గ్రే జోన్: దాడికి ముందు చైనా అనుసరించే ఈ వ్యూహం ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జోయెల్ గునిటో
- హోదా, బీబీసీ న్యూస్
తమ రెండు దేశాల మధ్య అనధికార సరిహద్దును దాటి చైనా యుద్ధ విమానాలు రికార్డు సంఖ్యలో వస్తున్నాయని గత నెలలో తైవాన్ ఆందోళన వ్యక్తంచేసినప్పుడు, అసలు అలాంటి సరిహద్దేలేదని చైనా చెప్పుకొచ్చింది.
చైనా పంపిన 103 యుద్ధ విమానాల్లో దాదాపు 40 తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ (ఏడీఐజెడ్)లోకి కూడా వచ్చాయి. చైనా ‘వార్ గేమ్స్’లో ఇవన్నీ భాగమని నిపుణులు చెబుతున్నారు.
తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని చైనా చెబుతూ వస్తోంది. ఇదివరకూ కూడా యుద్ధ విమానాలు, నౌకలతో ఈ దీవిని చుట్టుముట్టేలా విన్యాసాలు చేసింది. ఎప్పటికైనా తైవాన్‌ను తమలో కలిపేసుకుంటామని చైనా పదేపదే చెబుతోంది.
అయితే, చైనా చర్యలు ఇప్పటివరకూ దూరాక్రమణకు కాస్త దూరంలోనే ఉన్నాయి. వీటిని ‘గ్రే జోన్’ చర్యలని మిలిటరీ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే ‘అటు యుద్ధమూ కాదు, అలానే శాంతిగానూ ఉండనివ్వదూ’ అనే కోణంలో గ్రే జోన్‌ను ఉపయోగిస్తుంటారు.
గ్రే జోన్ వ్యూహాల్లో నేరుగా దాడి చేయరు. కానీ, నిత్యం భయపెడుతూ ఉంటారు. నేరుగా సైనిక చర్యలకు పోకుండా, భయపెట్టేందుకు యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను అటుగా పంపుతుంటారు.
కానీ, నేడు అమెరికా-చైనా ఉద్రిక్తతలకు తైవాన్ కేంద్రమవుతోంది. ఇక్కడ ఒక్క బుల్లెట్ కూడా ప్రయోగించకుండా ‘గ్రే జోన్’ వ్యూహాలతో చైనా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా ఏం సాధించాలని అనుకుంటోంది?
గ్రే జోన్ యుద్ధ వ్యూహాల్లో క్రమంగా ప్రత్యర్థిని బలహీనం చేస్తారు. ప్రస్తుతం తైవాన్ విషయంలో చైనా అదే చేస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఎప్పటికప్పుడు ఏడీఐజెడ్‌లోకి వెళ్తూ తైవాన్ ఏం చేయగలదో చైనా పరీక్షిస్తోందని లండన్‌లోని కింగ్స్ కాలేజీ తూర్పు ఆసియా యుద్ధ, వ్యూహాల నిపుణుడు, ప్రొఫెసర్ అలీసియో పటలానో అన్నారు.
ఏడీఐజెడ్‌ను ఏ దేశాలూ ప్రత్యేకంగా ప్రకటించుకోవు. టెక్నికల్‌గా దీన్ని ‘ఇంటర్నేషనల్ ఎయిర్‌స్పేస్’గా పిలుస్తారు. విదేశీ విమానాలపై ఈ ప్రాంతంలో ప్రభుత్వాలు నిఘా పెడుతుంటాయి.
‘‘చైనా నుంచి వచ్చే యుద్ధ విమానాలకు పోటీగా తైవాన్ కూడా ఏడీఐజెడ్‌లో యుద్ధ విమానాలతో చక్కర్లు కొట్టిస్తోంది. కానీ, ఇది సమస్యకు పరిష్కారం కాదు’’ అని ప్రొఫెసర్ పటలానో అన్నారు.
అయితే, ఇలా యుద్ధ విమానాలను పంపడం వెనుక చైనాకు మరికొన్ని ఉద్దేశాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ‘బలగాల మధ్య సమన్వయం (ఫోర్స్ కో-ఆర్డినేషన్), నిఘా (సర్వైలెన్స్)’ లాంటి తమ సామర్థ్యాలను కూడా చైనా దీని ద్వారా పరీక్షించుకుంటోందని చెబుతున్నారు. అదే సమయంలో తైవాన్ చుట్టుపక్కల సైన్యాన్ని మోహరించడాన్ని అలవాటు చేయడం, తైవాన్‌కు ఎంత స్థాయిలో అంతర్జాతీయ మద్దతు లభిస్తోందో తెలుసుకోవడం లాంటి వాటికి కూడా ఇలాంటి చర్యలు ఉపయోగపడొచ్చని వివరిస్తున్నారు.
