డిజిటల్ నోమాడ్: పని చేసుకుంటూనే ప్రపంచాన్ని చుట్టేయడం ఎలాగంటే....

ఫొటో సోర్స్, MAYANAK
- రచయిత, ఫాతిమా ఫర్హీన్
- హోదా, బీబీసీ కోసం
చిన్నతనంలో మనలో చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది. పెద్దవ్వగానే ప్రపంచమంతా చుట్టేయాలని అనుకుంటూ ఉంటాం. కానీ, మనం పెద్దైన తర్వాత, జీవితం మరోలా ఉంటుంది.
చదువులు, ఉద్యోగం, ఇల్లు, కుటుంబాన్ని పోషించడానికి డబ్బులు సంపాదించడం.. ఇలా వీటిలోనే అత్యధికుల జీవితం గడిచిపోతుంటుంది.
ప్రపంచమంతా చుట్టేయాలనే కలలు తీరని కోరికలుగా మిగిలిపోతుంటాయి.
కానీ, మీకో విషయం తెలుసా? డిజిటల్ నోమాడ్‌గా మారితే ప్రపంచమంతా ట్రావెల్ చేయొచ్చు. అంతేకాదు, మీ ఉద్యోగానికి ఇబ్బంది లేకుండానూ చూసుకోవచ్చు.

ఫొటో సోర్స్, MAYYUR NOMADGAO
డిజిటల్ నోమాడ్‌లంటే ఎవరు?
హిందీ సినిమాల్లో ‘బంజారాల’ను మీరు చూసుండొచ్చు. లేదా నోమాడ్ అనే పదాన్ని వినుండొచ్చు.
డిజిటల్ నోమాడ్‌లు కూడా నోమాడ్‌ల మాదిరిగానే నివసిస్తుంటారు.
ప్రపంచంలో వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ తిరుగుతుంటారు.
ఇతర నోమాడ్‌లకు, డిజిటల్ నోమాడ్‌లకు మధ్య ఉన్నది ఒకే ఒక్క తేడా.
డిజిటల్ నోమాడ్‌లు తమకు నచ్చిన ఉద్యోగాలను చేసుకునేలా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలను తమ వెంట పెట్టుకుంటారు.

ఫొటో సోర్స్, MAYYUR NOMADGAO
డిజిటల్ నోమాడ్‌ల ప్రయాణం ఎలా సాగుతుంది?
స్టీవెన్ కే. రాబర్ట్స్ ప్రపంచంలోనే తొలి డిజిటల్ నోమాడ్. 1983, 1991 మధ్య కాలంలో అమెరికాలో సైకిల్‌పై ఆయన పది వేల కిలోమీటర్లు ప్రయాణించారు.
తన పనిచేసుకునేందుకు ఆయన వద్ద ఎప్పుడూ రేడియో, ఇతర పరికరాలు ఉండేవి.
డిజిటల్ నోమాడ్ అనే పదాన్ని 1990 కాలం నుంచే వాడటం ప్రారంభించారు.
కంప్యూటర్లు, ఇంటర్నెట్, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ల వాడకం పెరిగిన తర్వాత, దీనికి మరింత ప్రోత్సాహం లభించింది.
కార్ల్ మలాముడ్ 1992లో తాను రాసిన ట్రావెలాగ్ ‘ఎక్స్‌ప్లోరింగ్ ది ఇంటర్నెట్’లో తొలిసారి డిజిటల్ నోమాడ్ అనే పదాన్ని వాడారు.
1997లో సుగియో మకిమోటో, డేవిడ్ మేనర్స్ డిజిటల్ నోమాడ్ అనే పుస్తకాన్ని రాశారు.
అప్పటి నుంచి, ఈ పదం వాడకం పెరగడమే కాకుండా, ఈ రకమైన వ్యక్తులు కూడా పెరిగారు.
అమెరికా కంపెనీ ఎంబీవో పార్టనర్స్ విడుదల చేసిన 2023 నివేదికలో, ప్రస్తుతం అమెరికాలో 17.3 మిలియన్ల మంది ఉద్యోగులు డిజిటల్ నోమాడ్‌లుగా మారారని తెలిపింది.
వచ్చే రెండు మూడేళ్లలో 24 మిలియన్ల మంది ప్రజలు డిజిటల్ నోమాడ్‌లుగా మారే ఆకాంక్షతో ఉన్నారని ఇది పేర్కొంది.

