తెలంగాణ ఎన్నికలు: ట్రక్, రోడ్ రోలర్, ఆటో రిక్షా గుర్తులు 2018లో చూపిన ప్రభావం ఏమిటి?

ఫొటో సోర్స్, ECI
- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తును పోలిన సింబల్స్‌ను తొలగించాలని, ఎవరికీ కేటాయించరాదని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, పంకజ్ మిత్తల్‌ల ధర్మాసనం ఈ పిటిషన్లను తిరస్కరిస్తూ కారుకు, రోడ్ రోలర్ వంటి ఇతర గుర్తులకు మధ్య తేడాను ఓటర్లు తెలుసుకోగలరని చెప్పారు.
బీఆర్ఎస్ తొలుత దిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ వేయగా అక్కడ కొట్టివేశారు. దీంతో ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
గత నెలలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా బీఆర్ఎస్ నేతలు కలిశారు. ట్రక్, రోడ్ రోలర్, ఆటో రిక్షా, చపాతీ రోలర్, కెమేరా, టెలివిజన్, ఓడ, కుట్టు మిషన్ వంటి గుర్తులు బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారులా కనిపిస్తున్నాయని, వాటిని ఎవరికీ కేటాయించవద్దని కోరారు.
నిజానికి గతంలో కూడా బీఆర్ఎస్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో 2011లో రోడ్ రోలర్ గుర్తును తొలగించారు.
కానీ, ఇటీవల వేరే పార్టీకి ఆ గుర్తును కేటాయించింది ఎలక్షన్ కమిషన్. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
తాజాగా సుప్రీంకోర్టు బీఆర్ఎస్ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఎన్నికల్లో ఈ గుర్తులన్నీ కనిపించనున్నాయి.
మరి, బీఆర్ఎస్(ఇంతకుముందు టీఆర్ఎస్) గతంలో ఇలా ఇతర గుర్తుల కారణంగా నష్టపోయిందా? 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఏమైంది? ఆ తరువాత 2019 లోక్ సభ ఎన్నికలలో, ఉప ఎన్నికలలో ఏమైంది?
కారును పోలిన గుర్తులని బీఆర్ఎస్ చెబుతున్న సింబల్స్‌తో పోటీ చేసినవారికి ఓట్లు ఏ స్థాయిలో వచ్చాయో చూద్దాం.

ఫొటో సోర్స్, eci
2018 అసెంబ్లీ ఎన్నికలలో..
తెలంగాణ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికలలో ట్రక్ గుర్తుతో 58 నియోజకవర్గాలలో అభ్యర్థులు పోటీ చేశారు. రోడ్ రోలర్ గుర్తుతో 31 నియోజకవర్గాలలో అభ్యర్థులు పోటీ చేశారు.
ట్రక్ గుర్తుపై పోటీ చేసినవారిలో కొందరు ఇండిపెండెట్లు కాగా, కొన్ని నియోజకవర్గాలలో ‘సమాజ్‌వాది ఫార్వర్డ్ బ్లాక్’ అనే రిజిష్టర్డ్(అన్‌రికగ్నైజ్డ్) పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు.
కొన్ని స్థానాలలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ – లెనినిస్ట్ -లిబరేషన్), సమాజ్‌వాది పార్టీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నుంచి పోటీ చేసినవారికి కేటాయించారు.
ట్రక్ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థులున్న స్థానాలలో ఎల్లారెడ్డి, రామగుండం, మంథని, సంగారెడ్డి, ఎల్బీనగర్, మహేశ్వరం, తాండూర్, కొల్లాపూర్, హుజూర్‌నగర్, మునుగోడు, నకిరేకల్, భూపాలపల్లి, పినపాక, సత్తుపల్లి, భద్రాచలం సీట్లలో బీఆర్ఎస్ ఓడిపోయింది.
నకిరేకల్‌లో..
నకిరేకల్(ఎస్‌సీ)లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వేముల వీరేశం 8,259 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
ఈ నియోజకవర్గంలో ట్రక్ గుర్తుపై పోటీ చేసిన దుబ్బా రవికుమార్‌కు 10,383 ఓట్లు వచ్చాయి. ఇది గెలుపొందిన అభ్యర్థి సాధించిన మెజారిటీ కంటే ఎక్కువ.
తాండూరులో..
తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి చేతిలో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి 2,589 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో ట్రక్ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థికి 2,608 ఓట్లు వచ్చాయి. రోడ్ రోలర్ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థికి 639 ఓట్లు వచ్చాయి. ఈ రెండు గుర్తుల ఓట్లు కలిపితే రోహిత్ రెడ్డి సాధించిన మెజారిటీ కంటే ఎక్కువ.
అంతేకాదు, తాండూరులో ట్రక్ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థి పేరు కూడా పి.మహేందర్ రెడ్డి. పేరు, గుర్తులో పోలిక ఉండడం వల్లే తమ అభ్యర్థికి రావాల్సిన ఓట్లను నష్టపోయామన్నది బీఆర్ఎస్ నేతల వాదన.
సంగారెడ్డిలో..
సంగారెడ్డి నియోజకవర్గంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) గెలిచారు. ఆయనకు 76,572 ఓట్లు రాగా, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నుంచి కారు గుర్తుతో పోటీ చేసిన చింత ప్రభాకర్‌కు 73,989 ఓట్లు వచ్చాయి.
ఇద్దరి మధ్య ఓట్ల తేడా 2,589.
ఈ నియోజకవర్గంలొ ట్రక్ గుర్తుపై పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి రామచందర్‌కు 4,140 ఓట్లు వచ్చాయి. ఇది విజేత జగ్గారెడ్డి సాధించిన ఆధిక్యం కంటే ఎక్కువ.
బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తంచేస్తున్న మరో గుర్తు టెలివిజన్‌తో పోటీ చేసిన అభ్యర్థికి ఈ నియోజవకర్గంలో 738 ఓట్లు వచ్చాయి.
ఎల్లారెడ్డి, రామగుండం, మంథని, ఎల్బీనగర్, మహేశ్వరం, కొల్లాపూర్, హుజూర్‌నగర్, మునుగోడు, భూపాలపల్లి, పినపాక, సత్తుపల్లి, భద్రాచలంలలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలైనా, అక్కడ గెలిచినవారి ఆధిక్యం కంటే ట్రక్ గుర్తుకు పడిన ఓట్లు బాగా తక్కువ.