‘‘ఇలా సైనిక మోహరింపులను అలవాటు చేయడం ద్వారా ఏదో ఒకరోజు ఇక్కడ యుద్ధానికి చైనానే తొలి అడుగులు వేయొచ్చు. దీని వల్ల అటు తైవాన్‌తోపాటు దాని మిత్రపక్షమైన అమెరికాకు సన్నద్ధం అయ్యేందుకు పెద్దగా సమయం దొరకదు’’ అని అమెరికాకు చెందిన నేషనల్ బ్యూరో ఆఫ్ ఆసియాన్ రీసర్చ్ పరిశోధకుడు డేవిడ్ జిట్టర్ అన్నారు.
ఇలాంటి విన్యాసాల ద్వారా తైవాన్ జలసంధిలో చైనాతో తమకు సరిహద్దు ఉందనే తైవాన్ వాదనను చైనా ఖండిస్తోంది.
దీనిపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి మావో నింగ్ స్పందిస్తూ ‘‘వారు చెబుతున్నట్లుగా తైవాన్ జలసంధిలో ఎలాంటి ‘మీడియన్ లైన్’ లేదు’’ అని చెప్పారు.
‘‘అదే సమయంలో చైనా నుంచి పొంచివుండే ముప్పును తైవాన్ ప్రజలకు కూడా అలవాటు చేస్తున్నారు. దీని వల్ల ఒకవేళ ఏదైనా యుద్ధం వస్తే తైవాన్ సైన్యం మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రజల మద్దతును కూడగట్టడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు’’ అని జిట్టర్ అన్నారు.
చైనా సైనిక శక్తి ముందు తైవాన్ ఎంత మాత్రమూ నిలబడలేదని దాదాపు అందరు సైనిక విశ్లేషకులు అంగీకరిస్తున్నారు. చాలా మంది తైవాన్ ప్రజలు కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తున్నారు. తైవాన్ పబ్లిక్ ఒపీనియన్ ఫౌండేషన్ నిరుడు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఒకవేళ యుద్ధం జరిగితే చైనానే గెలుస్తుందని సగం మంది చెప్పారు. మూడింట ఒక వంతు మంది మాత్రం తైవాన్ గెలుస్తుందని దీనిలో అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయినప్పటికీ సైన్యానికి మరింత బడ్జెట్ కేటాయించేందుకు మద్దుతు పలకడం లేదు. మూడింట ఒక వంతు మంది ఇప్పటికే సైన్యానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారని నొట్టింగ్హమ్ యూనివర్సిటీ సర్వేలో అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
గ్రే జోన్ వ్యూహాలను చైనా ఎప్పటి నుంచి అమలు చేస్తోంది?
తైవాన్, అమెరికాల మధ్య పైస్థాయి రాజకీయ నాయకులు పర్యటనలు జరిగేటప్పుడు చైనా ఇలాంటి వ్యూహాలను అమలు చేస్తోంది.
ఆగస్టు 2022లో అప్పటి అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసి పర్యటన అనంతరం వారం రోజులపాటు చైనా విన్యాసాలు చేసింది. దీనిలో నాలుగు రోజులు బాంబులు పేలుస్తూ విన్యాసాలు చేసింది. ఆ తర్వాత జలాంతర్గామి దాడుల విన్యాసాలు కూడా నిర్వహించింది.
ఆ తర్వాత ఏప్రిల్‌లో కాలిఫోర్నియాలో అప్పటి అమెరికా స్పీకర్ కెవిన్ మెకార్తీని తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ కలిసినప్పుడు కూడా షాంగ్‌డాంగ్ విమాన వాహj నౌకతో విన్యాసాలు చేపట్టింది.
మరోవైపు తైవాన్‌కు తూర్పున పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలోకీ చైనా యుద్ధ విమానాలు పంపించింది. సాధారణంగా ఎప్పుడూ తైవాన్‌కు పశ్చిమంగానే మాత్రమే చైనా విన్యాసాలు చేసేది. ఆ విన్యాసాలతో తూర్పు వైపు నుంచి కూడా దాడి చేయగలమనే సంకేతాలను చైనా ఇచ్చింది. మొత్తంగా తైవాన్‌ను అన్నివైపుల నుంచీ ముట్టడించగలమనే సంకేతాలను చైనా ఇస్తోంది. అయితే, ఈ వ్యూహంలో చైనా ఎంత మాత్రమూ విజయం సాధించలేదని, ఎందుకంటే ఈ లోగా మిత్ర దేశాల నుంచి ఆయుధాలు, మద్దతును తైవాన్ కూడగట్టగలదని అమెరికా అధికారులు అంటున్నారు.
అమెరికాలో తైవాన్ ఉపాధ్యక్షుడు విలియం లాయ్ పర్యటన అనంతరం సెప్టెంబరులోనూ విన్యాసాలను చైనా నిర్వహించింది. 2024 జనవరిలో జరుగబోయే తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో ముందంజలో ఉన్నట్లుగా భావిస్తున్న లాయ్ తాజా పర్యటనతో మరిన్ని తలనొప్పులు తప్పవనే సంకేతాలను చైనా ఇచ్చింది.
