క్రికెట్ వరల్డ్ కప్ 2023: టీమ్ ఇండియా స్పీడ్‌కు బ్రేక్ వేయగల జట్టు ఏదైనా ఉందా?

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అభిజీత్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారీ విజయంతో భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ ఇప్పటికే నంబర్-1లో ఉంది. వరల్డ్ నంబర్-3 ర్యాంక్‌లో ఉన్న ఆస్ట్రేలియాను ఓడించి టోర్నీ ప్రారంభించింది టీమిండియా.

ఇపుడు వరల్డ్ నంబర్-2 ర్యాంకర్ అయిన పాకిస్థాన్‌ జట్టునూ ఓడించింది.

పాకిస్థాన్ జట్టు 191 పరుగులకే ఆలౌట్ కావడం క్రీడా నిపుణులనే కాకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కూడా ఆశ్చర్యపరిచింది.

ఇది 190 పరుగుల పిచ్ కాదని, 280-290 స్కోరు చేయడం చూస్తున్నామని మ్యాచ్ అనంతరం రోహిత్ వ్యాఖ్యానించాడు. అంతేకాదు, తన జట్టు ఆటగాళ్లను ఆయన ప్రశంసించాడు.

ప్రస్తుత భారత ప్రపంచకప్ జట్టు పేపర్‌పైనే కాదు మైదానంలో కూడా చాలా బలంగా కనిపిస్తోంది. ఈ భారత జట్టు బలాబలాలేంటి? ప్రత్యర్థి జట్లు ఎలా ఉన్నాయి? ఏ జట్టు టఫ్ ఫైట్ ఇవ్వనుంది?

టీమిండియా

ఫొటో సోర్స్, Getty Images

మూడు మ్యాచ్‌లలో 28 వికెట్లు తీసిన బౌలర్లు

పాకిస్తాన్ మ్యాచ్‌లో బుమ్రా స్లో కట్టర్‌తో వికెట్ ఆఫ్ స్టంప్‌ పడగొట్టి ఫామ్‌లో ఉన్న మహ్మద్ రిజ్వాన్‌‌ను ఔట్ చేశాడు. ఈ బంతిని చాలామంది క్రీడా విశ్లేషకులు ప్రశంసించారు.

''జడ్డూ బాల్‌ స్పిన్‌ అవడం చూశాను. అందుకే, స్లో బాల్‌లా వేశా" అని మ్యాచ్ అనంతరం బుమ్రా అన్నాడు. మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా బుమ్రాపై ప్రశంసలు కురిపించారు.

భారత బౌలర్లలో పాకిస్తాన్‌పై బౌలింగ్‌ చేసే అవకాశం ఎవరికి దొరికినా వికెట్లు పడగొట్టారు. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, పాండ్యా, జడేజాలు రెండేసి వికెట్లతో సత్తా చాటారు.

పాకిస్థాన్‌తో పాటు ఆస్ట్రేలియాను కూడా ఆలౌట్ చేసిన బౌలర్లు వీళ్లే. టోర్నీలో ఇప్పటివరకు భారత బౌలర్లు 3 మ్యాచ్‌ల్లోనే 28 వికెట్లు తీశారు.

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా (7 వికెట్లు) నిలిచాడు.

ఇదే జాబితాలో ఐదో స్థానంలో మరో టీమిండియా ప్లేయర్ రవీంద్ర జడేజా ఉన్నాడు.

మహమ్మద్ షమీ వంటి సీనియర్ బౌలర్లు కూడా డగౌట్‌లో ఛాన్స్ కోసం వేచి చూస్తున్నారు.

వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన భారత బౌలర్‌ షమీ. అయితే క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్ల జోడీని విడదీసే బౌలర్‌గా పేరు సంపాదించుకోవడంతో పాటు, బ్యాటింగ్ చేయగల శార్దూల్‌కు టీం ఎలెవన్‌లో చోటు దక్కుతోంది.

టీమిండియా

ఫొటో సోర్స్, Getty Images

బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్

ఈ టోర్నీలో టీమిండియా బౌలర్లు మంచి ప్రదర్శన కనబరుస్తుండగా, బ్యాటింగ్‌లో కెప్టెన్‌ రోహిత్ ముందుండి నడిపిస్తున్నాడు.

రోహిత్ ఈ ప్రపంచకప్‌‌ మొదటి మ్యాచ్‌లో డకౌట్‌‌గా వెనుదిరిగాడు. కానీ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో (సెంచరీ, హాఫ్ సెంచరీ) చెలరేగాడు.

ఆస్ట్రేలియాపై టాపర్డర్ విఫలం కావడంతో, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ బాధ్యతాయుతంగా ఆడారు.

ఆ తర్వాత మ్యాచ్​లలో కెప్టెన్ రోహిత్ అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ జట్ల బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ జట్టును విజయపథంలో నడిపించాడు.

టీమిండియా కీలక బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు పూర్తి లయలో కనిపిస్తున్నారు. మిడిలార్డర్ బ్యాటర్స్ కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మంచి ఫామ్ కనబరుస్తున్నారు.

ఇపుడు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. దీంతో భారత బ్యాటింగ్ దుర్భేధ్యంగా మారింది.

ఫీల్డింగ్ అదుర్స్

బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో కూడా టీమిండియా రాణిస్తోంది.

జట్టు చాలా కష్టపడుతోందని, అది మైదానంలో కూడా కనిపిస్తోందని తొలి మ్యాచ్‌ విజయం అనంతరం రోహిత్ వ్యాఖ్యానించాడు.

టీమిండియా ఎలెవన్ ఆటగాళ్లతో పాటు జట్టులో ఫీల్డింగ్ చేయడానికి వచ్చే సబ్‌స్టిట్యూట్స్ కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు.

మొత్తంమీద టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. అందుకే భారత జట్టును ఓడించడం ప్రత్యర్థికి అంత సులువుగా కనిపించడం లేదు.

అలాగే, భారత జట్టుకు సొంత మైదానంలో అద్వితీయ రికార్డు సైతం ఉంది. గత 25 వన్డేల్లో కేవలం ఐదింటిలో మాత్రమే ఓడింది.

వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌ను ఓడించగలవా?

ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి జట్లు బలంగా కనిపిస్తున్నాయి. వాటి ఆటతీరు కూడా బాగానే ఉంది. టీమిండియా రాబోయే ప్రధాన మ్యాచ్‌లు ఈ జట్లతోనే జరగనున్నాయి.

శ్రీలంక జట్టుతో కూడా టీమిండియా తలపడనుంది. అయితే, ఇప్పటికే శ్రీలంక జట్టు బలహీనంగా ఉంది. తాజాగా జట్టు కెప్టెన్ దసున్ షనక గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.

ఈ టోర్నీలో శ్రీలంక ప్రదర్శన ఏమంత బాగాలేదు. పాకిస్తాన్‌పై 344 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ దాన్ని కాపాడుకోలేకపోయింది.

మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టు భారీ తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.

అయితే మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో 9 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది.

అయితే, గత నెలలో ఇదే ఇంగ్లండ్ జట్టు వరుసగా మూడు వన్డేల్లో కివీస్ జట్టును ఓడించింది. ఈ ఏడాది భారత్‌తో ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. భారత గడ్డపై ఇంగ్లండ రికార్డు బాగాలేదు.

ఇక్కడ టీమిండియాతో ఆడిన గత 25 మ్యాచ్‌లలో ఇంగ్లండ్ ఐదు మాత్రమే గెలిచింది.

న్యూజిలాండ్‌ను పరిశీలిస్తే ఈ జట్టు ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తోంది.

ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ జట్లను భారీ తేడాతో ఓడించింది. గత ఆరు వన్డేల్లో ఒక్కటీ ఓడిపోలేదు.

అయితే, ఉపఖండంపై కివీస్‌కు పేలవ రికార్డు ఉంది. ఇప్పటివరకు భారత్‌పై 38 మ్యాచ్‌లు ఆడగా కేవలం 8 మాత్రమే గెలిచింది.

టీమిండియాపై ఆడిన గత 17 మ్యాచ్‌లలో న్యూజిలాండ్ కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించింది.

కుల్దీప్ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణాఫ్రికాతో టఫ్ ఫైట్

ఉపఖండంలో భారత్‌పై మంచి రికార్డున్న జట్టు దక్షిణాఫ్రికాయే.

ఈ ఏడాది రెండు జట్లు ఒకదానితో మరొకటి తలపడలేదు. కానీ, గత ఏడాది ఉపఖండంలో దక్షిణాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడింది.

కాగా, గత 10 మ్యాచ్‌లలో భారత్‌పై ఆరు గెలిచింది దక్షిణాఫ్రికా. దీంతో రెండు జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.

భారత్ తన తదుపరి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో ఆడనుండగా చివరి లీగ్ మ్యాచ్ నెదర్లాండ్స్‌తో ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)