ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలు: గాజా మీద దాడులు కొనసాగుతుంటే వెస్ట్ బ్యాంక్‌లో ఏం జరుగుతోంది?

వెస్ట్ బ్యాంక్, పాలస్తీనా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా ఇజ్రాయెల్-గాజా ఘర్షణలపైనే ఉంది. అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసిన నాటి నుంచి, గాజాపై ఇజ్రాయెల్ ఎడతెగని దాడులు చేస్తూనే ఉంది. దీంతో ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఆందోళనలు పెరుగుతున్నాయి.

గాజా నగరంలో అల్-అహిల్ అరబ్ ఆస్పత్రిపై మంగళవారం నాటి దాడిలో వందల మంది చనిపోయారు. ఈ దాడి తరువాత వెస్ట్‌ బ్యాంక్ పరిపాలనా రాజధాని రమల్లాలో వందలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.

ఆస్పత్రిపై దాడికి ఇజ్రాయెల్‌‌దే బాధ్యత అని హమాస్ ఆరోపించగా, మరో అతివాద సంస్థ ‘పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్’ ఇందుకు కారణమని ఇజ్రాయెల్ చెబుతోంది.

మరోవైపు, పాలస్తీనా అడ్మినిస్ట్రేషన్ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ రాజీనామా చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. గురువారం నాడు మహమూద్ అబ్బాస్ రాజీనామా కోరుతూ రమల్లాలో భారీ ప్రదర్శన జరిగింది.

ఈ సందర్భంగా రాళ్ళు విసురుతున్న ఆందోళనకారులను నియంత్రించేందుకు పాలస్తీనా భ్రదతా దళాలు టియర్ గ్యాస్, స్టన్ గ్రేనేడ్స్‌ను ప్రయోగించాయి.

ఇజ్రాయెల్, హమాస్ ప్రస్తుత ఘర్షణలపై మహమూద్ అబ్బాస్ తీరే జనం ఆగ్రహానికి కారణమని న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ తెలిపింది.

గాజాలో మృతుల సంఖ్య పెరగడం, అక్కడి విధ్వంసానికి సంబంధించిన ప్రచారం ఈ ప్రాంతంలో ఆగ్రహం పెల్లుబుకడానికి కారణమైంది.

గాజాలో నివసిస్తున్న పాలస్తీనియన్లు బయటకు పోకుండా ఇజ్రాయెల్ రహదారులను మూసివేసింది. అలాగే వెస్ట్‌బ్యాంక్‌లో చెక్‌పాయింట్స్‌ను పెంచింది.

వెస్ట్ బ్యాంక్, పాలస్తీనా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, EPA

వెస్ట్‌ బ్యాంక్‌పై ఇజ్రాయెల్ దాడి

ఇజ్రాయెల్ భద్రతా దళాలు వేర్వేరు ఘటనలలో మొత్తం ఏడుగురిని చంపినట్టు న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ రిపోర్ట్ చేసింది. అక్టోబరు 7 నుంచి ఇజ్రాయెల్ దళాలు వెస్ట్‌బ్యాంక్‌లో మొత్తం 73మందిని హతమార్చాయి.

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు జరగడానికి కంటే ముందు నుంచీ వెస్ట్‌ బ్యాంక్‌లో పాలస్తీనా, ఇజ్రాయెల్ పౌరుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.

‘‘1967లో జరిగిన ఆరురోజుల యుద్ధం తరువాత ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న వెస్ట్‌ బ్యాంక్‌లో.. ఏడాదిన్నర నుంచీ హింస తీవ్రరూపం దాల్చుతోంది’’ అని బీబీసీ జెరూసలెం కరస్పాండెంట్ యోలానండే నెల్ ఈ నెల ప్రారంభంలో ఇచ్చిన ఓ రిపోర్టులో పేర్కొన్నారు.

‘‘గత కొన్ని నెలలుగా ప్రతిరోజూ రాత్రి ఇజ్రాయెల్ దళాలు చొరబడుతున్నాయి. పాలస్తీనా ప్రజలు కూడా ఇజ్రాయెల్ ప్రజలపై దాడులు చేసేవారు. పాలస్తీనా ప్రజలను ఇజ్రాయెల్ దళాలు హింసించడం కూడా ఎక్కువైంది. అలానే ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చిన భూమి కూడా నానాటికీ పెరుగుతోంది’ అని ఆయన చెప్పారు.

ఐక్యరాజ్యసమితి వివరాల ప్రకారం జనవరి నుంచి వెస్ట్‌ బ్యాంక్‌లో 179 మంది చనిపోయారు. గడిచిన రెండు దశాబ్దాలలో 2023 సంవత్సరమే ఎక్కువగా మరణాలు సంభవించాయి.

వెస్ట్ బ్యాంక్, పాలస్తీనా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

అబ్బాస్‌పై ఆగ్రహం

గాజాలో ఆస్పత్రిపై జరిగిన భీకరదాడి తరువాత అమెరికా అధ్యక్షుడితో జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసుకుని జోర్డాన్ నుంచి మహమూద్ అబ్బాస్ తిరిగి వచ్చేశారు.

ఆయన రాకకోసం రమల్లాలోని మానారా స్క్వేర్ వద్ద వందల మంది ఆందోళనాకారులు ఎదురుచూస్తున్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధంపై అబ్బాస్ స్పందన ప్రభావవంతంగా లేకపోవడంపై వీరంతా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం కొంతమంది ఆందోళనాకారులు హమాస్ నాయకులకు మద్దతుగా నినాదాలు కూడా చేసినట్టు తెలుస్తోంది.

వెస్ట్‌ బ్యాంక్‌లోని నబ్లస్, ట్యూబస్, జెనిన్ నగరాలలో పాలస్తీనా భద్రతా దళాలతో వీరు ఘర్షణకు దిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

రాయిటర్స్ కథనం ప్రకారం ‘‘అబ్బాస్‌కు వ్యతిరేకంగా వెస్ట్‌ బ్యాంక్‌లో ఎప్పటినుంచో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవి పాలస్తీనా ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇక్కడ ఘర్షణలు అదుపు చేయడానికి అబ్బాస్ సైన్యానికి, ఇజ్రాయెల్ సేనలతో సమన్వయంతో పని చేయాలని ఆలోచించక తప్పని పరిస్థితి ఏర్పడింది.’’

వెస్ట్ బ్యాంక్, పాలస్తీనా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అబ్బాస్ చాలాకాలంగా హమాస్‌ను వ్యతిరేకిస్తున్నారు

వెస్ట్‌ బ్యాంక్‌లో అబ్బాస్ పరిమిత ప్రభుత్వం

ఆరువేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే వెస్ట్‌ బ్యాంక్‌లో చాలా ప్రాంతాలు ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్నాయి. జోర్డాన్ నది పశ్చిమ తీరంలో ఈ ప్రాంతం ఉంది. దీనికి తూర్పున జోర్డాన్ ఉండగా, మిగిలిన మూడు దిక్కులలో ఇజ్రాయెల్ సరిహద్దుగా ఉంది.

మహమూద్ అబ్బాస్ నేతృత్వంలోని ది పాలస్తీనా అథారిటీ పరిమిత అధికారాలతో ప్రభుత్వాన్ని నడుపుతోంది.

1993లో ఓస్లో ఒప్పందం తరువాత పాలస్తీనా అథారిటీ తాత్కాలిక ప్రభుత్వంగా ఏర్పడింది.

తూర్పు జెరూసలెంను భవిష్యత్తులో పాలస్తీనాలో భాగం చేయడంతోపాటు వెస్ట్‌ బ్యాంక్, గాజాస్ట్రిప్‌లలోని కొన్ని భాగాలపై పాలస్తీనా అథారిటీకి పాక్షిక సార్వభౌమత్వాన్ని కల్పించేందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

2005లో నాలుగేళ్ళ కాలానికి అబ్బాస్ మొదటిసారి ఎన్నికయ్యారు. కానీ, 18 ఏళ్ళ తరువాత కూడా ఎన్నికలు నిర్వహించేందుకు అబ్బాస్ అనుమతించడం లేదు.

పశ్చిమదేశాల మద్దతుతో అబ్బాస్ కొనసాగుతుండగా, పాలస్తీనా ప్రాంతాలలో ఆయన చెడ్డపేరు మూటగట్టుకున్నారు.

వెస్ట్ బ్యాంక్, పాలస్తీనా, ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, Getty Images

వెస్ట్‌ బ్యాంక్ ప్రజల ఆగ్రహం

‘‘నిరుడు గాజాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడటం, వెస్ట్‌ బ్యాంక్‌పై భీకర దాడులు చేయడంపై పాలస్తీనా భూభాగాలలో నివసించే ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు’’ అని ‘ది వాషింగ్టన్ పోస్ట్’ మధ్య ప్రాచ్యం కరస్పాండెంట్ మిరియ్ బెర్గర్ చెప్పారు.

‘‘చాలామంది పాలస్తీనా ప్రజలు మహమూద్ అబ్బాస్ నియంతృత్వాన్ని ఇజ్రాయెల్ ఆక్రమణకు కొనసాగింపుగా చూస్తున్నారు’’ అని ఆయన చెప్పారు.

వెస్ట్‌ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ ఆక్రమణలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం చట్టవిరుద్ధమైనవి. కానీ ఇజ్రాయెల్ అలా భావించడం లేదు. పైగా గడిచిన కొన్ని నెలలుగా నిరంతరాయంగా ఇక్కడ ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణ పెరిగిపోతోంది.

అబ్బాస్ చాలాకాలంగా హమాస్‌ను వ్యతిరేకిస్తున్నారు. హమాస్ ఇజ్రాయెల్ ఉనికినే వ్యతిరేకిస్తోంది. అబ్బాస్ మొదట్లో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఎటువంటి శాంతి ప్రక్రియనైనా నిరాకరించేవారు.

2007లో అబ్బాస్ పార్టీ ఫతాను ఓడించి హమాస్ గాజాస్ట్రిప్‌ను నియంత్రణలోకి తెచ్చుకుంది. ఈ రెండు సంస్థల పునరేకీకరణకు ఏళ్ళ తరబడి చర్చలు సాగుతున్నా ప్రయోజనం లేకపోయింది.

సెప్టెంబరులో పాలస్తీనియన్ల మధ్య ది పాలస్తీనియన్ సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ (పీసీపీఎస్ఆర్) ఓ సర్వే నిర్వహించింది. హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనీయా, పాలస్తీనా అథారిటీకి చెందిన మహమూద్ అబ్బాస్ మధ్య మాత్రమే ప్రెసిడెంట్ అభ్యర్థి కోసం ఎన్నికలు జరిగితే హనియాకు 58 శాతం ఓట్లు అబ్బాస్‌కు 37శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది.

అదే సర్వేలో 87 శాతం మంది పాలస్తీనీయులు పాలస్తీనీయన్ అథారిటీ సంస్థలలో అవినీతి ఉందని అభిప్రాయపడగా, 72 శాతంమంది హమాస్ నియంత్రణలోని సంస్థలలోనూ అవినీతి ఉందని నమ్ముతున్నారు.

ఓస్లో ఒప్పందం తరువాతే తమ పరిస్థితి మరింత దిగజారిపోయిందని 65శాతం మంది పాలస్తీనియన్లు నమ్ముతున్నారు. అదే సమయంలో 20 శాతం మంది మాత్రం తమ పరిస్థితి మెరుగుపడిందని విశ్వసిస్తున్నారు.

హమాస్ 2007లో గాజాను నియంత్రణలోకి తెచ్చుకున్నప్పటి నుంచి ఇజ్రాయల్ నాలుగుసార్లు యుద్ధం చేసింది. కానీ, గతవారం మొదలైన ఈ అయిదో యుద్ధం చాలా భీకరమైనది. రాబోయే రోజులలో గాజాలో ఏం జరిగినా అది కచ్చితంగా వెస్ట్ బ్యాంక్‌ను ప్రభావితం చేస్తుంది.

వీడియో క్యాప్షన్, బీబీసీ లైవ్‌లో న్యూస్ ఇస్తున్న సమయంలో, ఓ భవనంపై ఇజ్రాయెల్ దాడులు జరిపింది.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)