టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు రివ్యూ: ఆంధ్రా రాబిన్ హుడ్‌గా రవితేజ అల‌రించాడా?

రవితేజ

ఫొటో సోర్స్, raviteja/twitter

ఫొటో క్యాప్షన్, టైగర్ నాగేశ్వరరావు రివ్యూ
    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

బ‌యోపిక్‌ను ఓ సక్సెస్‌ఫుల్ జోన‌ర్‌గా చిత్ర‌సీమ ఎప్పుడో గుర్తించింది. న‌టీన‌టులు, రాజ‌కీయ నాయ‌కులు, శాస్త్ర‌జ్ఞులు, క్రీడాకారులు.. ఇలా చాలామంది బ‌యోపిక్‌లు వ‌చ్చాయి. అవ‌న్నీ విజ‌య‌వంతం అయ్యాయా, లేదా అనేది ప‌క్క‌న పెడితే, బ‌యోపిక్‌ సినిమాలకు ఓ క్రేజ్ ఉంద‌ని అర్థ‌మైంది. ఇప్పుడు మ‌రో బ‌యోపిక్ వ‌చ్చింది. అయితే ఈసారి ఓ దొంగ క‌థ చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అదే, ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’

ఆంధ్రా రాబిన్‌హుడ్ అని పిలుచుకొనే టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు వెనుక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాలు చాలా ఉన్నాయి. అవన్నీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాకి స‌రిప‌డిన మెటీరియ‌ల్ అవుతుంద‌ని ర‌వితేజ భావించి ఉంటారు. అందుకే, ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’ క‌థను వెండితెర‌పై చూసే అవ‌కాశం ద‌క్కింది.

ఇంత‌కీ 'టైగ‌ర్ ' ఎలా ఉన్నాడు?

టైగర్ నాగేశ్వరరావు

ఫొటో సోర్స్, raviteja_2628

ఫొటో క్యాప్షన్, టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ

కథేంటంటే...

1970ల ప్రాంతంలో స్టువ‌ర్టుపురంలో ఓ పేరు గ‌ట్టిగా వినిపించేది. అతడే టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు. ఉన్న‌వాళ్ల ద‌గ్గ‌ర దోచుకుని లేనివాళ్ల‌కు పెట్ట‌డం అత‌ని జీవన విధానం.

కొట్టేట‌ప్పుడూ, కొట్టేసేట‌ప్పుడు.. చెప్పి మరీ చేయడం అతడి హాబీ. పోలీసుల‌కు కొర‌కాని కొయ్య‌లా మారిన‌ టైగ‌ర్ నాగేశ్వ‌రరావు ఎవ‌రు? ఎందుకు దొంగ‌గా మారాడు? స్టువ‌ర్టుపురం ప్ర‌జ‌ల కోసం త‌ను ఏం చేశాడు..? అనేదే చిత్ర‌క‌థ‌.

సినిమాటిక్ లిబ‌ర్టీ ఎక్కువే

స్టువ‌ర్టుపురం దొంగ‌.. టైగ‌ర్ నాగేశ్వ‌రరావు గురించి స‌మ‌గ్ర‌మైన స‌మాచారం అంటూ ఏం లేదు. ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాలు, పుకార్లు మాత్రమే ఉన్నాయి. అందుకే ద‌ర్శ‌కుడు వంశీ కూడా.. ‘కొన్ని ఉదంతాలు, వ‌దంతుల ఆధారంగా రాసుకొన్న క‌థ‌’ అని ముందే డిక్లేర్ చేసేశాడు. అంటే, ఈ క‌థ‌లో నిజాలు ఉండొచ్చు, లేక‌పోవొచ్చ‌ని ముందే ఒప్పుకొన్నాడ‌న్న‌మాట‌.

ఎంత బ‌యోపిక్ అయినా సినిమాటిక్ లిబ‌ర్టీ త‌ప్ప‌కుండా ఉంటుంది. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావులో అది కొంచెం ఎక్కువే క‌నిపిస్తుంది.

