రఫా క్రాసింగ్ ఓపెన్: 20 లక్షలమందికి 20 లారీల సాయం సరిపోతుందా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్యలో భీకర దాడులు ప్రారంభమైన తర్వాత తొలిసారి ఇవాళ (శనివారం) ఉదయం ఈజిప్ట్‌తో గాజా స్ట్రిప్‌ను ఈజిప్టుతో అనుసంధానించే రఫా బోర్డర్ క్రాసింగ్‌ను తెరిచారు.
ఈ క్రాసింగ్ ద్వారా ప్రజలకు ఆహారం, నీళ్లు, మందులు అందించే తొలి కాన్వాయ్‌కి చెందిన 20 ట్రక్కులు గాజాలోకి ప్రవేశించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది.
అయితే, ఈ క్రాసింగ్ ఎంత సేపు తెరుచుకుని ఉంటుందో స్పష్టత లేదు.
గాజాలోకి ప్రవేశించేందుకు ఉన్న ఒకే ఒక్క గేటు ఇది. దీనిపై ఇజ్రాయెల్ ప్రత్యక్ష నియంత్రణ లేదు.
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ ప్రభుత్వం కఠిన ఆంక్షలను కొనసాగిస్తోంది.
తమ భూభాగంపై హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై ఏకధాటిగా బాంబుల వర్షం కురిపిస్తోంది.
ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో 1400 మంది మరణించగా.. 200 మంది కిడ్నాప్‌కి గురయ్యారు.
గాజాపై ఇజ్రాయెల్ జరుపుతోన్న బాంబుల దాడుల్లో 4,385 మరణించారని, వారిలో 1,756 మంది చిన్నారులున్నారని పాలస్తీనియన్ అధికారులు చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
గాజా స్ట్రిప్‌లోని ప్రజలకు రోజుకు వందల ట్రక్కుల అంతర్జాతీయ మానవతా సాయం అవసరం ఉంది.
అయితే, ప్రస్తుతం రఫా క్రాసింగ్ ద్వారా గాజా స్ట్రిప్‌లోకి వచ్చిన 20 ట్రక్కులు సముద్రంలో ఒక నీటి బిందువంతా అని ఐక్యరాజ్యసమితి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
మరోవైపు రఫా క్రాసింగ్ తెరుచుకున్న కొద్ది సేపట్లోనే హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇద్దరు తల్లి కూతుళ్లను విడిచిపెట్టారు.
అమెరికాకు చెందిన 59 ఏళ్ల జూడిత్ రానన్, ఆమె కుమార్తె 17 ఏళ్ల నటాలిలను హమాస్ విడుదల చేసింది.

ఫొటో సోర్స్, REUTERS
గాజా ప్రజల కోసం వచ్చిన సాయంలో ఏమేమి ఉన్నాయి?
ఈజిప్ట్ నుంచి గాజా ప్రజలకు సాయంగా ట్రక్కులు వచ్చినట్లు గాజాలోని బీబీసీ ప్రతినిధి రుష్ది అబు అలౌఫ్ కూడా చెప్పారు.
మందులు, ఇంధనం, శవపేటికలతో నిండిన 20 వాహనాలు వచ్చినట్లు ఆయన చూశారు.
ఈజిప్ట్ నుంచి వచ్చిన 20 పెద్ద పెద్ద ట్రక్కుల్లోని సామాన్లను చిన్న పాలస్తీనా ట్రక్కుల్లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు బీబీసీ ప్రతినిధి తెలిపారు.
వీటిని గాజాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు.
గాజా భూభాగంలోని ఆస్పత్రులకు మందుల సరఫరాను అందించేలా ఈజిప్ట్, పాలస్తీనా రెడ్ క్రెసెంట్‌తో కలిసి పనిచేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది.
ఈ వాహనాల్లో వచ్చిన సరఫరాల్లో ఏమేమి ఉన్నాయో డబ్ల్యూహెచ్ఓ వివరించింది.
- 1,200 మంది ప్రజల కోసం మెడికేషన్లు, గాయాలకు మందుల సరఫరా
- గాయాలు పాలైన 235 మందికి సాయపడేలా పోర్టబుల్ మందుల బ్యాగ్‌లు
- దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే 1,500 మందికి మందులు, చికిత్సా సాధనాలు
- 3 లక్షల మందికి మూడు నెలలకు సాయపడేలా నిత్యావసర మందులు, వైద్య సేవలు
‘‘తీవ్రంగా గాయపడిన లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న వారికి సాయంగా గాజాలోకి వీటిని సరఫరా చేశారు. రెండు ప్రాంతాల మధ్య తీవ్ర ఘర్షణల నేపథ్యంలో మందులు, వైద్య సేవల కొరతతో గత రెండు వారాలుగా వీరు తీవ్ర బాధను అనుభవించారు’’ అని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
ఈ మానవతా సాయం ఎంత వరకు ఉపయోగం?
ఇరు ప్రాంతాల మధ్య భీకర దాడులు చెలరేగిన తర్వాత, గాజా స్ట్రిప్‌లోని సామాన్య ప్రజలు ఎదుర్కొంటోన్న క్లిష్ట పరిస్థితులపై అంతర్జాతీయ సంస్థలు, మానవ హక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
మానవతా సాయంగా కనీసం రోజుకి 100 ట్రక్కుల కావాల్సి ఉందని బీబీసీ అరబిక్ సర్వీసు రిపోర్టు చేసింది.