ఫొటో సోర్స్, MAYYUR NOMADGAO
డిజిటల్ నోమాడ్‌లతో పెరుగుతున్న వ్యాపారం
ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో డిజిటల్ నోమాడ్‌లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 787 బిలియన్ డాలర్లు(రూ.65,52,628 కోట్లు) అందజేస్తారని తెలిసింది.
డిజిటల్ నోమాడ్‌ల ట్రెండ్ ఇలానే కొనసాగితే, దానికి సంబంధించిన వ్యాపారాలు పెరగడం కూడా మొదలవుతుంది.
రిమోట్‌గా పనిచేసే ఉద్యోగులకు సేఫ్టీవింగ్ అనే స్టార్టప్ ప్రయాణ, ఆరోగ్య, వైద్య బీమాలను అందిస్తోంది.
గత ఏడాది 25 మిలియన్ డాలర్ల(రూ.208 కోట్ల) వ్యాపారం చేసినట్లు సేఫ్టీవింగ్ తెలిపింది. సెలినా డిజిటల్ నోమాడ్‌ల కోసం హాస్టల్స్, హోటల్స్ సౌకర్యాన్ని కల్పిస్తోంది.
2021తో పోలిస్తే 2022లో కంపెనీ వ్యాపారాలు 98 శాతం పెరిగినట్లు తన వార్షిక రిపోర్టులో సెలినా తెలిపింది.
జర్మనీకి చెందిన జోహన్నెస్ వోల్క్నర్ 2015లో నోమాడ్ క్రూజ్‌ల సర్వీసులు మొదలు పెట్టారు.
డిజిటల్ నోమాడ్‌లకు ఇది తొలి మొబైల్ కాన్ఫరెన్స్.
నోమాడ్ క్రూజ్‌లలో ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఒకరికొకరు తమ నైపుణ్యాలను పంచుకుంటుంటారు. నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇతరులతో కలిసి జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఫొటో సోర్స్, MAYYUR NOMADGAO
భారత్‌లో డిజిటల్ నోమాడ్‌ల సంగతేంటి?
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ నోమాడ్‌లు పెరుగుతున్నప్పుడు, భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు.
డిజిటల్ నోమాడ్‌ల ట్రెండ్ భారత్‌లో కూడా పెరుగుతోంది.
ఇది మాత్రమే కాక, చాలా మంది భారతీయులు దీనికి ఆకర్షితులవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజిటల్ నోమాడ్‌లకు భారత్ ఇష్టమైన ప్రదేశంగా మారుతోంది.
ఉదయ్‌పూర్‌కు చెందిన మయాంక్ పోఖర్నా తనని తాను డిజిటల్ నోమాడ్‌గా చెప్పుకుంటున్నారు.
2015 తన చదువులు పూర్తయిన తర్వాత బెంగళూరులో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.
అక్కడ ఇల్లు దొరకడం కష్టమైనప్పుడు, కొందరి స్నేహితులతో కలిసి కో-లివింగ్ కంపెనీని ఏర్పాటు చేశారు.
కొన్ని రోజుల పాటు ఆయన ఉద్యోగాన్ని, కంపెనీని రెండింటిన్ని చూసుకున్నారు.
ఆ తర్వాత 2017లో ఉద్యోగాన్ని పూర్తిగా మానేసి, ఈ కంపెనీ ఫుల్ టైమ్ బాధ్యతలు తీసుకున్నారు.
కానీ, కరోనా తర్వాత తన కంపెనీని మూసేసి, కొన్ని రోజుల పాటు ఫ్రీల్యాన్సింగ్ చేశారు.
ఇప్పటి వరకు భారత్‌లో చాలా నగరాలను ఆయన సందర్శించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పదికి పైగా దేశాలలో ఆయన నివసించారు, పనిచేశారు.
తన భార్యతో కలిసి ప్రతి ప్రదేశానికి వెళ్తున్నానని చెబుతున్నారు. తను కూడా ఉద్యోగం చేస్తుందన్నారు.
డిజిటల్ నోమాడ్‌లు పర్యాటకులకు, పౌరులకు మధ్య అనుసంధానంగా ఉంటారని మయాంక్ పోఖర్నా బీబీసీకి చెప్పారు.
అంటే పర్యాటకులు కొద్ది రోజుల కోసం ఏదైనా దేశానికి వెళ్తే, డిజిటల్ నోమాడ్‌లు ఎక్కువ రోజుల కోసం ఆ ప్రదేశానికి వెళ్తుంటారు. ఈ విధంగా పర్యాటకులకు వారు సాయపడుతుంటారు.
