‘రెండేళ్లుగా పీరియడ్స్ రావట్లేదు. సెక్స్‌లో పాల్గొంటే చాలా ఇబ్బందిగా ఉంటోంది. ఎందుకిలా?’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డా. శిల్పా చిట్నీస్ జోషి
- హోదా, బీబీసీ కోసం
కేసు 1: ‘‘డాక్టర్ నాకు పీరియడ్స్ ఆగిపోయి రెండేళ్లు అవుతోంది. అయితే, సెక్స్ చేసేటప్పుడు చాలా నొప్పి వస్తోంది. నేను నా భర్తకు ఏదీ సరిగా చెప్పలేకపోతున్నాను. ఆయన దీన్ని అబద్ధం అనుకుంటారేమోనని భయమేస్తోంది. నేను ఏం చేయాలి?’’
ఈ పేషెంట్ చాలా నిరాశలో ఉన్నట్లు ఇది చదివితే తెలుస్తోంది.
కేసు 2: ‘‘డాక్టర్ నాకొక స్నేహితురాలు ఉంది. కొన్ని నెలలుగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఒకప్పుడు ఆమె చాలా ఉత్సాహంగా ఉండేది. కానీ, నిరుడు ఆమె హిస్టెరెక్టమీ ఆపరేషన్ చేయించుకుంది. ఆ తర్వాత నుంచి ఆమె కుంగుబాటుకు గురైనట్లు కనిపిస్తోంది. భర్తకు, ఆమెకు మధ్య ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి.’’
తన స్నేహితురాలి గురించి ఈ వివరాలను నా పేషెంట్లలో ఒకరు చెప్పారు. ఆ తర్వాత తన స్నేహితురాలిని నా క్యాబిన్‌కు తీసుకొచ్చారు.
ఆమె మొహం పాలిపోయినట్లు కనిపించింది. బరువు కూడా పెరిగింది. జుట్టు కూడా కాస్త చెదిరిపోయినట్లుగా ఉంది. ఆమెలో ఈ లక్షణాలను ముందే నేను ఊహించాను.
ఆమెతో కాసేపు మాట్లాడిన తర్వాత, హిస్టెరెక్టమీ (గర్భాశయాన్ని తొలగించే చికిత్స) ఆపరేషన్ తర్వాత, ఆమె తన స్త్రీతత్వాన్ని కోల్పోయినట్లుగా భావిస్తున్నారని అనిపించింది. కొన్ని నెలలపాటు ఫైబ్రాయిడ్ల వల్ల ఎక్కువగా బ్లీడింగ్ కావడంతో అయిష్టంగానే ఆమె ఆపరేషన్ చేయించుకున్నారు. నిజానికి ఆపరేషన్ చేయించుకోవాల్సింది కాదని, మెనోపాజ్ వరకూ ఈ నొప్పిని భరించుండాల్సిందని ఆమె బాధపడుతున్నారు.
అయితే, చుట్టుపక్కల వారి వ్యాఖ్యలతోపాటు ఆమె ఆలోచనలూ కూడా ఆమెపై ప్రభావం చూపిస్తున్నాయి. దీని వల్ల ఆమె సెక్స్ జీవితం ప్రభావితం అవుతోంది. ఫలితంగా ఆమె వైవాహిక జీవితంలోనూ సమస్యలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
అప్పుడు యోని పొడిబారడం మొదలవుతుంది
మెనోపాజ్ సమయంలో చాలా మంది మహిళల రుతుస్రావం ఆగిపోతుంది. కొందరిలో కొన్ని ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. అయితే, వీరిలో చాలా కొద్ది మంది మాత్రమే మెనోపాజ్ సెక్స్ లైఫ్ సమస్యలతో వైద్యుల దగ్గరకు వస్తుంటారు.
చాలా మంది ఇక తమ శృంగార జీవితం కథ ముగిసిపోయిందని భావిస్తారు.
మెనోపాజ్ సమయంలో శరీరంలో హార్మోన్ల స్థాయులు తగ్గిపోవడంతో యోని పొడిబారడం మొదలవుతుంది. ఫలితంగా చాలా మంది మహిళలు సెక్స్‌లో పాల్గొన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు.
