తెలంగాణ: ఇంటి నుంచే ఓటు.. ఎవరు అర్హులు? ఎలా ఉపయోగించుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. దీనికోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ఈ క్రమంలో వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలను తీసుకొస్తున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ ప్రకటించారు.
తెలంగాణలో వృద్ధులు, డిజేబుల్డ్ పర్సన్స్‌కు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల కమిషన్ దేశంలోనే తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కల్పించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరు అర్హులు?
ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం వినియోగించుకోవడానికి వృద్ధులలో 80 ఏళ్లు దాటినవారు అర్హులు.
తాజాగా విడుదల చేసి తుది ఓటర్ల జాబితా ప్రకారం తెలంగాణలో 80 ఏళ్లు దాటిన వృద్ధ ఓటర్లు 4.43 లక్షల మంది ఉండగా, వందేళ్లు దాటినవారు 7,689 మంది ఉన్నారు.
డిజేబుల్డ్ పర్సన్స్ అయితే వైకల్య శాతం 40 కంటే ఎక్కువ ఉంటేనే దీనికి అర్హులు.
తుది ఓటర్ల జాబితా ప్రకారం తెలంగాణలో డిజేబుల్డ్ ఓటర్లు 5.06 లక్షల మంది ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటి నుంచే ఓటేయాలంటే ఏం చేయాలి?
ఇంటి నుంచే ఓటేసే వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే వృద్ధులు, డిజేబుల్డ్ పర్సన్స్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 5 రోజులలో దరఖాస్తు చేసుకోవాలి.
ఇందుకోసం ‘ఫార్మ్ 12డి’ నింపి రిటర్నింగ్ అధికారికి కానీ, సహాయ రిటర్నింగ్ అధికారికి కానీ పంపించాలి.
పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేం అనే సమాచారాన్ని ఈ ‘ఫార్మ్ 12డి’ ద్వారా సహాయ రిటర్నింగ్ అధికారికి పంపుతారు.

ఫొటో సోర్స్, ECI
‘ఫార్మ్ 12డీ’ ఎక్కడ దొరుకుతుంది? ఏమేం నింపాలి?
‘ఫార్మ్ 12డీ’ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ
ఈ దరఖాస్తు చేసుకునేవారు తాము ఏ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వారో అందులో చెప్పాలి. తమ పూర్తి చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ కూడా పొందుపరచాలి.
దాంతోపాటు ఓటర్ లిస్ట్‌లో తమ పేరు ఏ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది, సీరియల్ నంబర్ ఎంత అనేది కూడా నింపాలి.
వృద్ధులైతే తమ వయసు ఎంతనేది అందులో పేర్కొనాలి. డిజేబుల్డ్ పర్సన్స్ అయితే ‘పర్సన్ విత్ డిజెబిలిటీ’ అనేది టిక్ చేయాలి.
ఈ సమాచారం అంతా నింపిన ‘ఫార్మ్ 12డీ’ దరఖాస్తును నోటిఫికేషన్ వచ్చిన అయిదు రోజుల్లోగా రిటర్నింగ్ అధికారి/సహాయ రిటర్నింగ్ అధికారికి చేరేలా చూడాలి.

ఫొటో సోర్స్, Getty Images
రహస్య ఓటింగ్ సాధ్యమేనా?
దరఖాస్తులను పరిశీలించిన తరువాత అర్హతను బట్టి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించాలా వద్దా అనేది అధికారులు నిర్ణయిస్తారు.
అర్హత ఉంటే వారి ఇంటికి అధికారులే వెళ్లి ఓటు వేయిస్తారు.
పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓట్ వేసేటప్పుడు ఎలా అయితే రహస్య ఓటింగ్ ఉంటుందో ఇంటి నుంచే ఓటు వేసేటప్పుడు కూడా ఓటర్ ఎవరికి ఓటేస్తున్నారో మిగతా ఎవరికీ తెలిసే అవకాశం లేకుండా అధికారులు అన్ని చర్యలూ తీసుకుంటారు.
ఈ ఓటింగ్ ప్రక్రియను వీడియో కూడా తీస్తారు.
ఇంటి నుంచే ఓటు వేయించేటప్పుడు ఎన్నికల అధికారులు అక్కడి అన్ని రాజకీయ పార్టీలకూ ఆ సమాచారం ఇస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
వృద్ధులు, డిజేబుల్డ్ ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాలు ఇవీ
ఇంటి నుంచి ఓటేసే వెసులుబాటే కాకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చే వృద్ధులు, డిజేబుల్డ్ ఓటర్ల కోసం ఎన్నికల అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వీల్ చెయిర్లు అందుబాటులో ఉంచుతున్నారు.
పోలింగ్ కేంద్రాలన్నీ గ్రౌండ్ ఫ్లోర్లలోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
వృద్ధులు, డిజేబుల్డ్ పర్సన్స్‌కు సహాయం చేయడానికి వాలంటీర్లను ఉంచుతున్నారు.
డిజేబుల్డ్ పర్సన్లను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓటేసిన తరువాత తిరిగి ఇంటికి తీసుకువెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, ECI
డిజేబుల్డ్ పర్సన్స్ కోసం యాప్
వైకల్యంతో బాధపడే ఓటర్లకు సాయపడేందుకుగాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) Saksham-ECI యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత మొబైల్ నంబర్ ఉపయోగించి రిజిష్టర్ చేసుకోవాలి.
మొబైల్ నంబర్ నమోదు చేసి యాక్టివేట్ చేసుకుంటేనే ఈసీఐ కల్పించే సదుపాయాలను పొందే అవకాశం ఏర్పడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ యాప్‌తో అందే సేవలు ఇవీ
ఈ యాప్ సహాయంతో వివిధ సేవలు ఉపయోగించుకోవడానికి రిక్వెస్ట్ చేసుకోవచ్చు.
పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు వీల్ చెయిర్ కోరొచ్చు.
ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి, అక్కడి నుంచి మళ్లీ ఇంటికి పికప్, డ్రాప్ సదుపాయం కల్పించాలని ఈ యాప్ ద్వారా కోరొచ్చు.
ఓటరు నమోదు చేసుకోవడానికి రిక్వెస్ట్.
ఓటు హక్కును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చుకోవడం.
ఓటర్ కార్డులో తప్పులుంటే వాటిని సవరించాలంటూ రిక్వెస్ట్ చేయొచ్చు.
ఓటర్ ఐడీ, ఆధార్ నంబర్ అనుసంధానం.
ఓటరు జాబితాలో పేరు ఎక్కడుందో తెలసుకోవడం, పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలుసుకోవడం, అభ్యర్థుల సమాచారం తెలుసుకునే వీలుంటుంది.
ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఈ యాప్ ద్వారా చేయొచ్చు.
ఇవి కూడా చదవండి:
- కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యులు? తల్లిదండ్రులా? కోచింగ్ సెంటర్లా? – బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- నాందేడ్: ‘డాక్టర్లు లేరు, మెషీన్లు ఆగిపోయాయి.. పిల్లలు చనిపోయాక మా సంతకాలు తీసుకున్నారు’
- బంగారం కొనాలా? బంగారం బాండ్లు కొనాలా? ఏది లాభం?
- ఇందూరు సభ: ‘మీకో రహస్యం చెప్పనా’ అంటూ కేసీఆర్‌పై ప్రధాని మోదీ ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు?
- దేవ్ రతూడి: సైకిల్‌పై పాలు అమ్మిన ఈ భారతీయుడు, చైనా సినిమాల్లో విలన్‌గా ఎలా సక్సెస్ అయ్యాడు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