ఇలాంటి వ్యూహాలను తైవాన్‌కు మాత్రమే చైనా పరిమితం చేయలేదు. మొత్తం దక్షిణ చైనా సముద్రంలో అన్ని దేశాల విషయంలోనూ ఇలాంటి ఎత్తుగడలనే అనుసరిస్తోంది.
అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో ఒకటైన ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలో చమురు, గ్యాస్ నిక్షేపాలున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు.
ఈ వివాదాస్పద ప్రాంతంలో కొన్ని కృత్రిమ దీవులను చైనా నిర్మిస్తోంది.
అయితే, ఈ ప్రాంతాలు తమకు చెందుతాయని ఫిలిప్పీన్స్, తైవాన్, మలేసియా, వియత్నాం, బ్రూనై కూడా చెబుతున్నాయి. ఇక్కడ ఫిలిప్పీన్స్ నౌకలను అడ్డుకునేందుకు భారీగా కోస్టు గార్డు, మిలీషియా నౌకలను చైనా మోహరిస్తోంది.
ఈ వివాదానికి సంబంధించిన కేసులో ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్‌లో చైనాపై ఫిలిప్పీన్స్ విజయం సాధించింది. అయితే, దీన్ని చైనా పరిగణలోకి తీసుకోవడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ గ్రే జోన్ వ్యూహాలతో ముప్పు పెరుగుతుందా?
ఇలాంటి విన్యాసాల వల్ల ఈ ప్రాంతంలో సైనిక మోహరింపులు పెరుగుతున్నాయి. గగనతలంతోపాటు సముద్రంలోనూ సైనిక మోహరింపులు ఎక్కువ అవుతున్నాయి.
దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, దాని మిత్ర దేశాలు కూడా విన్యాసాలు చేపడుతున్నాయి. ఇటీవల అమెరికా, ఫిలిప్పీన్స్ కూడా ఇలానే విన్యాసాలు చేపట్టాయి.
ఒకవేళ ఇక్కడ రెండు వైపులా యుద్ధానికి రెచ్చగొట్టే ఉద్దేశాలు లేకపోయినప్పటికీ, ఇలాంటి బలప్రయోగాల వల్ల సైన్యంపై వెచ్చించాల్సిన ఖర్చు భారీగా పెరుగుతోందని నిపుణులు అంటున్నారు.
అమెరికాతో చర్చలను మళ్లీ మొదలుపెట్టినప్పటికీ, తైవాన్ విషయంలో వెనక్కి తగ్గే అవకాశంలేదని చైనా సంకేతాలు ఇస్తోంది.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ విధానాల్లో భాగంగా మరిన్నిసార్లు విదేశాల గగనతలాల్లోకి వెళ్తామని సంకేతాలను చైనా ఇస్తోందని జిట్టర్ అన్నారు.
‘‘బల ప్రయోగాన్ని ఉపయోగించలేమని చెప్పలేం. చైనాలో తైవాన్ కలవాల్సిందే’’ అని జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు.
అయితే, మరింత బలప్రయోగంతో చైనా ముందుకు వెళ్తే, తైవాన్ నాయకుడు లాయ్ వచ్చే జనవరి ఎన్నికల్లో విజయం సాధించడానికి మార్గం సుగమం అవుతుందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అదే సమయంలో వచ్చే ఏడాది ఫుజియాన్ విమాన వాహక నౌకను కూడా చైనా అమ్ముల పొదిలో చేర్చుకోబోతోంది. దీని వల్ల తైవాన్ జలసంధిని దిగ్బంధించే శక్తి చైనాకు మరింత పెరిగే అవకాశముందని తైవాన్ అంచనా వేస్తోంది.
అయితే, భవిష్యత్తులో చైనా యుద్ధ విన్యాసాలు మరింత పెరుగుతాయని జిట్టర్ అంచనా వేస్తున్నారు.
‘‘అవి అలా పెరుగుతూనే ఉంటాయి. బహుశా నేరుగా దాడి మొదలయ్యేవరకూ అవి పెరుగుతూ ఉండొచ్చేమో’’ అని ఆయన అన్నారు.
(అదనపు రిపోర్టింగ్: బీబీసీ మానిటరింగ్)
ఇవి కూడా చదవండి:
- సిక్కిం ఆకస్మిక వరదల్లో 22 మంది జవాన్లు సహా 102 మంది గల్లంతు, క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?
- ఏషియన్ గేమ్స్: ఈ ఫోటోను చైనా ఎందుకు సెన్సార్ చేసింది?
- పారిస్‌పై నల్లుల దండయాత్ర, భయపడిపోతున్న జనం, ఎక్కడ చూసినా నల్లులే..
- వరల్డ్ కప్ 2023: ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు? లైవ్ ఎక్కడ వస్తుంది?
- శ్రీదేవి ఉప్పు తినకపోవడం వల్లే చనిపోయారా? బోనీ కపూర్ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














