తెలంగాణ: టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 రద్దు, గ్రూప్-2 వాయిదా, నిస్పృహలో నిరుద్యోగులు... అసలేం జరుగుతోంది?

ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వరంగల్ జిల్లాకు చెందిన మర్రి ప్రవళిక అనే యువతి ఈ నెల 13న ఆత్మహత్య చేసుకున్నారు. గ్రూప్ 1 రద్దు, గ్రూప్ 2 వాయిదాల కారణంగా డిప్రెషన్‌కు గురై ఆమె ఆత్మహత్య చేసుకున్నారనే వాదనలతో తెలంగాణలో నిరుద్యోగుల సమస్య చర్చనీయాంశంగా మారింది.

'ఇంటికాడి నుంచి ఇస్తున్న పైసలతోనే జీవితం గడపాల్సి వస్తోంది. ఇంటికి ఫోన్ చేసిన ప్రతిసారీ.. అరె ఎప్పుడొస్తది జాబ్.. ఎప్పుడొస్తది జాబ్ అని అడుగుతున్నారని, ఏమీ చెప్పలేకపోతున్నామ'ని వాపోయారు మహబూబ్‌నగర్‌ జిల్లాకి చెందిన వెంకటేశ్.

ఇంటి వద్ద నుంచి డబ్బులు నెలల తరబడిగా అడిగి తీసుకోవాలంటే చాలా బా‌‍ధగా ఉంటోందని బీబీసీతో చెప్పారు కుమ్రం ‌భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అంజలి.

సర్వీస్ రంగంలోకి రావాలని సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశా. గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా. గ్రూప్ 1 మొదటిసారి రాసినప్పుడు క్వాలిఫై అయ్యా. అది రద్దు చేశారు. మళ్లీ రాశా. అందులోనూ మంచి మార్కులు వస్తాయనుకున్నా. కానీ దాన్నీ రద్దు చేశారు. భవిష్యత్తు ఏమిటో అర్థం కావడం లేదన్నారు సాహితి.

ఇలా ఒక్కో నిరుద్యోగిదీ ఒక్కో వ్యథ.

'అసలు మాకు జాబ్ వస్తదా.? అసలు మళ్లీ పరీక్ష రాస్తే అర్హత సాధిస్తామా.? మళ్లీ పరీక్ష జరుగుతుందా.? లేదా?' ఇలా ఎన్నో ప్రశ్నలు నిరుద్యోగులను చుట్టుముడుతున్నాయి.

అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది?

సీఎం కేసీఆర్

ఫొటో సోర్స్, @TELANGANACMO

ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పి 20 నెలలు

ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని 2022 మార్చి 9న అసెంబ్లీ వేదికగా ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

రాష్ట్రంలో 80,039 ప్ర‌‍‌‍భుత్వ పోస్టుల ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు.

‘‘పోస్టులను వెంటనే ‌భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం’’ అని ‌చెప్పారు.

అలాగే, 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని ప్రకటించారు. మొత్తంగా ఈ రెండు కలుపుకుని 91,142 పోస్టులు ‌భర్తీ అవుతాయని చెప్పారు.

ఆ తర్వాత వరుసగా గ్రూప్స్, టీఆర్టీ, ఎస్ఐ, కానిస్టేబుల్ సహా వివిధ టెక్నికల్ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ చేపట్టింది.

వీటిల్లో గ్రూప్స్ పరీక్షలపై నిరుద్యోగులు ‌ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు

తెలంగాణ వచ్చాక తొలి గ్రూప్ 1 నోటిఫికేషన్

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా గత ఏడాది గ్రూప్ – 1 నోటిఫికేషన్ వచ్చింది. నిరుడు అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. దీనికి 2,33,248 మంది హాజరయ్యారు.

ఈ పరీక్ష ద్వారా 503 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ సర్వీస్ పబ్లిక్ కమిషన్ ప్రకటించింది.

పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ - 1ను రద్దు చేస్తూ ఈ ఏడాది మార్చిలో కమిషన్ నిర్ణయం తీసుకుంది.

తర్వాత ఈ ఏడాది జూన్ 11న మరోసారి గ్రూప్ - 1 పరీక్ష నిర్వహించింది.

బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోలేదన్న వివాదంతో ఆ పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉంది.

