్పారు.

‘‘మంచి ప్లాట్‌పామ్‌ను పాక్ జట్టులోని ఆటగాళ్లెవరూ వాడుకోలేకపోయారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ భారీ స్కోర్లు చేసే టాలెంట్ పాక్ జట్టుకు లేదు.

మంచి వికెట్ మీద పాక్ జట్టు ఓడిపోవడం చాలా బాధగా ఉంది’’ అని వీడియోలో చెప్పారు.

భారత బౌలర్లను, కెప్టెన్సీ పట్ల రోహిత్ శర్మను అఖ్తర్ ప్రశంసించారు.

‘‘భారత స్పిన్నర్లు అద్భుతంగా ఆడారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా బాగుంది’’ అని అన్నాడు.

నరేంద్ర మోదీ స్టేడియం

ఫొటో సోర్స్, Getty Images

మ్యాచ్‌కు ముందు సచిన్ ఎంట్రీ

మ్యాచ్‌కు ముందు స్టేడియంలో సచిన్ కనిపించేసరికి ప్రేక్షకుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

ఐసీసీ వరల్డ్ కప్-2023కి గ్లోబల్ అంబాసిడర్‌ అయిన సచిన్, మ్యాచ్‌కు ముందు ట్రోఫీతో స్టేడియానికి చేరుకున్నారు.

భారత హోం మంత్రి అమిత్ షాతో పాటు ఈ మ్యాచ్ చూడటానికి చాలామంది ప్రముఖులు స్టేడియానికి వచ్చారు.

హార్దిక్ పాండ్యా

ఫొటో సోర్స్, Getty Images

హార్దిక్ పాండ్యా మంత్రం

మ్యాచ్‌లో జరిగిన కొన్ని ప్రత్యేక ఘటనల గురించి సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకున్నారు.

అందులో ఒకటి హార్దిక్ పాండ్యా, ఇమాముల్ హక్ వికెట్ తీయడం.

హర్దిక్ పాండ్యా బంతిని విసిరిన క్లిప్‌ను షేర్ చేస్తూ, ఇమాముల్ హక్ వికెట్ తీయడానికి పాండ్యా బ్లాక్ మ్యాజిక్ చేశాడంటూ కొందరు అభిమానులు సరదాగా అంటున్నారు.

‘‘ మంత్రించిన బంతితో ఇమాముల్ హక్ అవుట్’’ అని మరో యూజర్ రాశారు.

అలాగే మొహమ్మద్ రిజ్వాన్... గార్డ్ తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. బౌలర్లు, ఫీల్డర్లు ఎదురుచూసేలా చేశాడు.

దీనికి ఇంత సమయమా అన్నట్లుగా కోహ్లి సంజ్ఞ చేయడం గురించి కూడా సోషల్ మీడియాలో అభిమానులు పంచుకున్నారు.

కోహ్లి తన మణికట్టుపై వాచ్ ఉన్నట్లుగా దాన్ని చూస్తూ తన అసహనాన్ని ప్రదర్శించాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)