'భ‌గ‌వంత్ కేస‌రి' రివ్యూ: ఆడ‌పిల్ల‌ను పులి పిల్ల‌లా పెంచిన 'చిచ్చా' క‌థ‌ ఎలా ఉంది?

బాలకృ‌ష్ణ నందమూరి

ఫొటో సోర్స్, Nandamuri Balakrishna/FB

ఫొటో క్యాప్షన్, భగవంత్ కేసరి సినిమా రివ్యూ
    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

బాల‌కృష్ణకు ఓ ఇమేజ్ ఉంది. ఆయ‌న్ని ఓర‌కంగా చూడ్డానికి అభిమానులు అల‌వాటు ప‌డిపోయారు. బాల‌కృష్ణ కొడితే.. ప‌దిమంది ఎగిరెగిరి ప‌డాలి. ఆయ‌న డైలాగు చెబితే థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లాలి. స్టెప్పులు వేస్తే.. బాక్సాఫీసు బ‌ద్ద‌లైపోవాలి. ఏళ్ల త‌ర‌బ‌డి ఇలానే చూశారంతా.

అయితే ఈమ‌ధ్య బాల‌కృష్ణలో కొంత మార్పు వ‌చ్చింది. సెటిల్డ్‌గా క‌నిపించ‌డానికి, వ‌య‌సుకి త‌గిన పాత్రలు పోషించ‌డానికి ఆయ‌న మొగ్గు చూపిస్తున్నారు. ‘అఖండ’ అందుకు మంచి ఉదాహ‌ర‌ణ‌. అందులో ఓ పాత్ర అభిమానుల‌కు నచ్చిన‌ట్టు డిజైన్ చేస్తే, మ‌రో పాత్ర హుందాగా, వ‌య‌సు తీసుకొచ్చిన మెచ్యూరిటీతో తీర్చిదిద్దారు. ఆ ప్ర‌య‌త్నం మంచి ఫ‌లితాన్ని ఇచ్చింది.

బ‌హుశా.. `భ‌గ‌వంత్ కేస‌రి` పాత్ర పుట్ట‌డానికి స్ఫూర్తి కూడా అదే కావొచ్చు. ‘సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌’లో ఇదివ‌ర‌కెప్పుడూ చూడ‌ని బాల‌కృష్ణ `భ‌గ‌వంత్ కేస‌రి` పోస్ట‌ర్ల‌లో క‌నిపిస్తుంటే అభిమానులు ముచ్చ‌ట ప‌డిపోయారు.

‘బాల‌య్య నెవ‌ర్ బిఫోర్ అవ‌తార్‌’ అని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కూడా ఫ్యాన్స్‌కి మాటిచ్చేశాడు.

మ‌రి.. నిజంగానే బాల‌కృష్ణ కొత్త అవ‌తార్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడా? అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా పేరొందిన రావిపూడి ఖాతాలో మ‌రో హిట్టు ప‌డిందా..?

శ్రీలీల, బాలకృష్ణ

ఫొటో సోర్స్, Instagram / Balayyababu

కథేంటంటే..

‘ఆడపిల్లంటే లేడి పిల్లలా కాదు.. పులి పిల్ల‌లా పెంచాలి’ అనుకొనే వ్య‌క్తి భ‌గ‌వంత్ కేస‌రి (బాల‌కృష్ణ‌).

ఓ జైల‌ర్ (శ‌ర‌త్ కుమార్‌) మంచిత‌నం వ‌ల్ల‌ త‌న త‌ల్లిని క‌డ‌చూపు చూసుకొనే అవ‌కాశం ద‌క్కుతుంది. ఆ జైల‌ర్‌ చేసిన సాయానికి కృతజ్ఞతగా భగవంత్ కేసరి ఏం చేయాలనుకున్నాడు? దీనికీ, విజ్జుకీ (శ్రీలీల)కు సంబంధమేంటి? విజ్జుని సైన్యంలోకి పంపాలన్న భగవంత్ కేసరి లక్ష్యం నెరవేరిందా? అడ్డంకులను దాటి భగవంత్ కేసరి తను అనుకున్నది ఎలా సాధింగలిగాడు అన్నదే కథ.

శ్రీలీల, బాలకృష్ణ

ఫొటో సోర్స్, Instagram/Balayyababu

బ‌నావో బేటీకో షేర్..

‘బాల‌య్య నెవ‌ర్ బిఫోర్ అవ‌తార్‌’ అని అనిల్ రావిపూడి చెప్పినట్లే బాల‌కృష్ణని అలాగే చూపించాడు. కానీ బాల‌య్య ఇమేజ్‌ని మ‌ర్చిపోలేదు. ఆయ‌న‌కు, ఆయ‌న అభిమానుల‌కు కావ‌ల్సిన ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ని జోడించి, ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ముద్ర వేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. ముఖ్యంగా బాల‌య్య క్యారెక్ట‌ర్‌ని డిజైన్ చేసిన విధానంతోనే పూర్తి కథపై పూర్తి పట్టు సాధించాడు.