దీని వల్ల చాలా మందిలో సెక్స్ చేయాలనే కోరిక తగ్గిపోతుంది. అయితే, అదే సమయంలో వారి జీవిత భాగస్వామిలో కోరికలు ఉంటాయనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. మరోవైపు పిల్లలు కూడా పెద్దవారు అయ్యారు కదా, ఇంకా సెక్స్ జీవితం గురించి ఎందుకు ఆలోచించడమని చాలా మంది మహిళలు భావిస్తారు.
ఇది చాలా తప్పు. దీని వల్ల ఆమె పక్కనుండే జీవిత భాగస్వామి కూడా ఇబ్బంది పడతారు. ఫలితంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. ఇద్దరి మానసిక స్థితులపైనా ప్రభావం పడొచ్చు.
అందుకే మహిళల్లో మెనోపాజ్ సమయంలో సెక్స్ జీవితానికి సంబంధించిన అపోహల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
అయితే, దీని కంటే ముందుగా మెనోపాజ్ అంటే ఏమిటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి? లాంటివి తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
మెనోపాజ్ అంటే?
స్త్రీలలో పీరియడ్లు ఆగిపోయే దశను మెనోపాజ్‌గా పిలుస్తారు. సాధారణంగా 51 ఏళ్ల వయసులో ఇది మొదలవుతుంది.
మహిళల ప్రత్యుత్పత్తి దశలో ఇదే చివరిది. దీని తర్వాత మరో కొత్త జీవితం మొదలవుతుంది.
మెనోపాజ్ మొదట్లో మహిళల రుతుచక్రం అస్తవ్యస్తం అవుతుంది. దీన్నే పెరీ-మెనోపాజ్ అంటారు. సాధారణంగా ఇది 46 ఏళ్ల వయసులో మొదలవుతుంది.
ఈ దశలో బ్లీడింగ్ కాస్త ఎక్కువగా అవుతుంది. మానసికంగా, శారీరకంగా వారు అలసిపోతుంటారు. ముందెన్నడూ చూడని మార్పులు వీరి శరీరంలో కనిపిస్తుంటాయి.
హార్మోన్ల మార్పుల వల్లే ఇలా
మహిళల హార్మోన్ల స్థాయిల్లో మార్పులే దీనికి కారణం. పీరియడ్స్‌ను ఈస్ట్రోజెన్‌గా పిలిచే హార్మోన్ నియంత్రిస్తుంటుంది.
మహిళల వయసు పెరిగేకొద్దీ వారిలో వారి అండాశయంలో అండాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది.
ఒకానొక దశలో పతాకస్థాయికి వెళ్లిన ఈస్ట్రోజెన్ స్థాయిలు మళ్లీ పడిపోవడం మొదలవుతుంది. అప్పుడే మెనోపాజ్ లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతాయి.
అయితే, ఇవన్నీ ఏదో ఒక రోజులో జరిగిపోవు. దీనికి కొన్ని ఏళ్ల సమయం పడుతుంది. క్రమంగా హార్మోన్ల స్థాయులు పడిపోతాయి. ఇలా హార్మోన్లు తగ్గిపోయేటప్పుడు మహిళల శరీరంలోనూ మార్పులు కనిపిస్తాయి.
అండాశయంలో అండాల సంఖ్య తగ్గిపోతే, ఇక గర్భధారణ సాధ్యంకాదు. మెనోపాజ్ లక్షణాల్లో ఈ అండాలు తగ్గిపోవడమూ ఒక లక్షణం.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు సెక్స్ కోరికలు తగ్గిపోతాయి?
మెనోపాజ్ సమయంలో మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయులు తగ్గిపోతాయి. దీంతో యోని పొడిబారుతుంది. ఫలితంగా సెక్స్‌లో పాల్గొనడం చాలా కష్టం అవుతుంది.
