రొమ్ము క్యాన్సర్: బ్రాలో పెట్టుకొనే ఈ సరికొత్త పరికరం వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తుంది

బ్రా కప్‌పై అల్ట్రాసౌండ్ డివైజ్ చూపిస్తోన్న మహిళ

ఫొటో సోర్స్, MIT

ఫొటో క్యాప్షన్, మీ రొమ్మును వివిధ కోణాల్లో స్కాన్ చేసే వేరబుల్ డివైజ్
    • రచయిత, అయ్లిన్ యాజన్
    • హోదా, బీబీసీ తుర్కియే

రొమ్ములో ఏమైనా ట్యూమర్లు ఉన్నాయోమో చెప్పే ఒక వేరబుల్ అల్ట్రాసౌండ్ డివైజ్‌, బ్రా కప్‌లో పెట్టుకునేలా ఉంటే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచన వచ్చింది ఓ వైద్యురాలికి. ఫలితంగా రొమ్ము కేన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తించే పరికరం తయారైంది.

ఇది కాఫీ తాగినంత సేపట్లో పరీక్షించి, ఫలితాన్ని చూపించగలదు.

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) మీడియా ల్యాబ్‌లో తుర్కియే శాస్త్రవేత్త డాక్టర్ కనన్ దాదేవిరేన్, ఆమె టీమ్ కలిసి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు.

తన కుటుంబ సభ్యురాలు(ఆంటీ) రొమ్ము కేన్సర్‌తో చనిపోవడంతో, ఆమె గౌరవార్థం ఈ సాంకేతికతను రూపొందించారు.

మమోగ్రామ్‌ పరీక్షల మధ్యలో అత్యధిక రిస్క్ ఉన్న రోగులను తరచూ పర్యవేక్షించేందుకు ఈ డివైజ్ ఉపయోగపడనుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం 2020లో రొమ్ము కేన్సర్ వల్ల 6,85,000 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం 23 లక్షల మంది మహిళలకు ఇది నిర్ధరణ అయింది.

మహిళల మరణాలకు రెండో ప్రధాన కారణంగా రొమ్ము కేన్సర్ ఉంటోంది.

రొమ్ము కేన్సర్‌ను త్వరగా గుర్తించినప్పుడు, ఐదేళ్ల రిలేటివ్ సర్వైవల్ రేటు అంటే నిర్ధరణ అయిన తర్వాత ఐదేళ్ల వరకు బతికే రేటు 99 శాతంగా ఉంటుందని అమెరికన్ కేన్సర్ సొసైటీ తెలిపింది.

క్యాన్సర్‌ను ఆలస్యం చేసి అది నాలుగో దశకు చేరుకున్న తర్వాత గుర్తిస్తే మనుగడ రేటు మహిళలో కేవలం 22 శాతంగానే ఉంటుందని డాక్టర్ దాదేవిరెన్ చెప్పారు.

బతికించే అవకాశాలను పెంచేందుకు ఈ డివైజ్ ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు.

ఎంఐటీ మెటీరియల్ సైంటిస్ట్, ఇంజనీర్ కనన్ దాదేవిరేన్

ఫొటో సోర్స్, MIT

ఫొటో క్యాప్షన్, డాక్టర్ కనన్ దాదేవిరేన్ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్

డివైజ్ ఎలా పనిచేస్తుంది?

ఆస్పత్రిలో తన ఆంటీ పక్కన కూర్చున్నప్పుడు ఎంఐటీ మెటీరియల్ సైంటిస్ట్, ఇంజినీర్ కనన్ దాదేవిరేన్‌కి తొలుత ఈ ఆలోచన వచ్చింది.

దాదేవిరేన్ వాళ్ల ఆంటీ ఎప్పటికప్పుడు రొమ్ము పరీక్షలు చేయించుకున్నప్పటికీ, ప్రమాదకరంగా మారిన తర్వాతనే ఈ కేన్సర్‌ను గుర్తించారు.

ఆ తర్వాత ఆరు నెలలకు ఆమె మరణించారు.

ప్రస్తుతం దాదేవిరేన్ అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతలో ల్యాబ్ టెక్నీషియన్ సాయం లేకుండానే మహిళలు వేసుకునే ‘బ్రా’కి ఒక ఫ్లెక్సిబుల్, రీయూజబుల్ డివైజ్‌ను అతికించుకోవడం ద్వారా రొమ్ము కేన్సర్ కనుగొనవచ్చు.

తేనెతుట్ట ఆకారంలో ఉండే ఈ పరికరంలో ఆరు స్లాట్లు ఉంటాయి.

ఒక స్లాటులో చిన్న అల్ట్రాసౌండ్ కెమెరా అతికించడం ద్వారా, అది ఈ ఆరు స్లాట్ల మధ్యలో తిరుగుతూ ఉంటుంది.

ఆ సమయంలో రొమ్ము లోపల భాగాన్ని అన్ని వైపుల నుంచి చూసుకోవచ్చు. అల్ట్రాసౌండ్ జెల్ అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది.

ప్రాథమిక దశలో ఉండే ట్యూమర్లను, అత్యంత చిన్నగా డయామీటర్‌లో 0.3 సెంటిమీటర్లు ఉండే తిత్తిలను కూడా ఇది గుర్తించగలదని డాక్టర్ దాదేవిరేన్ చెప్పారు.

ఇది చాలా కచ్చితత్వంతో పనిచేస్తుందని తెలిపారు.

 రొమ్మును ఫోటో తీసేందుకు ఆరు స్లాట్లలో ఒక దగ్గర ఈ చిన్న ఆల్ట్రాసౌండ్ స్కానర్‌ను అతికించాలి.

ఫొటో సోర్స్, MIT

ఫొటో క్యాప్షన్, రొమ్మును ఫోటో తీసేందుకు ఆరు స్లాట్లలో ఒక దగ్గర ఈ చిన్న ఆల్ట్రాసౌండ్ స్కానర్‌ను అతికించాలి.

మామోగ్రామ్ అంటే ఏమిటి?

రొమ్ము కేన్సర్‌ను గుర్తించేందుకు ప్రస్తుతం ఎక్కువగా ఉపయోగిస్తున్న విధానం మామోగ్రామ్. ఈ విధానంలో రొమ్ములను ఎక్స్‌రే తీస్తారు.

మామోగ్రామ్‌ పరీక్ష చాలా ఖరీదైనది. చాలా దేశాల్లో జాతీయ ఆరోగ్య విధానాల్లో ఇది అందుబాటులో లేదు.

ఈ డివైజ్ ఎలా పనిచేస్తుందో తెలిపే గ్రాఫ్
ఫొటో క్యాప్షన్, ఈ డివైజ్ ఎలా పనిచేస్తుందో తెలిపే గ్రాఫ్

ఎందుకు కొంత మంది మహిళలకు నొప్పి వస్తుంది?

‘‘ప్రతి ఒక్కరి రొమ్ము కూడా ఆ వ్యక్తికి తగ్గట్టు ప్రత్యేకంగా ఉంటుంది. గ్లాండ్యులర్ టిస్యూ, ఫ్యాటీ టిస్యూలలో మార్పులు కూడా చాలా భిన్నమైనవిగా ఉంటాయి’’ అని యూకే అడ్వయిజరీ బోర్డు చైర్‌పర్సన్ కన్సల్టెంట్ రేడియోగ్రాఫర్ హెలెన్ యులె చెప్పారు.

ఫ్యాటీ బ్రెస్ట్‌ను కలిగి ఉన్న వారితో పోలిస్తే గ్లాండ్యులర్ టిస్యూలు ఉన్న మహిళలు మమోగ్రామ్ పరీక్షల్లో అసౌకర్యవంతంగా భావిస్తారు.

అలాగే, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ(హెచ్‌ఆర్‌టీ) తీసుకోవడం కూడా వారి రొమ్ము సెన్సిటివిటీకి కారణమవుతుంది.

మామోగ్రాఫ్ ఎలా ఉండాలనే దానిపై మహిళల అంచనాలు కూడా కీలకమని కన్సల్టెంట్ రేడియోగ్రాఫర్ చెప్పారు.

మామోగ్రామ్ సమయంలో కలిగే అసౌకర్యం నుంచి బయటపడేందుకు కొన్ని సులభతరమైన విధానాలు కూడా ఉన్నాయి.

పీరియడ్స్ వచ్చే సమయంలో లేదా వారానికి ముందు మామోగ్రామ్‌ చేయించుకోకపోవడం మంచిది.

లేదా ఈ పరీక్షకు ముందు పారాసిటమల్ తీసుకుంటే కూడా ఈ అసౌకర్యం నుంచి బయటపడొచ్చు.

అత్తమ్మ ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఈ డివైజ్‌ గురించి ఆలోచించిన డాక్టర్ దాదేవిరేన్

ఫొటో సోర్స్, MIT

ఫొటో క్యాప్షన్, అత్తమ్మ ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఈ డివైజ్‌ గురించి ఆలోచించిన డాక్టర్ దాదేవిరేన్

ఎవరి కోసం ఈ వేరబుల్ డివైజ్?

