సింగరేణి..12 నియోజకవర్గాలలో ఓట్ల గని, మరి పార్టీల వ్యూహాలేంటి?

ఫొటో సోర్స్, RevanthReddy/Getty Images/BRS
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. పాలక బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీతో పాటు మిగతా అన్ని పార్టీలూ ప్రచార వేగం పెంచాయి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన బస్ యాత్రను బుధవారం ప్రారంభించారు. ఆయన తన బస్ యాత్రలో భాగంగా భూపాలపల్లి, రామగుండం, మంథని, పెద్దపల్లి వంటి సింగరేణి ప్రాంతాలలో తిరగనున్నారు.
రామగుండంలో ఆయన సింగరేణి కార్మికులతోనూ సమావేశమై వారి సమస్యలు తెలుసుకోనున్నారు. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి సింగరేణి కార్మికులు, వారి సమస్యలపై పడింది.

ఫొటో సోర్స్, Getty Images
12 నియోజకవర్గాలలో గెలుపోటములను ప్రభావితం చేసేది వారే
సింగరేణి అని అంతా పిలుచుకునే ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’ ఒక ప్రభుత్వ సంస్థ. బొగ్గు తవ్వి తీసే ఈ సంస్థలో కేంద్రం, రాష్ట్రం రెండూ వాటాదారులే.
కేంద్రం వాటా 49 శాతం ఉంటే తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం. తెలంగాణలో గోదావరి, ప్రాణహిత లోయ ప్రాంతంలో 350 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ బొగ్గు గనులున్నాయి. ఈ ప్రాంతమంతటినీ కోల్‌బెల్ట్ అంటారు.
తెలంగాణలోని ఆరు జిల్లాలు.. కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్, రామగుండం, పెద్దపల్లి, మంథని, భూపాలపల్లి, పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాలు కోల్ బెల్ట్‌లోనే ఉన్నాయి.
పార్లమెంట్ నియోజకవర్గాల లెక్కల్లో చూస్తే ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలలోని చాలా ప్రాంతాలలో సింగరేటి ఓటర్ల ప్రభావం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
సింగరేణిలో ప్రస్తుతం సుమారు 42 వేల మంది కార్మికులున్నారు. వీరితో పాటు 20 వేల మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులు కూడా పనిచేస్తున్నారు. 60 వేల మందికిపైగా పెన్షనర్లున్నారు.
ఈ నేపథ్యంలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో సింగరేణి కార్మిక కుటుంబాల ఓట్లు కీలకం. అయితే, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో కార్మికులు ఇచ్చే తీర్పు ఆ తరువాత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఇచ్చే తీర్పు అన్ని సందర్భాలలో ఒకేలా ఉండదు.
2017లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగ్గా ఆ ఎన్నికలలో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(తెబొగకాసం) గెలిచింది.
కానీ.. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కోల్‌బెల్ట్ ఏరియాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో సగం కాంగ్రెస్, సగం బీఆర్ఎస్ గెలుచుకున్నాయి.
మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఈ ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి.
ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, చెన్నూరుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులుగెలిచారు.
రామగుండంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీచేసిన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి గెలిచారు.
రామగుండం నుంచి గెలిచిన కోరుకంటి చందర్, కాంగ్రెస్ నుంచి గెలిచినవారిలో గండ్ర వెంకటరమణారెడ్డి(భూపాలపల్లి), వనమా వెంకటేశ్వర రావు (కొత్తగూడెం), బానోత్ హరిప్రియ(ఇల్లందు), టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య(సత్తుపల్లి) బీఆర్ఎస్‌లో చేరారు.
2019 లోక్ సభ ఎన్నికలు నాటికి సింగరేణి ప్రాంత లోక్‌సభ నియోజకవర్గాలైన ఆదిలాబాద్‌లో బీజేపీ గెలవగా.. మిగతా నాలుగు పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. కోల్ బెల్ట్‌లో కాంగ్రెస్ ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలవలేకపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
రానున్న అసెంబ్లీ ఎన్నికలలో సింగరేణి కార్మికుల కుటుంబాల ఓట్ల కోసం అన్ని పార్టీలూ ప్రయత్నాలు చేస్తున్నాయి.
సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులతో పాటు పెన్షనర్ల కుటుంబాల ఓట్లూ ఇక్కడి నియోజకవర్గాలలో గెలుపోటములను ప్రభావితం చేస్తాయి.
అందుకే అన్ని పార్టీలూ వారి సమస్యలపై మాట్లాడుతున్నాయి.
తాము అధికారంలోకి వచ్చాకే సింగరేణి కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు కల్పించామని రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చెప్తుండగా సింగరేణి సంస్థను కాపాడింది, వారికి మేలు చేసింది కేంద్రమేనని బీజేపీ నేతలు అంటున్నారు.
అంతేకాదు.. సింగరేణి కార్మికుల చిరకాల డిమాండ్ అయిన ఆదాయ పన్ను మినహాయింపు కూడా సాధ్యం చేయిస్తానని బీజేపీ మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఇన్‌కం ట్యాక్స్ రూపంలో కార్మికుల నుంచి భారీ మొత్తంలో కేంద్రం రాబట్టుకుంటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంతకీ సింగరేణి కార్మికుల సమస్యలేమిటి?
సింగరేణి కార్మికుల ఓట్లను లక్ష్యంగా చేసుకున్న పార్టీలు, అభ్యర్థులు వారి సమస్యలపై మాట్లాడుతున్నారు. హామీలు ఇస్తున్నారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అయితే తమ ప్రభుత్వ హయాంలో ఏమేం చేశామో చెప్పుకొస్తున్నారు.
మరోవైపు కార్మికులు అధిక పనిగంటలు, యాంత్రీకరణతో తగ్గుతున్న ఉద్యోగావకాశాలు, కాంట్రాక్ట్ నియామకాలు, అవుట్ సోర్సింగ్ వంటి సమస్యలు ప్రస్తావిస్తున్నారు.
సింగరేణి రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులు కూడా పింఛను విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సుదీర్గ కాలంగా వేతన సవరణ అమలు కాకపోవడంతో పాత పింఛన్లే వస్తున్నాయని, కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్(సీఎంపీఎఫ్)లో సమస్యలున్నాయని రిటైర్డ్ కార్మికులు చెప్తున్నారు.
సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ‘బీబీసీ’తో అన్నారు.
‘‘ఒక్క రోజు సర్వీస్ మిగిలి ఉన్నవారిని కూడా కారుణ్య నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటామన్నారు, అది అమలు కాలేదు. పేర్లు తేడా ఉన్నవారికి అసలు పేర్లతో క్రమబద్ధీకరిస్తామన్నారు.. అది కూడా చేయలేదు’’ అన్నారు సీతారామయ్య.
కొత్తగా భూగర్భ గనులు ఏర్పాటుచేసి లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామన్నారు కానీ ఈ పదేళ్ల కాలంలో కొత్త గని ఒక్కటి కూడా రాలేదన్నారు సీతారామయ్య.
ముఖ్యమంత్రి కేసీఆర్ కారుణ్య నియామకాలు చేపడతామని, ఒక్క డిపెండెంట్ ఉద్యోగం కూడా పోనివ్వమని చెప్పడంతో వేల మంది కార్మికులు తమ వారసులకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారని.. కానీ, సింగరేణి యాజమాన్యం ఇచ్చిన సర్క్యులర్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం చాలా కొద్దిమందికే అవకాశం దొరుకుతోందని అన్నారు.

కారుణ్య నియామకాలు
2014 నుంచి 2022 వరకు పెండింగ్‌లో ఉన్న వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు సింగరేణి సంస్థ గత ఏడాది సర్క్యులర్ జారీ చేసింది.
