పొన్నాల లక్ష్మయ్య, డీఎస్, కేకే - తెలంగాణ: ఈ పీసీసీ మాజీ అధ్యక్షులంతా కాంగ్రెస్‌ను ఎందుకు వీడారు?

ఫొటో సోర్స్, facebook/KCR
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ కాంగ్రెస్ తొలి విడత అభ్యర్థుల ప్రకటన, బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదలతో ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
అక్టోబర్ 9న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనప్పటికీ కొంత స్తబ్దుగా ఉన్న తెలంగాణ పాలిటిక్స్ ఆదివారం (15.10.2023) నుంచి వేడెక్కాయి.
అక్కడికి రెండు రోజుల ముందు తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ రాజీనామా చేశారు.
ఆ వెంటనే బీఆర్ఎస్ నేత, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రంగంలోకి దిగి ఆయన్ను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తరువాత పొన్నాల ప్రగతి భవన్‌కు వెళ్లి బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిశారు.
సోమవారం జనగామలో కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభలో పొన్నాల బీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. ఈ పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికలకు ముందు టికెట్ రానివాళ్లు, ఎన్నికల తరువాత గెలిచినవాళ్లలో కొందరు పార్టీలు మారడం కొత్తేమీ కానప్పటికీ ప్రస్తుతం పొన్నాల కాంగ్రెస్‌ను వీడడం చర్చనీయమైంది.
ఉన్నత విద్యావంతుడిగా, రాష్ట్ర విభజన కాలంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేతగా, కాంగ్రెస్ పార్టీకి విధేయుడైన బీసీ నేతగా ఆయనకు పేరుంది.
అయితే, తెలంగాణ ఏర్పడిన తరువాత, అంతకుముందు పీసీసీ అధ్యక్షులుగా పనిచేసి.. ఇంకా రాజకీయాల్లో ఉన్న తెలంగాణ ప్రాంత నేతల్లో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆయన కంటే ముందు ఆ పదవిలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. 30 ఏళ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన వి.హనుమంతరావు(వీహెచ్) తప్ప అంతా బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఇప్పుడు చర్చనీయమవుతోంది.

ఫొటో సోర్స్, Ponnala Lakshmiah
తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో కాంగ్రెస్ 2014 మార్చిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వేర్వేరుగా పీసీసీ అధ్యక్షులను నియమించింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను పార్టీ నియమించింది.
సుమారు ఏడాది పాటు పొన్నాల పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.
2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. కొత్త రాష్ట్రంలో అప్పటి టీఆర్ఎస్ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
దీంతో సుమారు ఏడాది తరువాత 2015 మార్చ్‌లో పొన్నాల స్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది కాంగ్రెస్.
అయితే.. గత నాలుగు దశాబ్దాలలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ ఏర్పడిన తరువాత కానీ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన తెలంగాణ నేతల్లో ఎక్కువ మంది ఆ పార్టీని వీడారు.

ఫొటో సోర్స్, Getty Images
డి.శ్రీనివాస్(డీఎస్), కె.కేశవరావు(కేకే) వంటి కాంగ్రెస్ సీనియర్లు బీఆర్ఎస్‌లో చేరి పదవులు అందుకున్నారు.
వీరిద్దరూ ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారే. డి.శ్రీనివాస్ 2004 నుంచి 2005 వరకు ఒకసారి, 2008 నుంచి 2011 వరకు మరోసారి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.
కాంగ్రెస్ రెండు సార్లు వరుసగా అధికారంలోకి వచ్చి, రెండుసార్లూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భాలలో పీసీసీ అధ్యక్షుడిగా డీఎస్ ఉన్నారు.
మధ్యలో 2005 నుంచి 2008 వరకు కె.కేశవరావు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.
అంతకుముందు ఎం.సత్యనారాయణరావు, వి.హనుమంతరావు కూడా పీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు.
వీరిలో ఎం.సత్యనారాయణ రావు కోవిడ్ సమయంలో 2021లో మరణించేవరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.
వి.హనుమంత రావు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డీఎస్: కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరాక పెద్దల సభకు
డి.శ్రీనివాస్ 2015లో టీఆర్ఎస్‌లో చేరారు. 2016లో టీఆర్ఎస్ ఆయన్ను రాజ్యసభకు పంపించింది. 2022 జులై వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
2023 మార్చ్‌లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆ పార్టీ నేతలు చెప్పినా ఆ మరుసటి రోజే ఆయన రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు.
ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలలో ఆయన లేరు.