ఈ ప్రభావంతో సెక్స్ కోరికలు తగ్గిపోవడంతోపాటు యోని లోపల భాగాలు కూడా ముడుచుకుపోవడం మొదలవుతుంది. ఫలితంగా సెక్స్ చేసేటప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. కొంతమంది నొప్పి నుంచి దూరంగా ఉండేందుకు అసలు సెక్స్ చేయడమే మానేస్తుంటారు. ఫలితంగా భార్యా-భర్తల మధ్య సంబంధాలు దెబ్బతింటుంటాయి.
అయితే, ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
మొదటగా దీని కోసం మీరు గైనకాలజిస్టును కలవాల్సి ఉంటుంది. యోని పొడిబారడం, ఇతర ఇన్ఫెక్షన్లు, నొప్పిని సాధారణంగా అసలు భావించకూడదు.
ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించే చాలా క్రీమ్‌లు, జెల్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం ద్వారా సెక్స్ జీవితాన్ని మళ్లీ ఆస్వాదించొచ్చు కూడా.
సాధారణంగా హిస్టెరెక్టమీ ఆపరేషన్లను కూడా మెనోపాజ్ సమయంలోనే ఎక్కువ చేస్తుంటారు. అయితే, దీనికి రెండు నెలల తర్వాత మళ్లీ సెక్స్ చేయొచ్చు. ఆ ఆపరేషన్ వల్ల సెక్స్ జీవితం ముగిపోయిందని అసలు అనుకోకూడదు.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి ఆహారం, మందులు తీసుకోవాలి?
45 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మెనోపాజ్ తర్వాత ఎముకల శక్తి కూడా తగ్గుతుంది. మరోవైపు గుండె జబ్బులు వచ్చే ముప్పు కూడా ఎక్కువే.
అందుకే ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
ఈ వయసులో డాక్టర్ల సూచనలపై విటమిన్లు, కాల్షియం ట్యాబ్లెట్లు తీసుకోవాలి.
రోజుకు గంటసేపు వ్యాయామం కూడా చేయాలి.
మన సమాజంలో మధుమేహ కేసులు చాలా పెరుగుతున్నాయి. అందుకే కార్బోహైడ్రేట్లను తగ్గించుకోవడం కూడా కొంత మేలు చేస్తుంది. ముఖ్యంగా అన్నం, బంగాళ దుంపలు, బాగా ప్రాసెస్ చేసిన పిండి, పంచదార, తేనె తీసుకోవడాన్ని తగ్గించాలి. అదే సమయంలో చికెన్, గుడ్లు, పప్పుధాన్యాలను తీసుకోవడాన్ని పెంచాలి.
ఏడాదికి ఒకసారి వైద్యుల సూచనలపై అన్ని పరీక్షలు చేయించుకోవాలి.
ఒకవేళ మధుమేహం కూడా ఉంటే యోని పొడిబారడంతోపాటు మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, దురద రావచ్చు. అందుకే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. లేకపోతే మందులు తీసుకున్నా ప్రయోజనం ఉండదు. అయితే, ఈ విషయంలో సకాలంలోనే వైద్యులను సంప్రదించాలి.
మెనోపాజ్ తర్వాత ఎముకలు బలహీనం అవుతాయి. అందుకే వైద్యుల సూచనలపై కాల్షియం, విటమిన్ డీ మాత్రలను తీసుకుంటే మంచిది. కానీ, వ్యాయామం చేయకుండా కేవలం ఈ మాత్రలు మాత్రమే వేసుకుంటే పెద్దగా ప్రయోజనం కనిపించకపోవచ్చు.
మెనోపాజ్ సమయంలోనూ కొన్ని మైక్రోన్యూట్రియంట్లను తీసుకోవడం మంచిది. మేం పేషెంట్లకు ఎక్కువగా ఇవే సూచిస్తుంటాం. ముఖ్యంగా కాల్షియం ట్యాబ్లెట్లు ఎక్కువగా సూచిస్తాం.