కార్మికుడు మెడికల్‌గా ఇన్‌వేలిడ్ అయితేనే వారసులకు ఉద్యోగం వచ్చేలా నిబంధనలున్నాయని.. ఇది నిర్ధరించేందుకు ఏర్పాటుచేసిన మెడికల్ బోర్డులు అవినీతిమయంగా మారాయని సీతారామయ్య ఆరోపించారు. రెండేళ్లలోపు సర్వీస్ ఉన్న కార్మికులు మెడికల్‌గా అన్‌ఫిట్ అయితే అతని భార్య లేదా కొడుకు లేదా పెళ్లి కాని కుమార్తె లేదా వితంతువైన కుమార్తెకు ఉద్యోగం ఇవ్వాలని జేబీసీసీఐ ఒప్పందం-5లో(జాయింట్ బైపార్టైట్ కమిటీ ఫర్ ది కోల్ ఇండస్ట్రీ అగ్రిమెంట్ 5) ఉన్నప్పటికీ ఇక్కడ కొత్త నిబంధనలు తీసుకొచ్చారని కార్మిక సంఘాల నాయకులు చెప్తున్నారు.
మరోవైపు కారుణ్య నియామకాలలో సింగరేణి యాజమాన్యం రూపొందించిన నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని, ఎలాంటి అవినీతి జరగడం లేదని అధికారులు అంటున్నారు.

ఇన్‌కం ట్యాక్స్ రద్దు
‘సింగరేణి కార్మికులంటే బోర్డర్‌లో సిపాయిలు.. సిపాయిలకు లేని ఇన్‌కం ట్యాక్స్ సింగరేణి కార్మికులకు ఎందుకు’ అని కేసీఆర్ అనేక సందర్భాలలో అన్నారు.
సింగరేణి కార్మికులకు ఇన్‌కం ట్యాక్స్(ఐటీ) రద్దు చేయిస్తానని కేసీఆర్ పలుమార్లు కార్మికులకు హామీ ఇచ్చారు.
కేంద్రం పరిధిలోని విషయమే అయినప్పటికీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు దిశగా కేసీఆర్ ఎన్నడూ కృషి చేయలేదని సీతారామయ్య అన్నారు.
అయితే, కేసీఆర్ సీఎం అయిన తరువాత సింగరేణి కార్మికుల ఐటీ మినహాయింపు ఇవ్వాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు.
మరోవైపు సింగరేణి సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ. 3 వేల కోట్లు రాయల్టీ రూపంలో జమ అవుతోందని, కార్మికులు చెల్లించే ఇన్‌కం ట్యాక్స్‌ను అందులోంచి రీఎంబర్స్ చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భూగర్భంలోకి వెళ్లి బొగ్గు తవ్వుకుని వచ్చే కార్మికులు తమ జీతం నుంచి ఆదాయ పన్ను రూపంలో ఎక్కువ మొత్తం కేంద్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి వస్తోందని ‘సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్’ నేత, సీఐటీయూ స్టేట్ జనరల్ సెక్రటరీ మంధా నరసింహరావు ‘బీబీసీ’తో చెప్పారు.
నరసింహరావు కోల్‌కతా కేంద్రం కార్యకలాపాలు సాగించే కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థ నియమించిన ‘జాయింట్ బైపార్టైట్ కమిటీ ఫర్ ది కోల్ ఇండస్ట్రీ’లో సభ్యుడు.
సింగరేణి కార్మికుల పీఎఫ్ (కోల్ ఇండియా ప్రావిడెంట్ ఫండ్ – సీఎంపీఎఫ్)లో సమకూరిన మొత్తాలపై వచ్చే వడ్డీపైనా ఇన్‌కం ట్యాక్స్ పడుతోందని, వార్షిక వడ్డీ రూ. 2.5 లక్షలు దాటితే దానిపై పన్ను చెల్లించాల్సి వస్తోందని నరసింహరావు అన్నారు.
ఈ పన్నులో రాయితీ ఇస్తామని బీజేపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నా, అందుకు పార్లమెంటులో బిల్ పాస్ కావాల్సి ఉందని ఆయన అన్నారు.