ఫొటో సోర్స్, koppula eshwar
21 సీట్లలో మూడో స్థానంలో ట్రక్కు
58 నియోజకవర్గాల్లో ట్రక్ గుర్తుతో అభ్యర్థులు పోటీ చేయగా, 21 సీట్లలో మూడో స్థానంలో, 22 సీట్లలో నాలుగో స్థానంలో నిలిచారు.
ట్రక్ గుర్తు అత్యధికంగా మానకొండూర్‌లో 13,610 ఓట్లు సాధించింది. ఓట్ల శాతం పరంగా చూస్తే బెల్లంపల్లిలో అత్యధికంగా 8.38 శాతం ఓట్లు సాధించింది.
బెల్లంపల్లి, కామారెడ్డి, ధర్మపురి, నకిరేకల్, జనగాంలలో ట్రక్ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థులు 10 వేల కంటే ఎక్కువ ఓట్లు పొందారు.
ధర్మపురి(ఎస్సీ) నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కొప్పుల ఈశ్వర్ కేవలం 441 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ నియోజకవర్గంలో ట్రక్ గుర్తు అభ్యర్థికి 13,114 ఓట్లు(పోలైనవాటిలో 7.91 శాతం) వచ్చాయి.
కామారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి 4,557 ఓట్లతో గెలిచారు. అక్కడ ట్రక్ గుర్తు అభ్యర్థి 10,537 ఓట్లు(6.57 శాతం) సాధించారు.
అంబర్‌పేటలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేశ్ 1,016 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. ఇక్కడ ట్రక్ గుర్తు అభ్యర్థికి 1,052 ఓట్లు వచ్చాయి.
కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ 1,556 ఓట్లతో గెలిచారు. ఈ నియోజకవర్గంలో ట్రక్ గుర్తు అభ్యర్థి 5,240 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
తుంగతుర్తి(ఎస్సీ) నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత గాదరి కిశోర్ 1,867 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. ఇక్కడ ట్రక్ గుర్తు అభ్యర్థికి 3,729 ఓట్లు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
రోడ్ రోలర్ సంగతేంటి?
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రోడ్ రోలర్ గుర్తుపై కొందరు అభ్యర్థులు పోటీ చేశారు.
మొత్తం 31 నియోజవర్గాలలో ఈ గుర్తుతో అభ్యర్థులు బరిలో నిలిచారు.
రోడ్ రోలర్ గుర్తుపై పోటీ చేసినవారిలో 17 చోట్ల అభ్యర్థులు వెయ్యికి పైగా ఓట్లు తెచ్చుకున్నారు.
11 నియోజకవర్గాలలో ఈ గుర్తు అభ్యర్థులకు ఒక శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.

