IND vs PAK: పాకిస్తాన్‌పై భారత్ గెలవాలంటే ఈ 5 అంశాలే కీలకం

భారత క్రికెట్ టీమ్

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, నితిన్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి, అహ్మదాబాద్ నుంచి

పాకిస్తాన్ 1992 నుంచి ఇప్పటివరకు జరిగిన ఏడు వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో భారత్‌ను ఓడించలేకపోయింది.

ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన గత వన్డే ప్రపంచకప్‌ లీగ్ మ్యాచ్‌లో ఓల్డ్ ట్రఫోర్డ్ స్టేడియం వేదికగా భారత్, పాక్ జట్లు తలపడ్డాయి. వర్షం కారణంగా కుదించిన ఈ మ్యాచ్‌లోనూ భారత్ 89 పరుగుల తేడాతో పాక్‌పై గెలుపొందింది.

అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది.

ఇరు జట్ల మధ్య జరిగిన అంతర్జాతీయ వన్డేల్లో మాత్రం భారత్‌పై పాకిస్తాన్‌దే పైచేయి. పాకిస్తాన్ 73 మ్యాచ్‌ల్లో, భారత్ 56 మ్యాచ్‌ల్లో గెలిచాయి.

గణాంకాలను పక్కన పెట్టి, వాస్తవ పరిస్థితులను చూస్తే గత కొన్నేళ్లుగా పాక్ జట్టుపై భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.

అయితే, శనివారం అహ్మదాబాద్‌లో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై గెలవాలంటే మాత్రం భారత్ కొన్ని అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిందే. అవేంటంటే..

మొహమ్మద్ రిజ్వాన్

ఫొటో సోర్స్, Getty Images

1. మొహమ్మద్ రిజ్వాన్‌ను బోల్తా కొట్టించాలి

వరల్డ్‌కప్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా హాఫ్ సెంచరీ, సెంచరీ చేసిన మొహమ్మద్ రిజ్వాన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.

ఇందులో ఒక మ్యాచ్‌లో రిజ్వాన్ నాటౌట్‌గా కూడా నిలిచాడు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి మొత్తం 199 పరుగులు చేశాడు.

ఇటీవల కొలంబో వేదికగా జరిగిన ఆసియా కప్‌లో పెద్దగా రాణించనప్పటికీ, ఈ వరల్డ్ కప్‌లో లయను అందిపుచ్చుకున్నాడు. వార్మప్ మ్యాచ్‌ల్లోనూ నిలకడగా రాణించాడు.

పాకిస్తానీ సీనియర్ క్రికెట్ జర్నలిస్ట్ షాహిద్ హష్మీ చాలా కాలంగా మొహమ్మద్ రిజ్వాన్ ఆటను కవర్ చేస్తున్నారు.

‘‘రిజ్వాన్ ఒక అద్భుతమైన స్ట్రోక్ ప్లేయర్. కానీ, ఆరంభ ఓవర్లలోనే కొన్ని డేంజరస్ షాట్లు ఆడటానికి ఏమాత్రం వెనకాడరు. ఇలాంటి సమయంలోనే చాలాసార్లు వికెట్ల మీదకు బౌన్స్ అయ్యే బంతులకు బలి అయ్యారు’’ అని హష్మీ చెప్పారు.

బాబర్ ఆజమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్

2. తొలి 5 ఓవర్లలోనే బాబర్ ఆజమ్ వికెట్...

ప్రస్తుత పాక్ జట్టులో బాబర్ ఆజమ్ నిస్సందేహంగా కీలక ఆటగాడు.

19 సెంచరీలు, 28 అర్ధసెంచరీలతో సహా వన్డే క్రికెట్‌లో 5,824 పరుగులు చేసిన బాబర్ ఆజమ్ వికెట్‌ను ప్రత్యర్థులు కచ్చితంగా విలువైనదిగా పరిగణిస్తారు.

అందుకే, తొలి 5 ఓవర్లలోనే ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ అయిన బాబర్ ఆజమ్ వికెట్‌ను పడగొట్టడంపైనే భారత్ దృష్టి సారిస్తుంది.

భారత్‌తో ఆడిన గత 7 మ్యాచ్‌ల్లో బాబర్ ఆజమ్ మొత్తం 168 పరుగులే చేశాడని, అందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదని టీమిండియా మేనేజ్‌మెంట్ తమ బౌలర్లకు పదే పదే గుర్తు చేస్తుంది.

శుక్రవారం మధ్యాహ్నం నరేంద్ర మోదీ స్టేడియంలో ఎక్కువసేపు ప్రాక్టీస్ చేసిన పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌లో బాబర్ ఒకరు. స్లో బౌలర్లు, స్పిన్నర్లను ఎదుర్కోవడంపైనే బాబర్ ప్రత్యేకంగా శ్రమించాడు.

అనుకున్నట్లుగా అహ్మదాబాద్ పిచ్ కాస్త నెమ్మదిస్తే బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్‌లను త్వరగా పెవిలియన్ పంపించవచ్చు.

హసన్ అలీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హసన్ అలీ

3. ఆఫ్రిదీ, హారిస్ రవూఫ్, హసన్ అలీలను నిలువరించాలి..

పాకిస్తాన్‌కు వారి బౌలింగ్ విభాగమే అతిపెద్ద బలం. గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా జట్టుకు దూరమైనప్పటికీ, వారి బౌలింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తోంది.

