క్రికెట్ వరల్డ్ కప్: విరాట్ కోహ్లీ సెంచరీ కోసం సెల్ఫిష్‌గా ఆడారా... అవతలి వైపు క్రీజులో ఉన్న కేఎల్ రాహుల్ ఏం చెప్పాడు?

కేఎల్ రాహుల్, రోహిత్, కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అభిజీత్ శ్రీవాస్తవ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ, టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ప్రపంచ కప్ మ్యాచ్‌లలో భారత్‌కి ఇది వరుసగా నాలుగో విజయం.

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు ఓపెనర్లు 93 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పారు. రవీంద్ర జడేజా రాకతో ఓపెనర్లు వెనుదిరికి కొత్త బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చారు.

బంగ్లాదేశ్ మేటి బ్యాట్స్‌మెన్ లిటన్ దాస్‌ని కూడా జడేజా పెవిలియన్‌కు పంపించాడు.

ఒకానొక దశలో బంగ్లాదేశ్ భారీ స్కోరు దిశగా వెళ్తున్నట్టు కనిపించింది. జడేజా దెబ్బకి మిడిలార్డర్‌ తడబడడంతో 256 పరుగులకు పరిమితమైంది.

టీమిండియా మంచి ఫామ్‌లో ఉండడం, పరుగుల లక్ష్యం కూడా తక్కువగానే ఉండడంతో భారత్ గెలుపు సునాయాసమేనని తేలిపోయింది. దానికితోడు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ అది నిజమని నిరూపించాడు.

కోహ్లీ, జడేజా

ఫొటో సోర్స్, ANI

జడ్డూకి సారీ చెప్పిన కోహ్లీ

ఈ మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.

మైక్ ముందుకి వచ్చిననప్పుడు విరాట్ కోహ్లీ ముందుగా రవీంద్ర జడేజాకి సారీ చెప్పాడు. ''నీ నుంచి అది (ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్) దొంగిలించినందుకు సారీ చెప్పాలనుకుంటున్నా'' అన్నారు.

''మంచి ప్రారంభం దొరికింది. అలాగే పిచ్ కూడా అనుకూలంగా ఉంది. అవకాశం వచ్చినప్పుడు బౌండరీలు బాదాను'' అని కోహ్లీ అన్నారు.

''ప్రపంచ కప్ మ్యాచ్‌లలో నేను హాఫ్ సెంచరీలు చేసింది తక్కువే, కానీ ఈసారి మ్యాచ్ ముగించేయాలని అనుకున్నా. ఫ్రీ హిట్స్ వచ్చినప్పుడు షాట్స్ కొడుతూ ఇన్నింగ్స్ ఆడా. శుభ్‌మన్‌కి కూడా చెప్పడంతో అతను కూల్‌గా ఆడాడు.'' అని కోహ్లీ చెప్పారు.

ఈ మ్యాచ్‌తో శుభ్‌మన్ గిల్ ప్రపంచ కప్‌‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే, ఆ వెంటనే ఔటయ్యాడు.

జడేజా బౌలింగ్‌‌ను కెప్టెన్ రోహిత్ కూడా ప్రశంసించాడు. కానీ, సెంచరీ సెంచరీయేనని, దానిని తక్కువ చేయలేమని అన్నాడు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

కోహ్లీ సెంచరీపై జరుగుతున్న చర్చేంటి?

రోహిత్ చెప్పినట్టుగానే, మ్యాచ్ జరుగుతున్నప్పుడు కామెంటేటర్లు కూడా విరాట్ కోహ్లీ సెంచరీపై చర్చించుకున్నారు. అయితే ఆ చర్చ ఏంటంటే, విరాట్ కోహ్లీ సింగిల్స్ ఎందుకు తీయడం లేదని.

అప్పుడు విరాట్ కోహ్లీ 92 పరుగుల వద్ద ఉన్నాడు. సెంచరీకి సరిగ్గా ఎనిమిది పరుగులు కావాలి. అదే సమయంలో భారత్ గెలిచేందుకు కూడా 8 పరుగులే అవసరం. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చాలాసార్లు విరాట్ కోహ్లీ సింగిల్స్ తీసిన సందర్భాలున్నాయి.

మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో ఇదే చర్చ జరిగింది. క్రికెటర్లు మాథ్యూ హేడెన్, చతేశ్వర్ పుజారా కూడా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోలో కూడా దీని గురించే మాట్లాడారు.

''నెట్ రన్ రేట్ కూడా పరిగణనలోకి తీసుకోవాలని మాకు తెలియదు'' అని హేడెన్ అన్నారు. అయితే దీనిపై తనకెలాంటి అభ్యంతరం లేదన్నాడు.

''సింగిల్స్ తీయకపోవడం వల్ల ఎలాంటి సమస్యా లేదు. అదేం జట్టుకి ఇబ్బంది కలిగించదు'' అని చతేశ్వర్ పుజారా అన్నారు.

''ఒకవేళ నెట్ రన్ రేట్‌ కారణంగా నాకౌట్ రేసులో వెనకబడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు భారీ స్కోరు(సెంచరీ) చేయాలనుకున్నప్పుడు అది జట్టుకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. మీరు అది చేయాల్సి ఉంటుంది'' అని ఆయన అన్నారు.

కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

సింగిల్స్ తీయకపోవడంపై రాహుల్ ఏమన్నారు?

మ్యాచ్ ముగిసే సమయానికి విరాట్‌తోపాటు అవతలి క్రీజులో కేఎల్ రాహుల్ ఉన్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ విషయంపై రాహుల్ మాట్లాడుతూ అది తన ఐడియా అని, సింగిల్స్ తీయొద్దు, సెంచరీ చేసేందుకు ప్రయత్నించమని విరాట్‌కి చెప్పానని అన్నారు.

తాను అలా చెప్పినప్పుడు విరాట్ కొద్దిగా కన్ఫ్యూజన్‌లో పడిపోయాడని రాహుల్ అన్నారు.

''విరాట్ కన్ఫ్యూజన్‌లో పడ్డాడు. సింగిల్స్ తీయకపోతే బాగోదని అన్నాడు. ఇది ప్రపంచ కప్. నేను నా సెంచరీ కోసం ప్రయత్నించానని అనిపించుకోవడం ఇష్టం లేదన్నాడు. అప్పుడు నేను మళ్లీ చెప్పా. నేను సింగిల్స్ తీయాలనుకోవడం లేదు. నేనే తీయను అని చెప్పా'' అని రాహుల్ చెప్పారు.

గతంలోనూ ఇలాంటి సందర్భాలున్నాయి. విరాట్ కోహ్లీ మ్యాచ్ చివర్లో సింగిల్స్ తీయనివి, లేదంటే సింగిల్స్ తీసేందుకు రాహుల్ ఒప్పుకోని సందర్భాలు కనీసం ఐదు ఉంటాయి.

కానీ, మ్యాచ్ తర్వాత ట్విటర్‌లో సెల్ఫిష్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది.

వాటికి స్పందనగా, మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ మాట్లాడుతున్న వీడియోని ఓ ట్విటర్ యూజర్ షేర్ చేశారు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

విరాట్ రికార్డులు

ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 103 పరుగులు చేశాడు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచ కప్‌లో చేసిన సెంచరీ ఇది. ప్రపంచ కప్‌లో తనకిది మూడో సెంచరీ.

వన్డేల్లో ఇది 48వ సెంచరీ. సచిన తెందూల్కర్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డుకు కొద్దిదూరంలో నిలిచాడు. ప్రపంచ కప్‌ మ్యాచ్‌లలో 1200 పరుగులు సాధించాడు. అంతేకాకుండా అన్ని ఫార్మాట్లలో కలిపి కెరియర్‌లో వేగంగా 26 వేల పరుగులు చేసిన ఫాస్టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

చాలా కాలం తర్వాత విరాట్ కోహ్లీ ప్రపంచ కప్‌లో సెంచరీ చేశాడు. ప్రపంచ కప్‌లో మూడో సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. వన్డే మ్యాచ్‌‌లలో 40వ సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అందుకున్నాడు. సచిన్ తెందూల్కర్(62), సనత్ జయసూరియ(48) తర్వాత స్థానంలో కోహ్లీ ఉన్నాడు.

బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యాకి గాయం కావడంతో మిగిలిన మూడు బంతులు కోహ్లీ వేశాడు. ఆరేళ్ల తర్వాత వన్డేల్లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేశాడు.

ఇప్పటి వరకూ ఆడిన 285 మ్యాచ్‌లలో కనీసం ఒక్క బంతి వేసిన మ్యాచ్‌లలో ఇది 49వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వికెట్ తీయకపోయినా ఇప్పటి వరకూ వన్డేలో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ప్రపంచ కప్ మ్యాచ్‌లలో రెండోసారి బౌలింగ్ చేశాడు. గతంలో 2015 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేశాడు.

హార్దిక్ పాండ్యా

ఫొటో సోర్స్, Getty Images

పాండ్యా గాయంపై రోహిత్ ఏమన్నారంటే...

బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 9వ ఓవర్ వేసేందుకు హార్డిక్ పాండ్యాకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బంతి అందించాడు.

ఆ ఓవర్లో మూడో బంతిని బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్ స్ట్రెయిట్ డ్రైవ్‌కి అది బౌండరీ దాటింది. వేగంగా వెళ్తున్న బంతిని కాలితో ఆపేందుకు ప్రయత్నించిన సమయంలో పాండ్యా మడమ బెణికింది. వెంటనే ఫిజియోథెరపిస్ట్ మైదానంలోకి వచ్చి కొంతసేపు కాలు సరిచేసే ప్రయత్నం చేశారు.

ఆ తర్వాత హార్దిక్ లేచి నడిచేందుకు ప్రయత్నించినప్పటికీ కుంటుకుంటూ కనిపించాడు. కొద్దిసేపటి తర్వాత కుంటుతూ గ్రౌండ్‌లో నుంచి బయటికి వచ్చేశాడు. ఆ తర్వాత మళ్లీ గ్రౌండ్‌లోకి రాలేదు.

హార్డిక్ పాండ్యా గాయంతో బాధపడుతున్నాడని, శుక్రవారానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని రోహిత్ శర్మ చెప్పారు.

''హార్డిక్ పాండ్యాది అంత పెద్ద గాయం కాకపోవచ్చు. త్వరలోనే కోలుకుని జట్టులోకి వస్తాడని అనుకుంటున్నా. రేపటి వరకూ చూసి తర్వాత దానిపై ఒక నిర్ణయం తీసుకుంటాం'' అని రోహిత్ అన్నారు.

న్యూజిలాండ్ జట్టు

ఫొటో సోర్స్, ANI

22న న్యూజిలాండ్‌తో మ్యాచ్

భారత్‌లో 25 ఏళ్ల తర్వాత టీమిండియా బంగ్లాదేశ్‌తో బలపడింది. 1998లో చివరిసారి భారత్‌లో ఇండియా, బంగ్లాదేశ్ తలపడ్డాయి.

చాలా ఏళ్ల తర్వా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్, మొదట కొద్ది ఓవర్ల వరకూ మాత్రమే బంగ్లాదేశ్‌కి కాస్త అనుకూలంగా కనిపించింది. మొదటి వికెట్ పడిన తర్వాత భారత్ దూకుడు ప్రదర్శించడం మొదలైంది.

ప్రపంచ కప్‌‌ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో అక్టోబర్ 22న భారత్ తలపడనుంది. పాయింట్ల పట్టికలో భారత్‌ రెండో స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి: