వేడి వేడి చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు

Chicken soup

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చికెన్ సూప్‌తో జలుబు నుంచి ఉపశమనం వస్తుందా?
    • రచయిత, కోల్బి తీమన్
    • హోదా, బీబీసీ కోసం

జలుబు, ముక్కు దిబ్బడతో సతమతమవుతున్నప్పుడు వేడివేడి కషాయం తాగితే ఉపశమనం లభిస్తుందని చెప్పడం మనం కూడా వినే ఉంటాం.

కషాయానికి బదులుగా చాలా దేశాల్లో అనారోగ్యం బారిన పడిన వారికి, జలుబుతో ఇబ్బంది పడుతున్న వారికి వేడివేడి చికెన్ సూప్‌ను అందిస్తారు. జలుబు నుంచి ఉపశమనం పొందడానికి చికెన్ సూప్ సహకరిస్తుందని వందల ఏళ్లుగా నమ్ముతూనే వస్తున్నాం.

కాలం గడిచేకొద్దీ చికెన్‌ సూప్‌కు అదనపు రుచులు వచ్చి చేరాయి. ఒక్కో దేశంలో వారి వారి ఇష్టాలకు తగ్గట్లుగా తయారుచేసుకుంటారు.

అనారోగ్యానికి చికిత్సగా చికెన్ సూప్‌ను తీసుకోవడం అనేది ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో ఉంది. క్రీస్తు శకం 60ల నాటిది. రోమన్ చక్రవర్తి నీరో చక్రవర్తి దగ్గర సైనిక శస్త్రచికిత్స వైద్యుడిగా పేరొందిన పెడానియస్ డియోస్కోరైడ్స్, ఆయన రాసిన సమగ్ర వైద్య విధానాలే దాదాపు 100 ఏళ్లపాటు అప్పటి వైద్యులు అనుసరించారు.

అయితే మనం నమ్మినట్లుగా చికెన్ సూప్ ఆరోగ్యానికి మేలు చేస్తుందా? అనారోగ్యంగా ఉన్నప్పుడు సూప్‌ని తీసుకుంటే మానసికంగా కూడా ఉపశమనం పొందినట్లు అనిపించడం నిజమేనా? అసలు చికెన్ సూప్ తీసుకుంటే జలుబు నుంచి ఉపశమనంగా అనిపిస్తుందా?

వీటికి సమాధానాలు చెప్పారు యూనివర్సిటీ ఆఫ్ డేటన్‌లో న్యూట్రిషన్, డైటెటిక్స్ విభాగ ప్రొఫెసర్ అయిన కోల్బి తీమన్.

చికెన్ సూప్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అనారోగ్యంతో ఉన్నవారికి వేడి వేడి చికెన్ సూప్ ఇవ్వడం అలవాటుగా మారింది

ఆకలిని పెంచడంలో..

చికెన్ సూప్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తనకు బాగా తెలుసని కోల్బీ తీమన్ అన్నారు. ఉడికిన చికెన్, కూరగాయలు, మసాలా దినుసులతో తయారుచేసిన వేడి వేడి సూప్‌ మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో వివరించారు కోల్బి.

"అనారోగ్యంతో ఉన్నవారికి ఏమీ తినబుద్ది కాదు. తీపి, ఉప్పు, వగరు, చేదులతోపాటు మాంసపు రుచి(ఉమామి)తో కూడిన సూప్‌ను సేవించడం నోటికి ఎంతో రుచిగా ఉంటుంది" అని అన్నారు.

అమినో యాసిడ్లు ప్రొటీన్లను అందించడంలో కీలకం. ఈ ఉమామి రుచి కలిగి ఉండే ఆహార పదార్థాల్లో అమినో యాసిడ్‌ గ్లూటామెట్ ఉంటుంది. అయితే కేవలం మాంసంలోని ఉమామి రుచి ఉంటుందని కాదు. చీజ్, మష్రూమ్స్, మీసో, సోయాసాస్ వంటి పదార్థాలూ ఈ మాంసపు రుచిని అందిస్తాయి.

తరువాతి అధ్యయనాల్లో ఈ ఉమామి రుచి వలన చికెన్‌సూప్‌ తీసుకుంటే ఉపశమనం కలగడానికి కారణం అని తెలిసింది.

“నేను చూసిన వారిలో ఎగువ శ్వాసకోశ సంబంధిత అనారోగ్యానికి గురైన వారు తక్కువ ఆహారం తినడం లేదంటే అసలు తీసుకోకపోవడం వంటివి చేస్తారు. దీనికి కారణం లేకపోలేదు. మనకు ఏదైనా గాయం లేదా అనారోగ్యం కలిగినప్పుడు శరీరంలోని తెల్లరక్త కణాలు స్పందించి, ప్రభావితమైన ప్రాంతానికి చేరుకుని తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నిస్తాయి. దీనిని మనం ‘వాపు’గా చెప్పొచ్చు. ఈ కారణంగానే ఆకలి తగ్గిపోతుంది. ఆహారం తీసుకోవాలని అనిపించదు” అని అన్నారు.

అయితే, ఓ అధ్యయనం ప్రకారం ఆకలి లేదన్నవారు చికెన్ సూప్ తీసుకున్న సమయంలో తమకు ఆకలిగా అనిపించినట్లు తెలిపారని పరిశోధకులు చెప్తున్నారు.

ఈ ఉమామి రుచి కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయని ఇతర అధ్యయనాల్లో తేలింది. ఈ ఆహారాన్ని తీసుకున్నప్పుడు మెదడులో ఉండే నరాలు ఉత్తేజితమై నాలుకకు రుచి తెలియజేస్తాయని, ఆ వెంటనే శరీరం కూడా ఎక్కువ ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు సిద్ధమై, ఎక్కువ ప్రొటీన్ల సంగ్రహణకు అనుకూలంగా మారుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి.

అనారోగ్యంగా ఉన్నప్పుడు తమలో అరుగుదల సమస్యను ఈ చికెన్ సూప్‌ను తీసుకోవడం వలన కాస్త ఉపశమనాన్ని ఇచ్చిందని కొంతమంది అభిప్రాయపడ్డారు.

Chicken soup

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చికెన్ సూప్ తీసుకోవడం వలన ఉపశమనం కలుగుతుందని చాలామంది భావన

వాపు, ముక్కుదిబ్బడ నుంచి..

శ్వాసకోస సంబంధిత అనారోగ్యం తలెత్తినప్పుడు శరీరంలోని తెల్లరక్తకణాలు రక్తంలో కలిసి, ప్రభావితమైన ప్రాంతానికి చేరుకుని తమ పని మొదలుపెడతాయి.

అనారోగ్యంతో ఉన్నవారిలో జలుబు, ఫ్లూ, ముక్కుదిబ్బడ, దగ్గు, ముక్కుచీదడం, మందపాటి శ్లేష్మం వంటి లక్షణాలు మనలో కనిపిస్తాయి.

"తెల్లరక్తకణాలను నెమ్మదించేలా చేస్తే, ఆ ప్రభావం తగ్గుతుంది. ముక్కుదిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పని చికెన్ సూప్ చేస్తుంది” అని కోల్బీ అన్నారు. న్యూట్రోఫిల్స్ వంటి తెల్ల రక్తకణాలు దిబ్బడను కలిగించే ప్రక్రియను ఈ చికెన్ సూప్ నెమ్మదించేలా చేస్తుంది. ఫలితంగా దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది" అని అన్నారు.

చికెన్ సూప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చికెన్ సూప్ తయారీ

ఇవి ఉండేలా చూడండి..

ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి అవసరమయ్యే ప్రోటీన్లను అందించేలా చికెన్ సూప్‌ను సిద్ధం చేసుకోవాలి. సూప్ తయారీలో వాడే కూరగాయలు శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి.

“వేడివేడి చికెన్ సూప్‌ నుంచి వచ్చే వాసన(అరోమా)ను పీల్చడం వలన నాసిక, శ్వాసకోశ నాళాల ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. దీనితోపాటు తరచుగా శ్వాసకోశ వ్యాధుల వలన వచ్చే శ్లేష్మం నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. వేడి నీటిని కూడా తీసుకోవడంతో పోలిస్తే చికెన్ సూప్ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది” అని కోల్బి అన్నారు.

చికెన్ సూప్‌ తయారీలో వినియోగించే మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు, వెల్లుల్లి వంటివి కూడా పడిశం నుంచి ఉపశమనం పొందేందుకు, నీరు, ఎలక్ట్రోలైట్లు ఉన్న సూప్ శరీరానికి కావలసిన రీ హైడ్రేషన్‌కు సహాయపడతాయని చెప్పారు.

ఇంట్లోనే చికెన్‌తోపాటు దినుసులు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, తగినంత మసాలా వేసుకుని తయారుచేసుకునే చికెన్ సూప్ ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది.

“మంచి ఫలితాన్ని ఇవ్వాలంటే మార్కెట్‌లో దొరికే ఆల్ట్రా ప్రాసెస్‌డ్ చికెన్ సూప్‌ల కన్నా కూడా ఇంటి దగ్గరే సూప్ చేసుకుంటే మంచిది” అన్నారు.

“క్లుప్తంగా చెప్పాలంటే తాజా అధ్యయనాలు చికెన్ సూప్‌ను పూర్తిగా తగ్గించలేదని, కాకపోతే రోగి జలుబు నుంచి ఉపశమనం కలిగేలా చేయగలదు” అన్నారు కోల్బీ.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)