జట్టులోని టాప్-3 బౌలర్లు ఫామ్‌లో ఉన్నారు.

ముఖ్యంగా మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన హసన్ అలీ, వన్డే ఫార్మాట్‌లో పాక్‌కు చాలా కీలక ఆటగాడు.

50 ఓవర్ల పాటు జరిగే వన్డేల్లో మిడిల్ ఓవర్లలో హసన్ అలీ ప్రమాదకారిగా నిరూపించుకున్నాడు.

2017 చాంపియన్స్ ట్రోఫీలో హసన్ అలీ అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. పాక్ జట్టు విజేతగా నిలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు.

ఈ వరల్డ్ కప్‌లో భారత్ తరహాలోనే పాక్ జట్టు కూడా ఆడిన తొలి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో కలిపి హసన్ అలీ 6 వికెట్లు తీశాడు.

హారిస్ రవూఫ్ కూడా ఈ టోర్నీలో ఇప్పటివరకు 5 వికెట్లు పడగొట్టాడు. ప్రత్యర్థి జట్లకు చెందిన కీలక ఆటగాళ్లను అతను అవుట్ చేశాడు. రవూఫ్ గతంలోనూ తన బౌలింగ్‌తో భారత్‌ను ఇబ్బందిపెట్టాడు.

భారత్ వంటి పెద్ద జట్లను కూడా రవూఫ్ ఇబ్బంది పెట్టగలడు అని పాకిస్తాన్‌లోని జియో న్యూస్ క్రికెట్ విశ్లేషకులు అబ్దుల్ మాజిద్ భట్టీ అన్నారు.

‘‘టీమిండియాతో హసన్ అలీ, రవూఫ్‌లు ఎక్కువగా మ్యాచ్‌లు ఆడలేదు. కానీ, పిచ్ నుంచి కాస్త సహకారం లభించినా వారిద్దరూ పెద్ద బ్యాట్స్‌మెన్‌ను కూడా బోల్తా కొట్టించగలరు.

ఇంకో విషయం ఏంటంటే, రవూఫ్‌కు బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం ఉంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్‌తో పాటు కొంతవరకు కోహ్లి కూడా బయటకు వెళ్లే బంతులను వెంటాడే ప్రయత్నం చేస్తారు. ఆ షాట్ ఆడటంలో కాస్త పొరపాటు జరిగినా పెద్ద మైదానంలో అది సులువైన క్యాచ్‌గా మారుతుంది’’ అని ఆయన వివరించారు.

రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్

ఫొటో సోర్స్, Getty Images

4. మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్‌లే లక్ష్యం

ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో భారత బ్యాట్స్‌మెన్, ఫాస్ట్‌ బౌలర్లతో సమానంగా స్పిన్నర్లపై శ్రద్ధ పెట్టారు.

నిజానికి స్పిన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి బ్యాటింగ్ సగటు మునుపటి అంతా మెరుగ్గా లేదు. కానీ, అహ్మదాబాద్‌ మైదానంలో తక్కువ దూరంలో ఉండే లెగ్ సైడ్ బౌండరీలు బాదేందుకు కోహ్లి కచ్చితంగా ప్రయత్నిస్తాడు.

కాబట్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తప్పకుండా మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్‌లు వేసే 20 ఓవర్లపై దృష్టి సారిస్తారు.

‘‘ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఇప్పటివరకు ఆడలేకపోయిన శుభ్‌మన్ గిల్, 99 శాతం ఆడతాడు’’ అని రోహిత్ శర్మ చెప్పడం భారత్‌కు కలిసొచ్చే అంశం. గిల్ కూడా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు.

ఈ మ్యాచ్ నల్లమట్టి పిచ్‌పై జరుగుతుందని అంచనా. ఈ పిచ్ మీద బంతి నెమ్మదిగా కదులుతుంది. ఇది స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది.

ఈ నేపథ్యంలో భారతీయ స్పిన్నర్లతో పోలిస్తే పాక్ బౌలర్లు షాదాబ్, నవాజ్‌లపై అధిక ఒత్తిడి ఉంటుంది. భారత బ్యాట్స్‌మెన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

బ్యాట్

ఫొటో సోర్స్, Getty Images

5. టాస్ గెలిస్తే బ్యాటింగ్

ఈ మైదానంలో జరిగిన వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, న్యూజీలాండ్ తలపడ్డాయి.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజీలాండ్ ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను భారీ వికెట్ల తేడాతో ఓడించింది.

ఒకవేళ రోహిత్ శర్మ టాస్ గెలుపొందితే, న్యూజీలాండ్‌కు విరుద్ధంగా బ్యాటింగ్‌నే ఎంచుకోవాలి.

సీనియర్ క్రికెట్ విశ్లేషకుడు ఆనంద్ వాసు ప్రకారం, ‘‘భారత్ పెద్ద స్కోరు చేస్తే, లక్ష్యఛేదనలో పాక్ జట్టు ఒత్తిడికి గురవుతుంది. సొంతగడ్డపై భారత్‌కు ప్రేక్షకుల మద్దతు ఉంటుంది.’’

టాస్ గెలుపొందిన తర్వాత బ్యాటింగ్‌ను ఎంచుకోవడం భారత్‌కు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

వీడియో క్యాప్షన్, ఆత్రుతగా ఎదురుచూస్తున్న రెండు దేశాల ఫ్యాన్స్ ఏమంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)