దిగ్బంధనం వల్ల ఈ సాయం పూర్తిగా నిలిచిపోయింది. ఈ భూభాగంలో నివసించే 20 లక్షల మందికి పైగా ప్రజలకు మంచినీటితో సహా నిత్యావసరాల సరఫరాల విషయంలో తీవ్ర కొరత ఏర్పడింది.
ఇజ్రాయెల్ బాంబుల దాడులతో వేలాది మంది ప్రజలు బలవంతంగా తమ నివాసాలను వదిలిపెట్టి గాజా స్ట్రిప్‌లో దక్షిణానికి రావాల్సి వచ్చింది.
క్షేత్రస్థాయిలో దాడుల (గ్రౌండ్ అటాక్)కు సిద్ధమవుతున్నందున్న వీరిని దక్షిణ దిక్కుకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది.
ఈజిప్టు-గాజా స్ట్రిప్ మధ్య ఉన్న బోర్డర్ క్రాసింగ్ రఫా దగ్గర పాలస్తీనియన్లు పెద్ద ఎత్తున గుమిగూడారు.
20 ట్రక్కులతో వచ్చిన ఈ కాన్వాయ్ సముద్రంలో నీటి బిందువు మాదిరి అని పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తోన్న ఐక్యరాజ్యసమితి పబ్లిక్ వర్క్స్, రిలీఫ్ ఏజెన్సీ అభిప్రాయపడింది.
మానవతా సాయాన్ని స్థిరంగా అందించాల్సినవసరం ఉందని ఈ ఏజెన్సీ అధికార ప్రతినిధి జూలియట్ టౌమా నొక్కి చెప్పారు.
‘‘గాజాలోని సామాన్య ప్రజలకు ఇప్పుడు స్థిరమైన మానవతా సాయం వారికి కావాల్సి ఉంది. వాటిల్లో ముఖ్యంగా నీరు, ఇంధన స్టేషన్ల అవసరం ఉంది’’ అని బీబీసీ రేడియో 4లో చెప్పారు.
నీటి పంపులు పనిచేసేందుకు ఇంధనం అవసరమని టౌమా వివరించారు.
‘‘గాజాలో నీరు అయిపోతోంది’’ అని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో అసలు నీరే దొరకడం లేదన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఈ భీకర ఘర్షణలకు రెండు వారాలు
ఇజ్రాయెల్, హమాస్ మధ్యలో భీకర దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఈ రెండు వారాల్లో గాజాల్లో మానవతా పరిస్థితులు దారుణమైన స్థాయికి చేరుకున్నాయని ఐక్యరాజ్య సమితి చెప్పింది.
ఇదొక విపత్తు పరిస్థితిగా పేర్కొంది.
శనివారం కాన్వాయ్‌లోని మానవతా సాయాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా సురక్షితంగా గాజా ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తామని మానవతా వ్యవహారాల సెక్రటరీ జనరల్, యూఎన్ ఎమర్జెన్సీ రిలీఫ్ కోఆర్డినేటర్ మార్టిన్ గ్రిఫిత్స్ అన్నారు.
ఎన్నో దశాబ్దాలుగా గాజా ప్రజలు ఈ ఇబ్బందులు పడుతున్నారని, అంతర్జాతీయ సమాజం వారిని మరింత ఇబ్బంది పెట్టొద్దని వేడుకున్నారు.
ఈసారి గాజాలో 4,137 మంది ప్రజలు మరణించినట్లు పాలస్తీనా అధికారులు చెబుతున్నారు.
వీరిలో అల్ అహ్లి అరబ్ ఆస్పత్రిపై మంగళవారం జరిగిన దాడిలో మరణించిన 471 మంది కూడా ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది.
ఆస్పత్రిపై ఇజ్రాయెలే వైమానిక దాడి చేసిందని మిలిటెంట్ సంస్థ హమాస్ ఆరోపిస్తోంది.
దాడితో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది. పాలస్తీనా ఇస్లామిక్ జిహాదీ రాకెట్లు గురితప్పడం వల్ల ఈ పేలుళ్లు జరిగాయని ఇజ్రాయెల్ అంటోంది.
ఈ దాడి ఏ స్థాయిలో జరిగింది, ఆ సమయంలో వినిపించిన శబ్దాల ఆధారంగా ఈ దాడికి గల కారణాన్ని, ఎక్కడ నుంచి జరిగిందనే దాన్ని ఆధారాలను సేకరిస్తోన్న నిపుణులను బీబీసీ వెరిఫై టీమ్ సంప్రదించింది.
ఇప్పటి వరకు కనుగొన్నవన్ని అసంపూర్ణంగా ఉన్నట్లు వారు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
- కెనడాలో హిందువులపై అక్కడి పార్టీల వైఖరి ఏమిటి?
- ఇండియా-కెనడా వివాదం: భారత్‌కు అమెరికా అనుకూలమా, వ్యతిరేకమా? ఆ మాటలకు అర్థం ఏమిటి?
- కెనడాలో వీసా సేవలు నిలిపివేయడం భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
- ‘ఖలిస్తాన్’ ఉద్యమానికి కెనడా ఎందుకు కేంద్రంగా మారింది? హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు?
- సిక్కు నేత నిజ్జర్ హత్య: ఇండియా, కెనడా గొడవతో అమెరికా ఎందుకు టెన్షన్ పడుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