వ‌య‌సుకి త‌గిన పాత్ర‌. ఎక్క‌డా అరుపులు, త‌న రెగ్యుల‌ర్ మాస్ మ‌సాలా ఫీట్లు లేవు. కానీ, అవ‌న్నీ చేస్తే వ‌చ్చే ఎఫెక్టులు మాత్రం త‌గ్గ‌లేదు. జైల్ ఫైట్‌తో బాల‌య్య ఎంట్రీ మొద‌ల‌వుతుంది. ఫైటు బీభ‌త్సంగానే సాగినా, బాల‌య్య మాత్రం స్టైలీష్‌గా, హుందాగా క‌నిపిస్తాడు. ఇదే ఫైట్‌లో అనిల్ రావిపూడి మార్క్ హ్యూమ‌ర్ కూడా క‌నిపిస్తుంది. బ‌స్సు ఫైట్ లో కూడా అంతే. `క‌ళ్ల‌ల్లో క‌ళ్లు పెట్టి చూడు..` అనే రొమాంటిక్ గీతంలో ఇంత‌ వయెలెన్స్ ఉందా? అనిపిస్తుంది. అది కూడా ఫ‌న్నీగానే చూపించాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డ ద‌ర్శ‌కుడిగా త‌న మార్క్ కాపాడుకొన్నాడు రావిపూడి.

ఈ క‌థ‌లో న‌చ్చే విష‌యం విమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌. ‘బేటీకో ప‌డావో..బేటీకో బ‌చావో’ మాత్రమే కాదు ‘బేటీకో షేర్ బ‌నావో’ అన్న ఒక స్లోగ‌న్ కావాలి అనేది అనిల్ రావిపూడి ఉద్దేశం. ఇంట్లోంచి ఓ ఆడ‌పిల్ల బ‌య‌ట‌కు వెళ్తున్న‌ప్పుడు పెప్ప‌ర్ స్ప్రే ఇచ్చి పంపే బ‌దులు, ధైర్యాన్ని నూరిపోయండి అని చెప్ప‌డం, ఆడ‌పిల్ల‌ల్ని తలెత్తుకుని నిలబడేలా పెంచండి అని నిర్దేశించ‌డం బాగుంది.

ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో ఇలాంటి పాయింట్ చెప్పాల‌నే ఆలోచ‌న వ‌చ్చినందుకు ద‌ర్శ‌కుడ్ని అభినందించాలి.

ఓచోట‌.. ‘గుడ్ ట‌చ్ - బ్యాడ్ ట‌చ్‌’ గురించి ప‌దేళ్ల అమ్మాయిల‌కు పాఠంగా చెబుతాడు భ‌గ‌వంత్ కేస‌రి. నిజానికి ఈ ఎపిసోడ్‌కి, క‌థ‌కీ సంబంధం లేదు. ఈ స‌న్నివేశం కావాల‌ని జోడించిన‌ట్టు అనిపిస్తుంది.

కానీ చెప్పేది మంచి మాట అయిన‌ప్పుడు, ఆ లిబ‌ర్టీ తీసుకోవ‌డంలో అర్థం ఉంద‌నిపిస్తుంది.

భగవంత్ కేసరి రివ్యూ

ఫొటో సోర్స్, Nandamuri Balakrishna/FB

ఫొటో క్యాప్షన్, భగవంత్ కేసరి

ఐ డోంట్ కేర్‌

ఏటికి ఎదురీదే మ‌న‌స్త‌త్వం భ‌గ‌వంత్ కేస‌రిది. ఆ విష‌యం తొలి స‌న్నివేశంతోనే అర్థ‌మైపోతుంది. “ఐ డోంట్ కేర్‌” అంటూ బాల‌య్య‌తో ఓ మేన‌రిజం డైలాగ్ చెప్పించారు. దాని చుట్టూనే చాలా స‌న్నివేశాలు సాగుతాయి. పోలీస్ స్టేష‌న్‌లో `టీ` ఎపిసోడ్‌.. ర‌విశంక‌ర్ ఇంటికి వెళ్లి.. బాల‌య్య వార్నింగ్ ఇవ్వ‌డం.. అభిమానుల‌కు గూస్‌బంప్స్ మూమెంట్స్‌. ఇంటర్వెల్‌ను క‌మ‌ర్షియ‌ల్ సూత్రాల‌కు త‌గ్గ‌ట్టుగానే డిజైన్ చేశారు.