ఇక, గ్రూప్ - 2 పరీక్షకు తెలంగాణ వచ్చాక రెండోసారి నోటిఫికేషన్ వచ్చింది.

మొదట 2016లో నోటిఫికేషన్ రాగా.. మళ్లీ ఆరేళ్ల తర్వాత గతేడాది డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ - 2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

మొత్తం 783 పోస్టులకు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఈ ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని కారణాలతో నవంబరుకు వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

టీఎస్‌పీఎస్సీ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన

ఫొటో సోర్స్, BHANU PRAKASH BJYM/FACEBOOK

ఎన్నికల నోటిఫికేషన్‌తో మళ్లీ వాయిదా

తాజాగా ఎన్నికల కారణంగా మరోసారి జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

నవంబరులో జరగాల్సిన డీఎస్సీని కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

పరీక్షల వాయిదా, రద్దు కారణంగా నిరుద్యోగ యువత నిరా‌‍శానిస్పృహలకు గురవుతోంది. ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వ విధానాలపై నిరుద్యోగ యువత మండిపడుతోంది.

ఈ విషయంపై గ్రూప్స్‌కు సిద్ధమవుతున్న కరీంనగర్‌కు చెందిన సాహితి బీబీసీతో మాట్లాడారు.

‘‘పరీక్ష రద్దు, వాయిదా వేయడంతో విద్యార్థులు ఆత్మవిశ్వాసం కోల్పోతారు. సీరియెస్ నెస్ ఉండదు.

ఈ పరిస్థితిలో విద్యార్థులను ప్ర‌భుత్వం ఓటు బ్యాంకులా చూడకుండా పరీక్షలు సమయం ప్రకారం జరిగేలా చూడాలి.

ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. దాని ప్రకారం తప్పకుండా ఉద్యోగాల భర్తీ జరగాలి.’’ అని అన్నారు.

ప్రవళిక కుటుంబ సభ్యులు

ఫొటో సోర్స్, UGC

ప్రవళిక ఆత్మహత్యతో సంచలనం

ఈ నెల 13న వరంగల్ జిల్లాకు చెందిన మర్రి ప్రవళిక అనే యువతి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగించింది.

హైదరాబాద్ అశోక్ నగర్‌‌లో హాస్టల్‌లో ఉంటూ ఆమె చనిపోయింది.

గ్రూప్ 1 రద్దు కావడం, గ్రూప్ 2 వాయిదా పడటంతో డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు, యువత అదే రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

అయితే, వారిపై పోలీసులు లాఠీఛార్జి చేసి అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం ప్రవళిక మృతదే‌‍హాన్ని స్వగ్రామానికి తరలిచారు.

తర్వాత హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

‘‘ప్రవళిక ఆత్మ‌‍హత్య చేసుకోవడానికి కోస్గికి చెందిన శివరామ్ అనే యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడమే కారణం’’ అని ప్రకటించారు. ఈ ఘటనను వేరొక వ్యవహారంతో ముడిపెట్టడం సరికాదన్నారు.

కేటీఆర్

ఫొటో సోర్స్, FACEBOOK/KTR

కేటీఆర్ వ్యాఖ్యలపై యువత ఆగ్రహం

ప్రవళిక మృతిపై టీవీ9 ఛానెల్‌కు ఇచ్చిన లైవ్ డిబేట్‌లో మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రవళికను ఉద్దేశించి మాట్లాడుతూ..

‘‘ఆ అమ్మాయి అసలు గ్రూప్స్‌కే అప్లై చేయలేదని కూడా అంటున్నారు. తెలుసుకోండి మీరు. రాహుల్ గాం‍ధీ ట్వీట్ చేస్తారు. మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేస్తారు. ఇంకెవరో ట్వీట్ చేశారు. కనీసం అది నిజమా.. కాదా తెలుసుకోకుండా ఒక అమ్మాయి మరణాన్ని ఇంత దిగజారుడుతనంతో రాజకీయం చేయడం కరెక్టా?’’ అని ఆయన అన్నారు.

మంత్రి కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నిరుద్యోగులు, యువత మండిపడుతున్నారు.