చ‌రిత్ర క‌రుడుక‌ట్టిన దొంగ అని చెప్పిన ఓ వ్య‌క్తిని రాబిన్ హుడ్‌లా, ఓ స‌గటు క‌మ‌ర్షియ‌ల్ హీరోగా చూపించే ప్ర‌య‌త్నం చేసిన సినిమా ఇది.

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు గురించి ఢిల్లీలోని ఓ అధికారి (అనుప‌మ్‌ఖేర్‌) కూపీ లాగ‌డం ద‌గ్గ‌ర్నుంచి ఈ సినిమా మొద‌లెట్టారు. సాధార‌ణంగా మ‌న సినిమాల్లోని హీరోని ఎంత గంభీరంగా ప‌రిచ‌యం చేస్తారో, అలానే స్టువ‌ర్టుపురం దొంగ‌, టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావును వెండితెర‌పైకి తీసుకొచ్చారు. రైలు దొంగ‌త‌నం ఎపిసోడ్ దాదాపు 10 నిమిషాలు ఉంటే, అందులో థ్రిల్ కంటే విజువ‌ల్ ఎఫెక్ట్స్ పైనే ఫోక‌స్ ప‌డిపోతుంది. షిప్‌యార్డ్‌లో బంగారం ఎత్తుకొచ్చే సీన్ కూడా పూర్తిగా క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్‌లోనే సాగుతుంది.

‘నాకు ఈ కుర్చీ కావాలి’ అని చెప్ప‌డం, ఓ సామాన్యుడు దొంగ‌ల ముఠా నాయ‌కుడిగా క్ర‌మంగా ఎద‌గ‌డం.. ఇవ‌న్నీ ‘పుష్ప‌’, ‘కేజీఎఫ్‌’ సినిమాల‌కు స్ఫూర్తిగా రాసుకొన్న స‌న్నివేశాల స‌మాహారంలా క‌నిపిస్తే, అది ప్రేక్ష‌కుల త‌ప్పు కాదు.

ప్ర‌ధాని ఇంట్లో చోరీ

స్టువ‌ర్టుపురం దొంగ గురించి చాలామంది చాలా ర‌కాల క‌థ‌లు చ‌దివారు. వ‌దంతులు విన్నారు. సరిగ్గా అవే తెర‌పై కూడా క‌నిపిస్తుంటాయి. ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఇలా చేశాడా? ఇలా త‌ప్పించుకొన్నాడా?` అంటూ ఏవేవో క‌బుర్లు చెప్పుకొని జ‌నాలు ఆశ్చ‌ర్య‌పోయేవారు. అయితే అంత‌టి ఉత్కంఠ‌త‌, తీవ్ర‌త‌ తెర‌పై క‌నిపించ‌లేదు.

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఇందిరాగాంధీ ఇంటికి వెళ్లి, దొంగ‌త‌నం చేస్తాన‌ని పోలీసుల‌కు ముందే చెప్పి, అనుకొన్న‌ట్టే దొంగ‌త‌నం చేసి వ‌చ్చాడ‌ని ఓ రూమ‌ర్ వినిపించేది. అది ఎంత వ‌ర‌కూ నిజ‌మో తెలీదు. ఆ సీన్ కూడా సినిమాలో ఉంది.

ఇదో రాబిన్ హుడ్ క‌థ‌. నాగేశ్వ‌ర‌రావు ముమ్మాటికీ దొంగే. త‌న‌ని మంచివాడిగా, సంఘ సంస్క‌ర్త‌గా ఊహిచుకొని జ‌నాలు థియేట‌ర్ల‌కు వెళ్ల‌రు. అలాంట‌ప్పుడు ద‌ర్శ‌కుడికి మ‌సి పూసి మారేడు కాయ చేయాల్సిన ప‌నిలేదు.

తొలి స‌న్నివేశంలో డ‌బ్బు కోసం క‌న్న తండ్రి త‌ల‌నే న‌రికి చంపిన‌ట్టు నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌ని భ‌యంక‌రంగా చూపించారు. అదే టెంపో చివ‌రి వ‌ర‌కూ ఫాలో అయినా బాగుండేది. మ‌ధ్య‌లో ఊరి బాగు కోసం ప్రాణాలు ప‌ణంగా పెట్టాడ‌ని, పిల్ల‌ల చ‌దువుకోసం, వాళ్ల ఉద్యోగాల కోసం పాటు ప‌డ్డాడ‌ని చూపించి, మ‌ళ్లీ ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ దారిలో వెళ్లిపోయాడు ద‌ర్శ‌కుడు.

రేణూ దేశాయ్

ఫొటో సోర్స్, Abhishek Agarwal Arts/YT

ఫొటో క్యాప్షన్, హేమలతా లవణం పాత్రలో రేణూ దేశాయ్

సెకండాఫ్...

ద్వితీయార్థం ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంది. ద‌ర్శ‌కుడు స‌న్నివేశాల్ని పేర్చుకొంటూ పోయాడే త‌ప్ప‌, అవ‌న్నీప్రేక్ష‌కుల్ని క‌దిలిస్తాయా? క‌థ‌లో లీనం చేస్తాయా? అనేది ఆలోచించ‌లేదు.

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావుకి ఓ ప్రేమ క‌థ పెట్టి అన‌వ‌స‌రంగా కాల‌యాపన చేశాడు. ద్వితీయార్థంలో మ‌ర‌దలు పాత్ర‌ని ప్ర‌వేశపెట్టి, అది చాల‌ద‌న్న‌ట్టు ఓ వేశ్య‌ని సైతం రంగంలోకి దింపాడు. ముగ్గురు క‌థానాయిక‌లూ, ఆ పాత్ర‌లు క‌థ‌లో గ్లామ‌ర్ అద్ద‌డానికి అన్న‌ట్టు సాగాయి త‌ప్ప‌, క‌థ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాన్నీ క‌లిగించ‌లేదు.

బ‌యోపిక్ తీస్తున్న‌ప్పుడు సినిమాటిక్ లిబ‌ర్టీ తీసుకోవ‌డంలో త‌ప్పు లేదు. అలాగ‌ని వాస్త‌వాల్ని విస్మ‌రించ‌కూడ‌దు. ప‌తాక స‌న్నివేశాల్లో ర‌క్తం ఏరులై పారింది. ఎన్ని త‌ల‌లు తెగిప‌డ్డాయో లెక్క పెట్ట‌డం క‌ష్టం. ఆ హింస అస్స‌లు చూడ‌లేం. త‌న‌పై బుల్లెట్ల వ‌ర్షం కురుస్తున్నా. హీరో స్క్రిప్టులో త‌న‌కిచ్చిన డైలాగుల‌న్నీ ఓపిగ్గా కూర్చుని అప్ప‌చెప్ప‌డం చూస్తే, బ‌యోపిక్ తీసినా.. క‌మ‌ర్షియ‌ల్ సినిమా పోక‌డ‌ల్ని మ‌న‌వాళ్లు దాటుకురాలేక‌పోతున్నారేమో అనిపిస్తోంది.

హేమ‌ల‌తా ల‌వ‌ణం పాత్ర క‌దిలిస్తుంద‌ని, కుదిపేస్తుంద‌ని విడుద‌ల‌కు ముందు చాలా గొప్ప‌గా చెప్పారు. ఆ పాత్ర ప్ర‌వేశించే సమయానికి థియేట‌ర్లో ప్రేక్ష‌కుల‌కు నీర‌సం ఆవ‌హిస్తుంది. అందుకే హేమ‌ల‌తా ల‌వ‌ణం కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేయ‌లేక‌పోయింది.

టైగర్ నాగేశ్వరరావు

ఫొటో సోర్స్, raviteja_2628

ఫొటో క్యాప్షన్, టైగర్ నాగేశ్వరరావు రివ్యూ

ఆ ఎఫెక్ట్ ఎక్కడ?

ర‌వితేజ‌కు బ‌యోపిక్‌లు కొత్త‌. ఆయ‌న‌కు రెండు ర‌కాల పార్శ్వాలున్న పాత్ర పోషించే అవ‌కాశం ద‌క్కింది. ర‌వితేజ అనుభ‌వం కొద్దీ, త‌న పాత్ర‌కు కావ‌ల్సిన న్యాయం చేసేశారు. యం‌గ్‌లుక్‌లో క‌నిపించ‌డానికి ఆయ‌న ప‌డిన క‌ష్టం తెలుస్తూనే ఉంది. అయితే, ఆ లుక్‌లో ర‌వితేజ‌ని చూడ‌డం క‌ష్టంగా అనిపించింది. హేమ‌ల‌తా ల‌వ‌ణం పాత్ర‌లో రేణూదేశాయ్ నటిస్తోందనగానే ఆ పాత్ర ఏ రేంజ్‌లో ఉంటుందో అని అంతా ఎదురు చూశారు. రేణూ కూడా ఇలాంటి పాత్ర చేయ‌డం త‌న పూర్వ జ‌న్మ సుకృతం అన్నారు. కానీ, అంత ఎఫెక్ట్ ఆ పాత్ర‌లో లేదు.

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నా, వాళ్ల పాత్ర‌ల‌కున్న ప్రాధాన్యం అంతంత మాత్ర‌మే. అనుప‌మ్ ఖేర్‌, నాజ‌ర్ పాత్ర‌ల్ని సైతం స‌రిగా వాడుకోలేదు. ఈ రోజుల్లో సినిమా అంతా హీరో చుట్టూ తిరిగితే స‌రిపోవ‌డం లేదు. హీరోకి ధీటుగా కొన్ని పాత్ర‌లు సృష్టించాల్సిందే. లేదంటే క‌థ‌లు నిల‌బ‌డ‌డం లేదు. ఆ లోపం ఈ సినిమాలోనూ క‌నిపించింది.

రవితేజ

ఫొటో సోర్స్, Abhishek Agarwal Arts/YT

ఫొటో క్యాప్షన్, పోరాట సన్నివేశాలు

హింస

పీరియడ్ స్టోరీ వాతావ‌ర‌ణాన్ని తెర‌పై సృష్టించ‌డం అంత తేలికైన విష‌యం కాదు. ఆర్ట్ విభాగం, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌, కెమెరా వ‌ర్క్‌..ఇవన్నీ మ‌న‌ల్ని 1970ల ప్రాంతంలోకి తీసుకెళ్తాయి. కాస్ట్యూమ్స్ కూడా న‌ప్పాయి. ‘ట్రైన్ ఫైట్’ ఇంకాస్త బాగా డిజైన్ చేయాల్సింది. ఆ స‌న్నివేశాల్లో స‌హ‌జ‌త్వం లోపించింది. ఫైట్స్ లో ర‌క్తం ఏరులై పారింది. కొన్ని చోట్ల హీరో అభ్యంత‌ర‌క‌ర‌మైన సంభాష‌ణ‌లు ప‌లికాడు. సెన్సార్ వాటికి బీప్ వేసింది కూడా. అయినా స‌రే, ఆ మాట‌లేంటో స్ప‌ష్టంగా అర్థ‌మైపోతున్నాయి.

పాట‌ల‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. ‘ఏక్ ద‌మ్’ పాట హుషారుగా సాగింది. మిగిలిన పాట‌లు రిజిస్ట‌ర్ కావు. నేప‌థ్య సంగీతంలో హోరెక్కువ‌.

దర్శ‌కుడు కొన్ని ఉదంతాల్ని, వదంతుల్ని ఆధారంగా చేసుకొని ఈ క‌థ రాసుకొన్నాడు. అయితే, వాటిలో క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్ మ‌రీ ఎక్కువైంది. సినిమాటిక్ లిబ‌ర్టీ వ‌ల్ల ఓ బ‌యోపిక్ చూశామ‌న్న ఫీలింగ్ పోయింది.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)