లియో రివ్యూ: లోకేశ్ కనగరాజ్ మళ్లీ మెప్పించాడా? ఖైదీకి, లియోకి లింకేంటి?

ఫొటో సోర్స్, Twitter/7screenstudio
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ చిత్రాల్లో ఇప్పటివరకు ఏ సినిమాకు లేనన్ని అంచనాలు 'లియో'పై ఏర్పడ్డాయి. దీనికి కారణం స్టార్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్.
ప్రస్తుతం తమిళంలో అత్యంత విజయవంతమైన దర్శకుల్లో ఒకరు లోకేశ్. ఖైదీ, మాస్టర్, విక్రమ్.. ఈ మూడు సినిమాలతో తన ప్రతిభా సామర్థ్యాలను చాటి చెప్పి, దేశవ్యాప్తంగా ఆదరణ సంపాదించుకున్నారాయన.
‘మాస్టర్’ తో విజయాన్ని అందుకున్న విజయ్-లోకేశ్ కాంబో మళ్లీ కలవడం, ‘విక్రమ్’తో లోకేశ్ క్రేజ్ ఇంకా విస్తరించడం, లియోకు సంబంధించి ప్రతి ప్రోమో ఆసక్తిని కలిగించడంతో అంచనాలు మరింత పెరిగాయి.
మరి ఆ అంచనాలని లియో అందుకుందా? విజయ్, లోకేశ్ కనగరాజ్ ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని పంచారు ?

ఫొటో సోర్స్, Twitter/trishtrashers
ఎవరీ లియో ?
పార్తిబన్ (విజయ్) హిమాచల్ ప్రదేశ్‌లో కాఫీ షాప్ నడుపుతుంటాడు. పార్తిబన్ భార్య సత్య (త్రిష). వీరికి ఇద్దరు పిల్లలు.
కాఫీ షాపుని నడపటం, ఫ్యామిలీతో హాయిగా గడపటం, అలాగే అక్కడ వన్యప్రాణులను సంరక్షించడం తప్పితే పార్తిబన్‌కు మరో ప్రపంచం లేదు.
ఒకరోజు ఓ ముఠా కాఫీ షాపులో చొరబడి డబ్బు దోచుకోవడంతో పాటు ఆయన కూతుర్ని, అక్కడ పని చేస్తున్న మరో అమ్మాయిని చంపడానికి ప్రయత్నిస్తుంది. వేరే దారిలేక ఆ ముఠాను కాల్చి చంపేస్తాడు పార్తిబన్.
ఈ ఘటన తర్వాత పార్తిబన్ ఫోటో పత్రికల్లో ప్రచారం అవుతుంది. ఆ ఫోటో చూసి.. అతడే లియో దాస్ అని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్), హెరాల్డ్ దాస్ (అర్జున్ సర్జా) పార్తిబన్ వెంటపడతారు. మళ్లీ తమ గ్యాంగ్‌లోకి రావాలని ఒత్తిడి తెస్తారు.
తర్వాత ఏం జరిగింది? లియో దాస్ ఎవరు ? అతనికి అంటోనీ దాస్‌కు, హెరాల్డ్ దాస్‌లకు ఉన్న అనుబంధం ఏమిటి ? పార్తిబన్‌ను లియో దాస్ అని భ్రమపడ్డారా? నిజానికి లియో దాస్ అనే పాత్ర ఉందా లేదా అనేది మిగతా కథ.
బాషా ఫార్ములా?
రజనీకాంత్ కెరీర్‌లో ఐకానిక్‌గా నిలిచిన చిత్రాల్లో బాషా ఒకటి. ఈ సినిమా తర్వాత ఇలాంటి ఫార్ములాలో చాలా కథలు వచ్చాయి.
లియో కూడా బాషా ఫార్ములాలో ఉంది. అయితే ఈ లైన్ ప్రజంట్ చేసిన తీరు, కథనం మాత్రం కాస్త కొత్తగా ఉన్నాయి.
దర్శకుడు లోకేశ్, లియో కోసం హాలీవుడ్ సినిమా ‘హిస్టరీ ఆఫ్ వయెలెన్స్’ను స్ఫూర్తిగా తీసుకున్నాడు. ఈ విషయాన్ని టైటిల్ కార్డ్స్‌లో కూడా వేశాడు. ఆ సినిమాలో ఉన్నట్లే లియోలో ఆరంభ సన్నివేశాలు, కథనం నడిపాడు. ప్రథమార్ధంలో సన్నివేశాలని నడిపిన తీరు యథాతథంగా కాకపోయినా ఆ హాలీవుడ్ సినిమాను అనుసరిస్తుంది.
కాఫీ షాపులో దోపిడీ ముఠాతో పార్తిబన్ యాక్షన్ సన్నివేశాన్ని చాలా చక్కగా డిజైన్ చేశారు. సహజంగా అనిపించేలా, ఉత్కంఠ రేకెత్తించేలా ఆ సన్నివేశాన్ని తీర్చిదిద్దారు.
తర్వాత వచ్చే కోర్టు సీన్‌తో పాటు మిగతా సన్నివేశాలని చకచకా నడిపారు. ఆంటోనీ దాస్, హెరాల్డ్ దాస్ పాత్రల పరిచయంతో ఆసక్తికర విరామఘట్టం కుదిరింది.

ఫొటో సోర్స్, Twitter/Lokesh
ద్వితీయార్ధంలో ఎత్తుపల్లాలు
కథనంలో పెద్ద మెరుపులు లేకపోయినా తొలి సగం సాఫీగానే సాగిపోతుంది. ఐతే ద్వితీయార్ధంలోకి వచ్చేసరికి అసలు సమస్య మొదలైయింది. కథ ఎంతకూ ముందుకుపోదు.
కథలో కీలకంగా ఉండాల్సిన ఆంటోనీ దాస్ పాత్రను సరిగా తీర్చిదిద్దలేకపోయాడు దర్శకుడు. ద్వితీయార్ధం అంతా పార్తిబన్‌ని లియో అని ఒప్పించడానికే సరిపెట్టారు.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా తేలిపోయింది. పైగా లియో పాత్రని కూడా ఆసక్తికరంగా మలచలేకపోయారు లోకేశ్. అతడు చాలా మందిని చంపిన క్రూరుడు అనే డైలాగ్ చెప్పి ఓ రెండు ఫైట్స్‌ని చూపించారు తప్పితే లియో పాత్ర స్వభావాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చూపించలేకపోయారు.
ప్రీక్లైమాక్స్‌లోనే ఇందులో ఇక విషయం లేదని అర్ధమైపోతుంది. అలాంటప్పుడు త్వరగా ముగించాలి. కానీ ఇంకా సాగదీశారు.
అయితే ఆంటోనీ కార్ ఛేజింగ్ సీక్వెన్స్, హెరాల్డ్ దాస్‌తో ఫైట్, పార్తిబన్ ఇంటి చుట్టూ రక్షణ కవచం సీక్వెన్స్‌లు బావున్నాయి.

ఫొటో సోర్స్, Twitter/7screenstudio
విజయ్ ‘వన్ మ్యాన్ షో’
యాక్షన్ సినిమాలు విజయ్‌కు బాగా నప్పుతాయి. లియో కూడా విజయ్ ఇమేజ్‌కు తగ్గ కథ.
లియో దాస్ పాత్రని తన మాస్ ఇమేజ్‌తో సులువుగానే చేసుకుంటూ వెళ్లాడు. యాక్షన్, పోరాట ఘట్టాలలో విజయ్ ప్రదర్శన ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన అనుభవం చూపించారు.
ఆంటోనీ దాస్‌గా సంజయ్ దత్, హెరాల్డ్ దాస్‌గా అర్జున్ పాత్రలు లోకేశ్ కనగరాజ్ మార్క్‌లో లేవు. పెద్ద నటులని తీసుకున్నారు కానీ వాళ్లకి సరైన పాత్రలు ఇవ్వలేదనిపిస్తుంది.
త్రిష హుందాగా అందంగా కనిపించింది.
మడోనాకు భిన్నమైన పాత్ర దక్కింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ తదితర పాత్రలు పరిధి మేర ఉన్నాయి.

ఫొటో సోర్స్, Twitter/Lokesh
బలమైన పాత్రలు ఏవి ?
దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కు ఒక ప్రత్యేక ముద్ర వుంది. బలమైన కథానాయకుడితోపాటు అంతే బలమైన ప్రతినాయకుడిని దించుతాడు. భారీగా యాక్షన్ పెడుతూనే కథానాయకుడి చుట్టూ ఒక బలమైన భావోద్వేగాన్ని అల్లడం ఆయన ప్రత్యేకత. లియోలో కూడా అవి ఉన్నాయి కానీ, అంత ప్రభావంతంగా కనిపించలేదు.
ఇందులో విజయ్ తప్పితే మరో బలమైన పాత్ర కనిపించకపోవడం లోటుగా అనిపిస్తుంది. మాస్టర్, విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి లాంటి బలమైన ప్రతి నాయకుడిని పెట్టి అలరించిన లోకేశ్, ఇందులో మాత్రం అలాంటి మ్యాజిక్ చేయలేకపోయారు.
ఒక సినిమాను ఇంకో సినిమాకు ముడిపెట్టడం లోకేశ్ ప్రత్యేకత. ఇందులో కూడా అలాంటి ముడులు వున్నాయి. ఖైదీలో నెపోలియన్ పాత్రని తీసుకొచ్చారు. అలాగే విక్రమ్‌లోని ఓ పాత్ర కూడా కనిపిస్తుంది.
ఇక ఆయన సినిమాలో డ్రగ్స్, గ్యాంగ్ స్టర్స్, పోలీసులు, బిర్యానీ ఇలా కొన్ని కామన్ ఎలిమెంట్స్ వుంటాయి. ఇందులో కూడా అవి కనిపించాయి కానీ కథనం కుదరలేదు.
లియోను తన సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమయ్యేలా ప్రయాణం చేయించాడు దర్శకుడు. కానీ అది విక్రమ్‌లో కుదిరినంతగా కుదరలేదు.

ఫొటో సోర్స్, Twitter/Lokesh
అదరగొట్టిన అనిరుధ్ రవిచందర్
లియోలో మరో ప్రధాన ఆకర్షణ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. నేపథ్య సంగీతంతో యాక్షన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఎలివేషన్ సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు.
మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం కూడా ఉన్నత స్థాయిలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ నేపథ్యంలో తీసిన సన్నివేశాలు ఆకర్షణీయంగా వున్నాయి.
మాటలు సరిగ్గా కుదరలేదు.
ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టి కేంద్రీకరించాల్సింది.
ముఖ్యంగా సెకండ్ హాఫ్‌ని ఇంకా ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
లియో గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే- తెలిసిన కథనే కొత్తగా చెప్పేందుకు డైరెక్టర్ లోకేశ్ చేసిన ప్రయత్నం, అంచనాలను అందుకోలేకపొయింది.
ఇవి కూడా చదవండి
- ఇజ్రాయెల్‌తో పోరుకు సిద్ధమంటున్న హిజ్బొల్లా సంస్థ చరిత్ర ఏంటి?
- సిక్కిం ఆకస్మిక వరదల్లో 22 మంది జవాన్లు సహా 102 మంది గల్లంతు, క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?
- ఏషియన్ గేమ్స్: ఈ ఫోటోను చైనా ఎందుకు సెన్సార్ చేసింది?
- పారిస్‌పై నల్లుల దండయాత్ర, భయపడిపోతున్న జనం, ఎక్కడ చూసినా నల్లులే..
- శ్రీదేవి ఉప్పు తినకపోవడం వల్లే చనిపోయారా? బోనీ కపూర్ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














