మీ మానసిక ఆరోగ్యం ఎలా ఉందో చెప్పే 6 అంశాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్మితా అభ్యాంకర్
- హోదా, కౌన్సిలర్, సైకియాట్రిస్ట్, బీబీసీ కోసం..
మానసిక ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడటం, చర్చించడాన్ని మనం కొన్నేళ్ల కిందే మొదలు పెట్టాం.
మానసిక ఒత్తిడి, మానసిక అసమతౌల్యం అనేవి ఎన్నో శారీరక అనారోగ్యాలకు కారణమవుతున్నాయని వైద్య శాస్త్రం గుర్తించింది.
కానీ, మానసిక ఆరోగ్యంలో సమస్యలు తలెత్తడాన్ని మనం చాలా సార్లు పట్టించుకోం. చాలా సార్లు ఈ మార్పులను మనం కనీసం గుర్తించం కూడా. ఫలితంగా ఈ మానసిక ఆరోగ్య సమస్యల తీవ్రత పెరుగుతుంది. ఆ తర్వాత చికిత్స అనేది కష్టతరమవుతుంది.
ఇవాళ(అక్టోబర్ 10) ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ఈ సందర్భంగా, మన మానసిక ఆరోగ్యం మంచిగా ఉందో తెలుసుకునేందుకు ఉపయోగపడే ఆరు ముఖ్యమైన అంశాల గురించి చెప్పుకుందాం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
1. ఆకలి
సరైన సమయంలో ఆకలి అనేది మంచి మానసిక ఆరోగ్యానికి సంకేతం.
ఆకలి విపరీతంగా పెరగడం, ఆకలి లేకపోవడం లేదా పదేపదే తినాలనిపించడం మానసిక అనారోగ్యాన్ని సూచిస్తున్నాయి.
ఒకవేళ మీరు చేసే పనిలో కానీ, మరేదైనా విషయంలో కానీ ఒత్తిడి అధికంగా ఉంటే, మీ ఆకలి చచ్చిపోతుంది.
డిప్రెషన్ లేదా యాంగ్జైటీ లాంటి అనారోగ్య సమస్యలు ఆకలిపై ప్రభావం చూపుతాయి. అలాంటి వాటితో బాధపడే వారు ఆకలి వేస్తుంది, ఆహారం కావాలని తమకు తాము అడగరు.
ఆకలిని తెలుసుకునే మానసిక శక్తి వారికి చాలా తక్కువగా ఉంటుంది.
మరోవైపు మేనియా లేదా స్కిజోఫ్రేనియా వంటి వ్యాధులున్న వారికి ఆకలిపై అదుపు ఉండదు.
తీవ్రమైన ఒత్తిడిలో లేదా ఓసీడీ వంటి సమస్యలున్నప్పుడు, ఒత్తిడిని తగ్గించుకునేందుకు అడ్డూ అదుపు లేకుండా తినేస్తూ ఉంటారు.

ఫొటో సోర్స్, Getty Images
2. నిద్ర
క్రమం తప్పకుండా నిద్రపోవడం, 7 లేదా 8 గంటలు నిద్రపోయిన తర్వాత మీకు మీరుగా నిద్ర లేవడం, తాజాగా సరికొత్త అనుభూతితో నిద్ర లేవడం ఆరోగ్యకరమైన మనసుకు సూచిక.
నిద్రలేమి, సరైన నిద్ర లేకపోవడం, రాత్రంతా నిద్రపోయిన తర్వాత కూడా తీవ్ర అలసటగా అనిపించడం మానసిక అనారోగ్యానికి సంకేతాలు.
అతిగా నిద్రపోవడం కూడా మానసిక అనారోగ్యానికి సూచికే.
మీరు ఒత్తిడితో బాధపడుతుంటే, నిద్రలేమి పెరిగే అవకాశాలున్నాయి.
మనసు ఆలోచనల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ, వాటిపై నియంత్రణను కోల్పోయినప్పుడు కూడా నిద్ర పట్టదు.
మేనియా(ఆవేశం, ఉత్సాహం అధికంగా ఉండటం) వల్ల, మాదక ద్రవ్యాలకు బానిసైనప్పుడు, ఏడీహెచ్‌డీ వంటి జబ్బులు వచ్చినప్పుడు కూడా నిద్ర పట్టక ఇబ్బందులు పడుతూ ఉంటాడు.
భరించలేని ఒత్తిడి లేదా డిప్రెషెన్ ఉన్న రోగులు వరుసగా కొన్ని రోజుల పాటు నిద్రలేకుండా ఉండగలరు. నిద్రలేకుండా ఎలా కూర్చుని ఉండగలుగుతున్నారో కూడా వారికి తెలియదు.

ఫొటో సోర్స్, Getty Images
3. ఆలోచనా శక్తి
స్పష్టంగా, సరైన విధంగా ఆలోచించగలగడం, సమస్యలను అర్థం చేసుకుని, తగిన విధంగా ప్లాన్ చేసుకోగలగడం, ఒత్తిడిని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసుకోగలగడం అనేవి మంచి మానసిక ఆరోగ్యానికి సంకేతం.
అవసరమైన సమయంలో రిస్క్‌లను తీసుకోగలిగి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాగలగడం కూడా మీరు మానసికంగా బలంగా ఉన్నారని సూచిస్తుంది.
చిన్న చిన్న ప్రశ్నలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లు అనిపించడం, నిరంతరం ఏదో ఒక కన్‌ఫ్యూజన్(తికమక)లో ఉండటం, సవాళ్లను స్వీకరించకుండా తప్పించుకుని పారిపోవడం, మానసిక, శారీరక కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి భయపడటం, అసౌకర్యవంతంగా భావించడం వంటివి మానసిక అసమతౌల్యానికి సంకేతాలు.
ఒకవేళ ఇంట్లో ఏదైనా అనూహ్య సంఘటన జరిగితే అంటే ప్రమాదకరమైన అనారోగ్య సమస్య తలెత్తడం లేదా ప్రమాదానికి గురికావడం, చనిపోవడం, ఆర్థిక ఇబ్బందులు వంటి వాటివల్ల కూడా కొందరు తీవ్ర మానసిక క్షోభకు గురై, ఆలోచనా శక్తిని కోల్పోతారు.
కొందరు ఏం జరగలేదనే భ్రమలోనే కూరుకుపోతారు.
దీనికి భిన్నంగా కొందరు ఇట్లాంటి పరిస్థితుల్లోనే మరింత దృఢంగా మారి, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిని పొందుతారు.
ఏ పరిస్థితిలోనైనా మనసులోని ఆలోచనలను సమతౌల్యంతో ఉంచుకుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
4. వైఫల్యాలు
ఓటములను, వైఫల్యాలను సమర్థవంతంగా ఎదుర్కొని, వాటి నుంచి తిరిగి కోలుకోవడం, మళ్లీ ప్రయత్నించడంతో పాటు విజయానికి ఎక్కువ పొంగిపోకుండా ఉండటం కూడా బ్యాలన్స్డ్ విధానాన్ని సూచిస్తుంది.
చిన్న చిన్న వైఫల్యాలకు కూడా ఏదో పోగొట్టుకున్న మాదిరిలా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతూచ ప్రతి వైఫల్యాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం లేదా చిన్న విజయానికి కూడా అతిగా పొంగిపోవడం వంటివి మానసిక అసమర్థతకు సంకేతం.
యుక్త మయసు ఉన్న వారిలో ఇది సర్వసాధారణమైన లక్షణంగా ఉంటోంది.
కేవలం పరీక్షల్లో ఫెయిల్ కావడమే కాకుండా, ప్రేమ విఫలమవ్వడాన్ని కూడా చాలా మంది యువత తట్టుకోలేకపోతున్నారు.
ఇలాంటి పిల్లల్లో డిప్రెషన్ వంటి వ్యాధులు ప్రస్తుతం సాధారణంగా మారుతున్నాయి. ఆత్మనూన్యత భావాల వల్ల ఈ పిల్లలు విజయ ద్వారాలను మూసివేసుకుంటున్నారు.
విజయాన్ని పొందిన కొందరు యువత, తమకు తాము ఇతరుల కంటే ఎక్కువని భావిస్తున్నారు.
తమను చూసుకుని తామే మురిసిపోవడం అంటే నార్సిసిజం వంటి లక్షణాలు వీరిలో డెవలప్ అవుతున్నాయి.
అవాస్తవమైన ఆలోచనలున్న వ్యక్తులకు పర్సనాలిటీ డిజార్డర్స్ ఉండే అవకాశం ఉంది.
5. ఆరోగ్యకరమైన సంబంధాలు
కుటుంబంతో, స్నేహితులతో ఆరోగ్యకరమైన సంబంధాలను నెరపడం బ్యాలన్స్డ్ ఆలోచనా విధానాన్ని సూచిస్తుంది.
సంబంధాలలో అవసరాలను గుర్తించగలగడం, ప్రతి రిలేషన్‌షిప్‌లో అవసరాలను గుర్తిస్తూ, దానికి తగిన విధంగా స్పందించడం, రిలేషన్‌షిప్‌లో ఉన్న చిన్న చిన్న సమస్యలను కనుగొని పరిష్కరించడం మన మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం.
మన వారితో నిరంతరం పొరపచ్చాలుండటం, ఇగో, ఇతరులతో అసౌకర్యవంతంగా భావించడం, పగ, ద్వేషం ఉండటం, ఇతరుల నుంచి నిరంతరం అవాస్తవమైన అంచనాలు కలిగి ఉండటం, క్షమించే మనస్తత్వం లేకపోవడం వంటివి మన మానసిక ఆరోగ్యానికి హానికరం.
విచ్ఛిన్నమైన కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ముందుకు వెళ్లలేక, రిలేషన్‌షిప్‌లను అభివృద్ధి చేసుకోవడాన్ని కష్టంగా భావిస్తారు.
సురక్షితమైన వాతావరణంలో పెరిగిన పిల్లలు కూడా ఇతరులతో బాండింగ్ విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంటారు.
శారీరకంగా, మానసికంగా, లైంగిక వేధింపులు ఎదుర్కొన్న కొందరు పిల్లలు పెద్దయ్యే కొద్దీ మరింత మొండివారిగా, వేధించే తల్లిదండ్రులుగా మారే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
6. ఒంటరితనం
ఇతరులతో కలుస్తూ, మాట్లాడుతూ ఉండటం.. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కలిగి ఉండటం మీ మానసిక ఆరోగ్యానికి మంచి చేస్తుంది.
మనిషి సంఘ జీవి. అంటే ఇతరులతో ఇంటరాక్ట్ అవుతూ, సామాజిక సంబంధాలు కోరుకునే జీవి.
మానసిక సమతౌల్యం కలిగి ఉండేందుకు ఇతరుల అవసరం ఉంటుంది.
ఎప్పుడూ ఒంటరిగా ఉండేవారు యంత్రాల్లా మారిపోతారు. కుటుంబంతో సమయాన్ని గడపలేని వారు మానసిక అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది.
నిరంతరం పనిచేయడం, నిత్యం ఇంట్లోనే కూర్చుని ఉండటం, కళలు, పర్యటనలు, క్రీడలు లేదా ఇతర హాబీలపై ఆసక్తి లేకపోవడం కూడా మానసిక అనారోగ్యానికి కారణమవుతుంది.
మీచుట్టూ ఉన్న వారిలో ఎవరికైనా ఈ లక్షణాలుంటే, వారిపై ఓ కన్నేసి ఉండటం మంచిది. అలాంటి వ్యక్తులు సైకియాట్రిస్ట్‌లను, కౌన్సిలర్లను సంప్రదించాలి.
సరైన సమయానికి వీరికి సాయం దొరికితే, ఈ వ్యక్తులు సంతోషంగా, మానసిక ఆరోగ్యంతో జీవించగలుగుతారు.
ఇవి కూడా చదవండి:
- గాజా స్ట్రిప్: ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే ‘అతిపెద్ద ఓపెన్ ఎయిర్ జైల్’ అని ఎందుకంటారు?
- ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి: వీడియోలు, సోషల్ మీడియాలో వెల్లడైన సూపర్నోవా ఫెస్టివల్ మారణకాండ
- నోబెల్ పురస్కారం - ఎకనామిక్స్: మహిళల ఉద్యోగాలు, జీతాల్లో వివక్షపై పరిశోధన చేసిన అమెరికన్ ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్
- క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?
- రాణిని చంపేందుకు ప్రోత్సహించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్, జస్వంత్ సింగ్‌కు 9 ఏళ్ల జైలు శిక్ష
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