ప్రైవేటుకు బొగ్గు గనులు
ప్రైవేటు కంపెనీలకు కోల్ మైనింగ్ అవకాశం కల్పించేలా ఈ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతి ఇవ్వడం వల్ల సింగరేణి సంస్థ మనుగుడకు ప్రమాదమేర్పడుతోందని నరసింహారావు అన్నారు.
దేశంలోని 101 బొగ్గు గనులను వేలానికి పెట్టారని, అందులో తెలంగాణలోని నాలుగు గనులు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు.
సింగరేణి ప్రాంత గనులు వేలం వేయకుండా సింగరేణికే ఇవ్వాలని అంటున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేంద్రానికి ఈ విషయంలో గతంలో లేఖ రాసింది.
కేంద్రం మాత్రం వేలంలోనే గనులు దక్కించుకోవాలని సూచించింది. గత శీతాకాల సమావేశాలలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభలో ఈ విషయం స్పష్టం చేశారు. సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన లేదని చెప్పిన ఆయన గనులను మాత్రం ప్రైవేటు వాళ్లతో సమానంగా వేలంలో పోటీ పడి కొనుక్కోవాల్సిందేనని చెప్పారు.
దీనిపై కార్మికులు, సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
వేలంలో పాల్గొనాలంటే 14 శాతం ముందే చెల్లించాలని, ఇది సింగరేణికి భారం అని కార్మిక సంఘాలు అంటున్నాయి.
తెలంగాణలోని నాలుగు గనులలో కోయగూడెం బ్లాక్-3 ఆక్షన్‌లో ఒకే ఒక్క కంపెనీ పాల్గొందని, నిబంధనలు ప్రకారం అలా కేటాయించకూడదు కానీ కేంద్రం సింగిల్ టెండర్ వచ్చినా కూడా ఆ సంస్థకు బొగ్గు బ్లాక్‌ను కేటాయించిందని నరసింహారావు చెప్పారు.
బొగ్గు గనులు ప్రైవేట్ చేతిలో ఉంటే కార్మికుల శ్రమ దోపిడీ, కనీస వేతనాల అమలు లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని.. 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణి యాజమాన్యం రూ. 49,666 కోట్లు పన్నుల రూపంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించిందని.. ఆదాయం అందిస్తున్న సంస్థకు మేలు చేసేలా నిర్ణయాలు ఉండాలని ఆయన అన్నారు.
ఈ రంగంలో ప్రైవేట్ వాళ్లకు మేలు చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కొత్తగా బొగ్గు బ్లాకులు దక్కకపోతే సింగరేణి వద్ద ఉన్న గనులలో నిక్షేపాలు 15 ఏళ్లలో ఖాళీ అయిపోతాయి. ఆ తరువాత సంస్థ మూతపడే ప్రమాదం ఉందని అన్నారు.

సొంత ఇంటి పథకం
అలాగే కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేస్తామని కేసీఆర్ గతంలో హామీ ఇచ్చినప్పటికీ ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఇవ్వలేదని సీతారామయ్య ఆరోపించారు.
సింగరేణిలో సుమారు 49,500 క్వార్టర్లు ఉన్నాయని, సుమారు 35 వేల మంది కార్మికులు క్వార్టర్లలో ఉంటుండగా 14,500 క్వార్టర్లు అన్యాక్రాంతమయ్యాయని మంధా నరసింహరావు ఆరోపించారు. వీటిని ఖాళీ చేయించి కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని.. లేదంటే సింగరేణి సంస్థకు ఉన్న 12 వేల ఎకరాలలో కార్మికులకు స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారు.
కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేస్తామన్న కేసీఆర్ ఈ స్థలాలు కార్మికులకు ఇచ్చి ఇల్లు కట్టకునేందుకు సహకరించాలన్నారు నరసింహారావు.

