ఇజ్రాయెల్ – గాజా: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, నకిలీ వీడియోలు... అసలేం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, మరియానా స్ప్రింగ్
- హోదా, బీబీసీ కరెస్పాండెంట్ (డిజిన్ఫర్మేషన్, సోషల్‌మీడియా)
ఇజ్రాయెల్ గాజా ఘర్షణలకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, కుట్ర సిద్ధాంతాలు, విద్వేష వ్యాఖ్యలు హోరెత్తుతున్నాయి.
ఇందుకోసం నకిలీఖాతాలను ఉపయోగిస్తున్నరా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ వారం మొదట్లో టిక్ టాక్ ఫర్ యు పేజీని తెరిచినప్పుడు అక్టోబరు 7వ తేదీన ఓ ఇజ్రాయెలీ యువతిని హమాస్ ఫైటర్స్ బందీగా తీసుకువెళుతున్న దృశ్యం కనిపించింది. ఈ ఫుటేజీ ఎంతో దిగ్భ్రమకు గురిచేసింది.
దీనిపై కామెంట్స్ కోసం కిందకు స్క్రోల్ చేసినప్పుడు నేనూహించని ప్రతిస్పందన కనిపించింది.
కొందరు దీనిపై బాధపడగా, మరికొందరు ఆ వీడియోలో ఉన్నది నిజం కాదని కామెంట్ చేశారు.
బందీ అయిన యువతి పౌరురాలు కాదని సైనికురాలని, హమాస్‌ను నిందించడానికి ఆ క్లిప్‌ను ఉపయోగిస్తున్నారనే కామెంట్స్ ఉన్నాయి. బందీలతో హింసాత్మకంగా ప్రవర్తించడానికి ఆధారాల్లేవని మరికొందరు రాశారు.
అయితే, ఈ క్లిప్‌ను బీబీసీ పరిశీలించింది. అందులో రక్తమోడుతున్న యువతిని సాయుధులు ఓ కారులోకి నెడుతున్న దృశ్యం కనిపించింది.
గాజా నగర శివార్లలోని షెజియా ప్రాంతంలో దీనిని చిత్రీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
బందీల గురించిన వీడియోలు, పోస్టుల కోసం నేను అనేక ఇతర సామాజిక మాధ్యమాలను చూశాను. అన్నింటిలోనూ ఒకే విధమైన కామెంట్స్ కనిపించాయి.
ఇజ్రాయెల్‌లో మిలటరీలో పనిచేయడం తప్పనిసరే కానీ.. హమాస్ బందీలుగా తీసుకుపోయినావారిలో ఎక్కువమంది సాధారణ పౌరులే ఉన్నట్టుగా ఆధారాలు చెపుతున్నాయి.
వీడియోలలో కనిపిస్తున్నది వీరే... పైగా బందీలలో ఉత్సవాలకు వెళుతున్నవారు, పిల్లలు కూడా ఉన్నారు.
బందీల మీద జరుగుతున్న హింసను తక్కువ చేసి చూపడానికే ఈ తప్పుడు సమాచారం పరిమితం కావడంలేదు.
ఇజ్రాయెల్ ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ తప్పుదోవపట్టించే సమాచారంతోపాటు విద్వేషపూరిత కంటెంట్ ను షేర్ చేసే ప్రొఫైల్స్ కూడా దర్శనమిస్తున్నాయి. ఇలాంటి ఓ నకిలీఖాతాను ఈ వారాంతంలో చూశాను. అందులో గాజాలోని పాలస్తీనా పౌరులు తమకు దెబ్బలు తగిలినట్టుగా మేకప్ వేసుకుంటున్న వీడియో కనిపించింది.
నిజానికి ఇది పాలస్తీనా చిత్రాలకు పనిచేసే ఓ మేకప్‌మెన్ గురించిన 2017 నాటి నివేదికలోని వీడియో. ఇలాంటివి తీవ్ర దిగ్భ్రమకు గురిచేయడంతోపాటు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే అవగాహనను కూడా ప్రభావితం చేస్తాయి.
ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి సామాజిక మాధ్యమాలపై ఆధారపడితే సంభాషణల వక్రీకరణ, గందరగోళ సమాచారం కారణంగా నిజం తెలుసుకోవడానికి మీరు కష్టపడాల్సి వస్తుంది.
ఈ తప్పుడు సమాచారం యుద్ధనేరాలను విచారించడం, సహాయం అందించడం, ఎక్కడ ఏమి జరుగుతుందో గుర్తించే విషయాలలో అంతర్జాతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఫొటో సోర్స్, EPA
కొన్నిసార్లు తప్పుదారిపట్టించే పోస్టులను గుర్తించడం సులభమే.
ఉదాహరణకు పాప్‌స్టార్ జస్టిన్ బీబర్ ఖాతాను తీసుకుంటే ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేయండి’’ అంటూ ఓ పోస్టు షేర్ చేశారు.
కానీ, అందులో ఇజ్రాయెల్ దళాలు గాజాను ధ్వంసం చేసిన చిత్రాలు ఉన్నాయి.
