ప్రపంచ దృష్టి దినోత్సవం: ఇలా చేస్తే మీ కంటి ఆరోగ్యం గురించి తెలుస్తుంది

మన శరీరంలో సున్నితమైన ఇంద్రియం కళ్లు. చిన్న ఇబ్బంది వచ్చినా తట్టుకోలేం.
అయితే, మనలో ఎంతమంది కంటి సంరక్షణపై దృష్టి సారించాం? కంటి ఆరోగ్యం కోసం ఏమేం జాగ్రత్తలు తీసుకుంటున్నాం?
కంటిచూపు సమస్య లేని వారికి నేత్ర సంరక్షణ అనేది అంత ప్రాధాన్యత లేని విషయం.
“కళ్లు తెరిచిన దగ్గర నుంచి తిరిగి మూసేవరకు మనకు నిత్యం కళ్లతోనే పని. మనకు గుండె ఎంత ముఖ్యమో, కళ్లు కూడా అంతే ముఖ్యం అని గుర్తుంచుకోవాలి” రాయల్ కాలేజీ ఆప్తమాలజిస్ట్ సారా మాలింగ్ అన్నారు.
“మనం బాగా పరిగెత్తినప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీంతో మనం పరుగును ఆపి, కాస్త విరామం తీసుకుంటాం. కానీ కళ్ల దగ్గరకు వచ్చేసరికి, అలాంటి సడలింపులు ఏమీ ఇవ్వం. కళ్లు మాత్రం అలసట లేకుండా పనిచేస్తుండాలి. చాలామంది కంటి సంరక్షణ గురించి అంతగా పట్టించుకోరు” అని సారా అన్నారు.
అందరిలోనూ ఈ ధోరణి మారాలి. కంటి సంరక్షణపై అందరికీ అవగాహన రావాలి అనే ఉద్దేశంతోనే ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
“నేత్ర సంరక్షణ చాలా ముఖ్యమైనది, మనం కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి అన్న సందేశాన్ని అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాం” అని ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షెన్ ఆఫ్ బ్లైండ్‌నెస్’ (IAPB) చీఫ్ ఎగ్జిక్యుటివ్ పీటర్ హాలెండ్ అన్నారు.

రొటీన్ చెకప్‌తోనే ముప్పు నుంచి బయటపడ్డా..
సాధారణ చెకప్ వలన తన దృష్టి లోప సమస్యను ముందే గుర్తించి, తన కంటి చూపును కాపాడుకోగలిగానని బీబీసీ జర్నలిస్ట్ లూసీ ఓవెన్ అన్నారు.
లూసీ 16 ఏళ్ల వయసు నుంచి కాంటాక్ట్ లెన్స్‌లను వాడుతున్నారు. ఇప్పుడు ఆమె 50ల వయసుకు చేరారు. ఈ ఏడాది జూన్‌లో తన కుడివైపు కంటిలో మెరుపులు( వైట్ ఫ్లాష్) రావడం అనే సమస్యను ఎదుర్కొన్నారు.
“నాకు ఈ సమస్య రోజులో ఒకటి, రెండు సార్లు మాత్రమే జరిగేది. కాస్త అసౌకర్యంగా అనిపించినా, అంతగా పట్టించుకోలేదు” అన్నారు.
సాధారణంగా తాను ఏడాదికి ఒకసారి ఐ చెకప్‌కు వెళ్లాల్సి ఉన్నా, నిర్లక్ష్యం చేశానని ఆమె అన్నారు.
సమస్య అలాగే కొనసాగుతుండటంతో కంటి వైద్యులను సంప్రదించారు. పరీక్షల్లో కుడివైపు కంట్లో రెటీనా డిటాచ్ అవుతోందని, అందువల్లే కంటిలో మెరుపులు వస్తున్నాయని వైద్యులు నిర్ధరించారు.
లూసీకు ఎమర్జెన్సీ సర్జరీ నిర్వహించారు. 40 నిమిషాల పాటు జరిగిన ఆపరేషన్ తర్వాత లూసీ డిశ్చార్జ్ అయ్యారు.
“వారంపాటు నేను విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. నా కన్ను మళ్లీ సాధారణ స్థితికి ఎప్పుడు వస్తుందా? మళ్లీ నా రొటీన్ లైఫ్‌లోకి ఎప్పుడు వెళ్తానా? అని ఆతృతగా ఉండేది” అన్నారు.
కొన్ని నెలలకు ఆమె కంటి చూపు సాధారణ స్థాయికి వచ్చింది. ఇప్పుడు లూసీ తన పనిలో నిమగ్నమైపోయారు.
“సమయానికి నేను చెకప్‌కు వెళ్లడం మంచిదైంది. నేను అదృష్టవంతురాలిని, కంటి వైద్యులు అందుబాటులో ఉండి, వేగంగా స్పందించడం వలన అంతా చక్కబడింది” అన్నారు.
కానీ, లూసీకి లభించినట్లు సరైన, నాణ్యమైన వైద్యసేవలు అందరికీ లభించకపోవచ్చు. ముఖ్యంగా పేదరికం ఉన్న దేశాల్లో కంటివైద్యం అందడమే కష్టతరం కావొచ్చు.
ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ఈ సమస్య కూడా ప్రస్తావించాల్సి ఉంది.
“తక్కువ-మధ్య స్థాయి ఆదాయం ఉన్న దేశాల్లో కంటి సంరక్షణ, ఆరోగ్యానికి సంబంధించి జాతీయ ఆరోగ్య ప్రణాళికల్లో విధి విధానాల రూపకల్పన అవసరం” అని పీటర్ అభిప్రాయపడ్డారు.
“జాతీయ ఆరోగ్య ప్రణాళికల్లో నేత్ర ఆరోగ్యం, సంరక్షణలకు సంబంధించిన అంశాలను కూడా చేర్చాలి, అది మాత్రమే కాదు, ఆ విధి విధానాల అమలు కూడా జరగాలి. అలాంటప్పుడే నేత్ర ఆరోగ్యానికి కావల్సిన వనరులు కూడా సమకూరుతాయి” అన్నారు.