వీరు కొన్ని నెలల పాటు ఒకే ప్రాంతంలో ఉంటారు. కొన్నిసార్లు సంవత్సరం లేదా రెండేళ్లు వారెళ్లినా దేశంలో గడుపుతుంటారు.
కానీ స్థిరమైన నివాసాన్ని మాత్రం ఏర్పాటు చేసుకోరు.

ఫొటో సోర్స్, MAYYUR NOMADGAO
కావాల్సిన సదుపాయాలేంటి?
భారత్‌లో అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు ఉన్నాయి. డిజిటల్ నోమాడ్‌లకు రాబోయే గమ్యస్థానంగా భారత్ మారుతోందని మయాంక్ పోఖర్నా అన్నారు.
హైస్పీడ్ ఇంటర్నెట్ అనేది వీరికి అత్యంత ముఖ్యమైనది. భారత్ గత కొన్నేళ్లలో హైస్పీడ్ ఇంటర్నెట్‌లో గొప్ప పురోగతిని సాధించింది.
పర్యటకులను ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం పెద్ద మొత్తంలో వెచ్చిస్తోంది.
డిజిటల్ నోమాడ్‌లు స్థానిక సంస్కృతి, ఆర్థిక వ్యవస్థతో మమేకవుతారని మయాంక్ చెప్పారు.
ఒకవేళ భారత ప్రభుత్వం దీనిపై కాస్త దృష్టి సారించినా, పెద్ద ఎత్తున రాబడులు వస్తాయన్నారు.
భారత్ చాలా పెద్ద దేశం. ఇక్కడ వాతావరణ పరిస్థితులు కూడా భిన్నంగా ఉంటాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు, వారు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశంలో వివిధ ప్రాంతాల్లో నివసించగలరు.
విదేశాల నుంచి భారత్‌కు వచ్చే డిజిటల్ నోమాడ్‌లకు ఎన్నో ప్రయోజనాలున్నాయని, ఇక్కడ ఖర్చులు చాలా తక్కువని మయాంక్ చెప్పారు.
విదేశీ కంపెనీల్లో పనిచేస్తూ డాలర్లు లేదా పౌండ్లను సంపాదిస్తుంటే.. భారత్‌లో నివసించడం వారికి ఎంతో ప్రయోజనకరమని తెలిపారు.
నైపుణ్యాలు కచ్చితంగా అవసరం. కానీ, క్రమశిక్షణతో ఉండటం అత్యంత ముఖ్యమైన విషయని చెప్పారు.
ప్రతి రెండు నెలలకు ఒకసారి ప్రాంతాన్ని మారుస్తుంటే.. మీ ఫిట్‌నెస్‌పై అత్యంత శ్రద్ధ వహించాలి.
ఎంత తక్కువ లగేజీని మీతో తీసుకెళ్తే, అంత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు.
భారత్‌లో నోమాడ్ గ్రామం
డిజిటల్ నోమాడ్‌లకు భారత్ రాబోయే గమ్యస్థానంగా పేర్కొంటే, అది కేవలం నోమాడ్ గ్రామం వల్లనేనని మయాంక్ పోఖర్నా చెప్పారు.
మహారాష్ట్రలోని చిన్న పట్టణం కొల్హాపూర్‌కు చెందిన మయూర్ సోనాటాకే అనే వ్యక్తి నోమాడ్ గ్రామాన్ని ఏర్పాటు చేశారు.
2014 వరకు భారత్‌లో కార్పొరేట్ ఉద్యోగం చేసిన మయూర్, ఆ తర్వాత ఒక అమెరికా కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు.
2016లో తన డిజిటల్ నోమాడ్ ప్రయాణం ప్రారంభమైందని మయూర్ తెలిపారు.
నేపాల్ నుంచి ప్రారంభమైన తన పయనం, ఆగ్నేయాసియా దేశాల గుండా కొనసాగిందన్నారు.
2017 ప్రారంభం నుంచి తాను విదేశీయులను భారత్‌కు ఆహ్వానించడం మొదలు పెట్టానన్నారు.
దీని కోసం మయూర్ గోవా ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. 2019లో నోమాడ్ గ్రామాన్ని నెలకొల్పారు.
డిజిటల్ నోమాడ్‌లు మూడు ముఖ్యమైన డిమాండ్లు చేశారని మయూర్ బీబీసీకి చెప్పారు. వాటిల్లో ఒకటి హై స్పీడ్ ఇంటర్నెట్, రెండు భద్రత, మూడు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు వారి ఒంటరిగా ఫీల్ కాకుండా ఉండటం.