‘ఎక్స్’లో ( గతంలో ట్విటర్) చాలా ఖాతాలకు సంక్షోభానికి సంబంధించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న చరిత్ర ఉంది. ఇవి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందనే సమాచారాన్ని అతిశయోక్తులతో చెప్పడం, లేదంటే తగ్గించి చెప్పడం చేస్తుంటాయి.
వీటిల్లో ఇజ్రాయెల్, గాజాలో తాజా పరిస్థితి అంటూ పాత యుద్ధాల నాటి వీడియోలు, వీడియోగేమ్‌లలోని క్లిప్ లు షేర్ చేస్తుంటారు.
‘ఎక్స్’లో చురుకుగా ఉండే ఖాతాలు కొన్ని ఇజ్రాయెల్‌కు అనుకూల సమాచారాన్ని , ముస్లింల వ్యతిరేక పోస్టులను షేర్ చేస్తుంటాయి. ఈ ఖాతాలు ఇండియాకు చెందినవిగా, అవి ప్రధాని మోదీని సమర్థిస్తూ ఉంటాయి.
ఇలా ఐడెంటీటీలు, ప్రాంతాలు అస్పష్టంగా పేర్కొన్న ప్రొఫైల్స్ వెనుక ఏమున్నదనే విషయం నేను తెలుసుకోవాలనుకున్నాను.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఖాతాల వెనుకున్నది ఎవరు?
బందీలందరూ పౌరులు కాదని, వారిని సైనికులుగా పేర్కొంటున్న ఖాతాలు యువతకు చెందినవి కనిపిస్తున్నాయి. వీరి ప్రొఫైల్స్‌కు ఫన్సీమీమ్స్, ఫుట్‌బాల్ క్లిప్స్ ను తమ డీపీలకు జత చేసి ఉన్నారు. కొంతమందైతే ‘ఫ్రీ పాలస్తీనా’ అనే నినాదాలు కూడా పోస్ట్ చేశారు.
నేను వారికి మెస్సేజ్ చేయగా, వారంతా పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందినవారిగా చెప్పారు.
కొన్ని ప్రొఫైల్స్ నిజమైనవో కాదో అస్పష్టంగా ఉంది. కొంతమంది రాజకీయాల గురించి పోస్ట్ చేశారు.
యుక్రెయిన్ పై యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మద్దతు తెలపడం, అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇవ్వడం కనిపించింది. ఈ ఖాతాలలో చాలామటుకు కొత్తవి లేదంటే ఇటీవల మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టినవే.
గతంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం, హమాస్ మిలిటెంట్లు కూడా ‘బోట్’ అనే నెట్‌వర్క్ ద్వారా ఆన్‌లైన్ కథనాలను వక్రీకరించడానికి ప్రయత్నించారనే ఆరోపణలు ఎదుర్కొన్నాయి.
విభజన సృష్టించడం, తప్పుదారి పట్టించే కథనాలను అదేపనిగా పోస్టు చేయడానికి నకిలీఖాతాలను ఉపయోగించేవారు. సామాజిక మాధ్యమాలను విశ్లేషించే ఇజ్రాయెల్‌లోని సైబ్రా సంస్థ ప్రకారం, హమాస్ దాడులపై సంభాషణలు జరిపే ప్రతి ఐదు ఖాతాలలో ఒకటి నకిలీదని తెలిపింది.
ఇక్కడ నకిలీదంటే అర్థం వాటంతటవే నడిచేవి. అయితే, కొందరు నిజమైన వ్యక్తులు కూడా నకిలీ గుర్తింపులతో ఇటువంటి ఖాతాలను నడపొచ్చు.
‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్), టిక్ టాక్ లలో దాదాపు 40 వేల నకిలీ ఖాతాలను కనుగొన్నట్టు సైబ్రా చెప్పింది. ఇలాంటి వాటిలో కొన్ని హమాస్‌కు మద్దతుగా అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. వీటిల్లో వాస్తవ విరుద్ధంగా బందీలను మిలిటెంట్లు ప్రేమగా చూసుకుంటున్నట్టు చూపించడం వంటి వీడియోలు ఉన్నాయి.
అయితే, ఈ విషయంలో ఇజ్రాయెల్ అనుకూల నకిలీ ఖాతాలు కూడా ఉన్నాయనే విషయాన్ని కొట్టిపారేయలేం. నకిలీఖాతాలను గుర్తించడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయని ఈ సంస్థ చెప్పింది.
ఓ ఖాతా కొత్తగా మొదలై విభజన, తప్పుదారిపట్టించే సమాచారాన్ని అదేపనిగా షేర్ చేస్తోందంటే అది నకిలీఖాతా కింద భావించవచ్చని తెలిపింది.
అంతిమంగా, ఒక ప్రొఫైల్ నిజమా కాదా, దీని వెనుకున్నది ఎవరు అని తేల్చడం చాలా కష్టమైన పని. ఇందుకు జర్నలిస్టులకు సోషల్ మీడియా కంపెనీల నుంచి సమాచారం అవసరమవుతుంది.