ప్రవళిక గ్రూప్ -1, 2, 3 పరీక్షలకు చేసిన దరఖాస్తులను సోషల్ మీడియాలో పోస్టు‌లు చేస్తున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను సోషల్ మీడియా వేదికగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెంకటేశ్

ఇంటికాడ ముఖం చూపించలేకపోతున్నాం

‘‘పెళ్లి కాలేదు.. మూడేళ్లుగా ఇంటికి ముఖం చూపించలేకపోతున్నా. ఎలాగైనా ప్రభుత్వం ఉద్యోగం కొట్టి ఇంటికి వెళ్లాలనుకున్నా.

ఇంటికాడి నుంచి ఇస్తున్న పైసలతోనే జీవితం గడపాల్సి వస్తోంది. ఇంటికి ఫోన్ చేసిన ప్రతిసారీ.. అరె ఎప్పుడొస్తది జాబ్.. ఎప్పుడొస్తది జాబ్ అని అంటున్నారు.

2014 నుంచి లేక లేక వచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్. రెండు సార్లు రద్దు చేశారు. పరీక్ష వి‌షయంలో నిరుద్యోగులకు భరోసా లేదు. పరీక్ష జరుగుతుందని అంచనా వేయలేకపోతున్నాం’’ అని మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్‌కు చెందిన వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బీబీసీతో మాట్లాడారు.

వెంకటేశ్ ఐదేళ్ల కిందట నగరానికి వచ్చి అశోక్ నగర్ వద్ద ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటున్నారు.

చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద చెట్ల కింద కుర్చీలో కూర్చుని చదువుకుంటూ కనిపించారు. బీబీసీ ప్రతినిధి మాట్లాడించినప్పుడు తన బాధను వ్యక్తం చేశారు.

ప్రస్తుతం గ్రూప్ - 1 పరీక్ష రద్దయింది.. గ్రూప్ - 2 వాయిదా పడింది.

మరి ‌ పండుగకు ఇంటికి వెళ్లడం లేదా.. అని అడిగినప్పుడు.. ‘‘ఇంటికి ముఖం చూపించాలంటే సిగ్గుగా ఉంది. ఉద్యోగం వస్తే దర్జాగా వెళ్దామని అనుకున్నా. గ్రూప్ వన్‌లో ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యా.

మెయిన్ పరీక్ష రాసేందుకు కోచింగ్‌కు డబ్బులు కూడా కట్టా. ఈలోపు ప్రిలిమినరీ రద్దు అన్నారు. రెండోసారి రాస్తే అదీ రద్దయ్యింది. ఇక ఏం చేయాలి.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు వెంకటేశ్.

అంజలి

పరీక్షల రద్దు, వాయిదాతో అప్పుల ‌భారం

కోచింగ్ కోసమనో.. సొంతంగా ప్రిపేర్ అవుదామనో.. చదువుకునేందుకు మరిన్ని సౌకర్యాలు ఉంటాయన్న ఆశలతో మారుమూల ప్రాంతాల నుంచి యువతీయువకులు నగరానికి వచ్చారు.

ఇక్కడ గదుల్లో అద్దెకు ఉండటం లేదా ‌హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు.

పరీక్షల రద్దు, వాయిదా కారణంగా ఇప్పటివరకు చెల్లించిన అద్దెలు, కోచింగ్ ఫీజుల కారణంగా ఆర్థికంగానూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.

నెలల తరబడి హాస్టళ్లు, అద్దె గదుల్లో ఉండటంతో అద్దె, తిండి, మెటీరియల్ ఖర్చులకు రూ.లక్షల్లో అప్పులు చేయాల్సి వచ్చిందని వాపోతున్నారు.

‘‘నెలకు ఖర్చు వచ్చేసి హాస్టల్ ఫీజు రూ.4,500. బట్టలు, బుక్స్‌కు కలిపి రూ.8 వేలు అవుతోంది. ఇంటి వద్దనే అడుగుతున్నాం. వాళ్లు బంగారం కుదువ పెట్టి లేదా అప్పులు తెచ్చి ‌ఇస్తున్నారు.

ఫ్రెండ్స్ వద్ద అప్పులు చేస్తున్నాం. ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇచ్చి ఉంటే ఈ కష్టాలు ఉండేవి కావు’’ అని మహబూబ్ నగర్ గండీడ్ కు చెందిన వెంకటేశ్ బీబీసీతో చెప్పారు.