ఫొటో సోర్స్, I and PR Telangana
కేకే: కాంగ్రెస్ నుంచి వచ్చి బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా..
డి.శ్రీనివాస్ కంటే ముందు కె.కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే ఆయన 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
2014లో టీఆర్ఎస్ పార్టీ ఆయన్ను జనరల్ సెక్రటరీగా నియమించింది. అదే ఏడాది రాజ్యసభకు పంపించింది.
కాంగ్రెస్ పార్టీలో ఉండగా 2012తో రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం ముగిసింది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కొనసాగింపు రాలేదు.
బీఆర్ఎస్‌లో చేరిన తరువాత 2014లో రాజ్యసభకు ఎన్నికైన ఆయన అప్పటి నుంచి రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు.
కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి 2021 నుంచి హైదరాబాద్ మేయర్ పదవిలో ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఆలస్యాన్ని నిరసిస్తూ కేకే కాంగ్రెస్ పార్టీని వీడారని, ఆ సమయంలో ఆయన టీఆర్ఎస్‌లో చేరడంతో కేసీఆర్ బలం పెరిగినట్లయిందని, అందుకే కీలకమైన జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు భండారు శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.
కేకేకు ఇప్పటికీ కేసీఆర్ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉందని, అందుకే ఆయన కేసీఆర్ పక్కనే కనిపిస్తారని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, facebook/Ponnala Lakshmaiah
ఇప్పుడు పొన్నాల వంతు
తాజాగా పొన్నాల లక్ష్మయ్య కూడా కారు ఎక్కడంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు అందుకున్న బీసీ నేతలు ఎందుకు ఆ పార్టీకి దూరమవుతున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది.
పొన్నాల కూడా తన రాజీనామా సమయంలో కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ ఆరోపణలు గుప్పించారు.
తెలంగాణ సమాజంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరుగుతోందని ఆయన తన రాజీనామా లేఖలో ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కావాలని అడిగితే పార్టీలో ఆ విషయంపై చర్చే జరగలేదని, దొంగ సర్వేలతో బీసీలకు సీట్లు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసేందుకు ప్రయత్నించినా తనకు అవకాశం దొరకలేదని పొన్నాల ఆరోపించారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభావం తగ్గిందని.. కాంగ్రెస్ బలం పుంజుకొంటోందని రకరకాల వాదనలు వినిపిస్తున్న వేళ కాంగ్రెస్ నుంచి తమ పార్టీలోకి పొన్నాల వంటి నాయకుడు రావడాన్ని మంచి సంకేతంగా భావించి బీఆర్ఎస్ చకచకా అడుగులు వేసిందని భండారు శ్రీనివాసరావు విశ్లేషించారు.

ఫొటో సోర్స్, facebook/revanth reddy
ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం 50 శాతం సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే: రేవంత్ రెడ్డి
బీసీలకు పార్టీలో ప్రాధాన్యం లేదన్న ఆరోపణ సరికాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
అధ్యక్షుడిని కాబట్టి మంచైనా, చెడ్డయినా తననే అంటారని, ఏఐసీసీ ఆదేశాల మేరకే తాను పనిచేయాల్సి ఉంటుందని, పార్టీ కోసం పనిచేసినవారిలో కొందరు అనుకున్నట్లు జరగకపోవడం వల్ల ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, వారి బాధను తాను అర్థం చేసుకోగలనని రేవంత్ రెడ్డి అన్నారు.
పొన్నాల లక్ష్మయ్య విషయంలో రేవంత్ రెడ్డి స్పందిస్తూ- తెలంగాణ ఏర్పాటయ్యాక పార్టీ ఆయన్ను మొట్టమొదటి పీసీసీ అధ్యక్షుడిని చేసిందని, ఆయన ఓడిపోవడంతోపాటు పార్టీని కూడా గెలిపించలేకపోయారని, ఆ తరువాత 2018 ఎన్నికలలోనూ పొన్నాల ఓటమి పాలయ్యారని అన్నారు.
పొన్నాల కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులను అనుభవించారని రేవంత్ అన్నారు.
సీనియర్ అయినంత మాత్రాన సరిపోదని, సిన్సియర్‌గా కూడా ఉండాలని రేవంత్ అన్నారు.
జనగామకు ఇంకా అభ్యర్థిత్వం ఖరారు కాక ముందే పొన్నాల తొందరపడి పార్టీని వీడారని రేవంత్ అభిప్రాయపడ్డారు.
ఇప్పటివరకు 45 శాతం సీట్లు మాత్రమే ఇచ్చామని, ఇంకా 55 శాతం సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉందని, ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం సీట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, facebook
వారిని బుజ్జగించేందుకు కమిటీ
పార్టీలో అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు, టికెట్ రాని ఆశావహులతో చర్చించేందుకు కాంగ్రెస్ నలుగురితో ఒక కమిటీ నియమించింది.
ఫోర్‌మెన్ కమిటీగా పేర్కొంటున్న ఇందులో తెలంగాణకు చెందిన సీనియర్ నేత జానారెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రె, మరో ఇద్దరు నేతలు దీప దాస్‌మున్షీ, మీనాక్షి నటరాజన్ ఉన్నారు.
టికెట్లు రాని ఆశావహులతో మాట్లాడి వారు పార్టీని వీడకుండా చూడడం, పరిస్థితులను వారికి వివరించి పార్టీ కోసం పనిచేసేలా ఒప్పించడం వీరి బాధ్యత.
రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమేనని.. ఎన్నికల సమయంలో మరింత సహజమని భండారు శ్రీనివాసరావు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రుషికొండ మీద రూ. 270 కోట్లతో నిర్మిస్తున్న భవనాలు సీఎం క్యాంప్ కార్యాలయం కోసమేనా... వీటిపై ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోంది?
- టవర్ ఆఫ్ సైలెన్స్: పార్సీలు తమ బంధువుల మృతదేహాలను రాబందులకు ఎందుకు వదిలేస్తారు?
- ప్రవళిక ఆత్మహత్యపై నాయకులు, విద్యార్ధి సంఘాల వాదనేంటి, పోలీసులు ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి?
- తెలంగాణ ఎన్నికలు: ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు మహిళలే అయినా ఒక్కరూ ఎమ్మెల్యే కాలేకపోయారు, ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