ఫొటో సోర్స్, BRS
సింగరేణిని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీయే: కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ సింగరేణిని నాశనం చేసిందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి లాభాల బాట పట్టిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
ఇటీవల (2023 జులై 10) సింగరేణి ప్రాంతంలోని మంచిర్యాలలో ‘ప్రగతి నివేదన సభ’ పేరిట కేసీఆర్ నిర్వహించిన సభలో ఆయన సింగరేణి విషయంలో కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారు.
‘‘సింగరేణిది 134 ఏళ్ల చరిత్ర. వేలాది కుటుంబాలను ఆదుకున్న సంస్థ అది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణిని నాశనం చేసింది. కేంద్రం నుంచి అప్పు తెచ్చి తిరిగి చెల్లించలేక కేంద్ర ప్రభుత్వానికి సింగరేణిలోని 49 శాతం వాటా అమ్మేసింది’ అని కేసీఆర్ ఆరోపించారు.
‘2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ముందు సింగరేణిలో కార్మికులపై అణచివేత ఉండేది. తెలంగాణ వచ్చాక సింగరేణి నడక మారిందని.. 2014లో సింగరేణి వార్షిక టర్నోవర్ రూ. 11 వేల కోట్లు ఇప్పుడు రూ. 33 వేల కోట్ల టర్నోవర్.. గతంలో లాభాలు 300 కోట్లు 400 కోట్లకు మించి వచ్చేవి కావు కానీ ఈ ఏడాది(2022-23) లాభాలు రూ. 2,180 కోట్లు’ అని కేసీఆర్ చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటానికి ముందు పదేళ్ల కాలం కాంగ్రెస్ పాలనలో సింగరేణిలో 6,403 ఉద్యోగాలు వస్తే తమ ప్రభుత్వ హయాంలో మొత్తం 19,463 ఉద్యోగాలు కల్పించామని, అందులో 15,256 డిపెండెంట్ ఉద్యోగాలని కేసీఆర్ చెప్పారు.
కార్మికులు తమ డిపెండెంట్లకు ఉద్యోగం ఇవ్వకుంటే రిటైర్మెంట్ సమయంలో రూ. 25 లక్షల సెటిల్మెంట్ మొత్తం ఇస్తున్నామని.. ఇల్లు కట్టుకోవడానికి వడ్డీ లేకుండా రూ. 10 లక్షల రుణం ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు.
సింగరేణి స్థలాలలో గుడిసెలు వేసుకున్నవారికి జీవో 76 ద్వారా ఆ స్థలాలు క్రమబద్ధీకరించామని చెప్పారు. అలా 22 వేల మందికి స్థలాలు ఇచ్చామన్నారు కేసీఆర్.

ఫొటో సోర్స్, Revanth Reddy
కార్మికుల త్యాగాలను కేసీఆర్ మర్చిపోయారు: రేవంత్ రెడ్డి
సింగరేణి ప్రాంత బీఆర్ఎస్ అభ్యర్థులు ఇవే అంశాలను తమ ప్రచారాస్త్రాలుగా మలచుకుంటుండగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కేసీఆర్ చెప్పిన లెక్కలకు, వాస్తవాలకు తేడా ఉందని ఆరోపిస్తున్నాయి.
సొంత గనులు లేకుండా చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని ప్రమాదంలోకి నెడుతున్నాయని కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
భూపాలపల్లిలో తాజాగా ఆయన సింగరేణి కార్మికులతో మాట్లాడారు.
తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్ష పాత్ర పోషించారని.. వారి త్యాగాలను కేసీఆర్ మరచిపోయారని రేవంత్ ఆరోపించారు.
గనులు ప్రైవేటుకు కేటాయించే బిల్లుకు పార్లమెంటులో బీఆర్ఎస్ మద్దతు పలికిందని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భూకంపం వచ్చిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసించడం ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?
- బీబీసీ ఐ పరిశోధన: న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్‌ల తెర వెనుక ఏం జరుగుతుంది?
- ‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’
- ప్రేమనాడులు మనలో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా
- క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















