నవాజ్ షరీఫ్: పాకిస్తాన్‌లో దిగిన మాజీ ప్రధాని... ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తర్హబ్ అస్గర్, సైమన్ ఫ్రేజర్
- హోదా, బీబీసీ న్యూస్- డోహా, లండన్
పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ శనివారం నాడు స్వదేశానికి చేరుకున్నారు. 2019 నుంచి ఆయన స్వీయ ప్రవాసంలో ఉన్నారు.
తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో శక్తిమంతమైన పాకిస్తాన్ సైన్యానికి కొరకరానికొయ్యలా తయారైన నవాజ్‌షరీఫ్ తిరిగి రావడానికి తగిన నాటకీయ పరిస్థితులను సృష్టించగలిగే సామర్థ్యం కొందరికే ఉంది.
నవాజ్‌షరీఫ్ చివరిసారి ప్రధానిగా ఉన్న సమయంలో అవినీతి కేసులో జైలుపాలయ్యారు. కానీ, ఆరోగ్య కారణాలపై ఆయన 2019 నవంబరులో జైలు నుంచి విడుదలయ్యారు.
షరీఫ్‌ను గతంలో తిరుగుబాటుతో దించేసిన సైన్యమే ఇప్పుడు స్వాగతం పలకడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. బహుశా ఆయన మరోసారి ప్రధాని అయ్యే అవకాశమూ ఉంది.
విచిత్రం ఏమిటంటే 2018లో నవాజ్‌ను దించేసి సైన్యం ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రధానిని చేసింది. అయితే, సైన్యంతో శత్రుత్వం కారణంగా ఇమ్రాన్ ఖాన్ జైలు పాలయ్యారు.
గత అనుభవాలు కళ్ళెదుటే ఉన్నా ఈసారి కచ్చితంగా ఏం జరుగుతుందని చెప్పలేం.

ఫొటో సోర్స్, EPA
షరీఫ్ వచ్చాక ఏమవుతుంది?
మూడుసార్లు ప్రధానిగా చేసిన నవాజ్‌షరీఫ్, గత నాలుగేళ్ళుగా లండన్‌లో ఉన్నారు. ఆయన పాకిస్తాన్‌లో బెయిల్ పొందిన తరువాత చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్‌లో లండన్ వెళ్ళారు.
2022 లో పాకిస్తాన్ పార్లమెంట్‌లో ఇమ్రాన్‌ఖాన్ అవిశ్వాసంతో పదవీచ్యుతుడైన తరువాత నవాజ్ తన రాజకీయ కార్యకలాపాలను వేగవంతం చేశారు.
ఆ సమయంలో పాకిస్తాన్‌లో పీఎంఎల్-ఎన్ పార్టీకి షరీఫ్ తమ్ముడు షాబాజ్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఇప్పుడు షరీఫ్ పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారు.
శనివారం నాడు దుబాయ్ నుంచి ఇస్లామాబాద్‌కు వచ్చి, అక్కడి నుంచి లాహోర్‌కు వెళ్ళి ర్యాలీలో పాల్గొంటారు. న్యాయస్థానాలలో ఆయనపై కేసులు పెండింగ్‌లో ఉన్నా, వచ్చేవారం వరకు ఆయనకు బెయిల్ లభించడంతో అరెస్ట్ గురించి నవాజ్ షరఫ్ భయపడటం లేదు.
ప్రవాసం నుంచి షరీఫ్ తిరిగిరావడం ఇదే మొదటిసారి కాదు.
1999లో పాకిస్తాన్ సైన్యం తిరుగుబాటుతో నవాజ్ షరీఫ్ పదవి కోల్పోయారు. అయితే అప్పటి నుంచి దేశంలో ఎన్నికలు జరగకపోవడంతో 2007లో షరీఫ్ మరో ప్రతిపక్ష నేత బేనజీర్ భుట్టోతో కలిసి ఎన్నికలు జరిపేందుకు సైన్యంతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నారు.
అప్పట్లో ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై ఉన్నాయి. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత బేనజీర్‌భుట్టో ఎన్నికల ర్యాలీలో హత్యకు గురైన తరువాత ఆ పార్టీ ఘనవిజయం సాధించింది.

ఫొటో సోర్స్, REUTERS
షరీఫ్ మరోసారి ప్రధాని అవుతారా?
