ఎలక్షన్ కోడ్ వచ్చేసింది.. ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?

Cash

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.

ప్రభుత్వానికి, పార్టీలకు, అభ్యర్థులకు ఈ కోడ్ వర్తిస్తుంది.

ఎన్నికల కోడ్ అంటే ఏమిటి? ఇది అమలులో ఉన్నప్పుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?

Security Forces

ఫొటో సోర్స్, Getty Images

కులం, మతం పేరుతో చిచ్చు పెట్టరాదు

అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు, నాయకులకు వర్తించేలా ఎలక్షన్ కమిషన్ సాధారణ నియమావళిలో భాగంగా కొన్ని సూచనలు చేస్తుంది.

  • కులాలు, మతాల మధ్య, వేర్వేరు భాషలు మాట్లాడే ప్రజల మధ్య అప్పటికే ఉన్న విభేదాలను పెంచేలా రెచ్చగొట్టడం కానీ.. కొత్తగా విభేధాలు, వైషమ్యాలు సృష్టించడం కానీ చేయరాదు. ఇది అభ్యర్థులు, పార్టీలు అందరికీ వర్తిస్తుంది.
  • ఇతర రాజకీయ పార్టీలను విమర్శించేటప్పుడు వారి విధానాలు, కార్యక్రమాలు, గతంలో పనితీరు వంటి అంశాలకు మాత్రమే పరిమితం కావాలి.
  • నాయకులు, అభ్యర్థులు, పార్టీ కార్యకర్తల వ్యక్తిగత జీవితాలు, ప్రజలతో సంబంధం లేని వ్యవహారాల జోలికి పోరాదు.
  • నిర్ధరణ చేసుకోకుండా ఇతర పార్టీలు, నాయకులు, కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలు చేయడానికి వీల్లేదు.
  • ఓట్ల కోసం కులాభిమానం, మత విశ్వాసాలను వాడుకోరాదు. ఎన్నికల ప్రచారం కోసం మసీదులు, చర్చిలు, ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపయోగించుకోరాదు.
  • ఓటర్లకు డబ్బులివ్వడం, ఓటర్లను బెదిరించడం, ఒకరి ఓటు మరొకరు వేయడం, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రచారం చేయడం నిషేధం.
  • పోలింగ్ ముగిసే సమయానికి ముందు 48 గంటల లోపు బహిరంగ సభలు నిర్వహించడం పూర్తిగా నిషేధం.
  • పోలింగ్ కేంద్రానికి ఓటర్లను తరలించడం, వారిని తీసుకెళ్లి, తిరిగి తేవడం నిబంధనలకు విరుద్ధం.
  • రాజకీయ పార్టీలు కానీ, అభ్యర్థులు కానీ తమ ప్రచారంలో భాగంగా ఇతరుల స్థలం, గోడలు, ఇళ్లు, ఇతర వేదికలను వారి అనుమతి లేకుండా ప్రచారానికి వాడుకోవడం నిషిద్ధం.
  • ఇతర పార్టీల, అభ్యర్థుల సమావేశాలు, ప్రచార కార్యక్రమాలను అడ్డుకోవడం నిబంధనలకు విరుద్ధం. ఇలాంటి పనిచేస్తే ఆయా రాజకీయపార్టీలు, అభ్యర్థులు, వారి మద్దతుదారులపై చర్యలు ఉంటాయి.
  • ఇతర పార్టీలకు చెందిన, అభ్యర్థులకు చెందిన పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఇతర ప్రచార సామగ్రిని తొలగించడానికి వీల్లేదు.
rally

ఫొటో సోర్స్, Getty Images

సమావేశాలు నిర్వహించేటప్పుడు ఏం చేయాలంటే..

  • రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎక్కడైనా సమావేశాలు నిర్వహించాలంటే ముందుగానే స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
  • సమావేశం ఎప్పుడు నిర్వహిస్తున్నాం.. ఎక్కడ నిర్వహిస్తున్నాం వంటి వివరాలన్నీ ముందుగా తెలియజేస్తే పోలీస్ వ్యవస్థ అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తుంది.
  • సమావేశంలో లౌడ్ స్పీకర్లు వాడాలనుకుంటే అందుకు కూడా అధికారుల నుంచి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ర్యాలీల విషయంలో పాటించాల్సిన రూల్స్ ఇవీ..

  • ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తే దానికి సంబంధించిన సమాచారం కూడా ముందుగానే పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. ర్యాలీ ఎక్కడ మొదలవుతుంది, ఏ మార్గంలో వెళ్తుంది.. ఎన్నింటికి మొదలవుతుంది.. ఎన్నింటికి, ఎక్కడ ముగుస్తుందన్న విషయాలు స్పష్టంగా తెలియజేయాలి. ర్యాలీ నిర్వహించే సమయంలో మార్గం మార్చడం వంటివి చేయరాదు.
  • ర్యాలీ సాగే మార్గంలో అప్పటికే ఏవైనా నిషేధాజ్ఞలు ఉంటే నిర్వాహకులు దాన్ని పాటించాల్సి ఉంటుంది.
  • ఒకే ప్రాంతంలో, ఒకే సమయంలో వేర్వేరు పార్టీలు కానీ వేర్వేరు అభ్యర్థులు కానీ ర్యాలీలు నిర్వహించాలనుకుంటే రెండు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు తగిన సర్దుబాటు కోసం అవసరమైతే స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలి.
  • ర్యాలీలు, సభలు, సమావేశాల వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి, అందుకు అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవాలి.
  • ఇతర పార్టీల నాయకులు, అభ్యర్థులను పోలిన దిష్టిబొమ్మలను తీసుకెళ్లడం, అలాంటివి తగలబెట్టడం నిషేధం.
పోలింగ్ కేంద్రం

ఫొటో సోర్స్, Getty Images

పోలింగ్ రోజున..

  • పోలింగ్ రోజున అన్ని పార్టీలు, అందరు అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను ఎలక్షన్ కమిషన్ సూచిస్తోంది.
  • ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేలా అధికారులకు అభ్యర్థులు, పార్టీల నాయకులు, కార్యకర్తలు పూర్తిగా సహకరించాలి.
  • ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులను కల్పించాలి.
  • రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఓటర్లకు స్లిప్‌లు ఇస్తే ఓటర్ ఐడీ, పోలింగ్ కేంద్రం వంటి వివరాలను తెల్ల కాగితంపై మాత్రమే రాసివ్వాలి. దానిపై పార్టీ గుర్తులు కానీ, రంగులు కానీ, అభ్యర్థి పేరు కానీ, పార్టీ పేరు కానీ ఉండరాదు.
  • పోలింగ్ సమయంలో కానీ అంతకుముందు 48 గంటల నుంచి కానీ మద్యం పంపిణీ చేయడం పూర్తిగా నిషిద్ధం.
  • పార్టీల అభ్యర్థుల అభిమానులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఒకరితో ఒకరు కొట్లాడుకునే ప్రమాదం లేకుండా పోలింగ్ కేంద్రాల సమీపంలోని తమ శిబిరాల వద్ద జనం గుమిగూడకుండా పార్టీలు జాగ్రత్తపడాలి.

పోలింగ్ బూత్ వద్ద..

ఓటర్లు మినహా అక్కడ ఉండే మిగతా అందరికీ ఎలక్షన్ కమిషన్ జారీచేసిన పాస్ ఉండాలి.

ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్లను నియమిస్తుంది. అభ్యర్థులు కానీ, వారి ఏజెంట్లు కానీ నిర్దిష్టంగా ఏవైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే ఈ అబ్జర్వర్లకు చెప్పాలి.

