క్రికెట్ వరల్డ్ కప్ - ఇండియా Vs న్యూజిలాండ్: 2019లో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నితిన్ శ్రీవాత్సవ
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
వరల్డ్ కప్ టోర్నీలో ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఆదివారం నాడు హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో తలపడనున్నాయి.
2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు చేరిన ఇండియా ప్రత్యర్థి న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీ వాత్సవ ఆ మ్యాచ్ జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. ఆ క్షణాలను ఆయన గుర్తుచేసుకున్నారు.
ఆరోజు ఏం జరిగిందో ఆయన మాటల్లోనే:
జులై 10, 2019 . సమయం సాయంత్రం నాలుగంటలవుతోంది. ఇంగ్లండ్‌లోని ఓల్డ్‌ట్రాఫోర్డ్ స్టేడియం నిశ్శబ్దంగా ఉంది.
ప్రపంచకప్ మొదటి సెమీఫైనల్ మ్యాచ్ పూర్తికావస్తోంది.
వర్షం వలన ఈ వన్డే మ్యాచ్ రెండురోజులపాటు సాగాల్సి వచ్చింది. వర్షం అంతరాయం కలిగించే సమయానికి న్యూజిలాండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 239 పరుగులు చేసింది. ఇక తరువాత రోజు ఇండియా 50 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని చేధించాల్సి ఉంది.
నేను కూడా ఆరోజు స్టేడియంలో ఉన్నాను. యార్క్‌షైర్ నుంచి వచ్చిన కుల్వీందర్ సింగ్ గిల్‌ను కలిశాను.
మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆయన మాట్లాడుతూ ‘‘ 1980లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి మెకానిక్‌గా పనిచేయడానికి మా అంకుల్ ఇంగ్లాండ్‌కు వచ్చారు. నేను 1982లో పుట్టాను. 1983లో కపిల్‌దేవ్ నేతృత్వంలోని ఇండియా ఫైనల్‌కు చేరుకుందని, లార్డ్స్‌లో వెస్టిండీస్‌తో తలపడిందని మా అమ్మానాన్న చెప్పేవారు. మా నాన్న ఆ మ్యాచ్ చూడటానికి బస్సులో ప్రయాణించారు. ఈరోజు నేనీ సెమీఫైనల్ చూడటానికి వచ్చాను. అందుకే టీమ్ ఇండియా గెలవాలి’’ అన్నారు.
జులై 10వ తేదీ సాయంత్రం, టీమ్ ఇండియా ఆటగాళ్ళు విచారవదనాలతో కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి బస్సు ఎక్కుతున్నప్పుడు కుల్వీందర్ నా పక్కనే నుంచుని ఉన్నారు.
18పరుగుల తేడాతో ఇండియా ఓడిపోయాకా, టీమ్ బస్సు లాంక్‌షైర్ క్రికెట్ క్లబ్ గేటు దాటుతున్నప్పుడు నిరాశపడిన భారతీయ అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు.
‘‘సోదరా.. ఇకపై ఇండియా ఆడే వరల్డ్‌కప్ మ్యాచ్‌లు చూడను’’ అని కుల్వీందర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చేదు అనుభవాలు..
ఈ ఆదివారం ధర్మశాలలో ఇండియన్ క్రికెట్ టీమ్ న్యూజిలాండ్‌తో లీగ్‌మ్యాచ్ ఆడుతోందనగానే నిరుడు ప్రపంచకప్‌లోని చేదు అనుభవాలు నా మదిలో ఒకటికి రెండుసార్లు మెదలుతున్నాయి.
అప్పటి సెమీఫైనల్లో 239 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో టాపార్డర్ బ్యాటమెన్స్ చేసిన పరుగులు ఇవీ..
కెఎల్ రాహుల్ – 1
రోహిత్‌శర్మ – 1
విరాట్‌కోహ్లీ – 1
దినేష్ కార్తిక్ – 6
రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా చెరో 32 పరుగుల చొప్పున చేయగా, ధోనీ తన సహజ శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడి 50 పరుగులు చేశాడు.
రవీంద్రజడేజా మాత్రమే వేగంగా 59 బంతుల్లో 77 పరుగులను జత చేశాడు కానీ.. గెలుపునకు ఈ పరుగులు సరిపోలేదు.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త రోజు..కొత్త పోటీ
ఇది జరిగిన నాలుగేళ్ళ తరువాత 2023 వన్డే ప్రపంచకప్‌కు ఇండియా ఆతిథ్యమిస్తోంది. టోర్నమెంట్ ఆరంభం కూడా గట్టిగానే ఉంది.
ఇండియా ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. అప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లతోపాటు మాజీ ఛాంపియన్లు ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లను అలవోకగా ఓడించింది.
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు సంబంధించి భారత్ శిబిరంలో కచ్చితంగా కొంత ఆందోళన ఉంటుంది. కిందటి మ్యాచ్‌లో హార్థిక్ పాండ్యా బౌలింగ్ చేస్తూ గాయపడటంతో ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు.
హార్థిక్‌పాండ్యా స్థానంలో బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించడం, శార్దూల్ ఠాకూర్ స్థానంలో అశ్విన్, లేదా మహమద్ షమీని ఆడించడమనే కొన్ని ఆప్షన్లు జట్టు మేనేజ్‌మెంట్ ముందు ఉన్నాయి.
అశ్విన్‌ను జట్టులోకి తీసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయాల్సి వస్తే కష్టమవుతుంది. ఈ కొండప్రాంతంలోని స్టేడియంలో చీకటిపడ్డాకా కురిసే మంచుకు బంతి జారిపోవడం వలన స్పిన్నర్లు కష్టపడాల్సి వస్తుంది.
మరోపక్క శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహమ్మద్ షమీని అడించడం జట్టు బ్యాటింగ్ బలాన్ని కొద్దిగా బలహీనపరుస్తుంది.
ధర్మశాల పిచ్ ఫాస్ట్ బౌలింగ్‌కు బ్రహ్మాండంగా ఉంటుందని చెపుతున్నారు. పైగా ఈ స్టేడియం బౌండరీ లైన్లు కూడా 85, 75 మీటర్లు ఉంటాయి.
టాస్ గెలిచిన జట్టు ముందు బౌలింగ్ ఎంచుకోవడమే మంచిదనే ఓ సాధారణ అభిప్రాయం ఉంది.
అయితే న్యూజిలాండ్ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మెన్ ఇయాన్‌స్మిత్ ‘‘ఇండియాకే మెరుగైన అవకాశాలు ఉన్నాయి’’ అని అభిప్రాయపడ్డాడు.

ఫొటో సోర్స్, Getty Images
విశ్వాసంతో ఉన్న న్యూజిలాండ్..
న్యూజిలాండ్‌కు కూడా ఈ మ్యాచ్ ముఖ్యమైనదిగా భావిస్తోంది. ఎందుకంటే ఇప్పటి దాకా పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌కు సవాలు విసురుతున్న దేశం ఏదైనా ఉందంటే అది ఇండియానే.
ఇరుజట్లు టోర్నమెంట్లో మొదటి నాలుగు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ రన్‌రేటు ప్రకారం న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా, ఇండియా రెండో స్థానంలో ఉంది.
న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ సాంట్‌నర్ తమ ముందు మ్యాచ్ గెలిచాక ఇండియాతో జరగనున్న ఈ మ్యాచ్ గురించి చాలా జాగ్రత్తగా ఉన్నాడు.
‘‘ స్వదేశంలో భారత్ చాలా బలమైన టీమ్. పైగా ఇప్పుడు వారు అత్యున్నతమైన క్రికెట్ ఆడుతున్నారు’’ అని చెప్పాడు.
ఇండియాలానే న్యూజిలాండ్ కూడా ఈ టోర్నమెంట్ లో మిడిల్ ఓవర్లలో ఫాస్ట్ బౌలింగ్ తో వికెట్లు తీయిస్తూ ప్రత్యర్థి పై ఒత్తిడి పెంచుతోంది.
కెన్ విలియమ్సన్ గాయంతో వైదొలగడంతో అతనిస్థానంలో కెప్టెన్సీ చేస్తున్న టామ్ లాథమ్ కూడా మాట్ హెన్రీ, లూకీ ఫెర్గ్యూసన్ ను చక్కగా ఉపయోగించుకున్నాడు.
బ్యాటింగ్‌లో కెప్టెన్ లాథమ్, క్రాన్వే, విల్ యంగ్, రచిన్‌రవీంద్ర , గ్లెన్ ఫిలిప్స్ ఎప్పటికప్పుడు చక్కటి ఇన్నింగ్స్ ఆడుతున్నారు. దీనివలన న్యూజిలాండ్ భారీ స్కోర్లు చేయడమే కాదు , సగటు రన్‌రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది.
’’ ఈ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది’’ అని ఇంగ్లండ్ క్రికెటర్, బీబీసీ టీఎంఎస్ సభ్యుడు జోనాథన్ అగ్న్యూ అన్నారు.
‘‘ ఇప్పటిదాకా జరిగిన నాలుగు మ్యాచ్‌లలోనూ బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్ నుంచి తప్ప ఏ పెద్ద జట్టునుంచి కూడా ఎటువంటి సవాల్ ఎదుర్కోలేదు. కానీ న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఎటువంటి బెరుకులేకుండా ఆడుతున్నారు. ఇండియాపైనే కూడా ఇదే కొనసాగితే ఫైనల్ వరకు వారిని ఆపడం కష్టం’’ అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి..
- లీచ్ థెరపీ అంటే ఏంటి... స్టాలిన్ కూడా చేయించుకున్న ఈ జలగల చికిత్స నిజంగానే రోగాలను నయం చేస్తుందా?
- నవాజ్ షరీఫ్: పాకిస్తాన్లో దిగిన మాజీ ప్రధాని... ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?
- గోల్కొండ వజ్రాలతో ఆ యూదుల దశ ఎలా తిరిగింది?
- టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: ఆంధ్రా రాబిన్ హుడ్‌గా రవితేజ అలరించాడా?
- భారత్-కెనడా దౌత్య వివాదంలో జోక్యం చేసుకున్న బ్రిటన్, అమెరికా... వియాన్నా ఒప్పందాన్ని ఇండియా ఉల్లంఘించిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