‘‘అన్న ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. తన జీతంతో మా కుటుంబం నడుస్తోంది. అమ్మను చూసుకోవడంతోపాటు నా చదువుకు అన్ననే పంపిస్తున్నాడు.

సర్కారీ జాబ్ వస్తుందని ప్రిపేర్ అవుతుంటే.. వాయిదా, రద్దు కార‌ణంగా పరీక్షలు రాసే వీల్లేక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి’’ అని కుమ్రం ‌భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అంజలి చెప్పారు.

ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు

పౌష్టికాహారం లేదు, మెటీరియల్స్ ఖర్చు

‘‘నెలకు కచ్చితంగా పది వేలు అవుతున్నాయి. హాస్టళ్లలో ఉన్నప్పటికీ.. ఆ ఫుడ్ సరిగ్గా ఉంటోందో లేదో తెలియదు. మంచి ఫుడ్ ఉన్న హాస్టల్ కావాలంటే రూ.పదివేలు పెట్టాలి. లేకపోతే ప్రిపరేషన్ కోసం వచ్చి అనారోగ్యం పాలవుతుంటాం. అలా చాలా మంది ఆహారం పడక అనారోగ్యానికి గురయ్యారు.

దీనివల్ల అటు చదువుపైనా ఎఫెక్ట్ పడుతుంది.

ఇప్పటికే ప్రిపరేషన్ ప్రారంభించి 18నెలలు గడిచిపోయాయి. నెలకు రూ.పది వేలు ఖర్చు వస్తోంది. ఈ ఆర్థిక ‌‍‌భారం భరించడం చాలా కష్టమవుతోంది’’ హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఉండే సంతోష్ కుమార్ బీబీసీతో అన్నారు.

పోటీ పరీక్షల నోటిఫికేషన్లతో మెటీరియల్స్ ధరను కోచింగ్ సెంటర్లు పెంచేశాయి. గతంతో పోల్చితే మాక్ టెస్టుల ధర మూడింతలు పెరిగిందని గ్రూప్స్‌కు సిద్ధమవుతున్న శామీర్ పేటకు చెందిన ‌‍‌‍‌భానుచందర్ బీబీసీతో చెప్పారు.

‘‘మాక్ టెస్టులు రాసేందుకు గతంలో రూ.వేయి తీసుకునేవారు. ఇప్పుడు ఏకంగా రూ.3వేలు వసూలు చేస్తున్నారు. స్టడీ మెటీరియల్స్ ధర కూడా నాలుగింతలు పెంచారు. రూ.7-8 వేలు వసూలు చేస్తున్నారు.

అసలు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే.. అంత డబ్బులు పోసి ఎలా కొనగలం'’ అని ఆయన అన్నారు.

సాహితి

పరీక్షల రద్దుతో డిప్రెషన్

పరీక్షలు రద్దు కావడంతో డిప్రెషన్‌కు గురవుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. మళ్లీ తిరిగి బలం కూడగట్టుకునేందుకు చాలా కష్టమవుతోందని చెప్పారు.

‘‘నేను గతంలో సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేశాను. సర్వీస్ రంగంలోకి రావాలని అక్కడ ఉద్యోగానికి రాజీనామా చేశా.

గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా. గ్రూప్ 1 మొదటిసారి రాసినప్పుడు క్వాలిఫై అయ్యా.

అది రద్దు చేశారు. మళ్లీ రాశా. అందులోనూ మంచి మార్కులు వస్తాయనుకున్నా. కానీ దాన్నీ రద్దు చేశారు. భవిష్యత్తు ఏమిటో అర్థం కాకుండా ఉంది.

అటు ప్రైవేటు సెక్టార్‌లోకి వెళ్లిపోవాలా.? ఇదే ప్రిపేర్ అవుతూ ఉండాలా.? ఇంకెన్ని రోజులు పేరెంట్స్‌పై ఆధారపడాలి.? ఇంకెన్ని రోజులు మనీ అడగాలి.?

ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చాక ఇవ్వడానికి రెడీగా ఉన్నా తీసుకోవడానికి మనసు ఒప్పదు’’ అని బీబీసీతో చెప్పారు సాహితి.

ప్రస్తుతం పరీక్షలు జరుగుతాయో లేదో సందిగ్ధంలో ఉన్నారు నిరుద్యోగులు. చాలా మంది హాస్టళ్లు, గదులు ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోయారు.