ద్వితీయార్థంలో నేల‌కొండ భ‌గ‌వంత్ కేస‌రి ఫ్లాష్ బ్యాక్ మొద‌ల‌వుతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో ప‌ట్టు లేదు. ఈ హీరో-విల‌న్ సంఘ‌ర్ష‌ణ‌ చాలా సినిమాల్లో చూసిందే. అంత బ‌ల‌మైన విల‌న్ ఓ సాధార‌ణ‌మైన హీరోని ఎదుర్కోలేక ఇబ్బందులు ప‌డ‌డం.. ద‌ర్శ‌కుడు తీసుకొన్న సినిమాటిక్ లిబ‌ర్టీ.

ప్రీ క్లైమాక్స్‌లోనే సినిమా అయిపోవాల్సింది. కానీ... మ‌రో ఫైట్ పొడిగించారు. అయితే దానికీ ఓ లింక్ ఉంది.

‘బ‌నావో బేటీకో షేర్’ అనే పాయింట్‌ను మ‌ళ్లీ క్లైమాక్స్‌కు తీసుకొచ్చి, త‌ను క‌థ ఎక్క‌డైతే మొద‌లెట్టాడో, అక్క‌డ ముగించి, రౌండ‌ప్ చేయ‌గ‌లిగాడు. చివరి ఫైట్లో శ్రీ‌లీల ఓ స్పెష‌ల్ ప్యాకేజీలా అనిపిస్తుంది.

ఓ లాయ‌ర్ కొంత‌మంది పిల్ల‌ల‌కు కథ చెప్ప‌డం ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు ఎంచుకొన్న స్క్రీన్ ప్లే టెక్నిక్‌. ఈ క‌థ‌ని స్ట్రైట్‌గానే చెప్పొచ్చు. అలా థ‌ర్డ్ ప‌ర్స‌న్‌తో కథ చెప్పడం వల్ల అద‌నంగా వ‌చ్చిన ఉప‌యోగం ఏమీ లేదు.

కాజ‌ల్ ఎపిసోడ్ కూడా బోర్ కొట్టించింది. ఫ్లాష్ బ్యాక్ ద‌గ్గ‌ర అనిల్ రావిపూడి ఇంకాస్త కొత్త‌గా ఆలోచిస్తే బాగుండేది. అయితే, మ‌ధ్య మ‌ధ్య‌లో బాల‌కృష్ణకు ఇచ్చిన ఎలివేష‌న్లు, బేటీ కో షేర్ బ‌నావో అనే కాన్సెప్ట్ ఈ క‌థ‌కి కొమ్ము కాశాయి.

నందమూరి బాల‌కృష్ణ

ఫొటో సోర్స్, SHINE Screens/YT

ఫొటో క్యాప్షన్, భగవంత్ కేసరిగా బాల‌కృష్ణ

ట్రోల్స్‌‌కు కౌంట‌ర్ ఇచ్చేశాడు..

ఓ రొటీన్ స్టోరీని, ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి కొత్త ఫ్లేవ‌ర్ అద్దాయి. బాల‌కృష్ణ సినిమా అంటే ఎక్క‌డో ఓ చోట పొలిటిక‌ల్ ట‌చ్ ఇవ్వ‌డం కామ‌న్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న టాపిక్స్‌ను పాలిటిక్స్‌తో ముడిపెట్టి, డైలాగులుగా మార్చి, బాల‌య్య నోటి నుంచి వ‌చ్చేలా చేస్తే…అవి సినిమాకి మ‌రింత మైలేజీ వ‌స్తుంద‌ని ద‌ర్శ‌కులు న‌మ్ముతున్నారు.

అయితే ఈ సినిమా వ‌ర‌కూ అనిల్ రావిపూడి అలాంటి ప్ర‌య‌త్నం చేయ‌లేదు. కాక‌పోతే, బాలకృష్ణలోని ఓ కోణాన్ని తెలివిగా ద‌ర్శ‌కుడు వాడాడు. బాల‌య్య‌ ఆలపించిన ‘శివ శంక‌రీ’ అనే పాట‌ని బ‌య‌ట‌కు వ‌దిలారు. దానిపై విప‌రీత‌మైన ట్రోలింగ్ జ‌రిగింది. బాల‌కృష్ణ ఈ పాట పాడ‌డం అవ‌స‌ర‌మా? అని చ‌ర్చించుకొన్నారంతా. జైలు ఎపిసోడ్‌లో బాల‌య్య ఓ పాట పాడి “నాకు న‌చ్చిన‌ట్టు నేను పాడ‌తా.. ఎవ‌రేం అనుకొన్నా ప‌ట్టించుకోను ”అని చెప్ప‌డం..‘శివ శంక‌రీ’ పాట‌పై వచ్చిన ట్రోల్స్‌కు ఇచ్చిన కౌంట‌ర్ అనుకోవాలి.

నందమూరి బాలకృష్ణ

ఫొటో సోర్స్, SHINE Screens/YT

ఫొటో క్యాప్షన్, భగవంత్ కేసరి, విజ్జుల కథ

బాలకృష్ణ ఇమేజ్

బాలకృష్ణ అంటేనే ఓ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్‌. ఫ్యాన్స్‌కి ఏం న‌చ్చుతుందో అదే ఆయ‌న చేస్తాడు. కానీ ఈసారి మాత్రం క‌థ‌కి ఏం కావాలో అదే చేశాడ‌నిపిస్తుంది. త‌న న‌ట‌న సెటిల్డ్‌గా ఉంది. గెట‌ప్ కూడా వ‌య‌సుకి త‌గ్గ‌ట్టుగా ఉంది. కాజ‌ల్ ఉంది క‌దా అని డ్యూయెట్ పాడుకోలేదు. క‌థ‌లో ఆ స్కోప్ లేదు కాబ‌ట్టి, దాని జోలికి వెళ్లలేదు.

‘దంచవే మేన‌త్త కూతురా’ అనే పాట‌ని ఈ సినిమా కోసం రీమిక్స్ చేసి మ‌రీ ప‌క్క‌న పెట్టేశారు. దానికి కార‌ణం క‌థ‌లో అలాంటి పాట‌ల‌కు చోటు లేద‌నే.

బాల‌కృష్ణ క‌మ‌ర్షియాలిటీ కంటే క‌థ‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడ‌న్న విష‌యం అర్థ‌మ‌వుతూనే ఉంది.

మొద‌ట్నుంచి చివ‌రి రీల్ వ‌ర‌కూ.. బాల‌కృష్ణే ఈ క‌థ‌ని న‌డిపించాడు. బాల‌య్యే క‌థైపోయాడు. శ్రీ‌లీల‌ది చాలా కీల‌క‌మైన పాత్ర‌. శ్రీ‌లీల అంటే డాన్సులు, అల్ల‌రే గుర్తొచ్చేది. ఈ సినిమాలో త‌న‌లోని న‌టి కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. కాజ‌ల్ ది చిన్న పాత్రే. తాను కూడా హుందాగానే ఉంది.

అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లో విల‌న్‌గా అవ‌తారం ఎత్తాడు. త‌న‌ని స్టైలిష్‌గా చూపించాల‌న్న ప్ర‌య‌త్నం ద‌ర్శ‌కుడిలో క‌నిపించింది. ఎంతో శ‌క్తిమంతుడిగా ప‌రిచ‌యం చేసిన ప్ర‌తినాయ‌కుడ్ని.. మ‌ధ్య‌లో హీరోయిజం కోసం కావాల‌ని డ‌ల్ చేసిన‌ట్టు అనిపిస్తుంది.

వీడియో క్యాప్షన్, 'భ‌గ‌వంత్ కేస‌రి' రివ్యూ: ఆడ‌పిల్ల‌ను పులి పిల్ల‌లా పెంచిన 'చిచ్చా' క‌థ‌ ఎలా ఉంది?

పండిన ఎలివేష‌న్లు

త‌మ‌న్ ఉన్నాడంటే ఎలివేష‌న్ల గురించి చూసుకోవాల్సిన ప‌నిలేదు. ఈసారీ అదే జ‌రిగింది. ఎలివేష‌న్లు కావల్సిన ప్ర‌తీసారీ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ఊపు తీసుకొచ్చాడు.

పాట‌ల‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. సినిమా అంతా రిచ్‌గా ఉంది. నిర్మాత‌లు ఖ‌ర్చుకు వెనుకంజ వేయ‌లేదు. అనిల్ రావిపూడి రాసుకొన్న డైలాగులు బాగున్నాయి. హీరోయిజం చూపించాల్సిన చోట‌ త‌న క‌లం మ‌రింత ప‌దునెక్కింది. ద‌ర్శ‌కుడిగా ఓ రొటీన్ క‌థే ఎంచుకొన్నా, బాలకృష్ణని చూపించిన విధానం, కాన్సెప్ట్ ఈ సినిమాని ప్ర‌త్యేకంగా నిల‌బెట్టాయి.

అనిల్ రావిపూడి అంటేనే ‘ఫ‌న్’ అనే ఓ ముద్ర ఉంది. అందులోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, త‌న‌దైన ‘ఎమోష‌న్’ చూపించే అవ‌కాశం భ‌గ‌వంత్ కేస‌రి ఇచ్చింది.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)