పని ప్రదేశాలూ కారణం కావొచ్చు..
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) 2023లో విడుదల చేసిన నివేదిక చాలా అంశాలనే చర్చించింది. దీని ప్రకారం...ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్ల మంది దృష్టిలోపం లేదా అంధత్వంతో బాధపడుతున్నారు. 1.1 బిలియన్ల కంటే నివారించదగిన లేదా చికిత్స అందని పరిస్థితుల వలన బాధపడుతున్నారు.
ముఖ్యంగా తక్కువ-మధ్య స్థాయి ఆదాయం ఉన్న దేశాలు, దేశీయంగా సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల్లో, నివారణ చర్యలపై దృష్టి సారించకపోవడంతో ఈ సమస్య మరింత పెరుగుతుందోని నివేదిక తెలియజేస్తోంది.
2020లో ప్రపంచవ్యాప్తంగా 1.3 కోట్లమంది తమ తమ వృత్తిరీత్యా కంటిచూపు సమస్యను ఎదుర్కొంటున్నట్లు ILO చెప్తోంది. పని ప్రదేశాల్లోని పరిస్థితుల వలన కలిగే దృష్టిలోపాలను దృష్టి సమస్యల కారణాల్లో మూడో కారణంగా పేర్కొంటున్నారు.
పని ప్రదేశాలు కూడా దృష్టి లోప సమస్యలు ఏర్పడటానికి కారణం కావొచ్చని ఈ నివేదిక పేర్కొంది. వ్యవసాయం, మత్స్య, నిర్మాణం వంటి రంగాల్లో బహిరంగ ప్రదేశాల్లో పని చేయడమే ఎక్కువ. వీరు యూవీ, ఇన్‌ఫ్రారెడ్ రేడియషన్ బారిన పడటం వలన ‘శుక్లాలు (క్యాటరాక్ట్)’ బారిన పడే అవకాశం ఉంది.
పని ప్రదేశాల్లో సంరక్షణ చర్యలు అవసరం. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత ఉండే పని ప్రదేశాలు, యంత్రాల దగ్గర పని చేసే వారు కళ్లకు రక్షణగా అద్దాలు ధరించాలని, లేకపోతే ఆ రేణువులు కంటికి నేరుగా తగలడం వలన ప్రమాదం జరగొచ్చని నివేదిక పేర్కొంది.
ఇప్పుడైతే కంప్యూటర్లతోనే ఎక్కువశాతం పని జరుగుతోంది. ఇక్కడ కూడా సమస్య ఉంది. కంప్యూటర్ స్క్రీన్‌ను తదేకంగా చూడటం వలన కంటిపై ఒత్తిడి పడుతుంది.
రోజూ కంప్యూటర్ తెర, కంటి మధ్య స్థిరమైన దూరం ఉంచుతూ పనిచేస్తుంటారు. దీని వలన వక్రత స్థిరంగానే ఉండిపోతుంది. ఇది కూడా కంటిచూపు సంబంధిత సమస్యలకు దారితీయొచ్చని నివేదికలో పేర్కొన్నారు.

కంటిచూపును సంరక్షించుకునే చిట్కాలు…
ఖర్చు లేకుండా కంటి ఆరోగ్యాన్ని పరిక్షించుకునే చిట్కాలను సారా మాలింగ్ తెలియజేస్తున్నారు. అవేంటంటే..
- మీ కంటి ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడానికి ముందుగా రెండు కళ్లలో ఒకదానిని మూసి, రెండో కంటితో మీరు చూస్తున్న ప్రదేశాన్ని గమనించండి. అలానే రెండో కంటితో కూడా పరిశీలించండి. ఈ రెండుసార్లు మీకు ఏదైనా తేడా కనిపించిందా? ఇలా మీరే పరీక్ష చేసుకోండి.
- ఒకవేళ మీకు ఏడేళ్లలోపు పిల్లలు ఉండి, వారికి కంటి పరీక్ష చేయించే అవకాశం లేకపోతే గనుక, దూరంగా ఉన్నవాటిని చూపించి, అవేంటో గుర్తించమని చెప్పండి. రెండు కళ్లనూ పరీక్షించండి. దీనివలన అంబ్లియోపియా, దృష్టిలోపం వంటి సమస్యలు ఏమైనా ఉంటే గుర్తించే అవకాశం ఉంటుంది.
- నేత్ర ఆరోగ్య సంరక్షణకు నివారణే కీలకం అని గుర్తుంచుకోండి. క్రమం తప్పకుండా ఐ చెకప్‌కు వెళ్లడం ముఖ్యం.
ఇవి కూడా చదవండి..
- భూకంపం వచ్చిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసించడం ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?
- బీబీసీ ఐ పరిశోధన: న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్‌ల తెర వెనుక ఏం జరుగుతుంది?
- ‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’
- ప్రేమనాడులు మనలో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా
- క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