రెగ్యులర్ మామోగ్రామ్‌ల మధ్యలో కూడా బ్రెస్ట్ ట్యూమర్లు అభివృద్ధి చెందుతూ ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెప్పాయి.

వీటినే ఇంటర్వల్ కేన్సర్లు అంటారు. మొత్తం రొమ్ము కేన్సర్ కేసులలో 20 శాతం నుంచి 30 శాతం ఇవి ఉంటున్నాయి.

తరచూ చెకప్‌ల సమయంలో బయటపడే వాటి కంటే ఈ ట్యూమర్లు చాలా శక్తిమంతమైనవిగా ఉంటాయని ఎంఐటీ టీమ్ చెప్పింది.

రొమ్ము కేన్సర్ వచ్చే అత్యధిక ప్రమాదమున్న మహిళల కోసం ఈ డివైజ్‌ను ఆవిష్కరించారు.

రెండు మామోగ్రామ్‌ల మధ్యలో లేదా స్వీయ పరీక్షల ద్వారా ట్యూమర్లను గుర్తించేందుకు వారికి ఇది సాయం చేస్తుంది.

ఈ ప్రక్రియలో, ఏదైనా తేడాను గుర్తిస్తే, మామోగ్రామ్ అవసరమని శాస్త్రవేత్తలు చెప్పారు.

ఎక్కడ దీన్ని అభివృద్ధి చేశారు?

ఈ వేరబుల్ హెల్త్ డివైజ్‌ను అభివృద్ధి చేసేందుకు ఎంఐటీ టీమ్ ఆరున్నర నెలల పాటు పనిచేసింది.

ఆగస్ట్‌లో దీనికి అమెరికా పేటెంట్ లభించింది. మరిన్ని మానవ ప్రయోగాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

ఒక డివైజ్ ధర సుమారు వెయ్యి డాలర్ల వరకు ఉంటుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.8,300 పైనే.

పెద్ద మొత్తంలో వీటిని తయారు చేస్తే ఈ ధర దిగొస్తుందని డివైజ్ రూపకర్తలు చెప్పారు. ఈ పరికరం నాలుగు నుంచి ఐదేళ్లు పనిచేస్తుంది.

రోజూ మీరు టిస్యూను స్కాన్ చేయాలనుకుంటే ఒక స్కాన్‌ను కాఫీ తాగినంత సేపట్లో చేసేసుకోవచ్చని శాస్త్రవేత్తల బృందం తెలిపింది.

అత్తమ్మతో కనన్ దాదేవిరెన్

ఫొటో సోర్స్, Dr Canan Dagdeviren

ఫొటో క్యాప్షన్, అత్తమ్మతో కనన్ దాదేవిరెన్

మహిళలకు సరికొత్త ఆశలు

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రొమ్ము కేన్సర్ వల్ల చనిపోతున్న వారి సంఖ్య అత్యధికంగా ఉండేందుకు ప్రధాన కారణాల్లో ఒకటి చివరి దశలలో దీనిని గుర్తించడమని చాలా అధ్యయనాలు తెలిపాయి.

దీంతో పాటు అవసరమైన ఆరోగ్య సర్వీసులు అందుబాటులో ఉండటం లేదన్నాయి.

డబ్ల్యూహె‌వో డేటా ప్రకారం, అత్యధిక ఆదాయ దేశాల్లో ఐదేళ్ల మనుగడ రేటు బ్రెస్ట్ కేన్సర్ రోగులలో 90 శాతం కంటే అధికంగా ఉంది.

అదేవిధంగా భారత్‌లో ఈ రేటు 66 శాతంగా, దక్షిణాఫ్రికాలో 40 శాతంగా ఉంది.

శరీరంలో ఇతర భాగాలను కూడా స్కాన్ చేసే సామర్థ్యం ఈ డివైజ్‌కు ఉందని డాక్టర్ దాదేవిరేన్ చెప్పారు.

పోయిన సంవత్సరం ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో తన బేబీని స్కాన్ చేసేందుకు దీన్ని ఉపయోగించినట్లు ఆమె తెలిపారు.

‘‘మా ఆంటీ వయసు 49 ఏళ్లే. ఇంకా ఆమెకు చాలా జీవితం మిగిలి ఉంది. కానీ, త్వరగా కాలం చేశారు. ఒకవేళ ఇలాంటి బ్రాను మా ఆంటీ వేసుకుని ఉండుంటే ఆమె మరింత కాలం బతికేది కదా అనే ఆలోచన నాకు వచ్చింది’’ అని దాదేవిరేన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)