శరీరంలో వేడి ఆవిర్లు (హాట్ ఫ్లాషెస్) వచ్చేటప్పుడు, ఈ లక్షణాల నుంచి ఉపశమనం కల్పించేందుకు కొన్ని నాన్-హార్మోనల్ మాత్రలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
కొన్నిసార్లు మెనోపాజ్ సమస్యలు తీవ్రంగా ఉండేటప్పుడు హార్మోన్ మాత్రలు కూడా సూచిస్తుంటాం. అయితే, కేవలం వైద్యుల పర్యవేక్షణలోనే వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
భార్యా, భర్తలు మాట్లాడుకోవాలి
మీరు పైన చెప్పిన సూచనలన్నీ జాగ్రత్తగా పాటిస్తే, ఎలాంటి ఇబ్బందీ లేకుండా హాయిగా శృంగార జీవితాన్ని ఆస్వాదించొచ్చు.
ఈ మధ్యకాలంలో అసలు మెనోపాజ్ లాంటిదేమీ ఉండని చెబుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కానీ, అలా ఆలోచించడం తప్పు. మొదట మన శరీరాన్ని మనం అర్థం చేసుకోవాలి.
కొన్నిసార్లు మధుమేహం, రక్తపోటు లాంటి సమస్యల వల్ల పురుషుల్లోనూ సెక్స్ సమస్యలు వస్తుంటాయి. కానీ, ఈ సమస్యలకు చికిత్స తీసుకునేందుకు చాలా మంది పురుషులు సిద్ధంగా ఉండరు. అది కూడా తప్పే, మొదట వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలి.
సెక్స్ జీవితం అనేది ఇద్దరికీ ముఖ్యమైనదే. ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి. వయసు పైబడుతున్నప్పుడు ఎదుటివారికి అండగా ఉండేందుకు కాస్త సమయాన్ని కేటాయించాలి.
‘‘ఒకసారి పెళ్లయ్యాక ఇంకెక్కడికి వెళ్తాం. అందంగా ఉండటానికి ఎందుకు ప్రయత్నించాలి’’ లాంటి ఆలోచనలు తప్పు.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమనేది శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకొనేందుకు ఎంత అవసరమో, అలానే భార్యభర్తల సంబంధం సవ్యంగా ముందుకు వెళ్లేందుకూ ఇది అంతే అవసరం.
ఇంట్లో జంటలకు ప్రైవసీ ఇవ్వడమనేది మన సమాజంలో ఎక్కువగా కనిపించదు. ఇద్దరి, ముగ్గురు ముందు భార్య చేయి పట్టుకోవడాన్ని కూడా కొందరు తప్పుపడుతుంటారు.
కాస్త పెద్దయ్యాక పిల్లలను విడిగా పెట్టడమూ చేయరు.
కాబట్టి అందుకే వయసు పైబడుతున్నప్పుడు ఇద్దరూ కలిసి ఎలా సమయం గడపాలో ఆలోచించుకోవాలి. వయసు పైబడ్డాక అంతా అయిపోయిందని అనుకోకూడదు.
ఎదుటి వ్యక్తి స్పర్శ, తోడు అనేది ఆ వయసులో ఎంతో ముఖ్యం.
మొత్తంగా మెనోపాజ్ సమయంలో, ఆ తర్వాత కూడా సెక్స్ చేసేందుకు భార్యాభర్తలు ప్రయత్నించాలి.
(గమనిక: రచయిత వైద్యురాలు. ఈ అంశంపై స్థూలమైన అవగాహన కోసమే ఈ కథనం)
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి?
- ఇజ్రాయెల్ తెల్ల భాస్వరంతో గాజాపై దాడులు చేసిందా... ఈ స్మోక్ స్క్రీన్ ఆపరేషన్ ఎంత ప్రమాదకరం?
- ఫిల్లీస్ లాతోర్: ప్రమాదకరమైన ఆపరేషన్లు చేసిన లేడీ సీక్రెట్ ఏజెంట్
- నైట్‌క్లబ్స్, జూ, డ్రగ్స్ స్టోర్...ఒక జైలులో ఉండకూడని సౌకర్యాలన్నీ ఇక్కడ ఉంటాయి....
- ఇజ్రాయెల్‌పై మెరుపుదాడిలో హమాస్ మాస్టర్ మైండ్స్ వీరే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















