కొండచిలువ నూనెతో పక్షవాతం చికిత్సకు ప్రయత్నం, చివరికి ఏం జరిగిందంటే....

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఎస్. మహేశ్
    • హోదా, బీబీసీ కోసం

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన ఓ వృద్ధుడిని అటవీ శాఖ అధికారులు ఇటీవల అరెస్టు చేశారు. సాధారణంగా పాములను వాటి మాంసం, చర్మం కోసం చంపుతారు. కానీ, ఔషధాల తయారీ కోసం కొండచిలువలను చంపిన ఘటనలు మాత్రం అరుదుగా జరుగుతుంటాయి.

నాగర్‌కోయిల్‌కి సమీపంలోని కల్యాణ్‌కాడుకి చెందిన 75 ఏళ్ల బాల సుబ్రమణియన్ కొండచిలువను చంపి, దాని నుంచి నూనె సేకరించినట్లు అటవీ శాఖాధికారులకు సమాచారం అందింది.

ఆయన ఇంటిపై అటవీ సిబ్బంది దాడులు నిర్వహించినప్పుడు కొండచిలువల నుంచి సేకరించిన నూనెను గుర్తించారు. కొండచిలువను చంపినందుకు ఇండియన్ వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ 9 కింద కేసు నమోదు చేశారు.

పక్షవాతం చికిత్సలో పాము నూనె

ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం కన్యాకుమారి జిల్లా అటవీశాఖ చరిత్రలో ఇదే తొలిసారని కన్యాకుమారి జిల్లా అటవీ శాఖాధికారి (డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ - డీఎఫ్‌వో) ఎం.ఇళయరాజా అన్నారు.

''నేను పాత రికార్డులు కూడా చూశాను. కొండచిలువలను వేటాడినట్లు ఎలాంటి కేసూ నమోదైనట్లు కనిపించలేదు'' ఆయన బీబీసీ‌తో చెప్పారు.

కొండచిలువ కేసులో అరెస్టైన బాల సుబ్రమణియన్ పదేళ్లుగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన విలేజ్ ఫారెస్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.

ఇటీవల గ్రామంలోకి వచ్చిన ఒక కొండచిలువను స్థానికులు పట్టుకున్నారు. బాల సుబ్రమణియన్ అటవీ శాఖ కమిటీలో సభ్యుడిగా ఉండడంతో దానిని వాళ్లు ఆయనకు అప్పగించారు.

బాల సుబ్రమణియన్‌కి పక్షవాత సంబంధిత లక్షణాలతో బాధపడుతున్నాడు. కొండ చిలువ కొవ్వుతో వచ్చిన నూనెతో తన వ్యాధి నయమవుతుందన్న ఆశతో ఆయన దానిని చంపి కొవ్వు నుంచి నూనెను సేకరించారు.

అయితే, ''అతను కొండచిలువలను వేటాడి, వాటిని అమ్ముకునే వ్యక్తి కాదు'' అని డీఎఫ్‌వో ఇళయరాజా చెప్పారు.

అటవీ సిబ్బంది అదుపులో బాల సుబ్రమణియణ్‌

కన్యాకుమారి రిజర్వ్ ఫారెస్ట్‌లో పానగుడి, ఆరల్వాయిమొళి ప్రాంతాల్లో అడవులు ఉన్నాయి. అటవీ భూముల్లో అక్కడక్కడా లీజ్ ప్రాతిపదికన గాలిమరలు (విండ్ టర్బైన్స్) ఏర్పాటయ్యాయి. అది నివాస ప్రాంతం కాకపోవడం, జనసంచారం కూడా పెద్దగా ఉండకపోవడంతో ఆ ప్రాంతంలో అటవీ జంతువులు తిరుగుతుంటాయి.

ఉడుం మాంసం తింటే కీళ్లవాతం తగ్గుతుందన్న నమ్మకం ఈ ప్రాంతంలో ఉంది. అందువల్ల ఇక్కడ ఉడుములను వేటాడుతుంటారు.

''ఉడుములను పట్టుకోవడం అంత సులభం కాదు. వాటిని పట్టుకోవడానికి కొందరు వ్యక్తులు ఉన్నారు. వారిపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వారిని అదుపులోకి తీసుకుంటూ ఉండడంతో ఉడుముల వేట ఇప్పుడు తగ్గింది.

అలాగే, ఈ ప్రాంతంలో సాంబార్ డీర్ (ఒక రకం జింక)లను కూడా వేటాడుతుంటారు. ఎక్కడికక్కడ అటవీ శాఖ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటుండటంతో వేట తగ్గింది'' అని ఇళయరాజా చెప్పారు.

ఇళయరాజా, డీఎఫ్‌వో

ఔషధాల కోసం పాముల వేల చాలా అరుదు

ఔషధ నూనె కోసం కొండచిలువలను చంపడం చాలా అరుదని కన్జర్వేషన్ క్రిమినాలజీ రీసెర్చర్ (అటవీ జంతువుల సంబంధిత నేరాలపై పరిశోధకులు) శంకర్ ప్రకాష్ చెప్పారు.

పశ్చిమ కనుమల్లో వైల్డ్‌లైఫ్ క్రైమ్ ప్రివెన్షన్ (వన్యప్రాణి నేర నివారణ)లో అటవీ శాఖ, గిరిజనుల పాత్ర అనే అంశంలో ఆయన పరిశోధనకు గానూ శంకర్ ప్రకాష్ డాక్టరేట్ పొందారు.

''విషపూరితం కాని కొండచిలువలు ఇండియన్ వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ కిందకు వస్తాయి.

ఆగ్నేయాసియా (సౌత్ ఈస్ట్ ఏసియా) దేశాల్లో సంప్రదాయ ఔషధాల తయారీ కోసం అటవీ జంతువుల అక్రమ రవాణా జరుగుతుంటుంది, వాటి శరీర భాగాలను నాటుమందుల తయారీలో ఉపయోగిస్తారు. కానీ పాముల విషయానికి వస్తే, వాటి చర్మం కోసం, లేదంటే పెంపుడు జంతువులుగా పెంచుకునేందుకు తరలిస్తుంటారు.

భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లోనూ మాంసం కోసం పాములను చంపుతుంటారు'' అని శంకర్ ప్రకాష్ చెప్పారు.

శంకర్ ప్రకాష్, పరిశోధకులు

విదేశాల్లో ఎక్కువగా పెంచుకునే బాల్ పైతాన్లు (కొండచిలువల్లో ఒక రకం), తాబేళ్లు, మకాక్స్ (కోతుల్లో ఒక రకం), చిలుకలు భారత్‌కు స్మగ్లింగ్ ద్వారా వస్తుంటాయి.

అలా వచ్చేవి ఎక్కువగా థాయిలాండ్‌ నుంచి ఉంటాయి. స్మగ్లింగ్ ద్వారా వచ్చిన జంతువుల్లో ఎక్కువ శాతం పెంపుడు జంతువులుగా సంపన్నుల ఇళ్లకు చేరుతుంటాయి.

''అటవీ జంతువులను భారత్‌కు తరలించే క్రమంలో కొన్నిసార్లు ఎయిర్‌పోర్టుల్లో దొరికిపోతుంటారు. అలాంటి ఘటనలపై అధికారులు కేసులు నమోదు చేసి వాటిని ఆయా దేశాలకే తిప్పి పంపించేస్తారు'' అని శంకర్ ప్రకాష్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)