కాన్వాయ్

ఫొటో సోర్స్, Getty Images

అధికార పార్టీ కదా అని అనుకోకూడదు

  • అధికార పార్టీకి చెందిన మంత్రులు తమ అధికారిక కార్యక్రమాలను ఎన్నికల ప్రచారానికి, ఎన్నికల పనులకు వాడుకోరాదు. అంతేకాదు ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ, సిబ్బందిని కానీ ఎన్నికల పనులకు, ప్రచారానికి వినియోగించుకోరాదు.
  • ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ వాహనాలను వాడుకోరాదు. అధికారిక పనుల కోసం వినియోగించే ప్రభుత్వ ఖర్చుతో విమాన ప్రయాణ సదుపాయాన్ని ఎన్నికల కోసం వాడుకోకూడదు.
  • అధికారంలో ఉన్నాం కదా అని తమ బహిరంగ సభలకు మాత్రమే మైదానాలకు కేటాయించుకుంటూ ఇతర పార్టీలు, అభ్యర్థులకు అవకాశాలు లేకుండా చేయరాదు. హెలిపాడ్లు, విమానాల విషయంలోనూ ఈ నిబంధన వర్తిస్తుంది.
  • తమ ప్రభుత్వంలో ఏమేం చేశామో చెప్పడానికి, ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోవడానికి పత్రికలు, ఇతర ప్రసార మాధ్యమాలలో ప్రకటనలు ఇవ్వడానికి ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడానికి వీల్లేదు. అంటే ప్రభుత్వ ఖర్చుతో పార్టీ ప్రకటనలు ఇవ్వరాదు.
  • కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత మంత్రులు, ఇతర అధికారులు తమ విచక్షణాధికారాలతో నిధులు మంజూరు చేయడం కానీ చెల్లింపులు చేయడం కానీ నిషేధం.
  • ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి మంత్రులు, ఇతర అధికారులు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చే అంశాలపై ఎలాంటి హామీలు ఇవ్వరాదు.
  • రోడ్లు వేస్తామని, తాగు నీటి సదుపాయం కల్పిస్తామని, ప్రభుత్వంలో నియామకాలు చేపడతాం వంటి హామీలు ఇవ్వకూడదు.
  • కేంద్రంలో మంత్రులు కానీ, రాష్ట్రంలో మంత్రులు కానీ పోలింగ్ కేంద్రాలు, లెక్కింపు కేంద్రాలలోకి రావడానికి వీల్లేదు.
  • ఓటరుగా ఓటేయడానికి రావొచ్చు.. లేదంటే అభ్యర్థిగా కానీ, ఏజెంటుగా కానీ పోలింగ్ కేంద్రానికో, లెక్కింపు కేంద్రానికో రావొచ్చు. మంత్రులమన్న హోదాలో రావడానికి వీల్లేదు.

వీటికి ఓకే

  • ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడానికి ముందే ప్రారంభమైన పథకాలు, కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు.
  • వరదలు, కరవు, మహమ్మారులు, ఇతర ప్రకృతి విపత్తులు వస్తే ప్రభావిత ప్రాంతాలలో సహాయ, పునరావాస చర్యలు చేపట్టొచ్చు.
  • క్రిటికల్ ఇల్‌నెస్‌తో బాధపడేవారికి వైద్య సదుపాయం కానీ, వైద్యం కోసం నగదు సాయం కానీ తగిన అనుమతులు తీసుకుని చేయొచ్చు.
  • ఎన్నికల సభలు పెట్టడానికి మైదానాలు వంటి బహిరంగ స్థలాలను అన్ని పార్టీలకు, ఇతర అభ్యర్థులకు కూడా అందుబాటులో ఉండేలా నిష్పాక్షికంగా వ్యవహరించాలి.
  • ఇతర పార్టీల విధానాలు, పథకాలు, వారు చేసే కార్యక్రమాలను విమర్శించొచ్చు.

వీటికి వీల్లేదు

  • అధికార పార్టీ తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, తమ పార్టీ సాధించిన విజయాలు అంటూ ప్రభుత్వ ధనంతో ప్రకటనలు ఇవ్వడానికి వీల్లేదు.
  • ఓటరుగా, అభ్యర్థిగా, ఏజెంట్‌గా తప్ప మంత్రులెవరూ పోలింగ్ కేంద్రాల్లోకి కానీ, లెక్కింపు కేంద్రాలలోకి కానీ వెళ్లడానికి వీల్లేదు.
  • ఓట్లు అడగడం కోసం ఓటర్లు కులం, మతాలను వాడుకోవడానికి వీల్లేదు.
  • ఇతర పార్టీల నేతలు, అభ్యర్థుల ప్రైవేట్ లైఫ్‌పై విమర్శలు చేయరాదు.
  • తమ అభిప్రాయాలు, తమ విధానాలతో ఏకీభవించని వారి ఇళ్ల ముందు నిరసనలు, ప్రదర్శనలు చేయడానికి వీల్లేదు.
  • అధికారిక సెక్యూరిటీ కానీ ప్రైవేట్ సెక్యూరిటీ కానీ ఉన్నవారిని ఎలక్షన్ ఏజెంటుగా కానీ పోలింగ్ ఏజెంటుగా కానీ కౌంటింగ్ ఏజెంటుగా కానీ నియమించరాదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)