2024లో జరగనున్న పాకిస్తాన్ ఎన్నికలలో నవాజ్ షరీఫ్ తమ ప్రధాని అభ్యర్థి అని ఆయన పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అయితే 73 ఏళ్ళ షరీఫ్ ఎదుట ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభానికి తమ పార్టీనే కారణమని పెద్దఎత్తున వస్తున్న విమర్శలతోపాటు ప్రధాన ప్రత్యర్థి అయిన ఇమ్రాన్‌ఖాన్ జైల్లో ఉన్నందున ఈ ఎన్నికలు సక్రమం కాదనే భావన దేశమంతటా వ్యాపిస్తోంది.
మరోపక్క పాకిస్తాన్ ఎలా ఉండాలో చెప్పడానికి ఎలాగూ సైన్యం ఉండనే ఉంది.
షరీఫ్ విదేశాలలో ఉన్నప్పుడు తరచూ సైన్యంపై విమర్శలు చేసేవారు. దేశంలో రాజకీయ అస్థిరతకు ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ మాజీ అధిపతి, మాజీ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కారణమని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఆయా మాజీ అధిపతులు ఖండించారు.
తాను బోగస్ కేసుల బాధితుడినని, దేశంలో జడ్జీలందరూ కుమ్మక్కయ్యారని షరీఫ్ ఆరోపించారు. దీనివలన ఏ పాకిస్తాన్ ప్రధాని తనపూర్తి పదవీకాలాన్ని పూర్తి చేయలేక పోవడంతో పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం కుంటినడకన సాగుతోందన్నారు.
నవాజ్‌షరీఫ్ పాకిస్తాన్ మిలటరీతో రహస్య ఒప్పందం చేసుకున్నారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు అనుమానిస్తున్నారు. అయితే ఆయన ఎన్నికలలో గెలుస్తారనే గ్యారంటీ లేదని వారు చెపుతున్నారు.
ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ -ఎ- ఇన్సాఫ్ (పీటీఐ)కు చెందిన జుల్ఫీ బుకారీ బీబీసీ తో మాట్లాడారు. ‘‘షరీఫ్ మరోసారి ప్రధాని అవుతారని నేను భావించడం లేదు. ఆయనపై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాజకీయాలలో పాల్గొనకుండా ఆయనపై కోర్టులు జీవితకాలం నిషేధం విధించాయి’’ అన్నారు.
కానీ చాలామంది పరిశీలకులు నవాజ్ షరీఫ్ కు పరిస్థితులు అనుకూలంగా మారతాయంటున్నారు.
‘‘మా రాజకీయాల తలరాత మారడంలేదు. కేవలం రాజకీయ పాత్రలు మాత్రమే మారుతున్నాయి’’ అని రాజకీయ విశ్లేషకుడు వాజత్ మసూద్ బీబీసీతో అన్నారు.
‘‘2018లో ఇమ్రాన్‌ఖాన్ ను ప్రధానిని చేశారు... ఇప్పుడు సైన్యం నవాజ్‌షరీఫ్ కోసం ఎన్నికలు నిర్వహించే పనిలో పడింది’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయా?
ఈ ఏడాది మేలో ఇమ్రాన్‌ఖాన్ అరెస్టయ్యాక మిన్నంటిన హింసాత్మక ఆందోళనల అణచివేత తరువాత ఆయన పార్టీ బలహీనపడింది. దీంతో ఈసారి ఎన్నికలు సజావుగా సాగవని చాలామంది చెపుతున్నారు.
ఇమ్రాన్ అరెస్ట్‌కు ముందు పీటీఐ ముందంజలో ఉంది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని జుల్ఫీ బుకారీ చెప్పారు. ఇదే విషయాన్ని మిగతా పార్టీలు కూడా చెపుతున్నాయి.
‘‘దేశంలో అత్యంత ప్రసిద్ధి పొందిన రాజకీయనాయకుడిని ఎన్నికల ముందు మీరు జైల్లో ఎలా పెడతారు, ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగితే ఇమ్రాన్‌ఖాన్‌కు ఎంత బలమైన ఓటు బ్యాంకు ఉందో తెలుస్తుంది’’ అని బుకారీ చెప్పారు.
2018 ఎన్నికల ముందు నవాజ్ షరీఫ్ జైలుపాలైనప్పుడు కూడా ఆయన పార్టీ ఇదే మాట చెప్పింది.
పీటఐ కంటే పీఎంఎల్-ఎన్ కే ఈసారి అవకాశాలు ఎక్కువగా ఉండటం ద్వారా చరిత్ర తనంతట తానే పునరావృతమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆర్థికసంక్షోభమే ప్రధాన సమస్య. దీనిపై ఇరుపార్టీలు ఒకదానికొకటి నిందించుకుంటున్నాయి. నింగినంటే ద్రవ్యోల్బణం, జీవన వ్యయమే ఓటు వేసేటప్పుడు ఓటర్ల మదిలో మెదిలే అంశాలు.
అయితే ఈ సమస్యలన్నింటినీ చక్కపెట్టడం నవాజ్ షరీఫ్‌కు తెలుసని ఆయన పార్టీ చెపుతోంది. కానీ ఆయన వీటిని ఎలా చక్కపెడతారనేదానిపై స్పష్టత లేదు.
చాలామంది పాకిస్తానీయులు తమ దేశ ప్రజాస్వామ్య మూసధోరణితో విసిగిపోయారు. రాజకీయనాయకులు, మిలటరీ జోక్యానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ యువత ఇప్పుడు బహిరంగంగా మాట్లాడుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
నవాజ్ షరీఫ్ పై ఆర్మీ ఆధారపడుతుందా?
పాకిస్తాన్ రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తూ ప్రభుత్వాలను కూల్చివేసే సైన్యానికి, నవాజ్ షరీఫ్‌తో దీర్ఘకాలిక చరిత్రే ఉంది.
అయితే, ఈసారి మిలటరీ గత్యంతరం లేక నవాజ్ షరీఫ్ కు మరోసారి అవకాశం ఇచ్చేందుకు ఇష్టపడుతున్నట్టు కనిపిస్తోందని వాజాహత్ మసూద్ లాంటి పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
‘‘తొలుత మిలటరీ ఇమ్రాన్ ఖాన్ ను రంగంలోకి దించింది. అయితే తమ అదికారానికి అతడు సవాల్ విసరడంతో అతన్ని దించేయాలని మిలటరీ నిర్ణయించుకుంది’’ అని మసూద్ చెప్పారు.
‘‘ఇప్పుడిక నవాజ్ షరీఫ్ వంతులా కనిపిస్తోంది’’ అన్నారు.
లండన్ నుంచి నవాజ్ షరీఫ్ ఆర్మీపై చేసిన విమర్శలకు భిన్నంగా షరీఫ్‌కు, సైన్యానికి మధ్య ఒప్పందం ఒప్పందం కుదిరినట్టు సంకేతాలున్నాయని విశ్లేషకులు చెపుతున్నారు.
షరీఫ్ కూడా తొలినాళ్ళలో సైన్యం మనిషనే ముద్రపడటాన్ని ఇమ్రాన్ ఖాన్‌లానే ఖండించేవారనే విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు.
నవాజ్ షరీఫ్ తన రాజకీయ జీవితంలో మిలటరీ వలన అనేక ఆటంకాలు ఎదుర్కొన్నారు. మరి ఇప్పుడు ఆయన తన ఆట ఎలా ఆడతారో చూడాలి.
‘‘ ఆయన 'ఎస్ సర్' లాంటి మనిషి కారు’’ అని మాజీ ఎంపీ నదీమ్ అఫ్జల్ చాన్ చెప్పారు.
సైన్యంతో షరీప్ ఘర్షణను ఆయన గుర్తు చేశారు.
‘‘ఆయనకు హద్దుల గురించి తెలుసు. ఎప్పుడు వాటిని దాటాలి, ఎప్పుడు దాటకూడదో కూడా తెలుసు’’ అని ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు అధికారి ప్రతినిధిగా కూడా పనిచేసిన చాన్ చెప్పారు.
ఏదేమైనా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో ఘర్షణ పడక తప్పదని చాన్ లాంటివారు చెబుతున్నారు.
ముందు ఎన్నికలకు ఓ తేదీ నిర్ణయించడం, పతనమైపోయిన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడమే ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలుగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- కెనడాలో హిందువులపై అక్కడి పార్టీల వైఖరి ఏమిటి?
- ఇండియా-కెనడా వివాదం: భారత్‌కు అమెరికా అనుకూలమా, వ్యతిరేకమా? ఆ మాటలకు అర్థం ఏమిటి?
- కెనడాలో వీసా సేవలు నిలిపివేయడం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
- ‘ఖలిస్తాన్’ ఉద్యమానికి కెనడా ఎందుకు కేంద్రంగా మారింది? హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు?
- సిక్కు నేత నిజ్జర్ హత్య: ఇండియా, కెనడా గొడవతో అమెరికా ఎందుకు టెన్షన్ పడుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