ఫొటో సోర్స్, Raghunandan Rao
దుబ్బాక ఉప ఎన్నికలో ఏం జరిగింది?
కారును పోలిన గుర్తుల విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా గుర్తు చేసేది దుబ్బాక ఉప ఎన్నిక. ఆ ఉప ఎన్నికలో 1,079 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయింది. బీజేపీ నుంచి పోటీ చేసిన రఘునందనరావు గెలిచారు.
ఈ ఉప ఎన్నికలలో చపాతీ రోలర్ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థికి 3,510, కెమేరా గుర్తు అభ్యర్థికి 1,978, ఓడ గుర్తుతో పోటీ చేసిన నాయకుడికి 1,005, రోడ్ రోలర్ గుర్తు అభ్యర్థికి 544, టెలివిజన్ గుర్తు అభ్యర్థికి 354 ఓట్లు వచ్చాయి.
మరో ఉప ఎన్నిక ‘మునుగోడు’లో బీఆర్ఎస్ అభ్యర్థి 10,339 ఓట్లతో గెలిచారు. అక్కడ కూడా చపాతీ రోలర్‌కు 2,407, రోడ్ రోలర్‌కు 1,874 ఓట్లు పడ్డాయి. టీవీ గుర్తు అభ్యర్థికి 511, కెమేరా గుర్తు అభ్యర్థికి 502 ఓట్లు వచ్చాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోయింది. కానీ, కారును పోలిన గుర్తుల ప్రభావం ఇక్కడ కనిపించలేదు.

ఫొటో సోర్స్, ECI
2014 అసెంబ్లీ ఎన్నికలలో ఏమైంది?
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడిగానే జరిగాయి. ఆ ఎన్నికలలో ట్రక్ గుర్తు ఎవరికీ కేటాయించలేదు. కానీ, ఆటో రిక్షా గుర్తుతో అభ్యర్థులు పోటీ చేశారు.
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో 91 చోట్ల ఆటో రిక్షా గుర్తుపై అభ్యర్థులు బరిలో దిగారు.
అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నర్సంపేట నియోజకవర్గం. ఇక్కడ ఆటో గుర్తుతో పోటీ చేసిన దొంతి మాధవ రెడ్డి విజయం సాధించారు.
అయితే, ఆయన సాధించిన ఓట్లు గుర్తు కారణంగా కాకుండా వ్యక్తిగతంగానే సాధించుకున్నారు.
ఆ ఎన్నికలలో చేవెళ్లలో టీఆర్ఎస్ 781 ఓట్ల తేడాతో ఓడిపోయింది. అక్కడ ఆటో రిక్షా గుర్తుకు 3,719 ఓట్లువచ్చాయి.
జహీరాబాద్‌లో బీఆర్ఎస్ 842 ఓట్ల వ్యత్యాసంతో ఓటమి పాలవగా, అక్కడ ఆటో రిక్షా గుర్తుకు 1,767 ఓట్లు వచ్చాయి.
2019 లోక్‌సభ ఎన్నికలు
ఈ ఎన్నికలలో భువనగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో 5,219 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.
అక్కడ రోడ్ రోలర్ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థికి 27,973 ఓట్లు వచ్చాయి.
గుర్తుల కేటాయింపు ఇలా
ఎలక్షన్ కమిషన్ గుర్తింపు పొందిన పార్టీకి శాశ్వతంగా ఒకే గుర్తు ఉంటుంది.
గుర్తింపు లేని పార్టీలకు అవకాశాన్ని బట్టి ఉమ్మడి గుర్తు కేటాయిస్తారు. వేర్వేరు ఎన్నికలలో వేర్వేరు గుర్తులు రావొచ్చు.
ఎలక్షన్ కమిషన్ తమ దగ్గర అందుబాటులో ఉన్న గుర్తుల నుంచి ఒక దాన్ని పార్టీలు ఎంపిక చేసుకోవాలని సూచిస్తుంది. పార్టీలు మూడు ఆప్షన్లు ఇస్తే దాన్నుంచి ఎంపిక చేస్తారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్‌తో పోరుకు సిద్ధమంటున్న హిజ్బొల్లా సంస్థ చరిత్ర ఏంటి?
- సిక్కిం ఆకస్మిక వరదల్లో 22 మంది జవాన్లు సహా 102 మంది గల్లంతు, క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?
- ఏషియన్ గేమ్స్: ఈ ఫోటోను చైనా ఎందుకు సెన్సార్ చేసింది?
- పారిస్‌పై నల్లుల దండయాత్ర, భయపడిపోతున్న జనం, ఎక్కడ చూసినా నల్లులే..
- శ్రీదేవి ఉప్పు తినకపోవడం వల్లే చనిపోయారా? బోనీ కపూర్ ఏమన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