ఈ మూడు విషయాల్లో మయూర్ వారికి భరోసా కల్పించారు.
కానీ, కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంతో, విదేశీయులు ఇక్కడికి రాలేకపోయారు.
కానీ, చాలా మంది భారతీయులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు.
ప్రస్తుతం నోమాడ్ గ్రామాన్ని సందర్శిస్తున్న వారిలో సగం మంది భారతీయులు కాగా, సగం మంది 30కి పైగా దేశాల నుంచి వస్తున్న విదేశీయులు.
డిజిటల్ నోమాడ్‌లు భారత్‌లో పెరుగుతున్నారని మయూర్ చెబుతున్నారు. వీరిలో భారతీయులు, పెద్ద సంఖ్య విదేశీయులు ఉంటున్నారని అన్నారు.
భారత్‌లో డిజిటల్ నోమాడ్‌ల ట్రెండ్ పెరిగేందుకు చాలా సానుకూల అంశాలున్నాయన్నారు. భారత్‌లో యువత చాలా ఎక్కువని తెలిపారు. యువత కూడా పెళ్లిళ్లు ఆలస్యంగానే చేసుకుంటున్నారు.
పిల్లల్ని కనేందుకు వారు అంత ఆతృత చూపించడం లేదు. అందుకే, కపుల్స్ ఇలాంటి అవకాశాలను వదులు కోవాలనుకోవడం లేదు.

ఫొటో సోర్స్, MAYYUR NOMADGAO
భారత్‌లో ఉన్న అవకాశాలేంటి?
భారత్‌లో, ప్రపంచంలో సాంకేతికత అభివృద్ధి వేగంగా జరుగుతోంది. చాలా దేశాల కన్నా భారత్‌లో ఇంటర్నెట్ సౌకర్యాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయి.
ఉదాహరణకు, జూమ్ లేదా గూగుల్ వంటి ఎన్నో కొత్త కొత్త టూల్స్ అందుబాటులోకి వస్తున్నాయి.
గత కొన్నేళ్లలో ప్రజలు ఆదాయం కూడా పెరిగింది.
యువతలో రిస్క్ తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతోంది. ఫ్రీలాన్సర్లుగా మారేందుకు లేదా స్టార్టప్‌లు ఏర్పాటు చేసేందుకు వారు వెనకాడటం లేదు.
వచ్చే ఐదు పదేళ్లలో భారత్‌లో డిజిటల్ నోమాడ్‌ల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని మయూర్ చెప్పారు.
యువత ప్రస్తుతం ఫ్రీలాన్సర్లుగా లేదా రిమోట్ ప్రాంతాల నుంచి లేదా డిజిటల్ నోమాడ్‌లుగా పనిచేస్తున్నారు. వచ్చే కొన్నేళ్లలో వీరు మేనేజర్లుగా మారతారని మయూర్ చెప్పారు.
ప్రస్తుత మేనేజర్లలా కాకుండా రిమోట్ ప్రాంతాల నుంచి పనిచేయాలనుకుంటున్న యువతపై వీరికి మరింత విశ్వాసం ఉంటుందన్నారు.
తర్వాత ఎప్పుడైనా మీరు ఇండోనేషియాలోని బాలి లేదా గోవా బీచ్ వెళ్తే, కొబ్బరి నీళ్లు తాగుతూ ప్రింటెడ్ షర్ట్ వేసుకున్న ఎవరినైనా చూస్తే.. వారిని విదేశీ సందర్శకులుగానే భావించవద్దు. వారు డిజిటల్ నోమాడ్ కూడా కావొచ్చు.
ఇవి కూడా చదవండి:
- భగత్ సింగ్ ఓ విప్లవకారిణితో ప్రేమలో పడ్డారా? ఎవరా మహిళ?
- క్రికెట్ బ్యాట్ కథ: ఎలా పుట్టింది... ఎలా మారుతూ వచ్చింది?
- మ్యాడ్ సినిమా రివ్యూ: జాతిరత్నాలు స్టయిల్లో హ్యాపీడేస్...
- మహాదేవ్ బెట్టింగ్ యాప్ కథ ఏంటి... రణబీర్ కపూర్‌కు ఈడీ ఎందుకు సమన్లు జారీ చేసింది?
- తెలంగాణ: ఇంటి నుంచే ఓటు.. ఎవరు అర్హులు? ఎలా ఉపయోగించుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