హైదరాబాద్‌‌లో కోచింగ్ సెంటర్ల బోర్డులు

తెలంగాణలో నిరుద్యోగ రేటు ఇలా..

తెలంగాణలో అన్ని రకాల పోటీ పరీక్షలకు దాదాపు 30 లక్షల మంది యువత పోటీ పడుతున్నారని అంచనా.

తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ నియామకాలు పెద్దగా జరగకపోవడంతో ఈసారి తీవ్ర పోటీ నెలకొంది.

తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పలు గణంకాలు సూచిస్తున్నాయి.

ఆర్బీఐ 2022 నివేదిక ప్రకారం, తెలంగాణలో అర్బన్ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి 77 మంది నిరుద్యోగులు ఉన్నట్లు చెబుతోంది. అదే రూరల్ ప్రాంతానికి వచ్చే సరికి ఇది 33గా ఉంది.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2022 ప్రకారం, తెలంగాణలో 2019-20 నుంచి 2020-21 మధ్య నిరుద్యోగ రేటు 15 నుంచి 59 వయసు ఏళ్ల వారిలో 7.5 శాతం నుంచి 5.1శాతానికి తగ్గినట్లు చెబుతోంది.

అయితే, 2022 జులై నుంచి సెప్టెంబరు నెలకు (త్రైమాసానికి) నిరుద్యోగ రేటు 7.7 శాతంగా ఉంది.

రాష్ట్రంలో భారీగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రావడంతో ‌ఏడాదిన్నర కాలంగా సొంతూరును, కన్నవాళ్లను వదిలేసి హైదారాబాద్ వచ్చి పరీక్షల ప్రిపరేషన్‌‌లో మునిగిపోయారు యువతీయువకులు.

ప్రొఫెసర్ జి.హరగోపాల్

ప్రభుత్వానికి మాయని మచ్చ

తెలంగా‌ణ ఏర్పాటుకు ప్రధాన కారణం నీళ్లు, ని‌‍ధులు, నియామకాలు.

నియామకాల వి‌షయంలో ఈ ప్ర‌భుత్వం అనుసరించిన విధానం కచ్చితంగా చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతుందని చెప్పారు ప్రొఫెసర్ జి.హరగోపాల్.

పోటీ పరీక్షల వి‌షయంలో క్యాలెండర్ ప్రకారం నడుచుకుంటూ దశల వారీగా నిర్వహిస్తే బాగుండేదని చెప్పారు.

‘‘యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కేంద్రం పెత్తనం చేస్తున్నప్పటికీ, యూపీఎస్సీపై ఆ ప్రభావం కనిపించదు. అందుకు యూపీఎస్సీకి ఉన్న విశ్వసనీయతే కార‌ణం. పోటీ పరీక్షల వి‌షయంలో యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ కూడా విశ్వసనీయత సాధించాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

ముందుగా మాక్ టెస్టులా పరీక్ష నిర్వహించి ఉంటే బాగుండేదని హరగోపాల్ అభిప్రాయపడ్డారు. దానివల్ల ఏమేం ఇబ్బందులు రావడానికి అవకాశం ఉందో తెలిసేది అని చెప్పారు.

‘‘సాంకేతిక పరిజ్జానాన్ని పెంచుకోవాలి. సర్వీస్ కమిషన్లో కాంట్రాక్టు ఉద్యోగులు కాకుండా పర్మినెంట్ ఉద్యోగులు ఉండాలి. అసలు కాంట్రాక్టు ఉద్యోగులను నియమించడం పెద్ద తప్పు.

గ్రూప్ -1 రెండోసారి రద్దు చేసే విషయంలో పునరాలోచన చేయాల్సింది. టీఎస్‌పీఎస్సీ చేసిన పొరపాటు లక్షల మంది విద్యార్థులకు నష్టం కలిగిస్తోంది’’ అని హరగోపాల్ బీబీసీతో చెప్పారు.

పరీక్షల వాయిదా విషయంపై టీఎస్‌పీఎస్సీని బీబీసీ ఈ మెయిల్ ద్వారా సంప్రదించగా.. ఎలాంటి స్పందనా రాలేదు.

ఇవి కూడా చదవండి: